బ్రతుకుజీవుడా అని బయటపడ్డాడు నరేష్. ఇంకెప్పుడూ లీవ్ కోసం ఆయన దగ్గరకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. పాపం ఈ మహానుభావుడ్ని పెళ్ళి చేసుకున్న స్మిత ఎలా భరిస్తోందో! ఆరోజు తనను ఎందుకు రమ్మందో తెలియడంలేదు. మరోసారి ఆహ్వానం వస్తే వెళదామని అనుకున్నాడు గానీ ఆ తరువాత ఆమె పిలవలేదు. ఎప్పుడైనా కనిపిస్తుందేమోనని చూశాడు కూడా. కానీ స్మిత అతనికి కనిపించలేదు.
నిన్న ముందు జాగ్రత్తగా లీవ్ పెట్టాడుగానీ తలనొప్పి ఆఫీస్ నుంచి బయటకు రాగానే తగ్గిపోయింది. మళ్ళీ వెళ్ళి లీవ్ ను కేన్సిల్ చేసుకుందామనుకున్నాడు గానీ మారుతీరావు మళ్ళీ గంటసేపు వుపన్యాసం దంచుతాడని మానుకున్నాడు.
సో ఆ రోజు లీవ్ గనుక నిదానంగా తయారుకావచ్చులే అనుకుంటూ కాట్ మీద అటూ ఇటూ దొర్లాడు. ఎనిమిది గంటల ప్రాంతాన పడక నుంచి లేచాడు. రజనీకి ఫోన్ చేసి సినిమా చూద్దామనుకున్నాడు.
తలుపు వేస్తుండగా శ్రీలక్ష్మి వచ్చింది.
"ఎక్కడకో బయలుదేరినట్టున్నారు" అడిగింది వస్తూనే.
"అవునండీ అలా బయటకెళ్దామని" చెప్పాడు వినయంగా.
అంతలో ప్రసాద్ హడావుడిగా పైకి వచ్చాడు.
"గుడ్ మార్నింగ్ నరేష్."
"గుడ్ మార్నింగ్ సార్."
నరేష్ అలా విష్ చేయడంతో సీరియస్ గా రియాక్ట్ అయ్యాడతను. "నాకు గుడ్ మార్నింగ్ చెప్పకు. నాకెప్పుడూ బాడ్ మార్నింగ్. సకల దురలవాట్ల పుట్ట ఆయన తండ్రీ, చిరంజీవి పిచ్చి తలకెక్కిన పెళ్ళాం వున్న నాలాంటి వాడికి ఎప్పుడూ బ్యాడ్ మార్నింగే" అతని గొంతులో విసుగూ, కోపమూ పోటీ పడుతున్నాయి.
"ఏమైంది సార్?" అడిగాడు నరేష్.
"నేను చెబుతాను బాబూ! మా ఇద్దరికీ నువ్వు జడ్జివి. అందుకే నీ దగ్గరకు వచ్చాం" అంది శ్రీలక్ష్మి.
ఏమిటన్నట్టు చూశాడు నరేష్.
"ఖైదీలో చిరంజీవి, మాధవి జీప్ లో వస్తున్నప్పుడు మధ్యలో మాధవిని చిరంజీవి ఎలా చూశాడో నీకు గుర్తుందా? ఏ ఆడపిల్ల అయినా ఆ చూపుల అగ్నిలో మంచులా కరిగిపోవాల్సిందే. అలా చూడమని ప్రాక్టీసు చేయమన్నాను. గత వారంగా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ అభినయం రాలేదు. అయితే ఈయనేమో తను అచ్చు చిరంజీవిలా ఆడపిల్ల గుండెల్లో తుఫాను రేపుతున్నట్టు చూస్తున్నానని అంటున్నాడు. కానీ నాకేమో చిరంజీవిలా ఆయన చేస్తున్నట్టు అనిపించడం లేదు. హీరోలా బిహేవ్ చేయమంటే హీరో పక్కన వుంటాడు చూడు కామెడీయన్ అలా చేస్తున్నాడు ఈయన. నువ్వు జడ్జి. ఈయన చిరంజీవిని ఎంతవరకు అనుకరిస్తున్నాడో నువ్వే చెప్పు బాబూ." చెప్పడం పూర్తి చేసింది ఆమె.
