Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 41


    తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారు.

    ఇంకా వచ్చే వాళ్లు వస్తూనే వున్నారు.

    అఖిల్ అక్కడే నిలబడి, ఖాళీ అయిన గిన్నెల్లోకి మళ్ళీ తినుబండారాలు కిచెన్ లో నుంచి వచ్చే ఏర్పాట్లు చూస్తున్నాడు. అతనికి సాయం చేస్తున్నారు ఉత్తమ్, రాంభరోసే.

    ఈ లోపల__

    పెళ్ళివారి కార్లు కొన్ని స్టేడియం దగ్గరికి వచ్చాయి- అక్కడ జరుగుతున్న గొడవ తెలియక.

    ముందుకీ, వెనక్కీ పోవడానికి వీల్లేక గేటు దగ్గరే ఆగిపోయాయి ఆ కార్లన్నీ.

    వాటి వెనక మరికొన్ని వాహనాలు.

    వాటిలో ఒక దాన్లో బొంబాయి నుంచి వచ్చిన సినీతారల పార్టీ ఉందని తెలిసింది.

    చాలామంది జనం పోలోమంటూ అటు పరిగెత్తారు.

    దానితో మరింత తొక్కిసలాట!

    మరింత కన్ ఫ్యూజన్!

    గంటలు గడుస్తున్నకొద్దీ ఆ కన్ ఫ్యూజన్ పెరుగుతోందేగానీ తరగడం లేదు.

    అప్పుడు__

    హఠాత్తుగా అఖిల్ కి కనబడింది నీర్జా!

    నీర్జా! చండశాసనురాలు.

    అఖిల్ కనబడగానే తక్షణం అతని వైపు తీవ్రంగా చూసింది నీర్జా- "ఏమిటిదంతా! ఎందుకిలా చేశావు?" అంది ఆగ్రహంగా.

    "నేను చేసినదాన్లో తప్పేమీ లేదు" అన్నాడు అఖిల్.

    "నువ్వు చేసినదానికి ఫలితం అనుభవిస్తావ్! చూస్తూ ఉండు" అంది నీర్జా దృఢంగా.

    అంతలోనే ఆమెని పక్కకి నెట్టేసింది ఒక గుంపు. జనం అలా గుంపులు గుంపులుగా వచ్చేస్తుంటే సముద్రం అలలతో ఎగసిపడుతున్నట్లు వుంది.

    పక్కకి నెట్టివేయబడ్డ నీర్జాకి ఆమె తమ్ముడు రాజ్ కుమార్ కనబడ్డాడు. అతని బట్టలు చిరిగి, పేలికల్లాగా వేలాడుతున్నాయి. జుట్టు రేగిపోయి వుంది. మోచేతికి గాయం అయి వుంది.

    రాజ్ కుమార్ నీర్జాని చూసి ఏదో అనబోయాడు.

    కానీ జనం మళ్ళీ ఉధృతంగా ముందుకు తోసుకొచ్చారు. ఆ జనంతోబాటు ఇంకో పక్కకి వెళ్ళిపోయింది నీర్జా.

    రాజ్ కుమార్ మరోవైపు తోసివేయబడ్డాడు.

    జనం తోసుకోవడం మరీ ఎక్కువయ్యింది.

    ఇప్పుడు రాజ్ కుమార్ తన కాళ్ళ మీద తను నిలబడి లేడు. జన ప్రవాహంలో తేలిపోతూ కొట్టుకెళ్ళిపోతున్నాడు అతను.

    అతనికి ప్రాణ భయం పట్టుకుంది.

    ఇప్పుడు తను గనక బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడా....

    తనని జనం తొక్కేస్తూ వెళ్ళిపోతారు.

    ప్రాణాలు పోవడం ఖాయం!

    కొద్దినిమిషాలసేపు అలా ముందుకెళ్ళిపోయింది ఒక మానవ తరంగము. స్టేడియం రెండో గేట్లో నుంచి బయటికెళ్ళిపోయింది.

