గోడమీద పిల్లి వాటంలా కాస్త ఇటు తిరిగాడు. "శారదా! నీ సలహా బాగుంది. అమ్మాయి పెళ్ళి చేస్తాం. అతగాడికి సినిమాలు చూడటం...ఊళ్ళు తిరగటం ఇష్టం ఉండదనుకో! అప్పుడేంటి?"
"ఏమీ లేదు. హాయిగా ఇల్లు దిద్దుకుంటూ ఇంట్లో ఉంటుంది."
వందనకి వళ్ళు మండింది. పెరుగుతున్న బీ.పి తో స్పీచ్ అందుకుంది.
"మమ్మీ డాడీ! మీ వాదనతో టైమ్ వేస్ట్ తప్ప కించిత్ ప్రయోజనం లేదు. ఆడపిల్లలు...అగచాట్లు...ఆడది ఇంటి పట్టున వుండాలి... ఇలాంటి అమ్మమ్మ కాలం నాటి కబుర్లు నాకు చెప్పవద్దు. అయిదుగురు భర్తలున్న ద్రౌపదికి...రాముడిని భర్తగా పొందిన సీతకి తప్పలేదు అగచాట్లు...ఆపదలు.
ఈ కాలం స్త్రీ ఎంత చదువుకున్నా...ఎన్ని రకాల ఉద్యోగాలు చేసినా... కోరిన కట్నకానుకలు యిచ్చి ఓ మగమహారాజును కొనుక్కున్నా ఏదో విధంగా దేనికో వకదానికి పరిస్థితి సరీగ లేకపోతే ఆపద తప్పదు. కట్టుకున్నవాడే నిర్థాక్షిణ్యంగా లీటర్ కిరసనాయిల్ తో భార్యని పరలోకానికి పంపిస్తున్నారు.
"అయితే ఏమంటావే వందనా! ఈ జన్మకి పెళ్ళి చేసుకోను అంటావా?"
"ఇలాంటి నిర్ణయాలు తీసుకుని నిన్ను బాధపెట్టను మమ్మీ! ఈనాటి స్త్రీ ఉద్యోగ నిమిత్తంగాని మరి దేనికయినా గాని పదిమంది మగాళ్ళ మధ్య మసలక తప్పదు. మగాళ్ళంతా మోసగాళ్ళు కారు. అలాగని నిర్లక్ష్యంగా తీసేస్తే నష్టబోయేది మళ్ళీ ఇక్కడ స్త్రీయే" గంభీరంగా చెప్పింది వందన.
"ఏమిటో నీ మాటలు నాకేమీ అర్థం కావడంలేదు..." అంది శారద.
"మన బేబీ తెలుగులోనే చెబుతున్నది శారదా!" అన్నాడు రాజారావు.
"మరీ నన్ను అమాయకురాలిని చేసి మాట్లాడకండి. అర్థమైందిలెండి.."
"ఏమిటో అంత అర్థమయింది" రాజారావు అడిగాడు.
"మనకున్నది ఒక్కగానొక్క అమ్మాయి. మీరు దాన్ని అతి గారాబం చేసి మగరాయుడిలా పెంచారు. ఈ వయసులో బేబీ 'పెళ్ళి...పెళ్ళి' అనక 'సాహసయాత్ర చేసొస్తాను అది...ఇది' అంటోంది. మీరు దాని మాటలకి చాటుగా సపోర్ట్ చేస్తూ పైకి ఏమీ ఎరగనట్టు నటనొకటి" నిష్టూరంగా అంది శారద.
"రామ! రామ! ఎంత అపవాదు" రాజారావు అమాయకంగా మొహంపెట్టి అన్నాడు.
"మమ్మీ! మీ మాటలు తరువాత. నేను చెప్పేది వినండి. నా స్నేహితురాళ్ళు ముగ్గురూ బయల్దేరితేనే నేనూ బయల్దేరతాను. సరేనా!"
