కుక్ ఆ మాటలు వినగానే చటుక్కున తగ్గిపోయాడు. అయినా అక్కసు అణచుకోలేక సణుగుతున్నట్లు అన్నాడు_
"అయితే వాళ్ళు మన కడుపులు కొట్టి ఎలా ఆడుతున్నా మనం చూస్తూ ఊరుకోవలసిందేనా?"
"ఊరుకుని వుండాలని నేను అన్లేదే."
"మరి?"
"ఊరికే ఉండబోవడం లేదు మనం. ఏం చెయ్యాలో నేను చేసేశాను ఇప్పటికే!"
"చేసేశావా? ఏం చేశావ్?" అన్నాడు కుక్ నోరెళ్ళబెట్టి.
"అది ఇంకొంచెం సేపట్లో ఊరందరికీ తెలుస్తుంది" అని నవ్వాడు అఖిల్.
* * * *
రాజ్ కుమార్ తనకు వచ్చిన లాభాలను తృప్తిగా బేరీజు వేసుకుంటూ వుండగా....
అప్పుడు మోగింది ఫోన్.
అసహనంగా ఫోన్ అందుకున్నాడు రాజ్ కుమార్.
అది అతని డైరెక్ట్ లైన్. ఆ నెంబర్ డైరక్టరీలో వుండడు. అతి కొద్దిమంది సన్నిహితులకి తప్ప ఆ నెంబరు ఇంకెవరికీ తెలియదు.
అంత రాత్రప్పుడు ఆ నెంబరు మోగిందంటే అది అత్యవసరమైన విషయమే అన్నమాట.
"హలో" అన్నాడు రాజ్ కుమార్.
లైన్లో అవతల వినబడింది అతని అనుచరుడి గొంతు.
"అన్నా! కొంప మునిగింది" అన్నాడు అనుచరుడు ఆదుర్దాగా.
"ఏమయ్యిందిరా?"
"ఏ గోడ మీద జూడూ వాల్ పోస్టర్లూ అతకబెట్టి ఉన్నాయి?"
"వాల్ పోస్టర్లా ఏమనిరా?"
"అన్నా చదువుతా విను?" అని చదవడం మొదలు పెట్టాడు అనుచరుడు.
అన్నదానం! అన్నదానం!! అన్నదానం!!!
ఢిల్లీలో వుంటున్న పేదసాదలయిన సోదరులందరికీ మన అన్న రాజ్ కుమార్ చేస్తున్న అన్నదానం!
మన అన్న రాజ్ కుమార్ ప్రజల మనిషి. మన అన్న రాజ్ కుమార్ పేదలపాలిటి పెన్నిధి.
మన అన్నకి పెళ్ళి కుదిరింది.
వేరే బడా నాయకులయితే పెళ్ళికి పెద్ద హంగామాతో డిన్నరు పార్టీ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద వాళ్ళని మాత్రమే పెళ్ళికి పిలిచి వుండేవాళ్ళు.
మన అన్న రాజ్ కుమార్ అలా చెయ్యదలచుకోలేదు. తను ఈ స్థితికి తెచ్చిన బీదాబిక్కిని మరవలేదు మన అన్న రాజ్ కుమార్.
అందుకని మన అన్న పేదలకోసమే పెద్ద విందు కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాటు చేస్తున్నాడు.
ఈ ఫైవ్ స్టార్ విందుకు అందరూ వచ్చి మన అన్నకి శుభాకాంక్షలు తెలుపవలసిందిగా కోరడమైంది.
ఇట్లు.
రాజ్ కుమార్ మిత్రసంఘం.
