"బుద్దమూర్తీ! పేరుకి తగ్గ బుద్దిమంతుడివి నీవు. ఇలా ఆన్ ఆఫ్ ల వ్యవహార సరళి చూస్తుంటే గంతకు తగ్గ బొంతన్నట్లు మీ దంపతులను ఏరి ఏరి ఒకచోటకి చేర్చినట్లున్నాడు ఆ భగవంతుడు. సరే అసలు విషయానికి వద్దాం ఎన్నో రాత్రులు వస్తాయి పోతాయి. జీవితం అంటే ఆన్, ఆఫ్ లు కాదు. రాత్రి కాబట్టి మీ భార్యాభర్తలు పంతానికి పోయి ఆన్, ఆఫ్ లతో యుద్ధం చేస్తున్నారు రాత్రి సృష్టించిన వాడే పగలు సృష్టించాడు. పగలు ఎవరూ లైటు వేసుకోరు కదా! ఇప్పటికయినా కళ్ళు తెరిచి పగటిపూట ఏకంకండి మీకు లైటు ఆర్పే పనివుండదు. మీ వైఫ్ కి లైటు వెలిగించే పనివుండదు."
ఇలాంటి లెటర్స్ గాక ఇంకా ఇంకా చిత్రమైన లెటర్స్ కూడా "చేయూత...పై పూత"కి రాసాగాయి. అవన్నీ కూడా వింత వింత వ్యాధులు విచిత్ర మనస్తత్వాల గురించి.
ఆ లెటర్స్ చదివిన పాఠకులలో అనుమానం మొదలయింది. ఎవరికి వారికి ఆ వ్యాధి ఏదో తమకే వున్నట్లు అనిపించింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో దిగంబరంగా అద్దం ముందు నుంచుని తన శరీరాన్ని తామే క్షుణ్ణంగా పరిశీలించి చూసుకుని ఏదో ఎక్కడో లోటుకనపడటంతో తమ అనుమానం తీర్చుకోవటానికి డాక్టర్ వినయంగారికి ఒక లెటర్ రాసేవారు.
చివరికి
కొందరు పాఠకులు ఎంతగ దిగజారారు అంతే!
"నాకు వంకాయ కూర చాలా యిష్టం. రోజు విడిచి రోజు వంకాయలతో చేసిన పదార్ధం తింటాను.
నాకు పిల్లలు పుడతారా!
వంకాయలు తెగ తింటే పిల్లలు పుట్టరని చెపుతారు. నిజమా?
ఒకవేళ పిల్లలు పుట్టినా వంకర కాళ్ళతో పుడతారని మా బామ్మ అంది.
అంతే-
మరోసారి బి.పి. రావ్ కి అంతులేని పేరు ప్రఖ్యాతులు వచ్చిపడ్డాయి.
బి.పి. రావ్ ని ఆదర్శంగా తీసుకున్నారు కొందరు. అతగాడికి సన్మానం చేశారు మరికొందరు.
బి.పి. రావ్ అటు ఆకుకి చెందక ఇటు పోకకి చెందని మూడో మనిషి కావచ్చు కాని ఆ బుర్ర మహా మహా మేధావులకే లేనత గొప్పది. మెదడంతా పారేది పాదరసమే.
అయినా-
బి.పి. రావ్ కనపడని ఆ దేమున్ని తిట్టుకొని రోజులేదు. పైకి మాత్రం దైవం అంటే తనకి అంతులేని నమ్మకం అని నమ్మబలికేవాడు.
"ఏది! ఎందుకు? ఎప్పుడు! ఎలా! అన్నది ఆ పైవాడికి తప్పమానినీ మానవమాత్రలకి ఎవరికీ తెలియదు. ఇది సృష్టి రహస్యం.
నారు పోసినవాడె నీరు పోస్తాడు.
ప్రాణం పోసినవాడే ప్రాణం తీస్తాడు.
ఇటు ఆడ అటు మగ కాని బి.పి. రావ్ కి ఆ పైవాడు పెద్ద బుర్ర యిచ్చాడు.
అంతులేని పేరు ప్రఖ్యాతులు, సిరి సంపదలు యిచ్చాడు. ఇది చాలదా!
ఆడగాని మగవాని తెల్లారి లేస్తే ఎన్ని సమస్యలతో బాధ పడటం లేదు! పెళ్లి కాని వాళ్లకి పెళ్లి చేసుకున్న వాళ్ళకి పెళ్ళయి పిల్లలున్న వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎన్నెన్నో అనుమానాలు.
డాక్టర్ వినయం గారికి వచ్చే ఉత్తరాలు చదివితే చాలు ఈ సంసారం మీదనే విరక్తి కలుగుతుంది.
ఎవరూ చేయని ఆలోచనలు చేసి ఎంతో పేరు సంపాదించేలా ఆ దేముడు ఆనాడే బి.పి రావ్ ముఖాన రాశాడు. నిజంగా యిది బి.పి. రావ్ కి గాడ్ యిచ్చిన గిఫ్ట్.
ఆడవాళ్ళు ఆడ పిల్లలని మగవాళ్ళు మగపిల్లలని కనే ఈ రోజుల్లో (ఈ యుగంలో) మూడో మనిషైన బి.పి. రావ్ కి ఇంత పేరు ప్రఖ్యాతులు రావటానికి కారణం_!
గాడ్స్ గిఫ్ట్.
ఇది బి.పి. రావ్ కి తెలియని నిజం.
* * * *
పురుషులంతా కలసి-
చాటుగా-
ఓ ఘనకార్యం చేస్తున్నారు తాము చేసే ఆ ఘనకార్యం బయటికి రాకుండా ఎంతో ముందుచూపుతో తెరచాటునే దాచేశారు.
పురుషులంతా అంటే సమస్త మగ ప్రాణులని కాదు. వాళ్ళల్లో కొందరు మాత్రమే. ఇదో ఉద్యమం కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు ముందుగా కొందరు ఆలోచించారు.