Previous Page Next Page 
ఉషోదయం పేజి 3

    "బాగానే వుంది మీ ఇద్దరిగోల - ప్రతిరోజూ ఇలా దేనికో దానికి వాదులాడుకుంటూ, దెబ్బలాడుకుంటూ ఈ సంసారం ఎలా చేస్తారర్రా బాబూ - మధ్యన చూస్తూ నేనూరుకోలేను. కోడలిని వెనకేసుకు వస్తాను అంటూ నన్ను దెప్పుతాడు."
    "వెనకేసుకు రావద్దత్తయ్యా, న్యాయం ఎవరివైపు వుంటే వారినే సపోర్ట్ చేయండి" శారద నవ్వుతూ అంది.
    "అదేనమ్మా, నీ తప్పు లేదని తెలియబట్టే నిన్నేం అనలేకపోతున్నాను."
    "థ్యాంక్స్ అత్తయ్యా, మీరు నాకు అండ అని నాకు తెలుసు. మీరు చదువుకున్నవారు, ఉద్యోగం చేసినవారు అవడంవల్ల ఉచితానుచితాలు అర్ధం చేసుకోగల సంస్కారం మీకుండబట్టి నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అదే పాతకాలం అత్తగారైతే కొడుకు పక్షాన వుండి కోడలిని సాధించేవారు. అదే అత్తయ్యా చదువు విలువ" మానస్పూర్తిగా అంది శారద.
    "సరే వెళ్ళు, బట్టలవీ మార్చుకో, రోజూ వుండే గోలేగా ఇది" అందావిడ వంటింట్లోకి వెడుతూ.
    శారద గదిలోకి రాగానే ప్రకాష్ మొహం తిప్పుకున్నాడు. సత్యవతి రెండు కప్పుల కాఫీ కలిపి పట్టుకొచ్చింది గదిలోకి - "అయ్యో, మీరెందుకత్తయ్యా తేవడం, బట్టలు మార్చుకు వస్తున్నాగదా" అంటూ కప్పు అందుకుని పకాష్ కి అందించబోయింది.
    "అక్కడపెట్టు"అన్నాడు కరకుగా.
    సత్యవతి బయటకు వెళ్ళగానే శారద కోపంగా "కోపానికి కూడా అర్ధం పర్థం వుండాలి. కేసుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకుండానే ఇలా మొహం మాడ్చుకుంటున్నారు. రేపు నేను గెలిస్తే ఇంకేం అంటారో!
    మీకు చాలాసార్లు చెప్పాను.. వృత్తి సమస్యలు, పర్సనల్ సమస్యలకి ముడిపెట్టవద్దని. దయచేసి మీ కోపతాపాలు అందరి ముందరా అసహ్యంగా ప్రదర్శించి నన్ను నలుగురిలో నన్ను చిన్నపుచ్చద్దు, దానివల్ల నాకంటే మీ ఇమేజ్ ఎక్కువ దెబ్బ తింటుదన్నది గ్రహించండి" శారద కఠినంగా అంది.
    "చాలించే నీ ప్రీచింగ్స్....నీవే ఏదో పెద్ద విశాల హృదయం కలదాన్నన్నట్టు పోజులు మాను....నేనేదో కుళ్ళుపోతున్నట్టు మాట్లాడుతున్నావు" ఆవేశంగా అన్నాడు.
    "మరి ఈ మొహం ముడుపులు, విసుర్లు వీటినేమంటారు? ఇది మొదటిసారా మీరిలా ప్రవర్తించడం?..." శారద ఈరోజు ఊరుకోదలచలేదు...."సునీత నా బెస్ట్ ఫ్రెండ్ని మీకు తెలిసీ, దాని కేసు నేను టేకప్ చేస్తానని తెలిసీ మీరెందుకు రవీంద్ర కేసు తీసుకున్నారు...." నిలేసింది.
    "అన్నీ నీకు చెప్పి ఒప్పుకోవాలా? ఏ కేసు నాకు ప్రాఫిటబుల్ అనిపిస్తే అది తీసుకుంటాను...లాయరుగా నాకొచ్చిన కేసులు నేను వదులుకోను...."