గమనిక :
బీదలకోసం విందుకి చేయిస్తున్న వంటకాలు:
20 రకాల సూపులు
20 రకాల బిర్యానీలు
20 రకాల కూరలు
20 రకాల సలాడ్స్
20 రకాల పిండివంటలు
20 రకాల ఖారా
ఇవికాక :
స్విస్ చాక్ లెట్లు
స్విస్ చీజ్
రష్యన్ ఓడ్కా
అమెరికన్ మార్టినీ
హాలండ్ బీరు
ఫ్రెంచ్ షాంపెన్
స్కాచ్ విస్కీ
గోవా ఫెనీ మొదలుకుని కల్లు, గుడుంబా, కంట్రీ లిక్కర్ దాకా అన్నిరకాల మద్యాలు.
ముఖ్య గమనిక :
మన అన్న రాజ్ కుమార్ మామగారైన మెగా ప్రొడ్యూసర్ మెహతాగారి ఆధ్వర్యంలో మెగాస్టార్స్ తో కూడిన వెరైటీ ప్రోగ్రాం.
లక్షల సంఖ్యలో తరలిరండి !
తరలిరండి !!
తరలిరండి !!!
అనుచరుడు చెప్పడం ఆపగానే ఒక అశ్లీల పదం ఉచ్చరించాడు రాజ్ కుమార్.
"జనం ఏమనుకుంటున్నార్రా" అన్నాడు నిదానంగా.
"మెడకాయమీద తలకాయ వున్న ప్రతివాడూ ఇదేదో ప్రాక్టికల్ జోక్ అని అనుకుని నవ్వుకుంటున్నాడు."
తేలిగ్గా నిట్టూర్చాడు రాజ్ కుమార్.
"అంతే కదా?"
అనుచరుడు నెమ్మదిగా అన్నాడు_
"అన్నా!"
"చెప్పరా?"
"ఏమాత్రం తెలివి ఉన్నవాడయినా ఈ వాల్ పోస్టర్లు చదివి నవ్వుకుంటున్నాడు. కానీ....తిండికి లేక డొక్కలు మాడుతున్న గరీబుగాళ్ళు మాత్రం ఇది నిజమని నమ్మేసారన్నా! బిచ్చగాళ్ళు, బికారినాయాళ్ళు, అడుక్కు తినే అంట్ల వెధవలు. చీమలపుట్టలు పగిలినట్లు నగరం నాలుగు వైపుల నుంచి స్టేడియం దగ్గరికి వచ్చేస్తున్నారన్నా."
మాట పడిపోయి మౌనంగా వుండిపోయాడు రాజ్ కుమార్.
అనుచరుడే మళ్ళీ అన్నాడు-
"ఈ గరీబు వెధవలని ఉతికి ఊరవతలకు తరిమెయ్యమంటావా అన్నా?"
చటుక్కున సహనం కోల్పోతూ అన్నాడు రాజ్ కుమార్.
"నా కొడకా! అడ్డగోలుగా ఏమన్నా చేశావంటే నా ఇమేజ్ డ్రయినేజ్ గుంటలో కలిసిపోతుంది. ఇది పేదోళ్ళతో వ్యవహారం. పేదోళ్ళంటే రెండువైపులా పదును వున్న కత్తిలాంటి వాళ్ళురా. ఇన్నాళ్ళూ మనం పేదవాళ్ళని నమ్మించి మన పబ్బం గడుపుకున్నాం. ఇప్పుడు మనమంటే పడని వాళ్ళెవరో ఆ పేదోళ్ళనే ఇంకో రకంగా నమ్మించి మనమీదకే వదుల్తున్నారు. అట్ల చేస్తుందెవరో నాకు తెలుసు. దీనికి బద్లా ఏం చెయ్యాలో నేను ఆలోచించి చెప్త. అప్పటిదాకా నువ్వు చప్పుడు చెయ్యకు. అర్ధమయ్యిందా?"
"అట్లనే అన్నా" అన్నాడు అనుచరుడు.
వాళ్ళు అట్లా మాట్లాడుకుంటుండగానే పేదలు, సాదలు, బీదాబిక్కీ, దరిద్ర నారాయణలు, దైవోసహతులు, దిక్కులేని వాళ్ళు, దగాపడ్డ తమ్ముళ్లు, దీనంగా వున్న చెల్లెళ్ళు.
