'ఎంత చదువు చదివారండీ!' అంది.
'చదువుల దేవతవి కదా! అందుకే అంత చదివాను!'
'బ్రహ్మాండ పురాణం అంత చెప్పారు'
'అంత చెప్పినా ఆవగింజంతైనా అర్ధమయిందా?'
'ఆవగింజంటే గుర్తుకొచ్చింది. ఆంధ్రదేశంలో ఇలా అనుకుంటారట కదా! ఆవగింజంత బూడిద పూసుకుంటే గుమ్మడి కాయంత వెర్రి పుట్టుకొస్తుందట! నిజమేనా?'
'అక్కడి మాటల అర్ధాలు ఇక్కడ అడిగితే ఎలా దేవీ! అయినా వాగ్దేవివి. నీకు చెప్పాలా నేను!'
'తమరు వేదపఠనంలో ఘనాపాఠీలు కదా!'
'వేదాల సంగతి ఎందుకులే! మనమ్మాయి మాట విను. అహల్య సుఖంగా జీవిస్తోంది. ఆనందంగా ఉంది. కూతురికి పెళ్ళి చేసింది. కేసరి వల్ల అంజనకు కుమారుడు కూడా కలిగాడు'
'అహల్య కూతురు అంజన... ఆమె భర్త కేసరి!'
'ఆమె కుమారుడు అంజనీ తనయుడు. ఆంజనేయుడు...'
'ఇవన్నీ మీకెలా తెలిశాయి?'
'నీకు నీ ముంజేతి చిలుక చెపితే, నాకు నా వాహనం హంస చెప్పింది!' అన్నాడు.
'దానికెలా తెలుసునట!'
'మందాకినీలో విహరిస్తూ ఉంటే అప్సరసలు అనుకుంటూ ఉంటే విందట!'
బ్రహ్మ నవ్వుతూ అన్న మాటలకు సరస్వతి కూడా నవ్వింది.
'విషయాలన్నీ వివరంగా తెలిశాయి. కాబట్టి మనం వెళ్ళి చూడక్కరలేదంటారు అవునా!'
'మనం వెళ్ళక్కరలేదనలేదు. వెళ్ళే తీరిక లేదంటున్నాను'
'అయితే నేను వెళ్ళి చూసి రానా?'
'వెళ్ళు! వెళ్ళు! కూతురి ఇంటికి వెళ్ళి అల్లుడుగారు చేసే సపర్యలు అందుకుని, కూతురు చేసే మర్యాదలు స్వీకరించి ఆనందించి తిరిగిరా! ఈలోగా సృష్టి ఆగిపోతుంది. అదంతే!'
తెల్లబోయింది సరస్వతీ దేవి 'అయితే నేనెప్పటికీ ఇక్కడి నుంచి కదిలేందుకు వీల్లేదా?' అంది.
'ఊహూ! వాణీ చతురాననులు, శివ పార్వతులూ, లక్ష్మీ నారాయణులూ ఒంటరిగా ఉండరు. వాళ్ళు కలిసే ఉండాలి. అందుకే నేను కదా శ్రీమహావిష్ణువు భూలోకంలో నరుడిగా అవతరించబోతూంటే శ్రీమహాలక్ష్మి కూడా అవతరిస్తూ ఉంది'
'అయితే దాశరధి నుదుటి రాత కూడా తమరే రాస్తారా?'
జవాబివ్వలేదు బ్రహ్మ.
'అత్తగారి అదృష్ట గీత కూడా తమరి చేతిపైనే...?'
'ష్! అలా అనకు. మా అమ్మగారు అయోనిజగా జన్మిస్తారు. ఆవిడ భాగ్యరేఖ నిర్ణయించేంత వాడినా నేను?'
సరస్వతి మౌనం వహించింది. బ్రహ్మ తిరిగి సృష్టిపై దృష్టి నిలిపాడు.
* * * *
'నారాయణ! నారాయణ!'
'నారదా నీకెన్నిసార్లో చెప్పాను. నా ఆగర్భ శత్రువును నా ఎదుటే స్మరిస్తావా! ఈ రావణుడి పేరు వింటే ఏడేడు పదునాలుగు లోకాలూ దద్దరిల్లిపోతాయి. మా జ్ఞాతులు దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష గంధర్వ దేవయోనులూ, నా నామ స్మరణతో గజగజ వణికిపోతున్నారు. ఈ అఖిల చరాచర జగత్తులో నా ధాటికి ఎదురు లేదు. నా ఆజ్ఞకు తిరుగులేదు. కానీ నువ్వు...'
మధ్యలోనే ఆగిపోయాడు రావణుడు.
పక పక నవ్వాడు నారదుడు.
'అది హేళనా!'
'నారాయణ! నారాయణ! నిన్ను అవహేళన చేస్తానా మనవడా! నా నారాయణ స్మరణతోనే నువ్వు ఉలుకులికి పడుతూంటే నాకు నవ్వొచ్చింది. అందుకు నవ్వాను! అంతే! ఏనుగుకు ఎలుకను చూస్తే భయమంటే వింతగా ఉండదూ! అలాగే రాక్షేశ్వరుడికీ నారాయణ స్మరణ అంటే భయంగా ఉందంటే...'
'భయమా! నాకా! ఏమంటున్నావు నారదా!'
'అవును నీకే. లేకపోతే నారాయణ స్మరణ నీలో...'
'నాలో భయాన్ని కలిగించలేదు దేవర్షీ! శత్రునామ సంకీర్తనం నాలో చికాకును పుట్టిస్తున్నది'
'నారాయణుడు నీకు శత్రువా!'
'ఆహా దేవతలంతా మాకు శత్రువులే కదా! జ్ఞాతిశ్చేదనలేన కిమ్మని కదా సామెత! వారంతా అసురవైరులు! మేం సురవైరులం! మా దృష్టి సృష్ట్యాది నుంచీ ఇంద్రపదవి మీదా- అష్టదిక్పాలుర మీదే! వారికీ అంతే! మేం తపస్సు ప్రారంభిస్తే దాని ఫలితంగా సురాధిపత్యం సాధిస్తామని భయం! అందుకే మా తపస్సుని భగ్నం చేస్తారు. ఈ పగకంతా మూల పురుషుడు ఆ విష్ణువు. మేం విష్ణుద్వేషులం! శివభక్తులం!'
'మీది వైర భక్తి రావణా!'
'నీ సమర్ధనపై మాకు విశ్వాసం లేదు. ఎప్పటికయినా వైకుంఠంపై దండెత్తి అతన్ని జయించడమే యీ కైకసిసూనుని జీవిత లక్ష్యం!'
'నువ్వు దిక్పాలురందరినీ పాదాక్రాంతులను చేసుకున్నావు కదా!'