"ఏమైంది మా వాడికి?"అని వినిపించగానే ఇద్దరూ మెట్లవైపు చూశారు.
సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడు శంఖు, చక్రాలతో దర్శనమిచ్చినట్టు ఎడమచేతిలో విస్కీగ్లాసు, కుడిచేతిలో సిగరెట్ తో కనిపించాడు పూర్ణానందం.
ఆయన నరేష్ దగ్గరకొచ్చి "బాబూ, నా జేబులో వక్కపొడి పొట్లం వుంది. దాన్ని కాస్తంత తీసి న నోట్లో రెండు పలుకులు వేయి. వక్కపొడి తిని, సిగరెట్ దమ్ము పీలిస్తే తప్ప మజా తెలియదు" అన్నాడు.
ఆయనను ఏడుపు ముఖంతో చూస్తున్నాడు ప్రసాద్.
నరేష్ వక్కపొడి తీసి ఆయనచేతిలో పెట్టాడు. వక్కపొడిని నోట్లో వేసుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు పూర్ణానందం.
"బాబూ నరేష్. ఈ రోజు నువ్వు ఆఫీస్ కి లీవ్ పెట్టావని తెలిసింది. మా పాలవాడు ఇంకా రాలేదు. కాసేపు నువ్వు అలా చేయి కలిపితే పేకాడుకోవచ్చు. పేకలు ఎడమ జేబులో వున్నాయి. వాటిని కూడా తీసుకో నాయనా" అన్నాడు ఆయన.
"లేదండీ! నాకు పేక రాదు. మీ పాలవాడు మరి కాసేపట్లో వచ్చేస్తాడు. వాడితో ఆడుకోండి" రెండు చేతులూ జోడించి తనను వదిలేయమన్నట్టు చెప్పాడు నరేష్.
"పుడుతూనే ఎవరికీ పేకరాదు బాబూ! మా పాలవాడిక్కూడా రాదు. హ్యాండ్ లేకపోతే నేర్పించాను. వాడిప్పుడు అద్భుతంగా ఆడతాడు. ఒక్క పాలవాడేమిటి! మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఆట నేర్పించాను. ఆఖరుకి మా ఇంటికొచ్చే దోబీ దానికి కూడా. అదిప్పుడు క్లబ్ లో ఆడుతోందట. నిన్న రమ్మంటే రాలేదు. నాతో ఆడడం నామోషీ అట. క్లబ్బులో తప్ప ఆడనని వెళ్ళింది."
"లేదండీ! నాకు పేక చచ్చినారాదు"
"చచ్చిపోయాక వచ్చేదేముంది? బతికున్నప్పుడే జీవితాన్ని అనుభవించాలి."
"లేదు సార్! ఈరోజు నాకు అర్జెంట్ పనుంది."
నరేష్ తో ఇక లాభం లేదని కొడుకువైపుకు తిరిగి "నువ్వు ఆఫీసుకు లీవ్ పెట్టి నాతో కూర్చోరాదట్రా" అని అడిగాడు.
ఆ మాటలకు వళ్ళు మండిపోయింది ప్రసాద్ కు "నేను కూర్చుంటే మీతో పేక ఆడను. చెడుగుడు ఆడతాను. అప్పుడు మీ చేయీ, కాళ్ళూ విరిచేస్తాను. దాంతో పీడ విరగడైపోయింది" అని కాసేపాగి "అయినా చిరంజీవి ఏ సినిమాలో అయినా పేక ఆడాడా?" అని అడిగాడు.
"ఏమో సుపుత్రా! చిరంజీవి చిట్టా అంతా నీ శ్రీమతి దగ్గరుంటుంది. పోయి అడుగు . నిన్న రాక్షసుడిలో ఒక పాటకు చిరంజీవి ఎన్ని డ్రస్ లు మార్చాడని ఈ వీధిలోని ఇద్దరు ఆడవాళ్ళూ పేచీపడి, కరెక్టు ఆన్సర్ కోసం కోడలు పిల్ల దగ్గిరకొచ్చారు. వాళ్ళిద్దరూ చెప్పింది తప్పని, ఆ పాటలో చిరంజీవి మొత్తం ఆరు డ్రస్ లు వేసుకున్నాడని , ఆ డ్రస్ ల కాంబినేషన్ కూడా కోడలు పిల్ల చెప్పింది. అలా వుండాలి మనిషంటే, నువ్వూ వున్నావు ఎందుకు! ఒట్టి అసమర్ధుడివి" అన్నాడాయన.
