"నువ్వు ఎంత చెబితే అంత యిచ్చుకోవాలి గదా. అవునూ! నాకు తెలియక అడుగుతాను ఈ డబ్బంతా ఏం చేస్తున్నావ్?"
"మా యింట్లో దేవుడి పటం దగ్గరున్న హుండీలో వేస్తుంటాను."
"ఇప్పటికి ఎంత చేర్చి పెట్టావ్?"
"ఏమో మామయ్యా! చూడలేదు. దానిని పగులకొట్టి చూడాలంటే ఎవరయినా పదిపైసలు ఇవ్వాలి మరి."
"నీ హుండీలో నువ్వు ఎంత డబ్బు వేశావో చూడాలంటే నీకు లంచం ఇచ్చుకోవాలా?" నోరు తెరిచాడు నరేష్ ఆశ్చర్యంతో.
"అంతే కదా మామయ్యా! నేను ఎంత చేర్చి పెట్టానో తెలుసుకోవాలన్న వుత్సాహం వున్న వాళ్ళు పదిపైసలు ఇచ్చుకోవాలి మరి!"
మరికాసేపు నిలబెట్టి మాట్లాడినందుకు లంచం అడుగుతాడన్న భయంకొద్దీ నరేష్ "సరే వెళ్ళి పూరీ తీసుకురా" అన్నాడు.
"పూరీ తెచ్చినందుకు ఇరవయి పైసలు, ఇంతసేపు నా టైమ్ వేస్టు చేసినందుకు పదిపైసలు. మొత్తం ముప్పై పైసలు తీసుకుంటాను" అని రాజా తుర్రుమన్నాడు.
"ఓరి పిడుగా' అనుకుంటూ అలానే మంచంమీద కూలబడి పోయాడు.
మరో పదినిమిషాలకి రాజా వచ్చాడు.
నరేష్ వాడు ఇచ్చిన పొట్లం విప్పుతుంటే "పోస్ట్" అన్న కేక వినిపించింది.
"ఎవరొచ్చారో చూడు" అని రాజా చేతిలో పదిపైసల నాణెం వుంచాడు నరేష్.
అంతలోనే వేలు ద్వారం దగ్గరికి వచ్చి "గుడ్ మార్నింగ్ సర్" అన్నాడు.
అతన్ని చూస్తూనే నరేష్ జడుసుకున్నాడు. రాజా చేతిలోని పదిపైసల నాణేన్ని గబుక్కున లాక్కుని జేబులో వేసుకున్నాడు.
"అదేమిటి మామయ్యా! పదిపైసలు లాక్కున్నావ్!" రాజా బుంగమూతి పెట్టి అడిగాడు.
"అదంతే! నువు చూడకుండానే పోస్టుమాన్ వచ్చేసాడు. నువ్వు పని చేయలేదు కాబట్టి నీకు నో పదిపైసలు" రాజాతో అని పలకరింపుగా వేలును చూసి నవ్వాడు.
"ఏం సార్! బావున్నారా?"
"ఆఁ ఆఁ"
"లోపలికి రమ్మంటారా? ఇలా బయటే వుండిపొమ్మంటారా?" వేలు నవ్వుతూనే అడిగాడు.
అప్పటికి కాస్తంత తేరుకుని "రండి" అంటూ లోపలికి ఆహ్వానించాడు.
తనను రోజంతా ఎండలో తిప్పి, ఉత్తరాలను బట్వాడా చేయించిన అతను తన గదికి ఎందుకొచ్చాడో అర్థం కాలేదు నరేష్ కి.
వేలు స్టూల్ ను మంచం దగ్గరకు లాక్కుని కూర్చున్నాడు.
"ఇంకా బ్రహ్మచారిగానే వున్నారా? మీ లవ్ ఏమైంది? సక్సెస్ అయిందా లేక ఫెయిలయిందా? ప్రేమించని జీవితం ముగ్గులేని యిల్లు లాంటిది సార్!"
వేలూకు నిజం చెప్పడం ఇష్టంలేక పాలిపోయిన నువ్వొకటి నవ్వి వూరుకుండిపోయాడు.
