Previous Page Next Page 
దావాగ్ని పేజి 39


    పదిసెకండ్ల తర్వాత, చిత్రద్వీప్ ఎంబసీ చుట్టూ ఉన్న పదెకరాల గార్డెన్ లో దిగింది ఆ పారాచూట్.

 

    వెంటనే, తుపాకులు గురిపెట్టి అటువైపు పరుగెత్తారు చిత్రద్వీప్ సెక్యూరిటీ గార్డ్స్.

 

    పారాచూట్ ని వదిలించుకొని లేచి నిలబడింది ఒక అమ్మాయి... ఒణికిపోతూ వుంది తను.

 

    ఆమె చుట్టూ గుమిగూడారు అందరూ.

 

    ఉద్వేగంతో ఆమె వక్షం ఎగసిపడుతోంది. చెమటలుధారాపాతంగా కారిపోతున్నాయి.

 

    సెక్యూరిటీ గార్డ్సులో ఒకతను అడిగాడు. "పారాచూట్ జంపింగ్ చేస్తూ పొరబాటున ఇక్కడ పడ్డావనుకుంటాను."

 

    "పొరపాటున కాదు. కావాలనే ఇక్కడ దూకాను" అంది ఆ అమ్మాయి రొప్పుతూ.

 

    జనరల్ భోజా ముందుకు వచ్చాడు.

 

    "ఎందుకు?"

 

    "మీ ఎంబసీలో శరణు కోరడానికి:"

 

    "శరణార్థివా? నువ్వు ఇండియన్ వి కావూ?"

 

    "నిన్నటిదాకా ఇండియన్ నే. ఇవాల్టినుంచి ఇండియాను ద్వేషించే వాళ్ళలో ప్రధమురాలిని."

 

    తనకు పట్టిన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయాడు జనరల్ భోజా.

 

    ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడం తన పాలసీ:

 

    దానికి సాధనంగా దొరికింది ఇండియాను ద్వేషించే ఈ ఇండియన్ గర్ల్:  

 

    ధైర్యంగా పారాచూట్ సాయంతో దూకేసి, తన రాయబార కార్యాలయంలో శరణు కోరుతుందా?

 

    ఫెంటాస్టిక్:

 

    అతని వళ్ళు పులకరించింది.

 

    "నీ పేరేమిటి?" అన్నాడు భోజా.

 

    "నీలోఫర్:"

 

    "నీవు ఇండియన్ వే అయినా ఇండియా అంటే నీ కంత ద్వేషం ఎందుకు?"   

 

    "ఇక్కడ వీళ్ళు చెప్పేదొకటి లోపల చేసేదొకటి. నీతిగా, నియమంగా ఉండదలుచుకున్న వాళ్ళకి స్థానం లేదు ఇక్కడ. విసిగిపోయాను నేను. పైగా నామీద అక్రమంగా కేసులెన్నో పెట్టారు. కోర్టుల చుట్టూ తిరిగే ఓపికా, డబ్బూ నాకు లేవు అందుకని అందుబాటులో వున్న మీ ఎంబసీలోకి దూకేశాను. ఫ్రమ్ నౌ: గుడ్ బై టూ సారోస్ అండ్ టియర్స్: మీ దేశం భూతల స్వర్గమని విన్నాను. అక్కడికి వచ్చేస్తాను. నాకు రక్షణ కల్పించండి" అంది ప్రాధేయపూర్వకంగా.  

 

    జనరల్ భోజా నేతృత్వంలో వున్న చిత్రద్వీప్ భూతలస్వర్గం కాదనీ, దాన్ని అతను భూతాల స్వర్గంగా మార్చేశాడనీ అక్కడున్న విదేశీ రాయబారులకు తెలుసు.

 

    అయినా ఎవరూ నోరెత్తరు.

 

    దాన్నే రాజనీతి అంటారు.

 

    సాధ్యమయినంత గంభీరస్వరంతో అన్నాడు జనరల్ భోజా. "చూడు నీలోఫర్: నువ్వు చేసిన తప్పు ఏమీ లేకపోయినా ఇండియాలో నీ మీద అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటున్నావు. ఇండియాలో మా చిత్రద్వీప్ పౌరులు ఎలాంటి బాధలు పడుతున్నారో. నాకు తెలుసు కనుక నువ్వు చెప్పే విషయాలు అసత్యమనిపించడం లేదు. నువ్వు ఇప్పుడు చిత్రద్వీప్ రాయబార కార్యాలయం ఆవరణలో వున్నావు. నీకు తెలిసే వుంటుంది. ఒక దేశంలో మరో దేశపు రాయబార కార్యాలయం వుందంటే. ఆ కార్యాలయం ఉన్న కాస్తమేరా ఆ దేశపు భూభాగం కిందే లెక్క. అంటే మా ఈ రాయబార కార్యాలయం మినీ చిత్రద్వీప్ అన్నమాట. ఇక్కడ అన్నీ ఈ దేశపు శాసనాలే వర్తిస్తాయి.   

 

    అందుకని నీలోఫర్: నీకు ఈ జనరల్ భోజా శరణు ఇస్తున్నాడు. అంతేకాదు. నీకు చిత్రద్వీప్ పౌరసత్వం ఇవ్వడం కూడా జరుగుతుంది. నీ జీవనోపాధి కోసం తగిన ఉద్యోగం కూడా ఇవ్వబడుతుంది. ఏంచెయ్యగలవు నువ్వు?" అన్నాడు.

 

    "నేనా... నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ ని" అంది నీలోఫర్-వినీల-తొణుకూ బెణుకూ లేకుండా.

 

    "వారెవ్వా:" అన్నాడు జనరల్ భోజా, ఆనందాశ్చర్యాలతో.

 

    "అయితే ఇకనుంచి నువ్వే నా ప్రైవేట్ జెట్ కి పైలట్ వి. ట్రైయినింగ్ అవసరమైతే నిన్ను ఏ దేశానికన్నా పంపిస్తాను. ఓ.కె:" అన్నాడు. తన ప్రత్యర్థి జుగ్ నాధ్ కి ఇండియా ఆశ్రయం ఇచ్చింది. దానికి బదులుగా దిమ్మదిరిగేలా శాస్తి చేయగలననుకుంటున్నాడు అతను.  

 

    "మీరు ధర్మాత్ములు: యుగపురుషులు:" అంది నీలోఫర్ సజల నయనాలతో. మనసులో మాత్రం, "నీ ఆటలు కట్టించడానికే నీ దగ్గర చేరుతున్నానని తెలుసుకోలేని దద్దమ్మా, ఇంక నీ రోజులు దగ్గరపడ్డాయి" అనుకుంది.  

 

    ఒక ఇండియన్ గర్ల్ అత్యంత సాహసికంగా స్కై డైవ్ చేసి,చిత్రద్వీప్ ఎంబసీలోకి దూకి శరణుకోరిన వార్త మర్నాడు ఉదయానికల్లా ప్రపంచంలో వార్తాపత్రికలలో ప్రముఖంగా పడింది. టీవిలలో వచ్చింది. రేడియో వార్తలలో చెప్పారు.

 Previous Page Next Page