Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 39


    "నేను సరోజని గురించి మాట్లాడడానికే వచ్చానని ఎందుకనుకున్నారు?..... సరోజమీద నాకేం అధికారం వుంది ఆమెని ఏ విధంగానూ ఆజ్ఞాపించి కట్టడిచేసే హక్కు నాకేం లేదు ఇంతకీ సరోజ మాటలు నమ్మలేక, మిమ్మల్ని ఆరాతీద్దామని వచ్చానని మీరనుకుంటే, అది పొరపాటే"
    "మరి?" ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకరం.
    "నేనొక విషయం సూటిగా అడుగుతాను జవాబివ్వండి - గీత మీకెలా తెలుసు?"
    ప్రభాకరం అతనివంక సూటిగా చూశాడు "ఆ విషయం మీరు నన్నడగకపోవడం మంచిది" అన్నాడు కరకుగా.
    "కాదు చెప్పండి -దయచేసి మీకు తెల్సింది చెప్పండి..." ఆరాటంగా అడిగాడు.
    ప్రభాకరం మొహం కఠినంగా మారింది "చెప్పను - చెప్పలేను - చెప్పనని ఒకరికి మాటిచ్చాను"
    "ఎవరికి? గీతకా?"
    "కాదు సరోజగారికి!"
    "సరోజకా, ఆవిడకి - గీతకి ఏం సంబంధం!" ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్.
    "మనిషికి మనిషికి మధ్య వుండే సంబంధం - తోటి స్త్రీకి అన్యాయం జరగడం ఇష్టం లేక ఆవిడ మాట తీసుకుంది..."
    "అంటే....గీతకి మీకు మధ్య నే ఊహించిన దానికన్నా ఎక్కువే వుందన్నమాట - అందుకేనా గీత ఆరోజు అలా పరిగెత్తింది మిమ్మల్నిచూసి" సాలోచనగా అన్నాడు కృష్ణమోహన్.
    ప్రభాకరం మాట్లాడలేదు. అతనికి గీత గురించి అంతా చెప్పేయాలన్న ఆవేశం ముంచెత్తింది. కాని, సరోజకిచ్చిన మాట గుర్తువచ్చింది. ఆ క్షణంలో సరోజ మీద అతనికి కోపం వచ్చింది. గీత ఆమెని అంతలా అవమానిస్తున్నా, అవకాశం వచ్చినా ఆమెపట్ల యింకా సహృదయం చూపడం ఏమిటీ - యింత మంచితనం ఎవరూ మెచ్చేను అనుకున్నాడు.
    "అయితే సరోజ కీ విషయం అంతా తెల్సునా?" కృష్ణమోహన్ ప్రశ్నించాడు ప్రభాకరం తల ఆడించాడు.
    "మీరిదంతా గీతమీద కోపంకొద్దీ సృష్టించిన కధ అయితే- గీత వేరే విధంగా చెప్పిందే మీ గురించి..." కృష్ణమోహన్ అనుమానంగా అన్నాడు.
    ప్రభాకరం కోపంగా చివ్వున తలెత్తి "కృష్ణ మోహన్ గారూ! మీకీ గీత గురించి నేనేం చెప్పలేదు నా అంతట నేను -నేను చెప్పందే మీరు నమ్మే ప్రసక్తి ఏముంది. మీకీ రుజువులు చూపడానికి నా దగ్గరే సాక్ష్యాలు లేవు గనకనే మేం చెప్పినది నమ్మరనే చెప్పడంలేదు. నిజమో అబద్దమో గీతనే అడగండి అసలు సంగతి - హా- గీతకానిజం చెప్పేటంత నిజాయితీవుంటే - అయితే సరోజ మీద యిలాంటి నింద ఎందుకువేస్తుంది - ఆమాత్రం గుర్తించలేరా మీరు" వ్యంగ్యంగా అన్నాడు ప్రభాకరం లేచి నిల్చుని. కృష్ణమోహన్ లేచాడు. కృష్ణమోహన్ ఒక్క క్షణం అతని వంక చూసి యింకేం మాట్లాడకుండా కారు స్టార్టుచేశాడు.
    
