స్వామి కదలకుండానే అన్నాడు "లే పిచ్చమ్మా! లే! నేను బయల్దేరేటప్పుడు పిలుస్త_ సిద్ధంగుండు.... వస్తామరి" అని వెనక్కు తిరిగి బయలుదేరాడు స్వామి.
పిచ్చమ్మ లేచి "నేనొస్త. జీకటిగున్నది ముంగల నడుస్త" అని ఉరికొచ్చి స్వామి ముందు నడిచింది.
వాన పడుతూనే ఉంది.
స్వామి యింటిముందుదాకా వచ్చి నిలిచింది పిచ్చమ్మ. స్వామివైపు తిరిగి దండంపెట్టి "ఇగవస్త.... పోయేటప్పుడు పిలవండి" అన్నది.
ఒక మెరుపు మెరిసింది.
ఎదురుగా పిచ్చమ్మ స్పష్టంగా కనిపించింది స్వామికి.
గుమ్మంలో నుంచున్న నాంచారమ్మ పిచ్చమ్మను చూచింది.
పిచ్చమ్మ వెళ్ళిపోయింది.
స్వామి గుమ్మంలో అడుగు పెడుతూనే అన్నారు. "చూసినవా! ఎట్లాంటిది ఎట్లయిపోయిందో?"
"అవునండి ఎట్లయింది" చిన్న పంచె అందిస్తూ అన్నది నాంచారమ్మ. "బొమ్మోలె ఉండేది బొక్కల పోగయింది"
పిచ్చమ్మను మెరుపు వెలుగులో చూచినప్పుడే గుండె దసిలిపోయింది స్వామికి. నీలమణిలాంటి పిచ్చమ్మ బొగ్గు కంటే హీనమయిపోయిందే అనుకున్నారు.
వాస్తవంగా అందమయినది పిచ్చమ్మ. కాకుంటే గురువయ్యను మురిపించి, వలపించి, మరపించగలదా?
ఆ రాత్రి నారాయణస్వామికి నిద్ర పట్టలేదు. నాంచారమ్మ ముసుగుతన్ని పడుకుంది కాని ఆవిడ పనీ అలాగే ఉంది.
నాంచారమ్మ లేచి మంచంలో కూర్చొని "నేను కూడ వస్తానండి మీతోని".
"వస్తవా_రా" అన్నారు స్వామి.
"గురువయ్య మీకు తమ్ముడైతే నాకు మరిదికాడా మరి... వస్తనండి నేను కూడ"
"నాంచారూ" మంచంలో లేచి కూర్చొని "ఏటి దగ్గర రెండు దృశ్యాలు కనిపించినయ్. అవి చూచినప్పటినుంచి నా మనసు కలతగా ఉన్నది."
"చెప్పండి ఏమిటవి?"
"చూడు, ఏటికి వరద వచ్చింది కదా! ఆ ఒడ్డు నుంచి ఒక మొద్దు కొట్టుకొని వచ్చింది. ఈ ఒడ్డు నుంచి ఒకటి వచ్చింది. రెండూ నడి ఏట్లో కలిసినయ్. కొంతదూరం కలిసి సాగినయ్. తరువాత వేరే అయిపోయినయ్! నాంచారూ చెప్పు మళ్ళీ అవి కలుస్తయా?"
"ఇంకెట్ల కలుస్తయండి? వరదలో పోయిన మొద్దులు. దేని దారి దానిదే."
"అంతే నంటవా? అయితే గురువయ్య కూడ అట్లనే నంటవా?"
నాంచారమ్మ నివ్వెరపోయింది.
"అదేమిటండీ అట్లంటరు?"
"ఏమో నాంచారూ! అంతా భగవల్లీల! బంధం కల్పించినవాడు వాడే.... తెంచుకొని పోతే..."
నాంచారమ్మ మంచంలోంచి లేచి స్వామి నోరు మూసింది. "అశుభం పలకకండి. గురువయ్య బతుకుతడు! బాగయితడు. మీరు అతనికి ఎంత సంస్కారం కలిగించిన్రు!" అన్నది _ స్వామి మంచంలోనే కూర్చుంది.
"పిచ్చిదానా!" అని ఆమె వెంట్రుకలు నిమురుతూ "ఎవరు ఎవరికి సంస్కారం కలిగించిన్రో ఎట్ల చెప్పటం! అంటరానివాండ్లని అభాగ్యులకు దూరంగా ఉన్న మన కండ్లు తెరిపించి గురువయ్య మనకు సంస్కారం కలిగించలేదా? అయినా ఇంకా 'అహం' మనను వదిలిందా? పిచ్చమ్మ కాళ్ళమీద పడితే ఆమెను అంటుకొని లేవదీయటానికి మనసొప్పలేదు. వానలో నన్ను సాగనంపటానికి వచ్చినదాన్ని ఇంట్లోకి వచ్చి తలదాచుకొమ్మనలేకపోయాము. ఎవరిది నాంచారూ సంస్కారం?"
ఎవరిది సంస్కారం?
నాంచారమ్మకేమీ అర్థంకాలేదు? ఆమె మనసు పరిపరి విధాల పరిభ్రమించింది. గురువయ్య ఆమె మనోఫలకం మీద అనేకసార్లు మసలాడు. పిచ్చమ్మ రూపం ఆమె కండ్ల ముందు ఆడింది. తుదకు ఏరు.... ఏట్లో కొట్టుకొనిపోయే దుంగల దగ్గరికి వచ్చింది. ఆగిపోయింది. ఏ దుంగ దారి ఆ దుంగదే అనుకుంది. మనసులో అనుకున్న మాట బయటకే వచ్చేసింది.
