Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 42


    నా బస్తీలు భస్మం చేసేది నా కోసం,
    మీ ఛీత్కారాలు,
    బలాత్కారాలు,
    భీభత్సం,
    సిగ్గూశరం లేకుండా
    మీలో మీ సవాళ్ళు,
    వాటికి మీ కొక్కిరాయి సమాధానాలు,
    మీలో మీ కంటె ప్రశ్నలూ, తుంటరి జవాబులూ,
    ఆహాహాహా!
    ఓహోహోహో!
    ఎవరేమి చేసినా నా కోసం! నా కోసం!
    నా కులం,
    నా మతం,
    నా భాష,
    నా రాష్ట్రం,
    నా వర్గం,
    నా వర్ణం,
    నేను మర్చిపోదామనుకున్నా,
    నన్ను మర్చిపోనివ్వకుండా,
    క్షణక్షణం అనుక్షణం,
    కెలికి కెలికి,
    నాకు గుర్తు తెచ్చేది నా మంచి కోసం!
    నువ్వూ,
    నీ పెళ్ళాం,
    నీ పుత్రుడూ, నీ పిల్లా, నీ అల్లుడు,
    అందరూ అందలం ఎక్కాలంటే,
    అందుకు నా వీపే సోపానం అయి,
    నా నడ్డే విరిగినా
    అదీ నా మంచి కోసమే కదరా!
    మీ జెండా ఏ రంగైనా,
    మీ అందరిదీ ఒకే రంగురా!
    మీరంతా ఒకటేరా!
    నేనేరా ఒంటరిగాణ్ణి!
    నన్నికనైనా వదిలెయ్యిండిరా!
    నన్నీమాత్రంగానైనా బతకనివ్వండిరా!
    నేనేం పాపం చేశానురా?
    నా తండ్రుల్లారా!
    నన్నింక వదలండిరా!
    నాయకుల్లారా గుర్తుంచుకోండిరా!
    మీవల్ల నేను బతకడం లేదురా!
    నా చలవ వల్లే మీరు బాగుపడుతున్నార్రా!
    మీరు పీడిస్తున్న నేను బతుకు ఈడుస్తున్నారా!
    మీరు చంపుతున్నా నేను చావడం లేదురా!
    నాయకుల్లారా!
    నేను చావకుండానే,
    నా తద్దినం పెట్టటానికి తయారు కాకండిరా,
    నా కొడుకుల్లారా!
    ఇంక నన్నొదిలెయ్యండిరా!
    మీరు పాపులురా!
    అందుకని చిరాయివులే కావచ్చు!
    కానీరేయ్!
    గుర్తుంచుకోండి!
    నేను మనిషినిరా!
    నేను మంచినిరా!
    నేను చిరంజీవినిరా!"

    వింటూన్న రాజ్ కుమార్ మొహం కందగడ్డలా ఎర్రబడింది.

    అదృశ్య శతృవుతో మాట్లాడుతున్నట్లు అన్నాడు అతను.

    "ఓ.కే. పెట్టుకోక పెట్టుకోక ఈ రాజ్ కుమార్ తో పెట్టుకున్నావ్! జనంతో వ్యవహారం కాబట్టి ఇప్పటికి తగ్గి ఊరుక్కుంటున్నా. కానీ సంబరపడిపోకు. ముందుంది ముసళ్ళ పండగ. గుర్తుంచుకో."

    ఆ తర్వాత అక్కడ జరిగిన గలభా అంతా వర్ణిస్తే అదొక పెద్ద కామెడీ కథ అయిపోతుంది. ఆ వివరాలు యిక్కడ అనవసరం.

    ఆ రోజు సాయంత్రం-

    అఖిల్, ఉత్తమ్ సింగ్ చెడ్డా ఇంట్లో చార్ పాయ్ మీద కూర్చుని వుండగా_

    నీర్జా సెక్రటరీ అక్కడికి వచ్చాడు.

    "మేడమ్ అర్జెంటుగా నిన్ను తీసుకు రమ్మన్నారు" అన్నాడు ముక్తసరిగా.

    ఉత్తమ్ వైపు చూశాడు అఖిల్. తర్వాత లేచి నిలబడ్డాడు.

    అతన్ని వారిస్తున్నట్లు భుజం మీద చెయ్యి వేశాడు ఉత్తమ్.

