Previous Page Next Page 
శ్రీశ్రీ మన సంగీతం పేజి 4


                                            శ్రీశ్రీ

                                                సుద్దాల అశోక్ తేజ

    కవిత కాలికి గజ్జెకట్టి - కవితకి తాండవము నేర్పి
    కష్టజీవికి రెండువైపుల - కవికులమ్మును నిలువ నేర్పిన శ్రీశ్రీ
    కవి మహర్షికి చావు లేదు - కవి మహాత్మకు చావు రాదు -
    ఎక్కడోగల సహారాను - ఎదుటి పేదల ఎదర చూసి
    అన్నమే కరవైన అన్నల - కన్నులతడి వీణ మీటి
    రక్త గీతిక నెత్తి పాడి - కొత్త గొంతై వెలిసినాడు శ్రీశ్రీ

    రాళ్లలో పనివాళ్ల గురుతులు - బీళ్లు తడిపే చెమటకాల్వలు
    చక్రవర్తుల ఇనులగుండెల వక్రగతిలో లేళ్ల కేకలు
    అఖిలసృష్టి ఆలకించగ - శంఖమొత్తగ పుట్టినాడు శ్రీశ్రీ
    
    పండితుండే రచన చేసే - ఖండితోక్తు గుండె పగులగ
    బందోబస్తుల చెండి భాషకు - చిందులను నేర్పించగలిగి
    నాటికవులకు పిడుగు ఐ - ఈనాటి కవులకు గొడుగు పట్టిన శ్రీశ్రీ

    విప్లవమ్ముల కేతనంలో - విప్లవోద్యమ చేతనంలో
    పచ్చలారని పాపల మరి - విచ్చుకత్తుల వంటి యువకుల
    బిగిసికొను పిడికిళ్లయందున
    బిగువు తానై నిలిచి ఎగిసే - శ్రీశ్రీ    

    (శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ, శతజయంతి విశేష సంచిక 'శ్రీశ్రీ-100' ఏప్రిల్, 2010)

        దొంగ నోట్ల దొంగవోట్ల / రాజ్యం ఒక రాజ్యమా?
        లంచగొండి వెధవలిచ్చు / సాక్ష్యం ఒక సాక్ష్యమా?
          (దూదిపులి మీద పుట్ర..'మరోప్రస్థానం', విరసం ప్రచురణ, మే.1980)   

 Previous Page Next Page