"పిచ్చిదానా! నాకు కనిపించిన రెండో దృశ్యం చెప్పినానా!"
"చెప్పలేదు. చెప్పండి"
"ఒక మర్రిచెట్టులోంచి తాటిచెట్టు మొలిచింది. ఒక తీగ మర్రి చెట్టు నుంచి తాటిచెట్టు కొసదాకా కావిలించుకొని పాకింది."
"అయితే ఏమిటంటరు."
"బంధానికి జాతులతో సంబంధం లేదు. మర్రి ఏ జాతిది? తాటిచెట్టు ఏ జాతిది? ఎక్కడ నుంచి వచ్చింది ఆ బంధం? అవి రెండు కలిసి ఎట్లు పెరిగినయి. ఆ తీగ ఎక్కడది? ఏ గింజ పడి మొలిచింది? అది ఆ రెండింటినీ బంధించి వేసింది. ఆ బంధం ఎక్కడి దంటవు? ఎవరు తెచ్చిందంటవు?"
"గురువయ్య బంధం వంటిదండి."
"అవును, ఆ తీగను చూచినప్పుడు నాకు ఆశ మొలకెత్తుతున్నది. ఏటిలో పోయిన మొద్దులను చూచినప్పుడు గుండె పగిలిపోతున్నది."
"గురువయ్య బతుకుతడు. బాగుపడ్తడండి_సీతమ్మ చెప్పింది. ప్రయాణం ఎప్పుడు? నేను కూడ వస్త"
"సరేలే" అన్నాడు స్వామి.
ఇద్దరూ పడుకున్నారు.
ఏట్లో దుంగలు పోతున్నాయి. కలుసుకున్నాయి_విడిపోయాయి. మర్రిచెట్టు లోంచి తాటిచెట్టు, ఆ రెంటినీ పెనవేసుకున్న తీగ.
ఈ దృశ్యాలు నారాయణస్వామిని వదలడం లేదు. కళ్ళు మూసినా, తెరిచినా అవే కనిపిస్తున్నాయి.
వాన ఇంకా వదల్లేదు. జల్లు సవ్వడి వినిపిస్తూంది.
2
తెల్లవారింది. జల్లు తగ్గింది. నారాయణస్వామి ఆకాశాన్ని చూశారు. మబ్బులు విడిపోతున్నాయి. ఎండపొడ వచ్చే జాడలు కనిపిస్తున్నాయి. గాలి విసురుగా వీస్తూంది. నారాయణస్వామి మనసు ఎందుకో తేలికపడినట్లయింది. వేప పుల్ల విరిచి పళ్ళు తోముకుంటూ వంట ఇల్లు అలుకుతున్న నాంచారమ్మతో "భగవంతుడు కరుణించిండు. వాన తగ్గింది. ఏరు ఎట్లున్నదో చూసి వస్త. వంట తొందరగా చేయి. ఆరగింపు కానిచ్చి బయలుదేరుదాం" అని సాగిపోయారు.
నాంచారమ్మ ఏదో చెప్పదలచుకుంది_శూన్యాన్ని చూచి అలుకు ప్రారంభించింది.
నారాయణస్వామి ఏటి దగ్గరకు చేరుకున్నారు. ఏటి వడి తగ్గింది. అయినా వరద పూర్తిగా తగ్గలేదు. కర్రా కంపా ఇంకా కొట్టుకొని వస్తూనే ఉన్నాయి. రేవు పక్కన ఉన్న మర్రిని చూచారు. అది నిన్నటిలాగే ఉంది. విశేషం ఏమిటంటే పక్షులు తాటిచెట్టుమీద చేరి పోట్లాడుకుంటున్నట్లు కిచకిచ మంటున్నాయి.
ఏటిని చూచారు స్వామి. ఎలా దాటడం అని ప్రశ్నించుకున్నారు. రైలు స్టేషనుకు వెళ్ళాలంటే ఏరు దాటాల్సిందే. ఆకాశాన్ని చూచి పరాత్పరుణ్ని ప్రార్థించారు_ఏరు దాటించమనీ, గురువయ్య దగ్గరకి చేర్చమనీ.
ఏటి వరద చూడ్డానికి జనం వచ్చేస్తున్నారు.
మబ్బులను తొలగతోసి ఎండ వచ్చేసింది.
నారాయణస్వామి స్నానసంధ్యలు ముగించుకొని ఊళ్ళోకి బయలుదేరారు.
మబ్బులు పూర్తిగా విడిపోయాయి.
ఆకాశంలో పక్షులు స్వేచ్చగా ఎగురుతున్నాయి.
పొలాల్లో జనం కనిపిస్తున్నారు.
స్వామి ఇంటికి చేరేవరకు తడిచీరతో, నెత్తిన మంచినీళ్ళ బిందెతో చేరింది నాంచారమ్మ. స్వామి పట్టుబట్ట కట్టుకొని పీటమీద కూర్చున్నారు. ముందున్న మరో పీటమీద తిరుమణి పెట్టె, తులసి మాలలు ఉన్నాయి. ముకుందమాల చదువుతూ బొట్టు పెట్టుకుంటున్నారు.