"అవునూ... అదేమిటే మహి... అబ్బాయిల్ని ప్రకాష్ కేఫ్ లో, అమ్మాయిల్ని ఈ హోటల్ లో వుంచాడు మన సోడాబుడ్డి...." సుధారాణి బ్యాగ్ ని భుజానికి తగిలించుకుంటూ అంది.
"నీలాంటి వాళ్ళ చేష్టలకు భయపడి అలా చేసుంటారు మన ఎకనామిక్స్ లెక్చరర్ గారు. పద... పదా... బస్ ఈపాటికి వచ్చే వుంటుంది" అంటూ అప్పుడే వచ్చింది మేరీ.
"పోవే... పాతకాలపు అమ్మమ్మ... వంద జన్మలకో మానవ జన్మ... పొతే తిరిగి రాదు. వున్నప్పుడే అనుభవించాలి... సహజ వనరుల్ని వినియోగంలోకి తెచ్చుకోకపోతే దేశం ఎలా సస్యశ్యామలం కాదో- మనమూ అంతే అర్థమయిందా...?" అంటూ సుధారాణి బయటకు నడిచింది... మితిమీరిన వల్నర్ బిలిటి...
మహతికి సుధారాణి భావం అర్థమైంది. ఒక్కక్షణం ఆమెకేసి అసహనంగా చూసి ముందుకు కదిలింది.
కాస్తా వెనుకా, ముందుగా ఇరవైమంది అమ్మాయిలు పర్వతారోహకుల్లా తయారయి హోటల్ నుంచి బయటకు వచ్చారు.
"ఇలాగయితే ఎలాగమ్మా...? సరీగ్గా ఆరింటికి బస్ బయలుదేరాలి" అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అన్నాడు బస్ క్లీనర్.
"అబ్బాయిలొచ్చారా?" సుధారాణి సల్వార్ కమీజ్ ని సరిచేసుకుంటూ అడిగింది.
"వాళ్ళకోసం మావాడు వెళ్ళాడు. మీరు త్వరగా బయలుదేరండమ్మా..." అంటూ అతను వార్ని సాగదీస్తూ ముందుకు నడిచాడు వడివడిగా.
సరిగ్గా ఇదే సమయంలో ఇరవైమంది విద్యార్థులు ప్రకాష్ కేఫ్ నుంచి బయటపడి రోడ్డెక్కారు.
"టిప్పుసుల్తాన్ కథ అభూతకల్పన... అదే టీ.వీ.లో వచ్చింది" అన్నాడు విజయ్ అనే విద్యార్థి బస్ దిక్కుకేసి కదులుతూ.
"అవును- పచ్చి అబద్ధం. టిప్పూకి పరమత సహనం అసలు లేదట. మైసూర్ మహారాజుని మరీ బఫూన్ లా చిత్రీకరించారు. ఎవరో గిద్వానీ అట- చరిత్రని వక్రీకరించాడు. మైసూర్ మహారాజు 'ది స్వోర్డ్ ఆఫ్ తిప్పు సుల్తాన్'లో చూపించినట్లు పిరికివాడేం కాదు" అని సురేష్ అనే విద్యార్థి అన్నాడు కోపంగా.
ఆ అందరికీ నాయకుడిగా కనిపించే విద్యార్థి పేరు మధుకర్.
అతనేం మాట్లాడలేదు.
అందరూ మింటోస్ ఐ హాస్పటల్ చౌరస్తా దాటుతుండగా అన్నాడు మధుకర్-
"సంజయ్ ఖాన్ చూపించిన చరిత్ర తప్పని చెప్పటానికి క్లైమాక్స్ చాలు. టిప్పు సుల్తాన్ ప్యాలస్ పక్కగా కావేరీ నది ప్రవహిస్తుంది. ఆ కావేరీ నది ఒడ్డునే శ్రీరంగపట్టణం వుంది. రివర్ వైపున్న కోట తలుపుల్నే, టిప్పూకి వ్యతిరేక వర్గం తెరచి, బ్రిటీష్ సైన్యాన్ని లోపలకు తీసుకెళ్ళడం జరిగింది. చివరి పోరాటంలో కూడా టిప్పుసుల్తాన్ తీవ్రంగా గాయపడ్డాక టిప్పు గుర్రం టిప్పు శరీరాన్ని చాలా దూరం లాక్కువెళ్ళిందట. టిప్పు శవం దొరికిన స్థలాన్ని చరిత్రకారులు గుర్తించారట. అదిప్పటికీ వుందట. వచ్చేప్పుడు మనం చూద్దాం" అన్నాడు మధుకర్ ఒకింత అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.
"ఏమి చరిత్రలో ఏమిటో....? ఓ పక్క చలికి చస్తుంటే మీ గోలొకటి... ఎవరి దగ్గరన్నా గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజుందా?" దయాళ్ అనే విద్యార్థి తల పైకెత్తి ఓరగా చూస్తూ అడిగాడు.
"అడుక్కునేవాడిక్కూడా స్టయిల్...! సిగరెట్ ఫ్రీగా కావాలి. అదేడవ్వొచ్చుగా... కింగ్ సైజట పైగా! ఆ చూపులు చూడు ఒంటికన్ను శివ రాసన్ లా..." మధుకర్ దయాళ్ వైపు మిర్రి మిర్రి చూస్తూ అన్నాడు.
