Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 39


    ఉద్దాలకుడు అనురాగ పూర్వకంగా ముని కుమారుని కౌగిలించుకొని "అష్టావక్రా! నీ అభీష్టం నెరవేరుతుంది. ఈ శుభసమయం కోసమే నేను ఎంతోకాలం నుంచీ ఎదురుచూస్తున్నాను. నీ పితృఋణం తీర్చటానికే నీకు విశ్వవిజ్ఞానం ప్రబోధించాను. నిన్ను సమస్త ప్రపంచంలో సాటిలేని మేటి పండితుడిగా తీర్చిదిద్దాను. నా ఆశీర్వాద బలం వల్ల నీవు వందిని జయించి అఖండ ఖ్యాతి ఆర్జిస్తావు! వెళ్ళిరా నాయనా! విజయీభవ!" అని దీవించి పంపాడు.
    అష్టావక్రుడు తల్లి దగ్గరకు వెళ్ళి అశ్రుధారలతో ఆమె పాదాలు అభిషేకించాడు. తాను వెంటనే మిథిలకు వెళ్ళి వందిని జయించి వస్తానని నివేదించాడు. తన విజయయాత్రకు అనుమతించమని తల్లిని ప్రార్థించాడు.
    మునిపత్ని కన్నీరు తుడుచుకుంటూ ప్రియపుత్రుని శిరస్సు మూర్కొని "చిట్టి తండ్రీ! ఇప్పటికి నా కోరిక తీరింది. నేను కృతార్థురాలనైనాను. ఒకవేళ తాను ఓడిపోతే నిన్ను పంపించి నందిని గెల్పించమని మీ నాన్నగారు ఆజ్ఞాపించి వెళ్ళారు. మీ తండ్రిగారి ఆజ్ఞ తలదాల్చి వెళ్ళి ప్రతిపక్షిని పరాభవించిరా!" అని ఆదేశించింది. తల్లి అనుజ్ఞ అందుకొని మిథిలాపురానికి ప్రయాణమై వెళ్ళాడు అష్టావక్రుడు.
    అష్టావక్రుడు మిథిలా నగరంలో రాజభవనం ముందు నిలిచి ఒక్కమాటు ద్వారపాలకుణ్ణి తేరిపారచూచాడు. అతనిని చూచి ద్వారపాలకుడు నిర్లక్ష్యంగా "ఎవరు నీవు? ఎందుకు వచ్చావు?" అని అడిగాడు.
    అష్టావక్రుడు అంతకన్నా నిర్లక్ష్యంగా "నేనా! నేను ఒక ముని కుమారుణ్ణిలే! జనకచక్రవర్తిని చూద్దామని వచ్చాను!" అన్నాడు. ద్వారపాలకుడు నవ్వుతూ "చక్రవర్తిగారితో నీకేం పని?" అన్నాడు. మునికుమారుడు నిర్భయంగా "పని ఉండే వచ్చాను. మీ వందిని గెల్చి ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు త్రాగించటానికి వచ్చాను. తెలిసిందా? అనవసరంగా ఆలస్యం చెయ్యక నన్ను లోపలికి వెళ్ళనివ్వు." అన్నాడు. ద్వారపాలకుడు విరగబడి నవ్వుతూ "ఓ యబ్బో! చాలావరకు ఉన్నదే! పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు వందిగారి మీదనే దండయాత్రకు వచ్చావు! చాలా బాగుంది!" అన్నాడు.
    "బాగానే ఉంటుంది గాని ముందు నీవు తొందరగా వెళ్ళి నా రాక మీ మహారాజుగారితో మనవిచెయ్యి." అన్నాడు అష్టావక్రుడు.
    ద్వారపాలకుడు ప్రశాంతంగా "మునికుమారా! అనవసరంగా మృత్యుముఖంలో ఎందుకు పడతావు గాని, మర్యాదగా వచ్చినదారి పట్టు. చూస్తూ చూస్తూ కొండతో ఢీకొంటే ఏం జరుగుతుందో తెలుసా! తలపగిలి బ్రద్దలైపోతుంది. నిన్న మొన్నటి పసిపాపడివి నీవెక్కడ? శాస్త్రచర్చలలో అన్నివిధాలా ఆరితేరిన మహాపండితుడు వంది ఎక్కడ? అతనితో వాదానికి వచ్చి కొమ్ములు దిరిగిన గొప్ప గొప్ప పండితులు గుండెలు పగిలి కూలిపోయారు. ఇక నీవా అతనిని గెలిచేది? అసంభవం! నేను నీవంటి పిల్లలను రాజభవనం దగ్గరికే రానివ్వను." అన్నాడు.
