Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 3


    మార్చి 22 గ్రహకూటం. నక్షత్ర ధూళిని ఆకర్షిస్తుంది. ఇంకా చీకటిగా ఉన్న ఆకాశాన్ని తన ఉజ్జల కాంతితో వేళాకోళంగా వెలిగిస్తుంది. కాని యూనివర్శిటీ - ఫ్యాక్టరీ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇసుక రేణువులు అడ్డుపడి ఆ యంత్రాన్ని పనిచెయ్యకుండా నిలబెట్టాయి. నాన్ టెర్ విశ్వవిద్యాలయం అనే ఫ్యాక్టరీని మూసేశారు.
    పోలీసులు వచ్చారు. బలవంతంగా విద్యార్థుల్ని బైటికి గెంటి, వరుసగా నిలబెట్టి, మెడల వెనుక చేతులు కట్టి (వియత్కాంగ్ ఫోటోలు?) ఆయుధాల కోసం సోదా చేశారు.
    వియత్నాం అంత దూరంగా, అంత చేరువగా ఇదివరకెప్పుడు లేదు. పోలీసులకు ఆయుధాలు దొరకలేదు.
    రేపు నాన్ టెర్ విద్యార్థులు సోర్బాన్ (పారిస్) లో ప్రత్యక్షమవుతారు.

