Read more!
 Previous Page Next Page 
హైజాక్ పేజి 3

వెంటనే ఛెంగున దూకాడు వివేకానంద్.
"లెమ్మిగో! లెమ్మిగో ఎక్కడికి లాక్కెడుతున్నార్రా నన్నూ?"
"మన రూమ్ కే! అరవకు!" అన్నాడు శతృఘ్న, సాధ్యమయినంత శాంతంగా.
"ఓరి మీ పీకెలు తెగ్గొయ్యా!" అన్నాడు వివేకానంద్ పెద్దగా, అన్ని జేబులూ తడుముకుని మూడు సినిమా టిక్కెట్లు బయటికి తీశాడు. "ఇవాళ శాలిని పిక్చరు రిలీజవుతోందిరా! నా శాలిని పిక్చరు ఫస్టు డేనే చూడకుండా ఎప్పుడన్నా ఉన్నానుట్రా నేను? మీకు దణ్ణం పెడతారా! సినిమాకు పోనీయండిరా!" అన్నాడు దుఃఖంగా.
"నీ అసాధ్యం కూల! శోకాలు మొదలెట్టకు ఇప్పుడు!" అన్నాడు ఇక్బాల్ చిరాగ్గా.
"ఓకే! ఓకే! సినిమా కెళదాం ఊరుకో!" అన్నాడు శతృఘ్న. అతనికి సినిమాలంటే పరమ బోరు. సినిమాలే కాదు. మామూలు జనం ఇష్టపడే వినోదాలేవీ అతను ఇష్టపడడు. అతను మేధావి. కాలక్షేపానికి జీన్ పాల్ సార్ త్రే ఫిలాసఫీ చదివేరకం.
కానీ ఇవాళ అతను డిజప్పాయింట్ అయ్యాడు. అది మర్చిపోడానికి డైవర్షన్ కావాలి అతనికి. చివరికి ఫార్ములా సినిమా అయినా సరే!
సినిమా అనగానే వివేకానంద్ మొహం వికసించింది.
"థాంక్యూ! థాంక్యూ! డాడీ!" అంటూ తనంతట తనే ఆటోలో దూరాడు.
కొద్ది నిమిషాల తర్వాత థియేటరు ముందు ఆగింది ఆటో.
అప్పటికి సెకండ్ షో సినిమా మొదలెట్టే టైం అయింది.
సెకండ్ షో సినిమా టైం అవుతున్నా ఆ రోజు రాత్రి బ్యాంకులోని లైట్లన్నీ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. హెడ్ ఆఫీసునుంచి సీనియర్ ఆఫీసర్లు వచ్చారు. పోలీసులు వచ్చారు. వాళ్ళమధ్య క్యాషియర్ సుజాత కూడా కూర్చుని ఉంది.   
సబ్ ఇన్ స్పెక్టరు వెంకటరెడ్డి ప్రశ్న మీద ప్రశ్న అడుగుతున్నాడు సుజాతని. ఇనప చువ్వలా సన్నగా, నల్లగా, పొడుగ్గా ఉంటాడు అతను. మొహంమీద "ఇతను అతి నిజాయితీపరుడు" అని ఎవరో స్టాంపు వేసినట్లు కనబడుతుంది చూసేవాళ్ళకి. పోలీసువాళ్ళని చూస్తే అలాంటి భావం కలగడం అరుదు. సీరియస్ కేసులు టేకప్ చేసినప్పుడు రోజులు, వారాల తరబడి ఇంటి మొహం చూడకపోవటం, ఆ తరువాత వారాల తరబడి అతని భార్య ఎడమొహం పెడమొహంగా ఉండడం అతనికి రొటీన్. చెయ్యవలసిన పనులే తప్ప చెయ్యకూడని తప్పుడు పనులు ఎప్పుడూ చెయ్యడు కాబట్టి వాళ్ళ డిపార్టుమెంటులో చాలామందికి అతనంటే అయిష్టం. అందుకే ఎనిమిదేళ్ళ సర్వీసులో పది ట్రాన్స్ ఫర్ లు వచ్చాయి అతనికి.
"ఆలోచించండి! ఇంకేమన్నా గుర్తులు చెప్పగలరా?" అన్నాడు రెడ్డి.
సుజాత గాభరాగా తల ఊపింది చెప్పలేనన్నట్లు.