    అష్టావక్రుడు గంభీర కంఠంతో "వయస్సును బట్టి బుద్ధి వైభవాన్ని నిర్ణయించగూడదు. వృద్ధులంతా బుద్ధిమంతులనీ, బాలురంతా పామరులనీ భావించటం అవివేకం. నేను అన్ని విద్యలూ అభ్యసించిన మహాపండితుణ్ణి. అందువల్ల నేను వందిని జయించటం తథ్యం. నన్ను లోపలికి వెళ్ళనివ్వు." అని పట్టుబట్టాడు. ద్వారపాలకుడు అతని ఆగమనం మహారాజుతో మనవి చేసుకున్నాడు. మహారాజు మునిబాలుని లోపలకు ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు.
    అష్టావక్రుడు నిర్భయంగా జనక చక్రవర్తి కొలువుకూటంలో ప్రవేశించాడు. అప్పటికే అక్కడ పండితులందరూ సమావేశమై ఉన్నారు. విద్యావేత్తలైన మహాపండితులందరూ శాస్త్ర చర్చలు సాగిస్తున్నారు. చక్రవర్తి సావధానంగా కార్యక్రమం పరిశీలిస్తున్నాడు. అంతలోనే అష్టావక్రుడు పండితమండలిని సమీపించాడు. పండితులందరూ అనాకారిగా ఉన్న అష్టావక్రుణ్ణి చూచి ఒక్కమాటుగా పక్కున నవ్వారు. అది చూడగానే అష్టావక్రుడికి పట్టరాని కోపం వచ్చింది. ఆవిధంగా పండితులందరూ తన ఆకారాన్ని పరిహసించినందుకు మండిపడ్డాడు అష్టావక్రుడు. అతని ముఖం జేవురించింది.
    అతడు జనకచక్రవర్తిని చూచి "జగత్ప్రసిద్ధమైన నీ సభాభవనంలో కొందరైనా పండితులుంటారని భావించాను. కాని ఇక్కడ అందరూ అపండితులే! అందరూ అజ్ఞానులే! అందరూ అహంకారులే!" అని అన్నాడు ఆవేశంగా. ఆ మాటలు వినగానే జనకచక్రవర్తికి అలతికోపం కలిగింది. ఆయన "మునికుమారా! మీరు ఈ పండితుల సంగతి సరిగా గ్రహించకుండా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా పరికిస్తే ఇక్కడ అందరూ ఆత్మజ్ఞానులే!" అని పలికాడు.
    అష్టావక్రుడు పరిహాసం చేస్తూ "అవునవును. ఇక్కడ అందరూ ఆత్మజ్ఞానులే! ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది. కాని ఆత్మజ్ఞానులంటే పవిత్రమైన ఆత్మను పరిశీలింపగలవారు! మరి నీ సభ్యులందరూ కండపుష్టినీ దేహబలాన్నీ చూచి ఆనందించే అజ్ఞానులు! అందువల్లనే నా బాహ్యరూపం చూచి పకపక నవ్వారు." అని పలికాడు.
    సముచితమైన అతని వాదం విని పండితులందరూ తల వంచుకున్నారు. జనకచక్రవర్తి ఆదరంగా అష్టావక్రుడికి ఆసనం ఇచ్చి గౌరవించాడు. మునికుమారుడు చక్రవర్తితో తాను వందితో వాదించి సాధించటానికి వచ్చానని మనవి చేసుకున్నాడు. చక్రవర్తి తన ఆస్థానపండితుడి ప్రతిభా, ప్రతిజ్ఞా అంతా అతనికి వివరించి చెప్పాడు. కాని అష్టావక్రుడు అంగీకరించలేదు. అతడు వందితో వాదించటానికే నిశ్చయించుకున్నాడు.
    జనకమహారాజు వెనువెంటనే వందిని సభామందిరానికి పిలిపించాడు. మహాపండితుడు వంది మత్తగజంలాగా గంభీరంగా కదలివచ్చి తన ఆసనం అలంకరించాడు. ఒక్కసారి తిరస్కారంగా అష్టావక్రుణ్ణి అరకంటితో చూచాడు. ఒక్కమాటు తల ఊచాడు. అష్టావక్రుడు అఖండమైన ఆత్మవిశ్వాసంతో అచంచలంగా కూర్చున్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం ప్రారంభమైంది.