వెంటనే ప్రసాద్ అందుకున్నాడు. "ఆ చిరంజీవిలాగా కాదు. వాడి అబ్బలాగా నటిస్తున్నాను నేను. నేను చేస్తున్న అభినయానికి మరో ఆడపిల్ల అయితే నీలాగ "పడకమూడ్" రాదనదు. అసలు పడకమీద నుంచే దిగదు. ఎలా చూస్తున్నానో గమనించు నరేష్. నా చూపులు ఆడపిల్ల మనసుల్లో బాకుల్లా గుచ్చుకుంటాయో లేదో చెప్పు" అని మూడడుగులు వెనక్కి వెళ్ళి, అక్కడి నుంచి చిరంజీవిని అనుకరిస్తూ వచ్చాడు.
ఆయన వేషం కూడా చిరంజీవి గెటప్ లో వుంది. ఖైదీలో చిరంజీవిలా బ్లాక్ బనీన్ వేసుకున్నాడు. ఛాతీమీద "ఇంటర్నేషనల్ షో" అన్న అక్షరాలు సున్నంతో రాసినట్టు వున్నాయి. దానికింద నల్లటి ప్యాంటు, నుదుటికి బ్లాక్ కర్చీఫ్ కట్టుకున్నాడు.
ఉదయం లేచినప్పటినుంచి ఓపిగ్గా సర్కస్ ఫీట్లు చేస్తున్న ఆయన్ను చూస్తే జాలేసింది నరేష్ కి.
ఆయనను వూరడించడానికి "మీరు చిరంజీవిలా యాక్ట్ చేస్తున్నారో లేదో తెలియదుగానీ మీ ముందు ఏ యంగ్ హీరో కూడా నిలబడలేడు సార్" అన్నాడు.
ప్రసాద్ గర్వంగా భార్యవేపు చూశాడు.
ఆమె ముఖం చిటపటలాడుతూనే వుంది "మీరు ఏ యంగ్ హీరో అయినా నన్ను గెలుచుకోలేరు. ఆఖరుకి సిల్వర్ స్టర్ స్టెలోన్ ను ప్రతిభావంతంగా అనుకరించినా నేను మీకు లొంగను. నాకు మీరు చిరంజీవిలానే కనిపించాలి. మీరు అచ్చు మా "చిరు"లాగే అనిపించాలి."
"ఇంతకీ నేను చిరంజీవిని సక్సెస్ ఫుల్ గా అనుకరించానా! లేదా?" అడిగాడు తీవ్రస్వరంతో ప్రసాద్.
"మా చిరు చేసిందాంట్లో ఒకటీ భై నూరవవంతు కూడా చేయలేదు. జీప్ లో మాధవిని చిరూ ఎలా చూశాడనుకున్నారు. మాధవి స్థానంలో నేనుంటే ఎగిరి వాటేసుకుని వుందును అయితే ఆ ఛాన్స్ నాకు లేదు. అప్పటికీ పెళ్ళికి ముందు చిరంజీవితో కలిసి హీరోయిన్ వేషం వేయాలని మద్రాసుకు రైలెక్కుదామనుకుంటే నాన్న ఒప్పుకోలేదు. చిరంజీవిలా వుండేవాడ్ని వెదికి పట్టుకుని భర్తను చేస్తానన్నాడు. నిజమేననుకుని వూరకుండిపోయాను. చివరకు మిమ్మల్ని కుదిర్చాడు. నా ఖర్మ మిమ్మల్ని చిరంజీవిలా తీర్చిదిద్దాలని నేను విశ్వప్రయత్నం చేస్తుంటే మీరు మాత్రం చిరంజీవి దరిదాపులకు కూడా రావడం లేదు. చిరంజీవిలా ఒక్కరోజైనా నన్ను కాంక్షతో చూశారా? పడకటింట్లో కూడా ఏదో పసిపిల్లను ఆడుకోవడానికి రమ్మన్నట్టు పిలుస్తారుగానీ, నాలో కోరికలు రేపేటట్టు ప్రవర్తిస్తారా! వూహూఁ లేదే. మిమ్మల్ని అని ఏం లాభం డూప్లికేట్ చిరంజీవిలాగా కూడా లేని మిమ్మల్ని నాకు కట్టబెట్టాడు చూడు మా నాన్న... ఆయన్ను అనాలి" అని విసవిసా కిందకు దిగి వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి.
ప్రసాద్ తలపట్టుకుని కింద కూర్చుండిపోయాడు. "చూశావా నరేష్. వివాహమై రెండు సంవత్సరాలైనా నాలాగా అస్కలిత బ్రహ్మచారిగా వుండే మగాడు ఈ సృష్టిలో నేనొక్కడ్నేమో. ఏం చేద్దాం?" అన్నాడు ఇంకా చేతిని తలమీద నుంచి తీయకుండానే.