ప్రొఫెసర్ నవీన్ అతన్ని వారిస్తూ అతి సౌమ్యంగా అన్నాడు. "యూ.ఎఫ్.ఓ. - అంటే అన్ అయిడెంటిఫైడ్ ఫ్టయింగ్ ఆబ్జెక్ట్స్ వేరే గ్రహం నుంచి వచ్చే ప్రాణులు ఉపయోగించే ప్రయాణ సాధనాలూ, ఫ్లయింగ్ సాసర్లూ, ఎగిరే పళ్ళాలూ అని వ్యవహరిస్తూంటారే జనం - అవేనా మీరు చెప్పేది?"
"యా! సరిగ్గా మా నాన్నగారు చనిపోవడానికి రెండు గంటల ముందర..."
వాళ్ళ మాటలు పూర్తిగా మనసులోకి ఎక్కడం లేదు అపురూపకి. అల్లకల్లోలంగా ఉంది మనసు. అమ్మ ఏమయిపోయింది? తప్పించుకుపోయిన రాబొట్ కీ, అమ్మ కనిపెట్టిన విషక్రిమికీ, ఆకాశంలో కనబడ్డ ఫ్లయింగ్ సాసరుకీ ఏమిటి సంబంధం?
"వెల్ మిస్టర్ అజిత్!" అన్నాడు ప్రొఫెసర్ నవీన్ "ఎగిరే పళ్ళాల్లాంటి వాహనాలనీ, వాటిలో వచ్చిన గ్రహాంతర వాసులనీ చూశామని లక్షోపలక్షల రిపోర్టులు ఉన్నాయి. కానీ వాటిలో నూటికి నూరు శాతం కరెక్టే అని ఋజువయిన రిపోర్టు ఒక్కటీ లేదు. ఒక్కొక్కసారి చిత్రమైన వాతావరణ పరిస్థితుల్లో విమానాలూ, ఉల్కలూ, పక్షుల గుంపులూ, వాతావరణ పరిశోధనకి ఉపయోగించే బెలూన్లూ - ఇవన్నీ ఫ్లయింగ్ సాసర్లలాగా భ్రమని కలిగిస్తాయి." అని వాక్యం పూర్తిచేయకుండానే, "అరె! అదేమిటి?" అన్నాడు నిటారుగా నిలబడుతూ.
హఠాత్తుగా పెద్ద గాలి దుమారం లేచింది.
ఆ వెంటనే గుండెల మీద సమ్మెటతో కొడుతున్నట్లు గిట్టల చప్పుడు! యముడి వాహనంలా ఉన్న ఎనుబోతు ఒకటి వెర్రెత్తినట్లు పరుగెత్తి వెళ్ళింది.
ఆ వెనకాతలే ఒక ఆవుల మంద! విహ్వలంగా ఉరుకులు పెట్టింది.
కుక్కలన్నీ సామూహికంగా శోకాలు పెట్టడం మొదలెట్టాయి. చెట్లమీద ఉన్న పక్షులన్నీ బిలబిల్లాడుతూ ఒక్కసారిగా గాల్లోకి లేచాయి.
అప్పుడు -
చిత్రంగా - సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తున్నట్లు అయింది. పదిలక్షల వాట్ల ఆర్క్ లైటు వెలిగినట్లు బ్రహ్మాండమైన మెరుపు వచ్చింది.
ఆకాశంలో కనబడుతున్న ఆ తీవ్రమైన తేజస్సుని చూడలేక అందరి కళ్ళు చీకట్లు కమ్మాయి.
కొద్దిసేపటి తర్వాత ఆ కాంతి తీక్షణత తగ్గి లేత నీలం రంగుకి మారింది. మబ్బుల అంచున మెరుస్తూ నిశ్చలంగా నిలబడిన వెండి పళ్ళెం లాంటిది ఒకటి కనబడింది.
అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు.
సరిగ్గా రెండు క్షణాలు అలా కనబడింది అది. ఆ తర్వాత కాంతి వేగంతో పయనిస్తూ, కన్నుమూసి తెరిచేలోగా అదృశ్యమైపోయింది.
ఇప్పుడు నిర్మలంగా ఉంది ఆకాశం. సెకెండ్ల క్రితం అక్కడ అంత "డ్రామా" జరిగిన సూచనేలేదు!
"ఏమిటది? వాట్ ద హెల్ ఈజ్ దట్?" అన్నాడు ప్రొఫెసర్ కళ్ళు నులుముకుంటూ.
"ఫ్లయింగ్ సాసరు - కావచ్చు!" అన్నాడు అజిత్.
"షిట్!" అన్నాడు కమీషనరు విక్రమ్. కానీ అప్పటికే అతనికి నిలువుగుడ్లు పడ్డాయి.
అతని జేబులో వున్న పాకెట్ సైజు 'వాకీ టాకీ'సన్నగా రొద చేసింది. అది తీసి చెవి దగ్గర పెట్టుకు విని, "సరే! ఇప్పుడే వస్తున్నాను" అని, "రండి ప్రొఫెసర్!" అంటూ బయటికి పరుగుతీశాడు కమీషనరు.
