ఆచరణలో పెట్టారు ఆచరణలో పెట్టడం అంటే సాటి-తోటి-మగ వాళ్ళని కలుపుకుని ఈ సంఘాన్ని పెంచి పెద్దచేయటం.
ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే ఆడవాళ్ళకి పాపం యీ సంగతులేమీ తెలియవు. కళ్ళుండి గుడ్డివాళ్ళులా పతిదేముళ్ళ మాటలు నమ్ముతున్నారు.
ఆ కొత్త సంఘంలోని ఒక పురుషుడు ఆనందశంకరం. మాయమాటలతో భార్య కళ్ళు గప్పి పని కానిస్తున్నాడు.
ఆ రోజు-
సాయంత్రం ఆఫీసునుంచి ఇంటికి రాంగానే అతికినట్లు ఒక అబద్దం చెప్పాడు. అతికినట్లు అబద్దం చెప్పటం తేలికే తరచు ఒకే మాట చెపితే బాగుండదు కదా!
ఈ బాగు ఒగులు ఏమీ తెలియని ఆనంద శంకరం భార్య చైనా తాయరుని పిలిచి "మా ఆఫీసు ఫ్రెండ్ శ్రీరమణ పుట్టినరోజు హోటల్లో భోజనం సినిమా వగైరాలు వున్నాయి. రాత్రికి ఆలస్యంగా వస్తాను చితారూ!" అని మహా ఆప్యాయంగా చెప్పాడు.
భార్య చినతాయారుని ముద్దుగా 'చితారూ!' అని పిలుస్తాడు ఆనందశంకరం.
"ఇదేమిటి ఈ మధ్య మీ ఆఫీసులో వాళ్ళకి వారానికో పుట్టినరోజు వస్తున్నది! మా ఆఫీసూ వుంది దేనికి! ఎవతికీ కూడా ఏడాదికో పుట్టింరోజు రాదు" అంటూ రవంత ఈర్ష్య పిసరంత విచారము ప్రకటించింది చినతాయారు.
"పుట్టినరోజులు పుట్టిన ప్రతి వాళ్ళకి ఏడాదితిరుగుతూనే వస్తాయి ఆనాడు యిఇనాడు స్త్రీలు జాగ్రత్త పరులు పొదుపరులు. వయసు మీద పడకూడదని పుట్టినరోజు పండగలు రెండేళ్ళకి మూడేళ్ళకి చేసుకుంటుంటారు. మా మగ వాళ్ళు ఉత్త పిచ్చాళ్ళు. బర్త్ డే పార్టీ అంటూ నాలుగు డబ్బులు కర్చుచేస్తే గాని తోచిచావదు...." ఆనందశంకరం అడ్డంగా కోశాడు.
"అయినా...మరీ...వారం...రోజుల...కొకసారి..." అంటూ పతి దేముడి ముఖంలోకి పరీక్షగా చూసింది చినతాయారు.
"మా ఆఫీసు చాలా పెద్దది. చాలా మంది గుమాస్తాగాళ్ళు వున్నారు. ఆఫీసరు గారిని కాకా పట్టటానికి నిజంగానో లేక ఉట్టిట్టిగాని గాని పుట్టిన రోజులు చేసేసుకుంటున్నారు. నాటరమ్ కూడా ఎప్పుడో వస్తుంది.మా ఆఫీసులో అందరికి యిదో ఆట అయిపోయింది" తెచ్చి పెట్టుకున్న విసుగుతో అన్నాడు ఆనందశంకరం.
"సరేలేండి విసుక్కుంటే పనులవుతాయా! జాగ్రత్తగా వెళ్ళి రండి. అసలే ఉట్టిమనిషి కూడా కారు ఇప్పటికే రెండు యబార్షన్లు అయ్యాయి" అంటూ భర్త పొట్టకేసి చూసింది చినతాయారు.
ఆనందశంకరం ముందు బాధ ఆ తర్వాత నును సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకున్నాడు.
మరో పావుగంట తర్వాత ట్రిమ్ గా తయారయి ఇంట్లోంచి బయట పడ్డాడు ఆనందశంకరం.
* * * *
భర్తని సాగనంపటానికి బయట గుమ్మం దాకా వచ్చిన చిన తాయారు, ఏదో ఆలోచిస్తూ అలా నుంచుండి పోయింది.
