శివరాం కోపం ఆఖరి మెట్టు చేరింది. "పో-ముందు బయటికి" గుమ్మం వైపు వేలు చూపాడు.
"ఎందుకలా అరుస్తారు. ఇందాకే చెప్పాను. కోర్టులో విడాకులు పుచ్చుకునే వరకు మీ భార్యనే. అంతవరకు పొమ్మనేహక్కు మీకు లేదు.
శారద లోపలికి వెళ్ళబోయింది.
శివరాం ముందుకురికి చేయి వెనక్కిలాగి, చెంప చెళ్ళు మనిపించాడు. "వెళ్ళవూ ఎలా వెళ్ళవో చూస్తాను. క్షమాపణ చెప్పు. తప్పయిందని కాళ్ళు పట్టుకో లేదంటే వెళ్ళు. ఈ రెండింట్లో ఏం చేస్తావో చెయ్యి" నిప్పులు కురిపించాడు కళ్ళలో.
శారద చెంప పట్టుకుని క్రోధావమానాలతో ఎగిసిపడుతున్న గుండెలతో తీక్షణంగా చూసింది.
"నా వంటినీద చెయ్యివేస్తే మర్యాదగా ఉండదని ముందే చెప్పాను. అయినా కొట్టారు. క్షమాపణ కోరాల్సినంత తప్పులు నేనేం చెయ్యలేదు. చెప్పను. సరే, మీరు అక్కరలే దనుకున్నప్పుడు భార్యని గౌరవంగా చూడలేని భర్త నాకూ అవసరంలేదు. ఇందాకే చెప్పాను. ఇంతకంటే ఏ బతుకు తీసిపోదని, నేనూ తెగించాను. ఇన్నాళ్ళు మీ జులుం సహించాను. నా ఓర్మికే హద్దుదాటింది. నేను వెడుతున్నాను గుడ్ బై."
శారద స్థిరంగా చెప్పదలచింది చెప్పి సూట్ కేసు పట్టుకొని గుమ్మంవైపు అడుగులు వేసింది. పొమ్మనగానే బెదిరి కాళ్ళు పట్టుకుంటుందని, తప్పయిందని ప్రాధేయపడుతుందని ఆశించిన శివరాంకు శారద నిజంగా వెళ్ళి పోతూంటే కర్తవ్యవిమూఢుడిలా నివ్వెరపోయి చూశాడు.
అతని శరీరం భయంతోనో, ఆవేశంతోనో వణక సాగింది. సుత్తులతో కొట్టినట్టు తల బద్దలు అవుతూంది. వళ్ళు వేడెక్కి పోయింది. నిలబడడానికి శక్తి లేనట్టు పక్కమీద వాలి పోయాడు.
* * *
శారద విజయ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పింది. "సరే. మొదటి స్టెప్ గా మన ప్రయత్నం మనం చేద్దాం. అతని ఆఫీసరుని కలిసి మాట్లాడుదాం" అంది విజయ.
విజయ, శారదని ఆశ్చర్యంగా చూశాడు అధికారి. విజయ తనని తాను పరిచయం చేసుకొని శారదని పరిచయం చేసింది. అతను మర్యాదగా లేచి నమస్కరించింది "ఎస్. మేడం వాట్ కెనయ్ డూ ఫర్ యూ" అన్నాడు నమ్రతగా.
"మీతో ఈమె గురించిన కొన్ని పర్సనల్ మాటర్స్ మాట్లాడాలని వచ్చాను."
ఆయన అర్ధం గానట్టు ఆశ్చర్యంగా చూసాడు.
విజయ విశదంగా శారద గురించి, శివరాం గురించి, ముందునించి దాంపత్యంలో కలతలు, కట్న కానుకల లోపానికి భార్యని మాటలతో శివరాం ఎలా హింసించింది, చెయ్యి చేసుకోడం, ఆఖరికి పుట్టింటికేనా పంపని అతని అమానుషత్వం, విరక్తిలో శారద ఆత్మహత్యా ప్రయత్నం తను వైద్యం చెయ్యడం అన్నీ వివరంగా చెప్పింది.
"రియల్లీ!" ఆశ్చర్యంగా అన్నాడు అధికారి. "ఈ రోజుల్లో కూడా భార్యా నిలా హింసించే వారున్నారంటే మా మగవాళ్ళం సిగ్గు పడవలసిన విషయమే. శివరాం లాంటి విద్యాధికుడు కూడా యిలాప్రవర్తించడం నిజంగా అమానుషమే. అయితే ఇంతకీ డాక్టర్ నన్నేం చెయ్యమంటారు. ఇది అతని పర్సనల్ మాటర్ గదా ..."
"అవును. ఇది అతని సొంత విషయమే, కాని అతను మీ కింద పనిచేస్తున్నాడు. అతని కాండక్ట్ మోరల్స్ ప్రిన్సిపల్స్ వీటితో మీకేం పనిలేదా. రూల్సు, రెగ్యులేషన్స్ వప్పుకోడానికి మానటానికి, మీది గవర్నమెంటు సర్వీస్ కాదు. మీది ప్రైవేట్ పరమే! మీ యిష్టా యిష్టా లతో ఒక ఉద్యోగిని వుంచగలరు. తీసేయగలరు, మూడు నెలల జీతంతో, లేక మూడు నెలల నోటీస్ తో అతన్ని కాస్త నయాన బెదిరించి లొంగదీసుకోలేరా. ఉద్యోగం పోతుందంటే ఎలాంటి వారి కన్నా భయం వుంటుంది గదా..." విజయ ఆశగా చూస్తూ అడిగింది.
ఆఫీసరు ఆలోచనలో పడ్డాడు.
"కాని, ఈ ఉద్యోగం కాకపోతే మరోటి చూసుకుంటాడు. దీంతో కాపురం చక్కపడుతుందని ఏముంది."
సందేహంగా అన్నాడు అధికారి.
"ఈ రోజుల్లో ఒక ఉద్యోగం లేకపోతే మరోటి అంత సుళువుగా దొరికే రోజులా. దొరికినా ఎంత ప్రయత్నం చెయ్యాలి. ఎన్నాళ్ళు పడ్తుంది. ఈ భయం అతనికి వుండదా. ఇంతకీ నిజంగా ఉద్యోగం - తీయద్దు. కాస్త బెదిరించి చూడండి. ఓ స్త్రీ కాపురం నిలబడడానికి మీ చేత నయింది మీరు చేస్తే మీ మేలు మరిచిపోలేం సార్."
"కరెక్ట్, చూస్తాను లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ ఫర్ హెర్. నిజంగా ఇది చాలా విచారించదగిన విషయం. నా చాతనయిన సాయం చేస్తాను" తలపంకించాడాయన.
"థాంక్స్ సార్! మీరు ఈ మాత్రం భరోసా ఇస్తే చాలు. అతను దారికి వస్తాడని నా నమ్మకం."
విజయ సంతృప్తిగా అంది.
"ఇంతకీ మీరు ఆమెకేం అవుతారు! కుతూహలంగా అడిగాడు.
"తోటి స్త్రీగా ఆమెకి బంధువుని. అంతకంటే ఏం అవను" విజయ నవ్వింది.