"అయ్యగారు! మీరు లోపల కూకోండి! బస్తాలు నేను ఇంట్లో ఏసి పోత" అని "ఎత్తన్నా బస్తాలు" అన్నాడు, గురువయ్య బండి మనిషితో.
నాంచారమ్మ స్వామిని లోనికి తీసికెళ్ళి నడుము రుద్దసాగింది.
గురువయ్య అవలీలగా బస్తాలను ఇంట్లో వేశాడు. "దండమండి అయ్యగారు పోయొస్తా" అన్నాడు చేతులూ, వళ్ళూ దులుపుకుంటూ గురువయ్య.
నారాయణస్వామి బల్లపీట మీది నుంచి లేచి "కాస్త ఆగు నాయనా" అని ఇంట్లోకి సాగిపోయారు.
గురువయ్య తల గుడ్డలోంచి పొగాకు తీసి, బొడ్లోంచి మోదుగాకు తీసి చుట్ట చుట్టుకోసాగాడు.
నాంచారమ్మ గురువయ్యను చూసింది_భీముడు ఇలాగే ఉండేవాడేమో అనుకుంది.
"నీ పేరేమిటి?" అడిగింది నాంచారమ్మ.
"గురువడు" తల వంచుకొని చుట్ట చుట్టుకుంటూనే జవాబిచ్చాడు.
"ఎక్కడుంటావు?"
"గూడెము" చుట్ట నోట్లో పెట్టుకొని నిప్పుకోసం అటూ ఇటూ చూచి "జర ఇంగలం ఏస్తారుండి" అడిగాడు గురువయ్య.
నాంచారమ్మకు అతడు నిప్పడిగింది వినిపించలేదు. ఆమెమీద ఎవరో చల్లని నీరు కుండెడు గుమ్మరించినట్లయింది. అంతలోనే నిప్పులు కురిసింది.
"గూడెములో ఉండెటోనివా? అప్పుడే ఎందుకు చెప్పలేదు. అంటరానివాండ్లు నెత్తికెక్కుతున్నరు...ఇప్పుడు ఈ ఇంటికి నిప్పు...."
స్వామి బయటికి వచ్చి, ఆమె రౌద్రాకారం చూచి హడలిపోయారు.
"ఎందుకట్లరుస్తవు? నోరు మూసుకో" అన్నారు.
"మూసుకోక ఏం చేస్త? మాల మాదుగులు ఇండ్లల్ల దూరుతున్నారు. ఇక మన మడి ఆచారమేముంటుంది?" అని కేకలు వేసుకుంటూనే దొడ్డి గుమ్మంనుంచి బావి దగ్గరికి వెళ్ళిపోయింది.
"ఇదిగో ఈ డబ్బులు తీసుకో__నీ పేరేమన్నవు?" అడిగాడు స్వామి.
"గురువడు__డబ్బులెందుకండి__నేనేమన్న కూలి చేసిన్నా_జర ఇంగలం ఎయ్యుండి చుట్ట కాల్చుకుంట" నాంచారమ్మ మాటలు విననట్టే అతిసాధారణంగా అడిగాడు గురువయ్య.
నారాయణస్వామి ఎంత చెప్పినా డబ్బు తీసుకోలేదు గురువయ్య. గురువయ్య చుట్టకు నిప్పూ ఇవ్వలేదు ఎవరూ. దానికోసం కూడా వేచి చూడలేదు గురువయ్య. వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతున్న గురువయ్యను చూస్తూ నుంచున్నారు నారాయణస్వామి! ఇతను మనిషేనా? అనుకున్నారు. ఆ ఆలోచన వచ్చేవరకు యంత్రవతుగా కళ్ళు ముందుకు సాగాయి. వాకిట్లో నుంచొని చూశారు.
గురువయ్య సాగిపోతున్నాడు!
సాగుతున్నది తాటి వనం వైపు!!