                                              2

    టీచర్ల, పరీక్షల ధర్మమా అని ఆరో యేటనే పోటీ ప్రారంభమౌతుంది.
    (చేతితో రాసిన పోస్టర్)
    శిశురక్షణశాలలు, విశ్వవిద్యాలయాలు,
    తతిమ్మాకారాగృహాల దారాలు తెరుద్దాం.
    (నాన్ టెర్, సంగీత భవనం)
    మాతృమూర్తి సోర్బాన్, అమ్మలగన్నయమ్మ.
    ఉపనయనాల వంటి, పిండప్రదానాల వంటి, ప్రాచీన కర్మకాండలు సాగించే విషాదజనని,
    సోర్బాన్, చరిత్ర పవనాల బారినుండి, అలగాజనాల అనేక వికారాల నుండి చక్కని రక్షణ పొందిన తల్లి. విదన్మానసాల బంగారు ఫలాలు నీడపట్టున పరిపక్వత పొందే సోర్బాన్, మధుర మాతృదేవత. సోర్బాన్ కంచుకోట! సోర్బాన్ కొండవీడు.
    డీస్ రోష్ (విద్యాలయాధికారి) ఒక మూషికం. జాలిగొలిపే చిన్నారి. చిట్టి మూషకం, బూజుట్టిన, వయసు చెల్లిన బూడిదరంగు చిట్టెలుక. మరిన్నీ, డీన్ రాష్ అశుద్ధం.
    సోర్బాన్ ఆవరణలో కొన్ని వందలమంది విద్యార్థులు రాజకీయాలు చర్చిస్తున్నారు. దూరపు రాజకీయాలు: వియత్నాం; దగ్గర రాజకీయాలు, నాన్ టెర్ ను మూసెయ్యడం.
    పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితులు విషమించాయి. దిగంబర మహారాజుగారి దూతల్ని విద్యార్ధులూ, కొందరు టీచర్లూ ఎదుర్కోవలసి వచ్చింది. పులుముడుతో పరిపాలన సాగించే ఈ పద్ధతికికి గుర్తించదగ్గ ముఖంలేదు. సుదీర్ఘమైన బాహువులు మాత్రమే వున్నాయి. ఈ పద్ధతి విఫలమైతే, ఉండనే ఉంది పశుబలప్రయోగం.
    రసాయన శాస్త్రంలోనూ, రాజకీయాల్లో నూశక్తుల ఆకర్షణా, నిరాకరణా ఉంటాయి. ఒక్కొక్కరి మొగ్గు అంతరాత్మ, ప్రయోజనం, జిజ్ఞాస, అణు నిర్మాణం, సంఘంలో తమ స్థలం ఇలాంటి వాటిమీద ఆధారపడుతూ, విద్యార్థుల మీద, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా జబర్దస్తీ చేస్తాయి. బోధన పద్ధతులు వాళ్ళ మనస్సులను కుంచింపజేస్తాయి. అయితే విజ్ఞానపు పనిముట్లు వాళ్లకి అందుబాటులోనే ఉంటాయి.
    ఇప్పుడు వాళ్ళు సోర్బాన్ లో ఉన్నారు. అన్నిటికి తెగించిన కృతనిశ్చయంతో, వాళ్లకి తెలుసు, పోలీసులు పంపించే ముష్కరులైన థగ్గులమూక రాబోతున్నదని. (పశ్చిమం)
    మూషికంరోష్ కి నిజంగానే భయం.
    తననివేశనమంతా విద్యార్థులతో నిండిపోయింది (అని రేడియోలో అంటాడు)
    మంత్రిగారికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఫాసిట్టు గుంపును తయారుచేసి విద్యార్థి ఆందోళనకారుల మీదికి పంపించే కాలం వెళ్ళిపోయింది.
    పోలీసు ఉన్నతాధికారి గ్రిమోను పిలుస్తాడు రోష్, పరిస్థితి విషమిస్తే ఎదుర్కోడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటాడు.
    లాటిన్ కార్టర్ అంతటా విద్యార్థులు మూగుతారు.
    పరిస్థితి అదుపు మీరిందని (విద్యార్థులతో నిండిన ఆ ఆవరణ!) రోష్ భావిస్తాడు. పోలీసులను పంపించవలసిందిగా గ్రిమోను అడుగుతాడు.
    మరి, ఈ గ్రిమో ఉన్నాడే చాలా తెలివిన ఘటం. అధికారంలో ఉన్న అనేకుల్లాగే ఇతడూ ఒకప్పుడు విద్యార్థే (అంతేకాదు తన కూలి గుంపుల్ని ఉసిగొల్పి వదిల్తే ఏంచేస్తాయో తెలుసును). కాబట్టి లిఖితపూర్వకంగా మీ కోరికను తెలియజెయ్యండని రోష్ ను అడుగుతాడు. డీన్ రోష్, మూషికం రోష్, అమేధ్యం రోష్ అన్నీ కలిసి తనుగా రూపొందినవాడు. సంతకం చేస్తాడు.
    లాటిన్ కార్టర్ సంకేత స్థలం. లాటిన్ కార్టర్ పరోక్షపు పురాణగాథ. రాళ్లు పేర్చిన సన్నని సందులు.  
    సెయింట్ మైఖేల్ రహదారి ప్లేస్ సెయింట్ మైఖేల్ వద్ద నది పక్కన ప్రారంభమై సరాసరి లగ్జెంబర్గ్ తోటలవైపుగా పోతుంది. సెయింట్ జెర్మేన్ రహదారి దీన్ని అడ్డం కొడుతుంది. ప్లేస్ డీలా సోర్బాస్ దీనికి సగం దూరంలో ఎడమ పక్కగా ఉంది.
    సోర్బాన్ కి ఎదురుగా వుంది ప్లేస్ డీలా సోర్బాన్. అక్కడ ఒక దారం, డెసీ ఎకోల్ వీధిలో ఒక దారం ఉన్నాయి. సోర్బాన్ కు మధ్యలో ఒక వసారా ఉంది. అక్కడనుంచి మీదకి చూస్తే ఒక చిన్న నలు చదరపు ఆకాశం కనబడుతుంది.
    శాంతి భద్రతల రక్షణకు అవసరమైన పోలీసుల్లో అనేకమైన రకాలు. మెట్రోపాలిటన్ పోలీస్: 70 వేలు. అందులో 22 వేలమంది పారిస్ లో పొడుగాటి నల్లటి వాన కోట్లు ధరిస్తారు. కర్రతో చేసిన, తెల్లరంగు వేసిన లాఠీలుంటాయి వాళ్లకి.
    స్పెషల్ జోక్యం దారీ గ్రూపులు_ పోలీసుశాఖ అంతట్లోకి ఆణిముత్యాలు_ ఖాకీ యూనిఫారాలు వేస్తారు. గొప్ప ట్రైనింగ్ పొందినవాళ్ళు. దొమ్మీ వ్యతిరేక పద్ధతులు వీరి ప్రత్యేకత. C.R.S.(S.S.) ఒక రిజరు పోలీసు దళం, ఇది హోంమంత్రి అధికారం కింద ఉంటుంది. 15 వేలమంది నల్లటి ఇండియా రబ్బరు లాఠీలు వాడతారు.
    సంచార పోలీసున్నారు. వీరూ నల్ల దుస్తులు ధరిస్తారు. 15 వేలమంది, మిలటరీ నుండి మాత్రమే ఆజ్ఞలు తీసుకుంటారు. వీళ్లకి తుపాకులున్నాయి.
    మొత్తంమీద వీళ్ళందరినీ కట్టకట్టి C.R.S.(S.S.) అనే అంటారు. విద్యార్థులూ, ప్రదర్శకులూ, జన సామాన్యమూ, నాజీ పోలీసు దళాలను జ్ఞాపకం చేసే ఈ పేరును అసహ్యంగా, ధిక్కారంగా, వేళాకోళంగా, ద్వేషపూరితంగా ఉదాత్తనుదాత్తసరాలతో ఒక పాట లాగ ఉచ్చరిస్తారు. ప్రథమ పురుషలో చెప్పుకోవలసివస్తే, "ఫ్లిక్స్" అంటారు. లేదా మారుపేర్లు తగిలిస్తారు.
    రోష్ పిలిపించిన మీదట ఈ మూకలు సోర్బాన్ ను చుట్టుముడతాయి. డెస్ ఎకోల్స్ వీధిగుండా లోనికి తోసుకొస్తాయి. ఆవరణలో ఉన్న నాలుగయిదువందలమంది విద్యార్థులు చర్చికి దగ్గరగా ఒక ప్రక్కను గుమిగూడుతారు. విద్యార్థి నాయకులు జోక్యం దార్లతో రాయబారం జరుపుతారు. మీరంతా బైటికిపోతే మీ జోలికి రామని పోలీసులంటారు. ఈ నాయకులు వెళ్ళిపోవడానికి అంగీకరిస్తారు. కొందరు విద్యార్థులు శిరస్త్రాణాలు ధరించారు. కొంతమంది రెండు టేబుల్స్ విరగ్గొట్టి వారి కాళ్ళను లాఠీల్లాగ తిప్పుతున్నారు.
    పోలీసులొక వరసగా ఏర్పడి విద్యార్థులు వెళ్ళిపోవడానికి దారిచేస్తారు. బైటికిపోయే దారం వద్దమాత్రం వాళ్ళని అరెస్టుచేసి లారీల్లో తీసుకుపోతారు.

 Previous Page Next Page