    వంది వాదాన్ని అవలీలగా ఖండిస్తున్నాడు అష్టావక్రుడు. అతని ఉక్తికి ప్రత్యుక్తి పలకలేకపోతున్నాడు వంది. తర్క వితర్కాలతో, వాద వివాదాలతో ప్రచండమైన వాగ్యుద్ధం కొనసాగింది. మునిబాలుడి వాదనైపుణికి పండితమండలి ఆశ్చర్యపరవశమైపోయింది. అష్టావక్రుడు తన తర్కశక్తితో వంది నోటికి తాళం వేయించాడు. మత్తగజం తల వంచింది. సింహకిశోరం జయించింది. ఆస్థానపండితుడు పరాజితుడైనాడు. అష్టావక్రుడు జయం పొందాడు. సభాభవనం జయ జయధ్వనులతో మారుమ్రోగింది. చక్రవర్తి సబహుమానంగా అష్టావక్రుణ్ణి అవలోకించాడు. మహావిద్వాంసుడు వంది నిరాశతో నీరసంగా తన ఆసనం మీద ఒరిగిపోయాడు.
    అష్టావక్రుడు ఆవేశంగా పళ్లు కొరుకుతూ వంది వంక తేరిపారచూచాడు. ఒక్కమాటు సగర్వంగా చక్రవర్తిని చూచి "మహారాజా! నియమానుసారంగా పరాజితుడైన మీ రాజపండితుణ్ణి సముద్ర మధ్యంలో విసరి వేయించండి. కానివ్వండి. ఆలస్యం చేయకండి" అన్నాడు.
    వంది గడగడలాడిపోయాడు. అతడు తనని రక్షించమని అష్టావక్రుణ్ణి కాళ్ళావేళ్ళాబడి బతిమాలాడు. కాని ఆ పితృద్రోహిని అష్టావక్రుడు కరుణించలేదు. చక్రవర్తి ఆజ్ఞానుసారం వందిని పట్టుకొని పారావారంలో పారవేయటానికి సంసిద్ధమైనారు రాజభటులు.
    అప్పుడు వంది అష్టావక్రుడి పాదాలమీద పడి "మునికుమారా! నన్ను మన్నించు. నాకు కొంచెం అవకాశం ఇప్పించు. నేను నీ తండ్రితోపాటు నా చేతిలో పరాజితులైన పండితులందరినీ ఇప్పుడే పిలిపిస్తాను. వాళ్లు నిజంగా సాగర గర్భంలో చనిపోలేదు. వాళ్ళందరూ వరుణదేవుడి యజ్ఞం చూస్తూ సముద్ర గర్భంలో సురక్షితంగా ఉన్నారు" అన్నాడు. అష్టావక్రుడు ఆనందంగా "అయితే వెంటనే వారందరినీ పిలిపించు. నా తండ్రి సురక్షితంగా ఉంటే నీకు ప్రాణభిక్ష ప్రసాదిస్తాను." అని పలికాడు.
    వెంటనే మహిమాన్వితమైన మంత్రబలంతో పండితులందరినీ పైకి పిలిపించాడు వంది. అందరితోపాటు కహోడుడు గూడా అరుదెంచాడు. ఆ విధంగా తమకు ప్రాణదానం చేసిన అష్టావక్రుణ్ణి వారందరూ అభినందించారు. కహోడమహర్షి అపారమైన ఆనందంతో "వీరకుమారా! నీవల్ల నాకు పునర్జన్మ కలిగింది. నేను చేయలేని పని నీవు చేశావు! తండ్రిని మించిన తనయుడివైనావు! మహాప్రతిభతో పితృద్రోహిని పరాభవించావు! నా కోరిక తీర్చి నన్ను రక్షించావు! నిన్ను చూచుకొని నేను మహానందంతో మైమరచి పోతున్నాను." అని కుమారుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు. తన తండ్రి కౌగిలింతలో అష్టావక్రుడు ఆనందపరవశుడైనాడు. జనకచక్రవర్తి అనురాగ పూర్వకంగా అష్టావక్రుణ్ణి అభినందించి అపారమైన ధనంతో సన్మానించాడు.

                                     *  *  *  *

 Previous Page Next Page