                                      *    *    *   
    కృష్ణమోహన్ కి ప్రభాకరంతో మాట్లాడాక అనుమానం మరింత బలపడింది. నిన్న సరోజ మాటలు, యివాళ ప్రభాకరం మాటలు, గీత ఆనాటి ప్రవర్తన అన్నీ కలిపి గుణిస్తే అతనికి చాలా వరకు అర్దమైంది. సరోజ పట్ల అకారణ ద్వేషం గీతకి ఎందుకు కల్గిందో కూడా బోధపడింది. ప్రభాకరం, సరోజ స్నేహితుడు. అతను ఆమెతో తన గురించి చెప్పి వుంటాడని ఊహించి సరోజ తమ యింట్లో వుండడం ఎంత ముప్పో గ్రహించే ఆమెని అడుగడుగునా అవమానించి ఎలాగైనా ఆ యింట్లోంచి పంపాలనుకుంటుందన్నది స్పష్టపడింది.
    సరోజకంతా తెలిసి, గీత తననింతగా అవమానిస్తున్నాకూడ ఆమె గురించి చెడుగా ఒక మాటకూడా చెప్పలేదంటే ఆమె సంస్కారం, సహృదయత ఎంతటిదో అర్ధం అయి కృష్ణమోహన్ మనసులో సరోజపట్ల అభిమానం మరింత పెరిగింది. సరోజా....సరోజ....ఆమె మనసు మరొకరిది అందిట. ఆ మరొకరు ఎవరు? బావా!....బావలేక పోయినా ఆమె మనసు అతనికే అంకితమా? ఆమె మనసు ఏమిటో ఎలా తెల్సుకోవడం? గీత గురించి అడిగితే చెపుతుందా సరోజ? అనుమానం వున్నా అడగకుండా వుండలేక పోయాడు కృష్ణమోహన్.
    "సరోజా, గీత గురించి కొన్ని విషయాలు అడుగుతాను. దాచకుండా జవాబు చెపుతావా?" రాత్రి పడుకోబోయే ముందు పాలు తెచ్చిన సరోజని అడిగాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. "అలా చూడకు ఆమె గురించి నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసు!"
    "ప్రభాకర్ చెప్పాడా?" ఆరాటంగా అంది.
    "ఆ...అవును..." ఆమె మొహంలో భావం పరికిస్తూ అన్నాడు. సరోజ అనుమానంగా అతన్ని చూస్తూ "అయితే ఇంక నన్నడగటం ఎందుకు?" అంది.
    "లేదు. అతను విషయం చెప్పలేదు - ఆమె గురించి నీకు తెలుసని, ఆ విషయం నాకు చెప్పవద్దని మాట తీసుకున్నానని చెప్పాడు - సరోజా -నాకంటే నీకు గీత ఆప్తురాలా నా దగ్గిర ఈ విషయం ఎందుకు దాస్తున్నావు చెప్పు-?" నిలేసినట్లు అన్నాడు.
    "ఇంకొకరి విషయంలో జోక్యం కల్గించుకోడం, నేరాలు చెప్పినట్టు అవుతుందన్న భయం-స్వార్ధంతో చెప్పినట్లు అపార్ధం చేసికునే అవకాశం వుంది కనక నాది కాని విషయంలో జోక్యం నాకనవసరం అని..." సరోజ జవాబు అంతకంటే సూటిగానే యిచ్చింది. "అంటే-నేనెలాపోయినా నీకక్కర లేదన్నమాట-యిదే నీ బావ అయితే నీ విలా వూరుకునే దానివా? నా మీద నీకేం అభిమానం లేదన్న మాట!?" సరోజ దెబ్బతిన్న దానిలా చటుక్కున తలెత్తి చురుకుగా చూసింది -మరుక్షణం ఆమె నిర్లక్ష్యంగా నవ్వి- "మీరే మా బావ అయితే - నన్నీ ప్రశ్న అడగకుండానే నేనేమిటో, నా మనసేమిటో గ్రహించేవారు-" గిరుక్కున తిరిగి వెళ్ళిపోయినా సరోజని చకితుడై చూశాడు కృష్ణ మోహన్. ఆమె అన్నమాటని మననం చేసుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాడు కృష్ణమోహన్.

 Previous Page Next Page