వాళ్ళు ఎక్కగానే శోకాలు పెడుతున్నట్లు సైరన్ మోగించుకుంటూ, శరవేగంగా వెళ్ళిపోయాయి పోలీసు వెహికిల్సు.
ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేక కొద్దిసేపు అలాగే నిలబడిపోయాడు అజిత్. ఆ తర్వాత బయటికి వచ్చాడు. కలలో నడుస్తున్నట్లు అతన్ని అనుసరించి వచ్చింది అపురూప.
రోడ్డుమీద జనం కకావికలై పరిగెడుతున్నారు. ఎటు చూసినా భయం, సంభ్రమం, హిస్టీరియా, కేకలూ -
విక్రమ్ ఆర్డరు మేరకు అపురూప ఇంటిచుట్టూ అప్పటికే పోలీసులు కాపలాగా నిలబడి వున్నారు.
"ఓకే అపురూపా! ఒకసారి నేనూ వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో చూసి వస్తాను. మీరు కాసేపు భయపడకుండా ఇక్కడే ఉండండి. పోలీసు కాపలా వుంది ఇంటి చుట్టూ! పర్వాలేదు!" అన్నాడు అజిత్.
ఆందోళనగా చూసింది అపురూప. "వద్దు! నేనూ మీతో వస్తాను ప్లీజ్! ఒక్కదాన్నే ఉండలేను ఇక్కడ!"
వద్దని వారించే వ్యవధి లేదు అజిత్ కి. "ఆల్ రైట్! రండి!" అంటూ గేటుదగ్గరే పార్క్ చేసి వున్న తన సోలార్ ఎయిర్ కారువైపు పరుగెత్తాడు.
ఫైబర్ గ్లాసు బాడీతో వున్న ఆ ఎయిర్ కారు స్ఫటికంలా మెరుస్తోంది. పావురాయి రెక్కల్లాంటి చిన్న రెక్కలు రెండున్నాయి దానికి. నేలమీద పరుగెత్తడమే కాకుండా గాలిలో ఏడెనిమిది గంటలపాటు ఏకధాటిగా ఎగరగలదది.
అతను స్టార్టు చెయ్యగానే నిశ్శబ్దంగా ముందుకు జారిపోయింది కారు.
జనం మందలు మందలుగా ఊరి బయటికి పరుగెడుతున్నారు.
సరిగ్గా రెండున్నర నిమిషాల తర్వాత ఊరి శివార్లను చేరింది కారు.
ఎవరో రాక్షసులు చలి మంట వేసుకుంటున్నట్లు ఒకచోట పెద్ద జ్వాలలు కనబడుతున్నాయి. ఆ జ్వాలల్లో తగలబడిపోతోంది ఒక విమానం.
ధ్వంసమైపోయిన ఆ విమానం తాలూకు శకలాలు చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్లదాకా విసిరివేయబడి వున్నాయి. మంటల మీదనుంచి వీస్తున్న గాలి వేడిగా సోకుతోంది. ఫైరింజన్లు మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
గుంపులుగా ఉన్న జనాన్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళారు అజిత్, అపురూప.
అక్కడ అందరికంటే ముందువరసలో నిలబడి వున్నారు కమీషనర్ విక్రమ్, ప్రొఫెసర్ నవీన్.
ఇంతలో, "హలో ఓల్డ్ బాయ్! ఏమిటి న్యూస్?" అంటూ కమీషనర్ దగ్గరికి వచ్చాడు ఒక విలేకరి. అతని కలం పేరు లేసర్ కిరణ్. తనకి లేసర్ కిరణమంత తీక్షణమైన బుర్ర వుందని అతని నమ్మకం. సెన్సేషనల్ న్యూస్ కోసం ముల్లోకాలూ గాలించేస్తూ వుంటాడు. ఒకవేళ సంచలన వార్తలేవీ దొరక్కపోతే తనే సృష్టించగల సమర్ధుడు. ఒక ప్రయివేట్ టీ.వీ. నెట్ వర్క్ లో పనిచేస్తున్నాడు.
"పెద్ద న్యూసేమీ లేదు. ఫర్ హెవెన్స్ సేక్, నువ్వు ఏదేదో వూహించి, వూరించే న్యూస్ అని ప్రచారం చేసేసి న్యూసెన్స్ క్రియేట్ చెయ్యకు!" అన్నాడు కమీషనర్ మొరటుగా. అంతలోనే విలేకరులతో పేచీ పెట్టుకోవడం వివేకవంతుడి లక్షణం కాదని గుర్తొచ్చి, "ట్రెయినింగ్ విమానం ఒకటి ఫ్యూయెల్ టాంకు అంటుకుని పేలిపోయింది. లక్కీగా పైలట్ మాత్రం స్కై డ్రైవ్ చేసి బతికి బయట పడ్డాడు. అంతే!" అన్నాడు పళ్ళబిగువున.
"మరి ఇందాక కనబడిన కాంతీ, వెండి పళ్ళెంలాంటి వస్తువూ?" అన్నాడు అజిత్ సందేహంగా.
"విమానం పేలుతున్నప్పుడు వచ్చిన కాంతే ఇందాక మనం చూశాం!"
