ఆమె వెళ్ళిపోయింది.
వేలు ఆమె వెళ్ళిపోయినా ఆమె నిలుచున్న వేపుకే అలా శిలా ప్రతిమలా చూస్తుండిపోయాడు.
"ఆమె తీరే అంత. మ్యాచింగ్ సరిపోకపోతే ఆమె మనసు నిలవదు" అన్నాడు నరేష్.
"అయినా ఇదేం మ్యాచింగు పిచ్చి?" వేలు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకనే అడిగాడు.
"అందుకే ఆమె మ్యాచింగ్ మహారాణి అయ్యింది."
"మరి బజారులో ఎప్పుడయినా బట్టల్లేని బొమ్మను కొని ఇంటికి తీసుకెళ్ళాల్సి వస్తే మ్యాచింగ్ అని బట్టలిప్పేస్తుందా?"
"ష్, ఎస్.ఐ.గారు ఈ మాటలు విన్నారంటే మన ఇద్దర్నీ బొక్కలో తోసేస్తారు" నరేష్ తన చూపుడు వేలును నోటికి అడ్డంగా పెట్టుకున్నాడు.
"ఆమె మేకప్ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఎంతసేపు పడుతుందో తెలియదాయె. ఈ బాబు దగ్గిర ఇచ్చేస్తాను."
"ఆగు మహాశయా! మీ జేబులో అయిదు పైసల బిళ్ళలున్నాయా?" నరేష్ అడిగాడు.
"ఎందుకు?"
"వాడికి లంచం యిస్తే తప్ప లెటర్ తీసుకోడు. నా జేబులో చిల్లర లేదు."
ఈ మాటలకు మరింత బిగుసుకుపోయి అన్నాడు వేలు "ఇలాంటి పిల్లలతో ఆ ఎస్.ఐ. గారు ఎలా వేగుతున్నారు?"
"ఆయనకు ఇలాంటి సమస్య లేదు. కూర్చోవడానికి స్థలం దొరికితే చాలు ఆయన గుర్రుపెట్టి నిద్రపోతారు. వీరిద్దరూ తమ పిల్లలని కూడా ఆయన సరిగా పోల్చుకోలేడు బజారులో చూస్తే. ఆయన మేల్కొని వున్న క్షణాలు చాలా తక్కువ."
వేలు ఇక వినలేనట్టు చెవుల్లో వేళ్ళు దూర్చుకుని "శివ శివా" అన్నాడు.
అంతలో గదిలో బ్లూరంగు పొగ ఆవరించినట్టు కనిపించి చూస్తే ద్వారం దగ్గర స్వప్న.
ఆమె మొత్తం బ్లూ కలర్ డ్రస్ లో వుంది.
తన కూతురు ఎందుకింత హడావుడిగా డ్రస్ మర్చుకుందో అర్థం కాని శ్యామల కూడా కూతురి వెనకే వచ్చింది.
"ఏదీ కవర్ ఇలా ఇవ్వు" అంటూ చేయి చాచింది స్వప్న ఆ చేతినిండా బ్లూ రంగు గాజులు.
వేలు వుత్తరాన్ని ఆమె కందించాడు.
"లెటర్ కు మ్యాచ్ కావాలని డ్రస్ మార్చుకున్నావా?" బుగ్గమీద వేలేసుకుంది శ్యామల.
"అవునే అమ్మా!"
"మరీ ఇంత మ్యాచింగ్ పిచ్చి ఏమిటే!" బాధగా అడిగింది శ్యామల.
"అదంతే అమ్మా! పిచ్చి గిచ్చీ అన్నావంటే పోస్టాఫీసులో ముద్రలేసే కుర్రాడితో లేచిపోతాను జాగ్రత్త."
స్వప్న అలా మాట్లాడడంతో వేలు మరింత బిగుసుకుపోయాడు.
"ఇక అనను కానీ, పద" స్వప్నతో అని, రాజా చేతిలో ఓ చాక్ లెట్ పెట్టి "నువ్వూ రారా" అంటూ పిలిచింది.
వాళ్ళు ముగ్గురూ వెళ్ళిపోయారు.
తల విదుల్చుకుని వేలు కూడా బయల్దేరాడు.