బావి దగ్గరకు పోయిన నాంచారమ్మ, బొక్కెనతో నీళ్ళు తోడుకొని నెత్తిమీద పోసుకుంటూ_ 'గంగేచ యమునేచైవ' చదువుతూంది. మధ్య మధ్య గురువయ్యను శపిస్తూంది. ఆనాడు ఏదో రాగూడని ఆపద వచ్చిందని తపించిపోతూందామె. ఎన్ని నీళ్ళు గుమ్మరించుకొన్నా తృప్తి కలగటం లేదు. ఎక్కడో ఏ మూలనో మలినం ఉన్నట్లు బాధపడుతూంది. బావిలోని సగం నీరు వంటిమీద పోసుకుని ఇంట్లో అడుగుపెట్టి భర్తను పిలిచింది. జవాబు లేదు. నీరు కారుతూ వాకిట్లోకి వచ్చింది.
నారాయణస్వామి పరధ్యానంగా ఉన్నారు.
గురువయ్య వెళ్ళిన బాటనే చూస్తున్నారు.
"ఏమండీ! మిమ్మల్నే! అట్ల నిలబడ్డరేమండి! ఇల్లంత మైలపడ్డది! మనం మాదుగుల్ల కలిసినం. పొండి, స్నానం చెయ్యండి ఇల్లంత అలకాలె. ముగ్గులు పెట్టాలె. బట్టలన్నీ పిండాలె. పెరుమాళ్ళు కూడ మైలపడ్డారు. తిరుమంజనం చెయ్యాలె నడవండి" అన్నది.
స్వామి ఈ లోకంలోకి వచ్చారు.
"నాంచారూ! వచ్చినవాడు మనిషేనంటావా!"
"ఆఁ, కాక యతిరాజులు వచ్చారు. మీ పిచ్చిగానీ పొండి చీకటి పడుతున్నది. స్నానం చెయ్యండి" అని తరిమింది నాంచారమ్మ.
నారాయణస్వామి ఇంట్లో అడుగుపెడ్తోంటే దొడ్డి గుమ్మం నుంచి రమ్మంది నాంచారమ్మ.
భార్య మాట కాదనలేదు నారాయణస్వామి.
స్వామి నెత్తిన ఆవుపేడ పెట్టి నీళ్ళు గుమ్మరించింది నాంచారమ్మ. స్నానం ముగించి లోనికి వచ్చారు నారాయణస్వామి.
"వంటిల్లు అలికి ముగ్గులు పెట్త మొదలు, మీరు తిరుమంజనం ఇస్తుండండి. ఇంతలో తక్కిన ఇండ్లు అలికి, పొయ్యిల నిప్పేస్త" అన్నది నాంచారమ్మ.
నారాయణస్వామి కాదనలేదు.
అలాగే జరిగింది.
భోజనాలు ముగించి పడుకున్నారు భార్యాభర్తలు. నారాయణస్వామి నాంచారమ్మలు. ఎంతకూ ఇద్దరికీ నిద్ర రాలేదు. నాంచారమ్మకు తను మైలపడ్డాననే బాధ ఇంకా పోలేదు. నారాయణస్వామికి గురువయ్యను గురించిన ఆలోచన దూరం కాలేదు.
"నాంచారూ! గురువయ్య ఎంత గొప్పవాడు!" అన్నారు స్వామి. ఆ ధ్వనిలోనే ఏదో ఒక రకపు గౌరవం వ్యక్తం అయింది.
"ఏమిటండీ మీరంటున్నది!" చకిత అయి అడిగింది.
"నిజం నాంచారూ! గురువయ్య లేకుంటే నేనిప్పటికి ఎట్లగుండెటోణ్ణో! విరిగితే నడుము విరిగేది. పోయినా ప్రాణం పోయేది! భగవంతుని వలె వచ్చి రక్షించిండు. అతడు మనిషి అంటే ఇంకా నా మనసు ఒప్పటం లేదు."
"మాలముండ కొడుకును పట్టుకొని దేవుడో, దేవుడో అని జపిస్తున్నరేమండి! నీళ్ళు తేనా ఆచమనం చేస్తరా!"
"పిచ్చిదానా! అతడు నా ప్రాణం కాపాడిండు. నీ కుంకుమ కాపాడిండు. డబ్బు ఇస్తనంటె తీసుకోలే. కనీసం మనకు ఉపకారం చేసినట్లు భావించలే. ప్రతిఫలంగా నువ్వు అతడిని తిట్టినావు. అతడి అది పట్టించుకోనేలేదు. ఒక యోగివలె నిరాసక్తంగా విన్నడు వెళ్ళిపోయిండు! ఎంత గొప్పవాడు!!"
