Previous Page Next Page 
శ్రీశ్రీ మన సంగీతం పేజి 5


                         శ్రీశ్రీయే తిరుగుబాటు జెండాపై సంతకం

                                                                కె. దేవేంద్ర

    శ్రీశ్రీయే తిరుగుబాటు -జెండాపై సంతకం
    అంతరాలు దాష్టికాన్ని-దహిస్తున్న ద్రావకం
    మంటను మంటగా చేసిన క్రాంతిగమన-చోదకం
    శ్రీశ్రీమన రక్తమైతే-విప్లవాల పూనకం                                                     || శ్రీశ్రీ ||

    శ్రీశ్రీ అంటే స్ఫూర్తి - శ్రీశ్రీ అంటే దీప్తి
    శ్రీశ్రీతో తెలుగు కవిత-దిగంత కీర్తి!!
    భవితపై ఆశకొలుపు - భావాలు కవిత్వం
    తెలుగు కవిత శ్రీశ్రీతో అయ్యింది నవత్వం
    పద్మ వ్యూహాలను - ఛేదించే ధీరత్వం
    నేర్పెను మన జాతికి - శ్రీశ్రీ కవితాతత్వం                                                    || శ్రీశ్రీ ||

    సామాన్యులతో సైతం - పొదువుకునే అక్షరసిరి
    తెలుగు కవిత పావడాకు - శ్రీశ్రీయే పుత్తడి జరి
    పెట్టుబడికి మరణశాసనం- రాసిన కవితల బరి
    అందుకే స్మరిస్తాము - శ్రీశ్రీని మరీ మరీ                                                      || శ్రీశ్రీ ||

    ప్రభువెక్కిన పల్లకిని - మోసినోడి తరపున
    తెలుగు కవితరూపాన - శ్రీశ్రీ పొడిచె తూరుపున
    పెట్టుబడి కట్టుకథల-మాధ్యమాల వీపున
    చరిచి మరీ చెప్పాడు - శ్రామికజన కామన                                                    || శ్రీశ్రీ ||

    కవిత వ్రాయటానికి - ఏదైనా అర్హమని
    తెలుగులో కవిత్వాన్ని - శాసించిన శబ్దముని
    ప్రగతి శీల భావాల - శ్రీశ్రీ ఒక మహాకవి
    వాటికి పదునెక్కించి - పడదాం దుర్మార్గుల పని                                              || శ్రీశ్రీ ||

    పోరాటాల్లో మీకు వచ్చిందా బద్ధకం
    శ్రీశ్రీతో మెదడు మీద - చెయ్యండి అద్దకం
    విశ్వనరుని నిర్మాణం-అయితే మీ పంతం
    చురుకుతనం కరుకుతనం-అవుతాయ్ మీ సొంతం                                            || శ్రీశ్రీ ||

    (శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ, శతజయంతి విశేష సంచిక 'శ్రీశ్రీ-100' ఏప్రిల్, 2010)

 Previous Page Next Page