ఒకే టైములో నలుగురు రోగులకు ఆపరేషన్ చేసేందుకు వీలుగా పెద్ద థియేటర్, దాన్ని ఆనుుకని ఆపరేషన్ జరిగిన వెంటనే రోగులను వుంచే థొరాసిక్ రికవరీ రూమ్, పక్కనే చీఫ్ సర్జన్స్ కి కేటాయించిన ప్రత్యేక గదులూ...
మిగతా అంతా ఆపరేషన్ నుండీ దశలవారీగా కోలుకుంటున్న రోగుల వార్డులు, అలా మొదటి అంతస్థంతా గుండె ఆపరేషన్ల విభాగానికి మాత్రమే కేటాయించబడింది.
న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఇమేజియాలజీ, యురాలజీ, గాస్ట్రో ఎంటరాలజీ, గైనకాలజీ, ఆర్ధో మొదలయిన విభాగాలన్నిటికీ కలిసి మిగతా అంతస్థులు కేటాయించబడినాయి.
ఆపరేషన్ థియేటర్ ని ఆనుకుని ఉన్న గది బయట 'ప్రొఫెసర్ డా.శరత్ చంద్ర ఎమ్. ఎస్, ఎమ్ సి హెచ్' అని రాసి వున్న బోర్డు వుంది.
అప్పుడు మధ్యాహ్నం మూడున్నర కావస్తోంది. ఎండ తీక్షణత అప్పుడప్పుడే తగ్గుముఖం పడుతోంది.
ఆపరేషన్స్ ముగించుకుని అయిదు నిమిషాల క్రితమే థియేటర్ నుండి బయటికొచ్చిన శరత్ చంద్ర తన గదిలో కూర్చుని మర్నాడు చేయాల్సిన ఆపరేషన్స్ గురించి అసిస్టెంట్స్ కి సూచనలిస్తున్నాడు.
వార్డుల్లోని పేషెంట్స్ ని చూసే 'రౌండ్స్' పని ఓ గంటలో ముగించుకుని పెందలాడే ఇల్లు చేరే హడావుడిలో ఉన్నాడతను.
ఆ రోజు ఏ అవాంతరము లేకుండా పని త్వరత్వరగా పూర్తి చేసుకోగలిగినందుకు అతనికి ఆనందంగా ఉంది.
సరిగ్గా అప్పుడే... కింది అంతస్థులోని కారిడార్ లో సంచలనం మొదలయింది.
"తప్పుకోండి.... తప్పుకోండి" అన్న కేకలతో కారిడార్లోని మనుషుల్ని తప్పించుకుంటూ ఒక స్ట్రెచర్ ఎమర్జన్సీ వార్డువైపు దూసుకుపోతోంది.
స్ట్రెచర్ మీద రోగి మూలుగులు కారిడార్ పొడవునా విషాదాన్ని వెదజల్లుతూ దూరమైపోతున్నాయి. స్ట్రెచర్ తో పాటు పరిగెడుతున్న వాళ్ళ మొహాల్లో తీవ్రమైన ఆందోళన కొట్టిచ్చినట్ట కనిపిస్తోంది.
కారిడార్ లోని జనం రోగివైపు నిశితంగా చూసేలోపే ... కళ్ళముందు నుండి స్ట్రెచర్ మాయమైపోతోంది.
"ఏం జరిగింది?" దగ్గరగా వెళ్ళి రోగివైపు చూస్తూ అడిగాడు.
"గుండె నొప్పివచ్చి పడిపోయారు" భార్య చెప్పింది. రోగి కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాడు. అతని వళ్ళంతా తడిసి ముద్దయివుంది. అతని మొహంలో మృత్యుభయం స్పష్టంగా కనిపిస్తోంది.
"సిస్టర్ త్వరగా బిపి ఆపరేటస్ కట్టండి" పల్స్ చూస్తూ చెప్పాడు డాక్టర్. స్టెత్ రోగి ఛాతిమీద ఉంచి గుండెని పరిశీలించాడు. మరో నిముషంలో బిపి చూస్తూనే హడావుడిగా.... కంగారుగా....
"సిస్టర్ మార్ఫిన్ లోడ్ చేసుకురండి. త్వరగా ఐ.పి. ఫ్లూయిడ్స్ రెడీ చేయండి. ఇసిజి అర్జంట్ కమాన్ క్విక్!" అరుస్తున్నట్టు చెప్పి కార్డియాలజిస్టుకి కాల్ చేయడానికి ఫోన్ వైపు పరిగెట్టాడు.
అతను చెపుతున్నది వింటూనే నర్సులిద్దరూ పరిగెట్టారు.
మృత్యువక్కడే తచ్చాడుతున్న అనుభూతి!
ఒక్క నిముషం వృధా కావడం లేదక్కడ. మరో రెండునిముషాల్లో వీన్ లోకి ఇంజక్షన్ యిచ్చి, సెలైన్ పెట్టింది నర్స్. టెక్నీషియన్ అందించిన ఇసిజి చూశాడు. ఇసిజి వేవ్స్ లేవలేక, లేవలేక కొద్దిగా లేచి పడిపోతున్న కెరటాల్లా బలహీనంగా ఉన్నాయి.