"ఇంకా మీరు ఆశ్చర్యం నుంచి తేరుకున్నట్టు లేదు. నన్ను బాలాజీ కాలనీ నుంచి యిక్కడకు ట్రాన్స్ ఫర్ చేశారు."
"అలాగా!"
అప్పటికి అర్థమైంది నరేష్ కు.
వేలు బ్యాగ్ లోంచి కొన్ని ఉత్తరాలు తీసి, వాటిలోని ఒక లెటర్ ను నరేష్ చేతికిచ్చాడు.
"మీకు ఉత్తరం వచ్చింది సార్! దీనికి ఫ్రమ్ అడ్రస్ లేదు. కాబట్టి ఏ ఆడపిల్లో మీకు ప్రేమ ఉత్తరం రాసిందనుకుంటా" అని నిండుగా నవ్వాడు అతను.
తనకు ఉత్తరం ఎవరు రాశారబ్బా అనుకుంటూ నరేష్ తన చేతిలోని ఎన్ వలప్ ను అటూ ఇటూ తిప్పి చూశాడు.
రజనీ నిన్ననే కలిసింది. అందునా తను లెటర్ రాసినట్టు చెప్పలేదు. మరి ఈ ఉత్తరం ఎవరు రాసుంటారు? అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వేలూ వెళ్ళిపోయాక ఉత్తరం చదవచ్చు లెమ్మని తెరవకుండా పక్కన పెట్టాడు.
వేలూ రాజాని చూసి "ఈ అబ్బాయి ఎవరు?" అని అడిగాడు.
"పక్కింటి అబ్బాయి. ఎస్.ఐ. రాళ్ళపల్లి కొడుకు" నరేష్ చెప్పాడు.
"ఎస్.ఐ.గారి అబ్బాయా! వీళ్ళకూ ఓ ఉత్తరం వుంది" అని గబగబా వుత్తరాలు వెతికి ఒకదాని పిలక పట్టుకుని పైకి లాగాడు వేలు.
అడ్రస్ చూసి "ఇది మీకే. తీసుకుపో బాబూ" అని చేయి చాచాడు.
రాజా చేయి చాచలేదు.
వేలు ఆశ్చర్యపోయి "ఈ బాబుకు చెవుడా?" అని అడిగాడు నరేష్ ను.
"చెవుడు కాదు. మరో ఇబ్బంది. అందుకే ఉత్తరం తీసుకోలేదు" అని నరేష్ రాజా చేతిలో ఐదుపైసల బిళ్ళ చేతిలో పెట్టి "మీ అక్కను పిలువ్. వుత్తరం తీసుకెళుతుంది" అని చెప్పాడు.
రాజా పిట్టగోడ దగ్గరకు వెళ్ళి "అక్కా! ఉత్తరం వచ్చింది" అని అరిచాడు.
మరి ఐదునిమిషాలకి స్వప్న అక్కడకు వచ్చింది. ఆమె మొత్తం ఆకుపచ్చ రంగు డ్రస్ లో వుంది. అదేదో కాండం లేకుండా ఆకులే వున్న చెట్టులా వుందామె.
ఆమెను చూసి ఒక్క క్షణం జడుసుకున్నాడు వేలు. గోళ్ళకు కూడా ఆకుపచ్చరంగు చూసి ఎవరో పెట్టిన శాపంవల్ల ఆమె అలా అయిపోయిందేమో నన్న జాలితో చూస్తున్నాడతను.
"ఆమె పేరు స్వప్న. ఎస్.ఐ.గరమ్మాయి. ఉత్తరం ఇవ్వండి."
నరేష్ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు వేలు. బొమ్మలా అలా స్వప్నవేపు ఆశ్చర్యంగా చూస్తున్న అతను ఇన్ లాండ్ కవర్ ను ఆమెకివ్వబోయాడు.
ఆమె దానిని చూసి ఒక్క అడుగు వెనక్కి వేసి తనను ఓసారి పూర్తిగా చూసుకుని వేలుతో చెప్పింది "కవర్ బ్లూ రంగులో వుంది. నేనేమో ఆకుపచ్చ డ్రస్ లో వున్నాను. రెంటికీ మ్యాచింగ్ కాదు. ఓ ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను."