Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 3

    ఆ కోర్టుహాల్లో విజిటర్స్ గాలరీలేదు. హాలు మధ్యలో కేవలం అరడజను కుర్చీలు వాటికెదురుగా ఒక టేబుల్ అమర్చబడి వుంది.
   
    అప్పటికే ఆ హాలులోకి చేరుకున్న నలుగురు వ్యక్తులూ లేచి, న్యాయ మూర్తులకు వినయంగా నమస్కరించి కూర్చున్నారు.
   
    ఆ నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు న్యాయవాదులున్నారు. ఒకరు స్త్రీ న్యాయవాది....పేరు మాలవ్య.
   
    ఒకరు పురుష న్యాయవాది....పేరు ఆదిత్య....
   
    మిగతా ఒడ్డారు...ఒకరు కేసు పెట్టినవారు....
   
    అతని పేరు మనోహర్.
   
    మరొకరు అభియోగం మోపబడినవారు....
   
    పేరు మాయాదేవి....
   
    స్త్రీ న్యాయవాది కుమారి మాలవ్య, మనోహర్ తరపున వకాల్తా పుచ్చుకున్నారు.
   
    పురుష న్యాయవాది ఆదిత్య, మాయాదేవి తరపున వకాల్తా పుచ్చుకున్నారు.
   
    మహిళా న్యాయమూర్తి శ్రీమతి ప్రమీలారాణి, మహిళా న్యాయవాది మిస్ మాలవ్యవేపు ప్రసన్నంగా చూశారు.
   
    మాలవ్య తన పక్కనే కూర్చున్న తన క్లయింట్ మనోహర్ వేపు ఒక్కక్షణం చూసింది.
   
    మనోహర్ తనకు కొంచెం దూరంలో కూర్చున్న తన ప్రత్యర్ధి మాయాదేవివేపు కన్నెత్తి వోరగా చూశాడు.
   
    పాతికేళ్ళ మనోహర్ అందంగా ఆడపిల్లలా వుంటాడు.
   
    బలమైన కండలు....దృఢమైన శరీరం.... ఆడపిల్ల పెదాల్లా తీర్చిదిద్దిన అందమయిన ఎర్రని పెదవులు....వొత్తయిన మీసకట్టు....చురుకైన విశాలమైన కళ్ళు....ఆ కళ్ళు పైకెత్తినప్పుడు సన్నటి మెలికలతో కనపడే నుదురు అతని సొంతం...
   
    న్యాయమూర్తులిద్దరూ ఒకేసారి ఫైల్స్ ఓపెన్ చేశారు.
   
    మహిళా న్యాయమూర్తి అప్పటికే టేబుల్ మీద సిద్దం చేసి వున్న టేప్ రికార్డర్ ని ఆన్ చేస్తూ అడ్వకేట్ మాలవ్యవేపు చూస్తూ-"ప్రొసీడ్...." అని గంభీరంగా అన్నారు.
   
    ఆ మరుక్షణమే మిస్ మాలవ్య లేచి నిలబడింది.
   
    ఆ మరుక్షణమే మహిళా న్యాయమూర్తి అక్కడే వున్న ఆదిత్య అనే లాయర్ వేపు చూస్తూ-"ఆర్ యూ రడీ మిస్టర్ ఆదిత్యా...." అని ప్రశ్నించాడు.
   
    ఆదిత్య ఒక్కక్షణం మాయాదేవివేపు చూసి లేచి నిలబడి, వినయంగా తన అంగీకారాన్ని తన కళ్ళద్వారానే తెలియజేశాడు.
   
    మహిళా న్యాయవాది ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా బైట నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి.
   
    దాంతో ఆగ్రహించిన మహిళా న్యాయమూర్తి కోర్టు అమీనువేపు సీరియస్ గా చూశారు.
   
    ఆ మరుక్షణమే ఆ ప్రత్యేక కోర్టు డోర్ క్లోజ్ చేయబడింది. డోర్ బయట వివిధ దినపత్రికల రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు, సాటిలైట్ చానల్స్ కు చెందిన వీడియోగ్రాఫర్ లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారెవ్వరూ ఆ స్పెషల్ కోర్టులోకి ప్రవేశించకుండా వుండేందుకు అక్కడ అప్పటికే ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయబడింది.
   