    హఠాత్తుగా పట్టుదప్పి జనం మధ్యలో నుంచి కిందికి జారిపోయాడు రాజ్ కుమార్. దబ్బున కిందపడ్డాడు. కిందంతా నీళ్ళు. అతనికి కొద్ది క్షణాల పాటు ఊపిరాడలేదు.

    అతికష్టంమీద బ్యాలెన్స్ చేసుకుని లేచి కూర్చున్నాడు.

    అప్పుడు గమనించాడు అతను.

    అదొక మురికి కాలవ!

    దాన్లో పడ్డాడా తను.

    ఒక్కసారిగా ఒళ్ళంతా కంపరం ఎత్తింది అతనికి.

    అసహనంగా పక్కకి చూశాడు.

    పక్కనే ఉన్న ఇంకో శాల్తీ, మొహానికంటిన బురదని తుడుచుకుంటూ అతని వైపు చూసింది.

    అతను మెహతా! మెగా ప్రొడ్యూసర్! అతని పక్కనే మెహతా కూతురు. తన కాబోయే భార్య. అప్పుడే బురదలో దొర్లి వచ్చిన పంది పిల్లలా ఉంది ఆ అమ్మాయి.

    ఇంతలో- హిప్పోపొటామస్ లాగా ఆ మురికి కాలవలోనుంచి ఒక్కసారిగా పైకి తేలాడు పండిట్ జీ. పెళ్ళి జరిపించే పురోహితుడు.

    తన వాచీకి అంటిన బురద తుడుచుకుని చూసి, ఆదుర్దాగా అన్నాడు పండిట్ జీ.

    "అరే! ముహూర్తం టైం మించిపోతోంది. బేటా....! ఇప్పుడు ముహూర్తం దాటిందంటే మళ్ళీ మీ జాతకాలు ముడిపడే ముహూర్తం లేదే! తాళి కట్టెయ్యక తప్పదు బాబూ!"

    "ఇప్పుడా! ఇట్లానా?" అన్నాడు పురోహిత్. పెళ్ళికాకపోతే తనకు వచ్చే దక్షిణ రాకుండా పోతుందేమోనని ఆయన ఆరాటం.

    చీమ కష్టాలు చీమవి అన్నారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్! అలా అంటూనే, జేబులోనుంచి (నార్త్ లో పురోహితుడు మామూలుగా చొక్కా వేసుకునే అన్నీ చేయిస్తారు) మంగళసూత్రం తీశాడు పండిట్ జీ.

    "తప్పదా?" అన్నాడు రాజ్ కుమార్ చిరాగ్గా.

    "వేరే మార్గం ఉంటేగా!" అన్నాడు పురోహిత్.

    వధూవరులిద్దరూ మురికి కాలవ గట్టు మీదే కూర్చున్నారు. డ్రైనేజి సువాసనల మధ్య, నేపథ్యంలో పందులు గీ పెడుతుండగా, మెహతా కూతురు మెడలో తాళి కట్టేశాడు రాజ్ కుమార్.      

    నిర్ఘాంతపోయి ఇదంతా చూస్తున్న మెగాప్రొడ్యూసర్ మెహతా తేరుకుని మెల్లిగా అన్నాడు_

    "ఇన్ని సినిమాలు తీశాను. ఎంతెంతో మెలోడ్రామాలో ఎన్నెన్నో పెళ్ళి సీన్లు షూట్ చేశాను. కానీ యిట్లాంటి పెళ్ళి మాత్రం సినిమాల్లో కూడ జరగదురా దేవుడా!"

    దాదాపు మూడు కోట్ల రూపాయల ఖర్చుతో, రంగరంగ వైభవంగా, ఎంతో యింపుగా జరగవల్సిన రాజ్ కుమార్ పెళ్ళి, అలా ఆ డ్రైనేజి కాలవ పక్కన కంపుకంపుగా జరిగిపోయింది.