ఈ తఫా వందన చెప్పింది కాస్త బాగానే వుందనిపించింది శారదకి. ఇది కాస్త ఆలోచించదగిన విషయమే" అంది.
"బేబి! ఇప్పుడు మీ అమ్మ చెప్పింది నాకూ నచ్చింది. మీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లోని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలని వంటరిగా పంపించడానికి ఒప్పుకోవాలి కదా! వాళ్ళు...వాళ్ళ పిల్లల్ని పంపించినప్పుడు నిన్ను టూర్ పంపించటానికి మాకు మాత్రం ఎందుకు అభ్యంతరం ఉండాలి చూద్దాం కానీ" అన్నాడు రాజారావు.
"మీరు, మమ్మీ ఆ మాట మీద ఉండండి డాడీ! అందరిళ్ళల్లో అందరూ ఓ.కె. అంటేనే బయలుదేరతాం సరేనా!"
శారద ఏదో చెప్పబోయింది. సరీగ్గా అప్పుడే పక్కింటి పిన్నిగారు వచ్చింది. "శారదమ్మా! ఒకసారి ఇలారా! నీతో ఒక ముఖ్యమయిన విషయం చెప్పాలి." అంటూ పక్కగదిలోకి దారితీసింది శారద వెనకనే వెళ్ళింది.
పక్కింటి పిన్నిగారి మీద శారదకి మహా గౌరవం. కాని వందనకి మాత్రం మహా మంట పక్కింటి పిన్నిగారికి "పానకంలో పుడక" అని ఓ నిక్ నేమ్ కూడా పెట్టింది. కాని ఇప్పుడు మాత్రం పక్కింటి పిన్నిగారు పానకంలో పుడకలా అడ్డొచ్చినా ఏమీ విచారించలేదు.
పక్కింటి పిన్నిగారు, తల్లి ప్రక్కగదిలోకి వెళ్ళగానే స్వరం తగ్గించి తండ్రితో అంది. "డాడీ! మనిద్దరం కల్సి మమ్మీని మోసం చేస్తున్నామేమోనని బాధగా వుంది."
"డోంట్ వర్రీ బేబీ! మనం చేసేది మోసం కాదు. మీ మమ్మీకి ఏమీ తెలీదు. అందువల్ల ఆమె మనసు గాయపడకుండా వొప్పిస్తున్నాము అంతే" అన్నాడు రాజారావు.
"అంతేనా డాడీ!" అనుమానంగా అంది వందన.
"అంతే!" రాజారావు స్వరం స్థిరంగా పలికింది.
2
ఆ సాయంత్రం...నలుగురూ పార్కులో కల్సుకున్నారు.
వందనాదేవి, రాణి, ప్రమద, సుందర సుకుమారి నలుగురు మిత్రురాళ్ళూ పార్కులో కూర్చుని మాట్లాడుకోవటానికి ఒకచోటు పెట్టుకున్నారు. అది పబ్లిక్ పార్క్. అయినా ఆ చోటులో ఎవరూ కూర్చోటానికి వీలులేదు. వీళ్ళు పార్క్ కి వచ్చేసరికి ఖర్మకాళి ఎవరయినా అక్కడ కూర్చుంటే అక్కడనుంచి లేచిపొమ్మని గొడవ పెడతారు. అక్కడ కూర్చున్నవాళ్ళు కాస్త మొండివాళ్ళు అయితే "ఇదేమన్నా మీ సొంత స్థలమా! మేము లేవంగాక లేవం" అంటారు.
మిత్రురాళ్ళు నలుగురూ పాపం మంచివాళ్ళే. వాళ్ళతో పేచీ పెట్టుకోరు, పోట్లాడరు, వాళ్ళకి గజం దూరంలో వెళ్ళి కూర్చుంటారు. వెంటనే సుందర సుకుమారి ఓ కవిత చదివేస్తుంది. "వాహ్వా వాహ్వా" అంటూ తలలూగిస్తారు ముగ్గురును.