    యాభై ఐదు ఏళ్ళ మహిళా న్యాయమూర్తి శ్రీమతి ప్రమీలారాణి వేపు చూస్తూ మనోహర్ లేచి నిలబడబోయాడు.
   
    "ఇది స్పెషల్ కోర్టు....దేశంలో ఎప్పుడూ, ఎక్కడా, ఏ కోర్టుకీ రాని కేసుని మేము ఇక్కడ డీల్ చేస్తున్నాం....నో ఫార్మాలిటీస్.....మీరు కూర్చుని చెప్పొచ్చు.
   
    "సమాజం మొద్దుబారి పోతోందనుకుంటుందన్న సమయంలో అతి సున్నితమైన ఇలాంటి వివాదం నేనున్న కోర్టుకే వస్తుందని నేనెప్పుడు వూహించలేదు. కత్తిమీద సాములాంటి ఇలాంటి కేసుని నేనొక్కడ్నే డీల్ చేయడం బావుండదని, ఒక మహిళా న్యాయమూర్తి వుండాలని నేను అభ్యర్ధించడంతో చీఫ్ జస్టిస్, గౌరవ నీయులైన శ్రీమతి ప్రమీలారాణి గారిని ఈ కోర్టుకి బదలయించటం జరిగింది. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేవరకు, లేదా మీరు రాజీపడే వరకూ, మీ నలుగురూ, మేమిద్దరం, ఒక కోర్టు అమీను తప్ప మరెవ్వరూ ఈ కోర్టులో వుండరు. మీరు నిర్భయంగా, నిస్సందేహంగా మీ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. మీరు నియమించుకున్న లాయర్లు ఏ సంకోచం లేకుండా వాదించవచ్చు...." గంభీరంగా చెప్పారు జస్టిస్ మెహతా.
   
    జస్టిస్ మెహతా మరో ఆరునెలల్లో రిటైరు కాబోతున్నారు. ఇప్పుడాయన వయస్సు అరవై ఒక్క సంవత్సరాల ఆరు నెలలు....ఆ సందర్భంలో మనసుల్ని ప్రధాన  సాక్షులుగాచేసి విచారించవలసిన కేసు రావటం ఆయనకు ఒకింత నెర్వస్ గానే వుంది.
   
    "యువరానర్....కేసు పూర్వాపరాలు మొత్తం మీ ముందు వుంచబడ్డాయి. నా క్లయింట్ మిస్టర్ మనోహర్, మిస్ మాయాదేవి చేతిలో దారుణంగా మోసగించబడ్డాడు. అందుకు అతని మనసు తీవ్రంగా గాయపడింది. అందుకు తగిన శిక్ష విధించాలని, నా క్లయింటుకి న్యాయం చేకూర్చాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాను...." అని లాయర్ మిస్ మాలవ్య తన సీట్లో కూర్చుంది.
   
    "దీనికి మీ సమాధానం ఏమిటి.....?" అని అడిగాడు జస్టిస్ మెహతా లాయర్ ఆదిత్యవేపు చూస్తూ.
   
    లాయర్ ఆదిత్య ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా మిస్ మాయాదేవి చటుక్కున తన సీట్లోంచి లేచింది.
   
    "నేను చేసింది ముమ్మాటికీ తప్పుకాదు....నా కోరికలో న్యాయం వుంది.....అలా కోరుకోవటం రాజ్యాంగం నాకిచ్చిన ప్రాథమిక హక్కుగానే నేను భావిస్తున్నాను....." ఆవేశంగా అంది మాయ.
   
    "ఈ ప్రపంచంలో నీకేది నచ్చితే, అది నీ సొంతం చేసుకోవటం న్యాయమనే, నువ్వు భావిస్తున్నావా....? ప్రాణంలేని ఏ వస్తువునైనా నీ సొంతం చేసుకోవటం నీ ఆర్ధిక స్థితిగతుల మీద ఆధారపడి వుంటుంది. అది తప్పని ఎవ్వరూ అనలేరు. కానిక్కడ అలా జరగలేదే.....?" జస్టిస్ మెహతా మాయాదేవి వేపు సూటిగా చూస్తూ అన్నారు.

 Previous Page Next Page