    కన్ ఫ్యూజన్ వల్ల కొద్ది నిమిషాలపాటు కమేడియన్ లా అయిపోయిన రాజ్ కుమార్ మొహంలో క్రమంగా కాఠిన్యం చోటుచేసుకుంది.

    సరిగ్గా అప్పుడే....

    స్టేడియంలో పెట్టిన వందలాది మైకుల్లో నుంచి వినబడటం మొదలెట్టింది అఖిల్ గొంతు. అతను అక్కడ వున్నవాళ్ళను వుద్దేశించి యేదో చెబుతున్నాడు మైకులో.

    అయిష్టంగానే అయినా, చెవులు రిక్కించి వినడం మొదలెట్టారు రాజ్ కుమార్, మెహతా.

    "అన్నలారా! తమ్ముళ్ళారా! అక్కలారా! చెల్లెళ్ళలారా! పెద్దలని మనం అనుకునే వాళ్ళు పేదల నెత్తుటితో పిండివంటలు ఎలా చేసుకుతింటారో యివాళ మీకూ ప్రత్యక్షంగా తెలిసింది. ప్రజలందరూ కదిలివస్తే పెద్దల తిష్టవేసుకు కూర్చున్న పీఠాలు కదిలిపోతాయని కూడా యివాళే మీకు తెలిసి వుంటుంది. పేనుకు పెత్తనం యిస్తే తలంతా తెగ కొరికి పెట్టిందట!

    అలాగే మీ సేవకులుగా ఉండవలసిన వాళ్ళను మీరు నాయకులుగా పొరబడి నెత్తినెక్కించుకుంటే ఏమయ్యిందీ....? శని తలకు చుట్టుకున్నట్లే అయ్యింది. అవునా? ఏమంటారు?" అని ప్రశ్నిస్తున్నాడు అఖిల్.

    జనంలో నుంచి ఆమోదసూచకంగా ధ్వనులు మైకుల్లో పెద్ద హోరు లాగా వినబడ్డాయి.

    అతను ఇంకా చెబుతూనే ఉన్నాడు.

    "ఈ సోకాల్డ్ నాయకుల బారినపడిన మీలాంటి, నాలాంటి సగటు మనుషుల ఆక్రోశమే నా కంఠంలో నుంచి వెలువడుతోంది. స్నేహితులారా! వినండి...."

    అని ఆశువుగా, ఆవేశంగా, ఒక కవితని చదవడం మొదలెట్టాడు అతను.

    "ఓ నాయకుల్లారా!
    నా పెళ్ళని నమ్మించి నా చావుకి తేకండిరా!
    చాలు! ఇంక చాలు!
    నా కోసం ఇంక ఎవరేం చెయ్యకండి!
    బక్క ప్రాణిని నన్నిట్లాగైనా బతకనివ్వండిరా!
    నా పేరుతో గజిబిజి సిద్ధాంతాలు,
    నా పేరుతో గడబిడ రాద్ధాంతాలు,
    నా పేరు మీదే రాజులూ,
    రాజ్యాలూ,
    రక్కసితంగడి యుద్ధాలూ,
    నా కోసమే మీ శ్రీరంగనీతులు,
    మీ రాతలు,
    మీ కోతలు,
    మీ కపిత్వం,
    నా కోసమే మీ మొసలి కన్నీళ్ళూ,
    వృధా వృధా పథకాలూ, ప్రణాళికలూ,
    నా మీదే ప్రయోగాలు,
    అయ్యయ్యో నా మీదే చేతబడులు,
    నా మీదే పన్నులు,
    నా కోసమే ధర్మపన్నాలు,
    నాయకుల్లారా!
    మీరు ధరలు పెంచేది నా కోసం,
    ధర్నాలు చేసేది నా కోసం,
    నా బస్సులు తగలెట్టేది నా కోసం,

 Previous Page Next Page