"గుబురు గెడ్డం, కళ్ళద్దాలూ, పొడుగు మనిషీ - ఈ మూడే గుర్తులతో అతన్ని పట్టుకోవడం ఇంపాజిబుల్! 'పులి - బలంగా ఉంటుంది - పసుపురంగు ఒంటిమీద నల్లటి చారలుంటాయ్' అని గుర్తులు చెప్పినట్లు ఉండవచ్చు. కళ్ళద్దాలు ఊరికే పెట్టుకుని ఉండవచ్చు. పొడుగాటి మనుషులు ఈ హైద్రాబాద్ లోనే లక్షమంది ఉంటారు. సారీ! మీరు చెప్పిన గుర్తులు అంతగా ఉపయోగపడవు. ఇంకేమన్నా జ్ఞాపకం తెచ్చుకోగలరా? ఎంత చిన్న విషయమయినా సరే!"
నిస్పృహగా తల ఊపింది సుజాత. అతను ఆ ప్రశ్నలన్నీ ఇప్పటికే చాలాసార్లు అడిగాడు తనని.
"వాడు బెదిరించగానే అలారం బెల్లు ఎందుకు మోగించలేదు? కనీసం పెద్దగా అరిచి ఉండవచ్చునే!" అన్నాడు రెడ్డి.  
భయంతో తడి ఆరిపోయాయి సుజాత పెదిమలు. మాటల కోసం తడుముకుంటూ అస్పష్టంగా చెప్పింది. "భయమేస్తే బొమ్మలా కదలకుండా ఉండిపోతాను నేను, క్రితం నెల కూడా అలాగే అయింది. మా స్టోర్ రూంలో ఒక తేలు చర చరా పాకుతూ, నా పాదాలవైపు వచ్చింది. చూస్తూ అలాగే నిలబడిపోయాను గానీ ఒక్క అడుగు కూడా పక్కకి జరగలేకపోయాను."
"మంచి సస్పెన్సు కథ చెప్పారు. క్లయిమాక్సు ఏమిటో చెప్పలేదు. తేలు మిమ్మల్ని కుట్టిందా?" అన్నాడు వెంకటరెడ్డి సీరియస్ గా - కానీ అతని కళ్ళలో నవ్వు కనబడుతోంది.
"లేదు. పాదాలదాకా వచ్చి పక్కకి వెళ్ళిపోయింది." అంది సుజాత.
అందరూ నవ్వేశారు. అప్పటిదాకా అక్కడ వాతావరణంలో ఉన్న టెన్షన్ కొంచెం తగ్గినట్లయింది.
బ్రాంచ్ మేనేజరు కలుగజేసుకుంటూ అన్నాడు. "అది ఎక్స్ ట్రా స్పెషల్ రకం మంచి తేలయి ఉంటుంది. అన్ని తేళ్ళు అంత మంచిగా ఉండవు. ఈసారి తేలు కనబడితే అది కరిచెయ్యకముందే అరిచెయ్యాలి మీరు."
ప్రయత్నపూర్వకంగా నవ్వు మొహం పెట్టింది సుజాత.
వాచ్ చూసుకున్నాడు రెడ్డి. "ఆల్ రైట్ మిస్ సుజాతా! మీరింక ఇంటికి వెళ్ళవచ్చు. ఇంకా ఏమన్నా అడగవలసి ఉంటే రేపు పొద్దున్న అడుగుతాను."
"థాంక్స్" అని ఆగి, "కానీ రేపటినుంచి నేను లీవు. ఊరికెళ్ళుతున్నాను. బ్యాంకుకి రాను" అంది సుజాత.
ఇన్ స్పెక్టరు రెడ్డి మొహంలో వెంటనే అనుమానం తొంగిచూసింది. "ఊరికా? ఏ ఊరు? ఎందుకు?" అన్నాడు.
 మొహమాటంగా తల దించుకుంది సుజాత. "మా పేరెంట్సు ఢిల్లీలో ఉంటారు. నాకు అక్కడే పెళ్ళిచూపులు అరేంజ్ చేశారు. అతను స్టేట్స్ లో ఉంటాడు. శెలవు మీద రెండు వారాలపాటు ఇండియాకి వస్తాడట. సెటిలయిపోతే వచ్చేవారమే మ్యారేజ్" అంది సుజాత.
సానుభూతిగా చూశాడు రెడ్డి. "ఐయామ్ వెరీ సారీ! కానీ ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళడానికి వీల్లేదు. లీవు కాన్సిల్ చేసుకోవాలి. మిమ్మల్ని ఏ టైంలో ప్రశ్నించడం అవసరమవుతుందో చెప్పలేం. అందుకని మీరు ఇక్కడే, మాకు అందుబాటులోనే ఉండవలసి వస్తుంది."

 Previous Page Next Page