పొయ్యిలో నిప్పుచేసి వంటపనిలో మునిగిపోయింది నాంచారమ్మ తిరునామాలు గునుస్తూ.
తిరువారాధన ముగిసింది. సాపాట్లు అయినాయి. తాంబూలం వేసుకొని బల్లపీట మీద కూర్చున్నారు స్వామి. నాంచారమ్మ ప్రయాణానికి అవసరమైన సామాగ్రి సర్దుతూంది.
తలుపు తట్టిన చప్పుడైంది.
లేచి తలుపు తీశారు నారాయణస్వామి.
వచ్చింది పిచ్చమ్మ. పిచ్చమ్మను చూచి గుండె పగిలింది నారాయణస్వామికి. రాత్రి చూచారు పిచ్చమ్మను. చీకట్లో సరిగా కనిపించలేదు. ఎదురుగా పగటి ఎండలో పిచ్చమ్మ నుంచొని ఉంది. ఆమెకు ప్రాణం ఎక్కడుందో అర్థం కాలేదు స్వామికి!
"ఇప్పుడు పోతున్రా తయారయి వచ్చిన."
వెర్రిగా చూచారు నారాయణస్వామి పిచ్చమ్మను. పిచ్చమ్మలో గురువయ్య కనిపించాడు. గురువయ్య ఎద్దులాంటి మనిషి. అతన్ని రోగం నమిలేసింది. మరి పిచ్చమ్మ. పిచ్చమ్మ కేమయింది? ఎముకలు తప్ప శరీరంలో ఎక్కడా ఏమీ కనిపించలేదు. గురువయ్యంటే ప్రాణం పెడుతుంది పిచ్చమ్మ. ఈమె ఆరోగ్యం గురువయ్య ఆరోగ్యంతో ముడివేసుకొని ఉందనుకున్నారు. ఇంతకాలంగా కనీసం ఆమెను గురించి ఆలోచించక తప్పు చేశామనుకున్నారు?
"ఎట్లయినవేం పిచ్చమ్మా!"
"ఏమైంది. బాగున్నగద" అని చిరునవ్వు నవ్వింది పిచ్చమ్మ.
ఆ నవ్వులో వెన్నెలల్లేవు. కటిక చీకట్లున్నాయి.
ఆ నవ్వు అందంగా లేదు. పరమ వికారంగా ఉంది.
నారాయణస్వామి గుండెలో సూదులు గుచ్చుకున్నాయి. అయినా అగపడనివ్వకుండా "తిన్నవా పిచ్చమ్మా!" అడిగారు స్వామి.
పిచ్చమ్మ నవ్వింది. ఆ నవ్వులో అనేక అర్థాలున్నాయి.
గ్రహించారు స్వామి. కులాన్ని విడిచి, గురువయ్యను కట్టుకొని ఏం సుఖపడ్డది పిచ్చమ్మ అనుకున్నారు.
స్వామి నాంచారమ్మను పిలిచారు. పిండి చేతుల్తో పరిగెత్తి వచ్చింది నాంచారమ్మ.
"పిచ్చమ్మను చూసినవా?"
"పిచ్చమ్మా!" నివ్వెరపోయి చూసింది నాంచారమ్మ. గురువయ్యతోబాటు తన ఇంటికి వచ్చి కాళ్ళు మొక్కిన పిచ్చమ్మను తలచుకుంది. ఎక్కడ పోలిక? ఎవరు ఈ ఆడది? అనుకుంది. ఇంకా నాంచారమ్మ పూర్తిగా తేరుకోకముందే స్వామి అన్నారు. "అన్నం పెట్టు తినలేదట."
"రా పిచ్చమ్మ అన్నం పెడ్త" నిరామయంగా అన్నది నాంచారమ్మ.
"పెద్దలు మీ ఇంట్ల ఏం తింటగని పడెయ్యండి తినొస్త" అని కొంగు చాచింది పిచ్చమ్మ.
నారాయణస్వామి నెత్తిమీద ఏదో బండ పడ్డట్లనిపించింది. మౌనంగా మెట్లెక్కి ఇంట్లోకి వెళ్ళిపోయారు.
చరచర లోనికి వెళ్ళి విస్తట్లో అన్నం తెచ్చి పిచ్చమ్మ పైట కొంగులో వేసింది నాంచారమ్మ. బావి దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చేసింది.
నారాయణస్వామి బల్లపీటమీద తల పట్టుకొని కూర్చుని ఉన్నారు. నాంచారమ్మను చూచి అడిగారు.
"బియ్యం, పప్పులు కట్టినవా?"
"అదేమిటండి అట్లంటరు. మనకు చూట్టాల్లేర, శిష్యుల్లేర పట్నంల?" ముక్కు మీద వేలేసుకుని అడిగింది.
నాంచారమ్మను తలెత్తి చూచారు స్వామి.
నాంచారమ్మ ముక్కు పుడకలోని ఎర్రరాయి జిగేలుమంది. "పిచ్చిదానా! మనకింత చుట్టాల్లేరు, శిష్యులు లేరు, వారికోసం గురువయ్యను వదులుకోలేను. సత్రంలో దిగుదం. అక్కడినుంచే తిరిగి వద్దం, కానీ బండి వస్తుంది."