"ఒక జోక్ చెప్పరా... సిగరెట్ ఇస్తాను" అన్నాడు సురేష్ జేబులోంచి సిగరెట్ పెట్టె తీస్తూ.
నిజానికి దయాళ్ కి ఆస్తిపాస్తులు బాగానే వున్నాయి. కాని అదో రకమైన బుద్ధి... ఫ్రీగా వచ్చిందే గొప్ప తృప్తినిస్తుందని అతని నమ్మకం. అతని అసలు పేరు నిధి దయాళ్. చూట్టానికి స్టూడెంట్ లా వుండడు. ఐదడుగుల ఆరంగుళాల ఎత్తుతో పెట్రోలు పీపాలా వుంటాడు. క్రింద నుంచి పైవరకు ఒకటే షేప్.
ఎప్పుడెవరు, ఏది ఫ్రీగా ఇస్తారా అని ఎదురు చూస్తుంటాడు.
ఇతరుల్ని మోసగించటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
మోసగించింది కాక, ఎలా మోసగించింది నలుగురికీ చెప్పి తన తెలివితేటలకు తనే మురిసిపోతుంటాడు.
"ఒక పోలీస్ స్కూటర్ మీద తన భార్యతో షాపింగ్ కు వెళ్తున్నాడట... చాలా వేగంగా... కొంత దూరం వెళ్ళాక అతని భార్య స్కూటర్ మీంచి జారిపడిపోయింది. దారిన వెళ్ళే ఒక వ్యక్తి ఆ దృశ్యాన్ని చూసి, అంతకంటే వేగంగా వెళ్ళి ఆ విషయాన్ని ఆ పోలీసుకి చెప్పాడట- అప్పుడా పోలీసు ఏమన్నాడో తెలుసా?"
"ఏమన్నాడు? పీడ విరగడయిందనా?"
"అయ్యో అనా?"
"వెనక్కి తిరిగి పరిగెత్తుకెళ్ళి భార్యకు సారీ చెప్పాడా?"
తలా ఒక రకంగా ఊహించారు.
సురేష్ చేతిలోంచి సిగరెట్ తీసుకుని స్టయిల్ గా దాన్ని వెలిగించుకుని ఒక దమ్ము లాగి-
"నేనింకా చెవిటివాడ్నేమో అని భయపడ్డాను- అని అన్నాడట" అన్నాడు నిధి దయాళ్ తాపీగా.
"దిక్కుమాలిన కుంకకి ఇన్ని చావు తెలివితేటలెలా వచ్చాయో?" అన్నాడు మధుకర్ వడివడిగా నడుస్తూనే.
మరికొద్దిసేపటికి అందరూ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలస్ ముందున్న బస్ వద్దకు వచ్చారు.
అక్కడికి వస్తూనే మేరీ కోసం విజయ్ కళ్ళు ప్రతి అంగుళాన్ని గాలించాయి.
సరిగ్గా అదే సమయంలో బస్ లో విండో ప్రక్కన కూర్చున్న మేరీ కావాలనే గొంతు సవరించుకుంది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. కళ్ళతోనే వంద పేజీల్లో ఇమిడివుండే భావాన్ని ఎక్ఛేంజ్ చేసుకున్నారు.
గొప్ప ప్రగతి... గ్రేట్ ఎచీవ్ మెంట్!
మరికొద్దిసేపటికి బస్ బయలుదేరింది. మధుకర్ ఓరగా, ఎవ్వరికీ అనుమానం రాని విధంగా మహతి కేసి చూసాడు.
ఆమె దీక్షగా చదువుకుంటూ కనిపించింది. ఆ పుస్తకంవైపు మధుకర్ పరిశీలనగా చూసాడు. ఆమె చేతిలో అమెరికన్ హీరో - అమెరికన్ ఆటోమోబైల్ ప్రపంచాన్ని రాడికల్ గా ఛేంజ్ చేసిన లీ అయోకోకా ఆటోబయోగ్రఫీ బుక్ వుంది. అతనెవరయిందీ మధుకర్ కి అర్థం కాలేదు.
* * * * *
బ్రతకలేమోనన్న భయం...
బ్రతికినా నలుగురితో సమానంగా, సమాన స్థాయిలో బ్రతకలేమోనన్న భయం...
రేపు నాకెలా గడుస్తుంది...? ఎల్లుండి నా పరిస్థితేమిటి...? అనే ఆదుర్దా...
నష్టం మైనస్ లాభం, సుఖం మైనస్ దుఃఖం సంభవిస్తుందని తెలిసినప్పుడు ఏర్పడే ఆకస్మిక భీతి... perpetual Insecurity... అనిశ్చిత భావం...
ఫియర్... యాంగ్జయిటీ... ప్యానిక్ డిజార్డర్... అంతా ట్రాష్... తలుచుకుంటే వాటిని గెలవటమెంత? ఆత్మస్థయిర్యమున్నప్పుడు, ఆత్మవిశ్వాసం ఆయుధమైనప్పుడు... విశ్వాసం స్వంతమైనప్పుడు శారీరకమైన వైరస్ ల్ని తొలగించుకోవటం తేలిక... అదే మానసిక వైరస్ ల్ని దూరం చేసుకోవటం కష్టం.