"ఏమండీ! మీకేమన్న పిచ్చిలేస్తున్నదా? మరి వాణ్ణి నెత్తిన ఎక్కించుకొని ఊరేగుదామంటరా!"
"అట్ల ఊరేగినా మనం అతని రుణం తీర్చుకోలేం."
"ఆ మాలవాణ్ణి...." నాంచారమ్మ వాక్యం పూర్తికాకముందే చెంప చెళ్ళుమంది. నారాయణస్వామి మంచంమీంచి లేచి, చరచరా నడిచి వసారాలోని బల్లపీట మీద కూర్చున్నారు.
నాంచారమ్మ దిగ్భ్రమ చెందింది. కళ్ళవెంట నీళ్ళు దుమికాయి. ముందు ఆశ్చర్యమూ, తరువాత ఏడుపూ వచ్చాయి. మూలకు కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్వసాగింది.
వసారాలో చీకటి, మూలన చీకటి, మధ్య ఇంట్లో లాంతరు వెలుగుతూంది.
నాంచారమ్మ మీద నారాయణస్వామి అంతవరకు చేయి చేసుకోలేదు. వారిది ఆదర్శ దాంపత్యం. కనీసం కీచులాడుకోలేదు. పసిమిలాంటి రంగు, పసుపు పూసిన ముఖం, ఎర్రరాళ్ళ ముక్కుపుడక, దుద్దులతో నాంచారమ్మ లక్ష్మీదేవిలా వుంటుంది. సౌమ్యమయిన ముఖం, చామనఛాయ, మకరకుండలాలతో నారాయణుడనిపిస్తారు నారాయణస్వామి. ఆ ఊరికి ఆ దంపతులు లక్ష్మీనారాయణులే.
అలాంటి దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి _ మనసుకు చిచ్చు రగులుతూంది.
నారాయణస్వామి తన తప్పు గ్రహించాడు.
అనూచారంగా వస్తున్న ఆచారాలు, తరతరాలుగా వస్తున్న నమ్మకాలు, పురాణాలు, కథలు, గాథలు "కులాలు, కులాలు" అని కేకలు పెట్టి చెపుతున్నాయి. ఈ నమ్మకాలలో పెరిగి పెద్దదయింది నాంచారు. కాదు తానుకూడా. ఈ సాయంకాలపు సంఘటనదాకా తానూ వాటిని నమ్మాడు. ఇప్పుడు నమ్మడంలేదా. ఇప్పటికీ నమ్ముతున్నాడు. గురువయ్య విషయంలో తప్ప! గురువయ్య యోగి. తనకు ప్రాణదాత. కాదు. పెరుమాళ్ళు. అతని విషయంలో తనకో గౌరవం ఏర్పడింది. గులకరాళ్ళలో మాణిక్యం! నిజంగా గొప్పవాడు గురువయ్య! ఎంత అనాసక్తుడు గురువయ్య! తన ప్రాణం కాపాడాడు! డబ్బు వద్దన్నాడు! తిట్లను లక్ష్యం చేయలేదు. కర్మయోగి గురువయ్య. కర్మ చేశాడు గురువయ్య. ఫలితం ఆశించలేదు. అందుకే అతణ్ణి మాట అంటే భరించలేకపోయాడు. నాంచారమ్మను కొట్టాడు. తన భార్యను తానే కొట్టాడు. గురువయ్యను గురించి తనకున్న అభిప్రాయం వేరు. నాంచారుకు అతడు మాల. తన ఇంటిని అపవిత్రం చేశాడు. ఆమెకు తెలిసింది ఇంతే. బహుశా తెలియాల్సిందీ అంతే! ఆమెకు తాను నచ్చచెప్పగలడా! చెప్పాడా! కోపం చేతకానివానికి వచ్చేది! తనవద్ద సమాధానం లేకనే కోపం వచ్చిందా? వాస్తవంగా ఇందుకు సమాధానం లేదా! తను చేసిందే తప్పా? తప్పేనా? తప్పు చేశానా? నాంచారును కొట్టాను అనుకునేవరకు దుఃఖం ముంచుకొని వచ్చింది. నారాయణస్వామి పైకి ఏడ్వలేకపోయారు. మోకాళ్ళమీద తల పెట్టుకొని కుమిలిపోయారు.