    స్నేహితుడి చేతిని తన భుజం మీదనుంచి నెమ్మదిగా తీసేసి సెక్రటరీతో అన్నాడు అఖిల్_

    "పద! వెళ్దాం!"

    మాట్లాడకుండా కారువైపు దారితీశాడు సెక్రటరీ.

    కారు కదిలింది.

    కొద్ది నిమిషాల తర్వాత ఛండశాసనురాలైన నీర్జా హోటల్ ముందు ఆగింది కారు.

    హోటల్ లోకి వెళ్ళి నీర్జా ఛాంబర్స్ ముందు నిలబడ్డాడు అఖిల్. ఆ డోర్ దగ్గరే నిలబడి వుండే బోయ్ ఎప్పటిలాగా అఖిల్ ను రూడ్ గా దులపరించెయ్యలేదు. ఇవాళ పైగా అఖిల్ ని చూడగానే పెదిమల చెవులదాకా విశాలంగా నవ్వుతూ డోర్ తెరిచి పట్టుకున్నాడు.

    అతనివైపు చిత్రంగా చూసి లోపలికి వెళ్ళాడు అఖిల్.

    అతన్ని చూడగానే నవ్వుతూ లేచి నిలబడింది నీర్జా. "కంగ్రాట్స్" అంది కరస్పర్శకై చేయిజాపుతూ.

    ఆమె చేతిని అందుకునే ప్రయత్నం చెయ్యకుండా "కంగ్రాట్సా? దేనికి?" అన్నాడు అఖిల్ నెమ్మదిగా. ఆశ్చర్యాన్ని అతికష్టం మీద అణిచి పెట్టుకుంటున్నాడు అతను. ఎందుకిలా ప్రవర్తిస్తోంది నీర్జా ఇవ్వాళ? ఇందులో తనకు అంతుబట్టని 'క్యాచ్' ఏమన్నా ఉందా?

    ఏదో మతలబు వుండే వుంటుంది. నీర్జా అసాధ్యురాలు.

    "కంగ్రాట్స్ చెబుతోంది దేనికంటే.... నువ్వు ప్లే చేసిన మాస్టర్ స్ట్రోక్ కి. గాడ్ ఓ గాడ్! పైకి చూడటానికి వెరీ సింపుల్ ట్రిక్! కానీ ఎఫెక్లో! డి వాస్టేటెంగ్! ఆటంబాంబులా పేలింది! ఒప్పో! ఏం స్ట్రాటజీ! గరీబులనందరినీ స్టేడియం మీదికి తోలావ్! అలా అనుకోకుండా లక్షల మంది జనం స్టేడియంవేపు రావడం మొదలుపెట్టగానే అక్కడ చెప్పలేనంత కన్ ఫ్యూజన్. ఆ కన్ ఫ్యూజన్ వల్ల స్టేడియంకి వచ్చే రోడ్లన్నీ అన్నివైపులా కనీసం ఒక కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ తో క్లోజయి పోయాయి. పోలీసులు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని ముందుకు రాలేకపోయారు. లాఠీఛార్జీ, ఫైరింగ్ చేద్దామంటే భయం. అన్నదానం వుంటుందని ఆశతో వచ్చిన అభాగ్యులని కాల్చి చంపారని చెడ్డ పేరు వస్తే అది రాజకీయంగా వికటిస్తుందేమోనని వీళ్ళకి హడలు!

    అందులో ఎలెక్షన్ ఒకటి డ్యూ వుందికదా! బీదవాళ్ళు తిరగబడితే తమ జాతకాలు కూడా తిరగబడతాయని భయం ఈ లీడర్లకి. అన్నిటికన్నా కుర్చీ ముఖ్యం. అవునా? అందుకని చివరికి ఏం జరిగిందీ! పోలీసు ఆఫీసర్లు కొందరు మాత్రం ఒక హెలికాఫ్టర్ లో వచ్చి ఆకాశంలో తారట్లాడుతూ అసహాయంగా చూస్తూ వుండిపోయారు అఖిల్! ఐ రియల్లీ అడ్మైర్ యువర్ గట్స్! బట్టీపట్టిన డైలాగులు వప్పచెప్పేస్తున్నట్లు ఆమె గడగడా మాట్లాడేస్తుంటే ఆమెని అంచనా వేస్తున్నట్లు చూస్తూ మౌనంగా వుండిపోయాడు అఖిల్.