నాంచారమ్మకు కొంత చిరాకు వేసింది. కొంతలో కొంత దుఃఖమూ, కోపమూ వచ్చాయి. అయినా దిగమింగి ఇంట్లోకి వెళ్ళిపోయింది బియ్యం వగైరా మూటలు కట్టడానికి.
పిచ్చమ్మ చంకలో బట్టల మూటతో, ఇంటిముందున్న చింతచెట్టు కింద నుంచుంది, జీతగాడు బండిలో గడ్డివేసి, ఎద్దును కట్టి పగ్గాలు పట్టుకొని నుంచున్నాడు. నారాయణస్వామి, నాంచారమ్మ బయటికి వచ్చారు. ఇంటికి తాళం వేసి ఇరుగుపొరుగుతో చెప్పి వచ్చింది నాంచారమ్మ. చుట్టుపట్ల వాళ్ళు సాగనంపడానికి బండి వెనుక నుంచున్నారు. నారాయణస్వామి, నాంచారమ్మ బండి ఎక్కారు.
పిచ్చమ్మ మూటతో దూరంగా నుంచుంది.
బండి కదిలింది. జనం కదిలింది. పిచ్చమ్మ కదిలింది.
బండి ఊరు బయటికి వచ్చేవరకు వెంట వచ్చిన జనం వెనకపడ్డారు. ఇప్పుడు బండి, బండి వెనుక పిచ్చమ్మ మాత్రమే ఉన్నారు. స్వామి బండి నిలుపు చేయించి పిచ్చమ్మను ఎక్కమన్నారు.
"మీతోని కూచుంటానండి, బాంచెను. నడిచొస్త, నాకేమైంది, కాల్మొక్త" అన్నది పిచ్చమ్మ.
"ఎక్కు పిచ్చమ్మా ఎక్కు. గురువయ్య నాకు తమ్ముడుగద. నువ్వెక్కటానికేమి? ఎక్కు. కండ్లలో ప్రాణాలున్నయి ఏమి నడుస్తవు?" అన్నారు స్వామి.
నాంచారమ్మ కళ్ళు పెద్దవి చేసి చూచింది.
పిచ్చమ్మ బండి ఎక్కలేదు. "ఎందుకులేరి నడిచొస్త" అని బండి తప్పుకొని ముందుకు సాగింది.
అలాగే బండిమీద ఏరు దాటారు.
స్టేషనుకు చేరుకున్నారు. రైలెక్కి కూచున్నారు.
ముగ్గురూ మౌనంగా వున్నారు.
ముగ్గురి మనసుల్లోనూ గురువయ్యే ఉన్నాడు.
3
వరి కోతలైనాయి. పంట ఇళ్ళకు చేరుతూంది. ఊరు సాంతం పంట కళ్ళంలా వుంది. ఎక్కడ చూచినా గడ్డి, ఎక్కడ చూచినా ధాన్యం.
ధాన్యం బండి నారాయణస్వామి ఇంటి ముందు ఆగింది. బండి మనిషి ముసిలివాడు. బస్తా బండిమీద నిలువుగా ఎత్తి నుంచున్నాడు. "మనిషి లేడు మల్ల బస్తలెట్ల దిగుతయి?" అన్నాడు.
నారాయణస్వామి, నాంచారమ్మ వాకిట్లో అరుగుమీద నుంచొని ఉన్నారు. మనిషికోసం అటూ ఇటూ చూచారు. ఎవరూ కనిపించలేదు. సూర్యుడు కుంగాడు, సాయంకాలం అయింది. మసక చీకట్లు ముసురుకో బోతున్నాయి. గింజలు ఇంట్లో పడాలి. గత్యంతరం లేదు. నడుముకు కండవా బిగించి ముందుకు వచ్చారు స్వామి.
"అయ్యో, అయ్యో, మీరు బస్తాలు మోస్తరా! ఏమిటీ అన్యాయం? ఏమిటీ అధర్మం!" అని కేకలు పెట్టసాగింది నాంచారమ్మ.
నారాయణస్వామి బస్తా వీపుమీద వేసుకున్నారు. ఒక్క అడుగు కూడా వేయలేదు. తూలి పడబోయారు, క్షణం అయితే సంచి స్వామి మీద పడిపోయేదే! తరవాత ఏమయ్యేదో తెలీదుగాని గురువయ్య అది చూచి అయ్యగారు, అయ్యగారు అని ఉరికి వచ్చి బస్తాను ఒక చేత్తో పక్కకు నెట్టేశాడు. సంచి ఒక పక్కన పడిపోయింది. స్వామి మరో పక్కన చతికిల పడ్డారు. నాంచారమ్మ ఉరికి వచ్చి స్వామిని లేవదీసింది.
స్వామి లేచి నుంచొని ఎదురుగా నుంచొని ఉన్న గురువయ్యని చూచారు.
నల్లగా, ఎత్తుగా ఇనుప మనిషిలా ఉన్నాడు!
"ఎవరు నాయనా నువ్వు! పరాత్పరుని వలె వచ్చి కాపాడినవు! ఆ శ్రీమన్నారాయణుడు పంపించాడా?" అడిగారు స్వామి.