ఎదురింటి నాంచారి ఏదో పని వున్నట్లు వచ్చి పలకరించింది. చాలా మంది ఆడవాళ్ళకి అక్కరలేని విషయమంటూ లేదు. సృష్టి మొదట్లోనే స్త్రీకి యీ (సు) గుణం అబ్బింది.
ఎదురింటి నాంచారి అసలు సిసలయిన ఆడది. వస్తూనే అడిగింది "మీ వారు ఎక్కడికో వెళ్ళినట్లున్నారు!" అంటూ.
విషయం చెపుతూ ఇంట్లోకి ఆహ్వానించింది.
అంతా విని "ఇదేదో చిత్రంగానే వుంది" అంది నాంచారి.
"దీంట్లో చిత్రము విచిత్రము ఏముంది!" చిన తాయారు ఆశ్చర్యంగా అడిగింది.
"ఈ మధ్య మా ఆయనకూడా కొత్తగా ఒకరు ఫ్రెండ్ అయ్యాడని....వాడికి బోలెడు డబ్బుందని... తోచనప్పుడల్లా ఫ్రెండ్స్ అందరికి పార్టీలు గట్రా యిస్తుంటాడని....అదని ఇదని చెప్పి వెళుతున్నారు. వెనక వీధి వెంకటేస్వరి భర్తకూడా ఇలాగే ఏదేదో చెప్పి రాత్రిళ్ళు ఎక్కడికో వెళ్ళివస్తున్నట్టున్నాడుట. అంతేకాదు-రాచమణి భర్తకూడా తన పిల్లల్ని భార్యకి అప్పగించి బతిమాలి బామాలి వెళ్ళి వస్తున్నాడుట" నాంచారి తను సేకరించిన విషయాలు చెప్పింది.
'
"చాలా గేదర్ చేశావే. నీ అనుమానం ఏమిటంటావ్!" చిన తాయారు అడిగింది.
"ఏదో వుంది"
"ఏదో అంటే?"
"తెలిస్తే చెప్పనా?"
"మనింటి మగవాళ్ళని మనం అనుమానించటం తప్పుకాదా?" చిన తాయారు మందలింపుగా అంది.
"నువ్వు ఈ కాలందానివి కాదు. అలనాడు రాముడు సీతాదేవిని అనుమానిస్తే అమాయకంగా పిచ్చి సీత అవమానాల పాలయింది. ఆ తర్వాత యుగాల్లో మాత్రం ఎంతమంది మగవాళ్ళు భార్యల్ని అనుమానించలేదు. అవస్థలకు పెట్టలేదూ కాలం మారింది- స్త్రీ పురుష సమాన హక్కులు ఉన్నా మనం మన మగవాళ్ళని అనుమానించటంలో తప్పులేదు.
ఈ ప్రపంచం తల్లక్రిందులయ్యేదిగాక మగబుద్దిమాత్రం మారదు. ఈ సత్యం మనం గుర్తుంచుకుని మనం సంసారాలు చేయాలి" ఎంతో ముందుచూపు గల నాంచారి గీతోపదేశం చేసింది.
చినతాయారు మెదడులో అనుమానం పురుగు ప్రవేశించింది.
కాసేపు ఆలోచించింది చిన తాయారు. ఆయన అసలే ఒట్టిమనిషీ కారు పెళ్ళయింతర్వాత ముద్దబంతి పువ్వులాంటి ఆడపిల్లని కంది. అదేం ఖర్మమోగాని ఆయనకీ మాత్రం రెండుసార్లు అబార్షన్ లయ్యాయి. ప్రతిసారి చచ్చిబతికినంత పనయింది. ఈ తఫా ఎలానో ఏమిటో మూడో నెల సగం పడింది. ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ సమయంలో ఈ కొత్త బెడద ఏమిటో అర్ధం కావటంలేదు....
"ఏమిటి ఆలోచిస్తున్నావ్? నేను చెప్పిందాంట్లో నిజమెంత వుందనా?" నాంచారి అడిగింది.
"అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు. కాకపోతే నా ఆలోచన ఏమిటంటే? మన మగవాళ్ళు మనతో అబద్దాలు ఆడి ఏం ప్రయోజనం సాధిస్తారా అని...." చిన తాయారు నిమ్మదిగా అంది.
"అదే ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది."
"ఏం కనిపెడతాము?"
"మనసంటూ వుంటే మార్గం దానంతట అదే కనపడుతుంది."
"మనం కనిపెట్టాల్సింది ఏమీలేక మనం చేసిన ఈ పని మనవాళ్ళకి తెలిసిందే అనుకో..."