    ఉన్నట్లుండి ఏదో గుర్తు వచ్చినట్లు నవ్వింది నీర్జా.

    "సందట్లో సమారాధనలాగా ఆ కవిత....నిజంగానే నాకు నచ్చింది. చెవులప్పగించి విన్నాను. అక్కడే నువ్వు చదివేసిన అన్యాయాలు అన్నిటి గురించీ చెప్పినవాడివి మీ కుట్రలు, కుత్సితాలు, మీ కుతంత్రాలు, మీ కుంభకోణాలు అన్నీ నా కోసం.... అని కూడా యాడ్ చేసి వుంటే బాగుండేదేమో!" అంది.

    ఈ వాతావరణం, ఈ మాటలూ అన్నీ అసహజంగా అనిపిస్తున్నాయి అఖిల్ కి. అయినా శాంతంగానే అన్నాడు "ఎనీ థింగ్ మోర్!"

    "యా! దేర్ ఈజ్ సమ్ థింగ్ మోర్!" అంది నీర్జా. "నీ కవితలో మెచ్చుకోవాల్సింది ఏమిటంటే అందరిలాగా ఒకళ్ళని వెనకేసుకొస్తూ యింకొకళ్ళని తిట్టడం కాకుండా డేరింగ్ గా అందరినీ పట్టుకుని ఏకేశావు నువ్వు. ఇది సందేశాల ఫార్ములాకి వ్యతిరేకం కదా! బాక్సాఫీసు సినిమాలకి ఫార్ములా వున్నట్లు సందేశాలకి కూడా ఒక ఫార్ములా వుంటుంది. ఆ ఫార్ములా ప్రకారం చెప్పే సందేశాలే ఎప్పుడూ హిట్ అవుతాయి. అంటే సందేశాలు ఎప్పుడూ కూడా మనుషులని ముఠాలుగా విడగొడుతూ ఒక వర్గానికి మీసాలు మెలేసి రోషం తెప్పిస్తూ ఇంకో వర్గానికి తోక మెలేసి ఉక్రోషం తెప్పించేటట్లు ఉండాలి. ఒప్పుకుంటావా?"

    చాలా సర్ ప్రయిజింగ్ గా ఉన్న ఆమె అనాలిసిస్. అఖిల్ కి ఆశ్చర్యం కలిగించింది. పరీక్షగా ఆమె మొహంలోకి చూశాడు.

    నీర్జా చెబుతూనే వుంది-

    "హెట్ సందేశాలు ఎప్పుడూ కూడా ఒక పక్షం వెన్ను కాస్తూ రెండో పక్షాన్ని వేళాకోళం చేస్తూ "మీలో మీరు తన్నుకు చావండి" అని హితబోధ చేసేటట్లు వుంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనుషులందరూ ఒకటేనని, కలిసి కలివిడిగా ఉండాలని సందేశం యిస్తే అది మరీ చప్పచప్పగా వుంటుంది. అలా కాకుండా మనుషులని బ్రాహ్మణులూమ్, బ్రాహ్మణేతరులనీ, అగ్రవర్ణాలు, నిమ్నజాతులనీ, ఆంధ్రా అనీ, తెలంగాణా అనీ, మొగ అనీ, ఆడ అనీ, బీదా గొప్పా అనీ అలా విడదీసి ఏకపక్షంగా చెబితేనే వేడివేడి మిరపకాయ బజ్జీల్లాగా గర్మగరంగా ఉంటుంది. అలాంటి సందేశాలనే జనం కూడా లైక్ చేస్తారు కూడా. 'సర్వేజనా సుఖినో భవంతు' అన్నట్లు అందరూ బాగుండాలి అన్నామనుకో. అనామకులై పోతాం! కానీ నువ్వు మాత్రం అందరినీ పట్టుకుని హోల్ లాట్ గా తిట్టేశావ్! ఈ సోకాల్డ్ నాయకులందరి నైజం ఒకటేనని జనానికి చెప్పాలని చూశావు. "గ్రేట్ ఐ సే! రియల్లీ!" 

 Previous Page Next Page