"అవును నేను అసమర్ధుడను కాబట్టి నీ ఆటలూ, దాని ఆటలూ ఈ ఇంట్లో చెల్లుబాటవుతున్నాయి" అని ఘీంకరించాడు ప్రసాద్.
"నరేష్! నేను వెళుతున్నానయ్యా! చేతులు పీకుతున్నాయి. పేకముక్కల్ని పట్టుకుంటే తప్ప చేతుల వణుకు ఆగదు" అని పూర్ణానందం వెళ్ళిపోయాడు.
"చూశావా!" ప్రసాద్ ఆయన వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు.
"చూశాను సార్."
"ఏం చేయాలో అర్థం కావడంలేదు. నీ సలహాలు విని ఆయనకు వక్కపొడి దగ్గర్నుంచీ అన్నీ అందించాను. ఇప్పుడు ఆయన సకల గుణాభిరాముడు అంటారు చూశావా అలా ఆయన సకల దుర్గుణాభి రాముడయ్యాడు మరి నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటావ్?"
"సలహా చెప్పమంటారా?" సందేహంగా అడిగాడు నరేష్.
ఆఁ సలహా చెప్పమనే కదా నేను నీకు నా సమస్యల్ని చెప్పడం."
"అయితే ఈసారి ఆయన విస్కీ బాటిల్, సిగరెట్, వక్కపొడి, పేకలు ఎత్తుకున్నప్పుడు వాటినన్నింటినీ చేతుల్లోకి తీసుకుని రేస్ లకు వెళ్ళమనండి. ఆ రేస్ లను చూస్తూ మిగిలిన అలవాట్లను మానేస్తాడు ఆ రేస్ ల పిచ్చిని నిదానంగా కంట్రోల్ చేయవచ్చు ."
"ఇదీ బాగానే వుంది ట్రై చేసి చూస్తాను."
ఏదో ఆలోచిస్తూ ప్రసాద్ వెళ్ళిపోయాడు.
ఇక బయటికి వెళ్ళడానికి బద్ధకంగా అనిపించి తలుపుతీసి లోపలికెళ్ళి మంచం మీద కూలిపోయాడు నరేష్.
రజనీని మనసులో తల్చుకుంటూ వుండిపోయాడు.
కాసేపయ్యాక ఆకలిగా అనిపిస్తే రాజా చేత టిఫిన్, తెప్పించుకుందామని పైకి లేచాడు.
పిట్టగోడ దగ్గరికి వచ్చి రాళ్ళపల్లి ఇంటివేపు చూశాడు.
వరండాలో మంచం మీద స్వప్న, రాజా కూర్చుని వున్నారు.
"రాజా" పిలిచాడు.
వాడు తలపైకెత్తి చూడలేదు.
స్వప్న వాడి చేతిలో ఐదుపైసల నాణెం వుంచి "నరేష్ పిలుస్తున్నాడు. చేయి తడిచింది గదా తల పైకెత్తు" అంది.
వాడు నరేష్ వైపు తిరిగి "ఏం మామయ్య?" అని గట్టిగా అరిచాడు.
"టిఫిన్ కావాలి."
"వస్తానుండు."
వాడు మంచం పైనుంచి లేచి, గేటు తీసుకుని పైకి వచ్చాడు.
నరేష్ వాడి చేతిలో అయిదు రూపాయల నోటుపెట్టి "పూరీలు నాలుగు తీసుకురా. మిగిలిన చిల్లరలో నువ్వో పది పైసలు తీసుకో" అని చెప్పాడు.
"రెండు పూరీలు తేవడానికి పదిపైసలు. నాలుగు పూరీలైతే ఇరవై పైసలు ఇవ్వాల్సి వుంటుంది."
నరేష్ ఏం చెబుతాడోనని వాడు చూస్తూనే వున్నాడు.