"విమానం పేలడానికి కొద్దిక్షణాల ముందర..." అని ఏదో చెప్పబోయాడు ప్రొఫెసర్.
"దట్సాల్! ఇంక చెప్పవలసినదేమీ లేదు" అన్నాడు కమీషనర్ ఉదాసీనంగా. ఆయన అన్ని విషయాలూ పూర్తిగా చెప్పడం లేదనిపించింది అజిత్ కి. విలేకరి కూడా అనుమానంగా చూశాడు కమీషనర్ వైపు.
కమీషనర్ అపురూప వైపు తిరిగాడు. "అపురూపా! మీ మమ్మీ ఈ విశాల విశ్వంలో ఎక్కడున్నా సరే సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం. మీ ఇంటికి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాం. మీరు నిశ్చింతగా వుండండి" అన్నాడు.
కొద్దిగా కుదుటబడింది అపురూప. ఊహాతీతమైన దృశ్యమేదో ఇక్కడ కనబడుతుందని బెదిరిపోయింది తను ఇంతసేపూ.
కానీ ఇది కేవలం విమానం ప్రమాదమేనా? అందులోనూ, పైలట్ తప్ప వేరే ప్రయాణీకులు లేని ట్రెయినింగ్ విమానం! అంతే!
థాంక్ గాడ్!
రాబొట్స్ తెలుసు తనకి. మనిషిని మించిన మేథస్సుగల రాబొట్ ని కూడా వూహించుకోగలదు తను.
తను మరమనిషికి భయపడదు - దానికి ఎన్ని విద్యలు వచ్చినా సరే! తనే భయపడనప్పుడు ఇంక అమ్మ - ఫేమస్ డాక్టర్ శోధన - దాన్ని చూసి భయపడే ప్రశ్నే లేదు.
ఒకవేళ నిజంగానే ఆ రాబొట్ అమ్మని ఎత్తుకెళ్ళి ఉంటే, దానికింక ఆయువు మూడినట్లే! అమ్మ తెలివితేటల ముందు ఆ మరమనిషి తెలివితేటలు సూర్యుడిముందు గుడ్డి దీపంలా అయిపోతాయి! ష్యూర్ థింగ్!
అలా అనుకోగానే పూర్తిగా సేదతీరినట్లయింది అపురూప హృదయం.
"గుడ్ డే టూ యూ అపురూపా! సో లాంగ్ మిస్టర్ అజిత్!" అని చెప్పి, పోలీసు కార్లో ఎక్కాడు విక్రమ్.
ఏదో చెప్పబోయి, మళ్ళీ మనసు మార్చుకుని, అజిత్ ని తదేకంగా చూస్తూ "బెస్టాఫ్ లక్!" అన్నాడు ప్రొఫెసరు.
"థాంక్యూ -" అన్నాడు అజిత్ కరచాలనం చేస్తూ.
పోలీసు కారు కదిలి వెళ్ళిపోయింది.
"హేయ్! మిమ్మల్ని ఎక్కడో చూశాను!" అన్నాడు, విలేకరి లేసర్ కిరణ్ అజిత్ ని ఎగాదిగా చూస్తూ 'వెధవది! ఎక్కడో గుర్తురావడం లేదుగానీ ఎక్కడో చూశాను మిమ్మల్ని!"
"నా పేరు అజిత్!" డాక్టర్ సంజీవ్ గారి కొడుకుని." అని చటుక్కున చెప్పేసి, 'అలా ఎందుకు చెప్పానా అని వెంటనే మధనపడ్డాడు అజిత్. ఈ విలేకర్లు వెంట పడ్డారంటే తోడేళ్ళ గుంపు వెంటపడినట్లే! ప్రశ్నలతో ప్రాణాలు కొరికేస్తారు!' అనుకున్నాడు.
కానీ అప్పటికే ఆలస్యమయి పోయింది. లేసర్ కిరణ్ బ్రీఫ్ కేసులో నుంచి మైక్రోఫోను తీసి అజిత్ మొహం ముందు పెట్టాడు. అప్రయత్నంగా తనకి దొరికిన ఈ బంగారంలాంటి అవకాశాన్ని వదిలెయ్యదలుచుకోలేదు అతను. టేప్ రికార్డర్ ఆన్ చేశాడు.
అజిత్ ఏదో అస్పష్టంగా గొణిగి తప్పించుకోవాలని చూశాడు గానీ వదలలేదు లేసర్ కిరణ్. అప్పుడే వాళ్ళ చుట్టూ ఒక గుంపు కూడటం మొదలెట్టింది. ఒకళ్ళిద్దరు అపురూపకి మరీ దగ్గరగా నిలబడి ఆమెని నొక్కేస్తున్నారు. నిస్పృహగా చూశాడు అజిత్.
"మనం ఇక్కడ కాకుండా కాస్త తీరిగ్గా కూర్చుని మాట్లాడుకునే ప్రదేశం ఏదీ లేదా?" అన్నాడు.
"దగ్గరలోనే ఒక రెస్టారెంటు ఉంది. రండి అక్కడికి వెళదాం."