"ఇదివరకెప్పుడయినా ఇట్లా నొప్పివొచ్చిందా?" వేవ్స్ ని పరిశీలిస్తూనే అడిగాడు రఘు.
"ఎప్పుడు లేదు డాక్టరుగారూ?" రోగి భార్య చెప్పింది ఆందోళనగా.
తలతిప్పి రోగిమొహంలోకి చూశాడు. అతను స్పృహ కోల్పోతున్నాడు.
"హార్ట్ ఎటాక్! ఇతన్ని త్వరగా కార్డియాలజీకి పంపించండి" అని డాక్టర్ తో చెపుతూనే అక్కడినుంచి కదిలాడు రఘు.
డాక్టరు వార్డుబాయ్ వైపు సూచనగా చూశాడు. మరుక్షణం స్ట్రెచర్ కదిలి కార్డియాలజీ వైపు దూసుకుపోయింది.
* * * *
కొత్త పేషెంట్ రాగానే కార్డియాలజీ డిపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా సంచలనం ప్రారంభమైంది.
రోగి రాగానే 'స్టెప్టోకానేజ్' ఇంజక్షన్ ఇవ్వబడింది. అది అతనికి పనిచేయలేదు. అతని గుండె పరిస్థితి స్క్రీన్ మీద చూపించే మానిటర్ ని అతనికి అమర్చారు. బలహీనపడి వేగం తగ్గిన గుండెని మానిటర్ స్క్రీన్ మీద చూస్తూనే.
"పేస్ మేకర్!" అరిచాడు రఘు. అతనప్పటికే యాంజియోగ్రాం చేసేందుకు సిద్ధపడుతున్నాడు.
గుండె వేగాన్ని పెంచే పేస్ మేకర్ మిషన్ని రోగి ఛాతిలో అమర్చడం మొదలెట్టారు అసిస్టెంట్స్. రోగి భార్య దూరంగా నిలబడి పదే పదే భగవంతుడ్ని ప్రార్ధిస్తోంది.
మరో పావుగంటలో గుండె వేగం కొద్దిగా పెరిగినట్లు మానిటర్ సూచించింది.
"ఓహ్ మేజర్ బ్లాక్ ఉంది. మనచేతిలో ఏం లేదు. హి నీడ్స్ ఎమర్జన్సీ సర్జరీ శరత్ చంద్రకి కాల్ ఇవ్వండి గోపాల్!" యాంజియోగ్రామ్ చూస్తూ ఆందోళనగా చెప్పాడు రఘు.
గోపాల్ ఫోన్ వైపు పరిగెట్టాడు. అక్కడున్న వైద్యులందరి మొహాలు కళతప్పి ఉన్నాయి.
మృత్యువక్కడే చిరునవ్వులు చిందిస్తోంది.
"శరత్ చంద్ర సారు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు సార్!" గోపాల్ ప్రశ్నకి సర్జికల్ డిపార్ట్ మెంట్ నర్స్ సమాధానం చెప్పింది.
"ఈ టైమ్ లో ఇంటికెళ్ళారా?"
"అవున్సార్ నిజం! ఇవాళ మార్నింగ్ నుండి పనులన్నీ త్వర త్వరగా పూర్తిచేసుకుని, కొన్ని పనులు అసిస్టెంట్స్ తో చేయించి వెళ్ళిపోయారు సార్! నిన్న రాత్రి కూడా..." ఇంకా ఏదో వివరించసాగింది నర్సు.
"ఎంతసేపయింది వెళ్ళి?" మధ్యలోనే సంభాషణ తుంచేస్తూ అడిగాడు.
"ఇప్పుడే, జస్ట్ త్రీ మినిట్స్ అయుంటుంది సార్" తీరిగ్గా చెప్పింది.
ఠప్పున ఫోన్ పెట్టేసి బయటికి పరిగెట్టాడు గోపాల్.
* * * *
"అబ్బ! ఎంతకాలమయింది సాయంత్రం వెలుగులో ప్రపంచాన్ని చూసి!" పరిసరాలని చూసి అనుకుంటూ కార్ స్ట్రార్ట్ చేశాడు శరత్ చంద్ర.
ఎప్పుడూ వెంటనే స్టార్ట్ అయ్యే కారు ఆరోజు మొండికేసింది. మళ్ళీ ఇగ్నీషియస్ కీ తిప్పాడు. కొద్దిగా స్టార్టయినట్టు అయి ఆగిపోయింది.
"దీనికేమైందిప్పుడు" విసుగ్గా అనుకుంటూ మూడవసారి స్టార్ట్ చేశాడు. ఈసారి ఇంజన్ శబ్దం ఎంతో రిలీఫ్ నిచ్చింది.
ఈ చిన్న ఆలస్యం అతనికోసం పరిగెత్తుకొస్తున్న గోపాల్ కి కలిసొచ్చింది.
"కానీ, సార్...!" అంటూ దూరం నుండి చప్పట్లతో కూడిన గోపాల్ కేక కారు స్టార్టయిన శబ్దంలో కలిసిపోయింది.