Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 3


    "ఛీ....ఛీ నాలో భయం నా నోటివెంట పిచ్చిగా పలికిస్తున్నది. కవి అన్నవాడి హృదయం సున్నితమైనది. నాకు తెలుసు కవికుమారా! మాట తప్పటం కాని ఆడదాన్ని మోసం చేయటం గాని మీకు తెలియదు గాక తెలియదు. మరి నేను వెళ్ళిరానా!"

    అవంతి వేసిన మంత్రం అద్భుతంగా పనిచేసింది. "మీరు వచ్చిందాకా ఎదురు చూస్తుంటాను. నేను అందరి మగవాళ్ళలాంటి వాడిని కాను. వెళ్ళిరండి." చంద్ర తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అన్నాడు.

    చంద్ర కొత్త కవిత పురుగులా మనసులో దూరంగా అదే ఆలోచిస్తూ వుండిపోయాడు.


                          *    *    *


    అబలా ఓ అబలా
    అయినవాళ్ళు ఆదుకోరు
    అసలువాడు ఏలుకోడు
    అయివదానికి కానిదానికి
    అన్నిటికీ మూలం నీవే నీవే
    అబలా ఓ అబలా

    "మిష్టర్ ! చంద్రశేఖర్ ఆజాద్ !"

    తన పూర్తి పేరు గట్టిగా వినపడటంతో వులిక్కిపడి కళ్ళు తెరిచాడు చంద్ర. పైకి లేచి సరిగా కూర్చున్నాడు చంద్ర.

    "మీరు పిలిచింది నన్నేనా!" వినయంగా అడిగాడు.

    "మిష్టర్! నీ పేరు చంద్రశేఖర్ ఆజాద్ అవునా!"

    "అవును మీ కెలా తెలుసు?"

    "నీవు ఎదురు ప్రశ్నలు వేయవద్దు. కంగారు పడవద్దు. అబద్దాలు కూడా ఆడకూడదు. మైండిట్."

    చంద్రకంతా అయోమయంగా వుంది. బుర్ర వూపాడు.

    "నీలో నీవు ఏంటి గొణుక్కుంటున్నావ్?"

    "కవిత్వం. కొత్తది తడితేను...."

    "అహో అదేదో చదివి వినిపించు...."

    "అబలా ఓ అబలా అయిన వాళ్ళు ఆదుకోరు అసలు వాడు ఏలుకోడు అయిన దానికి కాని దానికి అన్నింటికీ మూలర నీవే నీవే...."

    "ఛీ....ఛీ...."

    చంద్ర గబుక్కున నోరు మూసుకున్నాడు.

    "ఛీఛీ....ఛీ....ఛీ....ఛీ....ఛీ....ఛీ....మళ్ళీమళ్ళీ అంటున్నాను. ఆడది అబల కాదు తబల కాదు. ఆదిశక్తి. మీ మగవాళ్ళది ఎద్దు మొద్దు అవతారం. బుర్రలో గుజ్జు కూడా నామమాత్రమే వుంటుంది. ఇప్పుడు నీ నా విషయమే చూద్దాము. నీవు మగవాడివి. నేను ఆడదానిని. నా శక్తి ఏమిటో ప్రదర్శిస్తాను కాచుకో."

    చంద్రకేమి చేయాలో తెలియలేదు. అయోమయం లోంచి ఇంకా తేరుకోలేదు.

    "ఇంకో రెండు నిమిషాలలో నేను జాకెట్టు చించేయబోతున్నాను."

    "ఎందుకు?" నీకేమన్నా పిచ్చా. అన్నట్టు చూశాడు చంద్ర.

    "జాకెట్టు మొత్తం చించను గూడు మీద మాత్రమే. అదైనా రెండు అంగుళాల బారున చించుతాను. ఆ తర్వాత వెర్రిగా కేకలు పెడ్తాను...."

    "ఎందుకు?"

    "ఇక్కడున్నది మనం యిద్దరం. ఒక పురుషుడు. ఒక స్త్రీ. జాకెట్టు చినిగి తలరేగి బొట్టు చెరిగి వున్న ఓ అబల వెర్రికేకలు పెడితే కిం అర్ధం! ఈ పురుషుడు అనగా నీవు ఈ స్త్రీని అనగా నన్ను అనగా ఓ అబలని అన్యాయంగా రేప్...."

    ఆ అమ్మాయి తమాషాగా చెపుతుంటే కెవ్వుమన్నాడు చంద్ర.

    "ఇంకెప్పుడూ ఆడదాన్ని అబల అనకు."

    "అనను" చంద్ర బుద్దిమంతుడిలా అన్నాడు.

    ఆ అమ్మాయి నవ్వింది.

    ఈ పిల్లకి పిచ్చి గిచ్చిలాంటిది లేదుకదా, అనుకున్నాడు హంద్ర. ఆ మాట పైకి అనే ధైర్యం లేక పెదవులు కుట్టేసుకున్నట్లు వుండిపోయాడు.

    "ఇంకా నన్ను గుర్తుపట్టలేదా మహాశయా! అవంతిని వేషం మార్చుకుని వచ్చాను."

    "అవంతి?"

    "య్యా, అంత ఆశ్చర్యం దేనికి!"

    "నిన్ను గుర్తు పట్టలేదు సుమా!"

    "తెలుస్తూనే వుంది."

    "ఇప్పటికిప్పుడు యింత మార్పా!"

    "నే ముందే చెప్పా కదా! అయిదు నిమిషాలలో పూర్తిగా మారిపోగలనని, నాటకాలు ఆడి ఆడి అదే నాటకంలో పలురకాల వేషాలు వేసి వేసి నాకు అలవాటైపోయింది. ఇలా వేషం అలా కంఠస్వరం వెంట వెంటనే మార్చగలను."

    "బాగానే వుంది. మరి నన్ను బెదిరించడం ?"

    "జోక్ అంతే, అబలా ఓ అబలా అని మీరు కవిత్వం  చదివేసరికి మిమ్మల్ని ఏడిపిద్దామని చిన్న తమాషా చేశాను. మీ మంచితనాన్ని వాడుకున్నందుకు క్షమించండి."

    "క్షమించండి అన్నారు కదా కనుక క్షమించాను. ఇంక మనం వెళదామా!" చంద్ర లేస్తూ అడిగాడు.

    "నేను రెడీగానే వున్నాను.

    చంద్ర కాగితాలు సర్దుకున్నాడు. "ఈ కాస్తలోనే నేను మిమ్మల్ని గుర్తు పట్టలేక పోయాను. ఆ రౌడీలు మాత్రం మిమ్మల్ని ఏం గుర్తు పట్టగలరు. పదండి వెళదాం."

    "ఇలాగేనా!"

    "ఇలా గాక ఎలా? కొంపదీసి నేను కూడా వేషం మార్చాలా?"

    "ఉహూ, మనం ఈ పార్క్ నుంచి బైటపడి నేను రిస్ఖా ఎక్కిందాకా మనం ప్రేమికుల్లా నటించాలి."  

 Previous Page Next Page