అందరూ లక్షల సంఖ్యలో మర్నాటి విందుకోసం ఈ రాత్రి నుంచే స్టేడియంని చుట్టుముట్టడం మొదలుపెట్టారు.
అన్న రాజ్ కుమార్ పెళ్ళికి ఫైవ్ స్టార్ లెవెల్లో "అన్నదానం" జరగబోతోందన్న సంగతి ఆఘమేఘాల మీద వాడవాడలా వ్యాపించింది.
అలా ఆ వార్తను వ్యాపింపచేయడంలో ఉత్తమ్ సింగ్ చెడ్డా, లారీ క్లీనరు రాంభరోసేల పాత్ర కూడా చాలానే ఉంది. లారీ వేసుకుని, బస్తీ బస్తీకి వెళ్ళి వార్తని చాటింపుచేసి వచ్చారు ఇద్దరూ.
నోరూరించే ఆ మాట ఆనోటా ఈనోటా మరింత మందికి తెలిసింది.
ఆ తెలిసిన వాళ్ళు ఇంకొంత మందికి చెప్పడం....
అలా....అలా....అలా....
తెల్లారేసరికి ప్రపంచంలోని పేదలందరూ ఇక్కడే ఉన్నారా అనిపించేటంతలా పోగయిపోయారు జనం అక్కడ.
స్టేడియంకి వచ్చే దారులన్నీ జనసందోహాలతో కిక్కిరిసిపోయాయి. కిటకిటలాడిపోయాయి.
షెడ్యూలు ప్రకారం అయితే ఆ స్టేడియంలో కార్యక్రమాలన్నీ పొద్దున పది తర్వాత ప్రారంభం అవ్వాలి. ఆ టైంకి చాలా టైట్ గా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడుతుంది.
ఆ సాయంత్రం సినీతారల వెరైటీ ప్రోగ్రాం!
అప్పటికి ఊళ్ళో ఉన్న పోలీసు బలగంలో ముప్పాతిక మూడొంతులమంది అక్కడే ఉంటారు.
అదీ ఒరిజనల్ ప్రోగ్రాం!
కానీ__
ఇంత పొద్దున్నే అక్కడికి అంతమంది జనం వచ్చేస్తారని ఎవరూ ఊహించి ఉండకపోవడంవల్ల అంత పెద్ద సంఖ్యలో పోలీసు బలగం హాజరుగాలేదు అక్కడ.
ఉన్న కొద్దిమంది పోలీసులూ కూడా ఆ జనం తాకిడిని తట్టుకునే స్థితిలో లేరు.
అంతా గొడవ గొడవగా ఉంది.
ఏం చేస్తే బాగుంటుందని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చేలోపలే, స్టేడియం గేట్లు ఊడి కిందపడ్డాయి. పోలోమని లోపలికి పరిగెత్తారు జనం.
వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగి చావకుండా ఉండడానికిగానూ, పోలీసులు గేలరీల్లోకి ఎక్కి నిలబడవలసి వచ్చింది.
అప్పటికే "మాయాబజార్" రెడీగా ఉంది.
రకరకాల తినుబండారాలూ, మద్యాలూ టెంప్టింగ్ కనబడుతున్నాయి స్టాల్స్ లో.
ఆవురావురుమని తినడం మొదలెట్టారు బీదాబిక్కీ. వాళ్లు కలలో కూడా ఊహించలేని విందు అది.
ఆబగా తినేస్తున్నారు జనం. ఒకడు కాశ్మీరీ పరాటాల పని పడుతూ ఉంటే, ఒకడు బాసుందీ బేసిన్ ఎత్తి నోట్లోకి ఒంపేసుకుంటున్నాడు. ఒక అమ్మాయి రెండు చేతులతో నాలుగు లడ్లు పట్టుకుని తినేస్తోంది. ఒక డోసు బాబు ఓడ్కాని ఒంటె తాగినట్లు తాగేస్తున్నాడు.