వాళ్ళు ఎప్పుడెళతారా లెటర్ చించుదామా అన్న ఆతృతతో నరేష్ కవర్ ను చించాడు.
అందులోని తెల్లకాగితం ముడతలు విప్పాడు రజని రైటింగ్ కాదే అనుకుంటూ వుత్తరం చదవడం మొదలుపెట్టాడు.
నరేష్ కి.
మీరు ఎవరితోనో కలిసి వచ్చినప్పుడు మిమ్మల్ని మొదటిసారి నా నర్శింగ్ హోమ్ లో చూశాను నేను అక్కడ డాక్టర్ ను. పేరు సువర్చల, మిమ్మల్ని చూస్తూనే మనిద్దరి మధ్య వున్న అనుబంధం ఈనాటిది కాదనిపించింది. మీరంటే ఎంతో ఇష్టం కలిగింది. మీతో మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నా సహజమైన సిగ్గువల్ల ప్రొసీడ్ కాలేకపోయాను. కానీ ఇలా ఎంత కాలం! మీ గురించి ఆలోచిస్తూ ఎన్ని రాత్రులు నిద్రకు దూరమయ్యానో చెప్పలేను. మీ స్పర్శతో పునీతమైతే తప్ప మళ్ళీ మామూలు మనిషిని కాలేను. మీ ముద్దులతో నా శరీరం నిండిపోవాలి. మీ కౌగిలిలో నా రక్తం ఆగిపోవాలి. మీ నఖక్షతాలు నా ఒంటి మీద నక్షత్రాల్లా మెరవాలి. అప్పటి వరకు ఇలా మీ కోసం తపిస్తూనే వుంటాను. మీ గాఢ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నేను మైనపు ముద్దలా కరిగిపోవాలి. మీ కళ్ళ నీలిమలో నేను కలిసిపోవాలి. నా కంఠం చుట్టూ వేసిన మీ చేయి నాకు ఆభరణం కావాలి. అంతవరకు నా తపన చల్లారదు. ఈ దాహం తీరదు. మీకోసం ఆదివారం సాయంకాలం ఏడుగంటలకు లాల్ బహదూర్ పార్కులోని శివపార్వతుల విగ్రహం దగ్గర వెయిట్ చేస్తుంటాను. నన్ను మీరు గుర్తుపట్టడానికి వీలుగా తెల్ల డ్రస్ లో వుంటాను మీరు నాకు తెలుసు గనుక మీరు అక్కడికి వస్తే చాలు మిమ్మల్ని నేను పలకరిస్తాను.
మీరు రాగానే అటునుంచి మా ఇంటికి వచ్చేద్దాం. మా ఇంట్లో ఎవరూ వుండరు. నేనొక్కదాన్నే వుంటున్నాను. అమ్మ ఇటీవలే వూరు వెళ్ళింది. మీరు తప్పక వస్తారన్న ఆశతో.... సువర్చల.
అతనిలో అక్షరాలను పట్టుకుని వుబుకుతున్న ఉద్వేగం లెటర్ చివరికొచ్చేసరికి ఆనందం, ఆశ్చర్యంలోకి మారి శరీరమంతా టెన్షన్ ను నింపి, మాటల్లో ఇమడని అనుభూతిగా రూపాంతరం చెంది 'హుర్రే' అన్న పదాల్లో బయటపడింది.
నరేష్ వుబ్బితబ్బిబ్బయిపోయాడు.
ఏదో తెలియని ఎగ్జయిట్ మెంట్ అతనిలో రకరకాల ఆలోచనలతో వుక్కిరిబిక్కిరయ్యాడు.
అతని కళ్ళముందు స్టెత్ పట్టుకున్న అందమయిన అమ్మాయి కదలాడుతోంది. పార్క్ నుంచి ఆ అమ్మాయితోపాటు యింటికెళ్ళాక ఏం జరుగుతుందో అతను వూహించలేదు. ఆమె తన దగ్గిర్నుంచి ఏం ఆశిస్తోందో, తనకు ఆమె ఏ విధంగా, ఎంతవరకూ కావాలో అతను ఆలోచించడం లేదు. తనను ఇష్టపడి ఓ అమ్మాయి లెటర్ రాసిందంటేనే ఎగిరిపడే సగటు మగబుద్ధితో అతను థ్రిల్లింగుగా ఫీలవుతున్నాడు.