    "కరెక్ట్. ప్రోఫెషనల్ గా మీకు లాభం, డబ్బు సంపాదన కావాలి.. కాదని ఎవరూ అనరు. నా వృత్తీ అదే! నాకు పేరు, డబ్బు వచ్చే కేసులు నేనూ తీసుకుంటాను. గెలుపు ఓటములు రెండువైపులా వుంటాయి. దానికింత రాద్ధాంతం ఎందుకు!"
    "రాద్ధాంతం ఎవరు చేశారు? నిన్నేమన్నా అన్నానా - ఎందుకు వెయిట్ చెయ్యలేదు అన్నదానికి జవాబు చెప్పానంతే. కేసు గెలిచినందుకు నేనేం ఏడవడం లేదు. ఇలాంటి కేసులు వంద గెలిచాను" ఉడుకుమోత్తనంగా చిన్నపిల్లాడిలా  అన్నాడు.
    ఇలాంటివాడితో ఇంకా వాదన పెట్టుకోవడం ఇష్టంలేక ఖాళీకప్పులు పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది అత్తగారికి సాయం చెయ్యడానికి.
    అత్తాకోడళ్ళిద్దరూ ఈ మాటా ఆ మాటా చెప్పుకుంటూ వంట పూర్తి చేశారు.
    ప్రకాష్ తయారై తన ఆఫీసుకి వెళ్ళిపోయాడు. క్లయింట్స్ ని కలుసుకోడానికి, పని చూసుకోవడానికి ఆఫీసుకోసం అద్దెకో ఇల్లు తీసుకున్నాడు.
    శారద మాత్రం తనకోసం వచ్చే క్లయింట్స్ తో ఇంట్లోనే మాట్లాడుతుంది. సాధారణంగా తనకోసం వచ్చే క్లయింట్స్ అందరూ ఆడవారే కనుక వీధి గదిలో మాట్లాడి పంపిస్తుంది.
    కోర్టునించి రాగానే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ ఆఫీసుకి వెళ్ళి ఏ తొమ్మిదింటికో ఇంటికి వస్తాడు ప్రకాష్. శారద ఇల్లాలిగా, తల్లిగా బాధ్యతల మధ్య ఎక్కువ కేసులు తీసుకోదు... విడాకుల కేసులు, ఆత్మహత్యలు చేసుకున్న స్త్రీల తరపున, అత్తింటి ఆరళ్ళ కేసులు, భర్తలు మోసాలు చేసి రెండో పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడవాళ్ళ కేసులు మాత్రం తీసుకుంటుంది. ఈ మాత్రం కోసమే ప్రకాష్ ప్రాక్టీస్ మానెయ్ అంటూ సాధిస్తాడు.
    రాహుల్ పెద్దవాడయ్యాడు. ఇంట్లో అత్తగారుండనే వుంది. రోజంతా ఖాళీగా వుండి తనేం చెయ్యాలి! అంతేకాక లా చదివి మంచిపేరు, ప్రాక్టీసు అన్నీ సంపాదించుకుని, మంచి లాయరుగా తనని తాను నిరూపించుకున్నాక తన అస్తిత్వాన్ని ఎందుకు వదిలేయాలన్నది శారద వాదన.
    తను బాగా సంపాదిస్తున్నాడు గనుక, ఇప్పుడింక తన సంపాదన అవసరం లేదు కనుక ఇంట్లో కేవలం ఇల్లాలిగా వంటావార్పు చేసుకుంటూ వుండిపోవాలా! అతనికి ఆర్థిక సాయం అవసరం వున్నన్నిరోజులు సంపాయించి, ఇపుడు బాగా సంపాదిస్తున్నాడు కనుక తనకొచ్చిన పేరు, జాబ్ శాటిస్ ఫేక్షన్ అన్నీ వదులుకుని ఉత్త గృహిణిగా మిగలమనడం ఏం న్యాయం? శారద వాదన అది.
    భార్యాభర్తల మధ్య ఈ విషయంలో చాలాసార్లు గొడవలు జరిగాయి. శారద తన మీద ఆధారపడకుండా మంచి లాయరుగా పేరు తెచ్చుకుని, సంపాదించుకోవడంతో ప్రకాష్ మేల్ ఇగో దెబ్బతింది. శారద ఏ చిన్నమాట అన్నా, మాటకి మాట జవాబిచ్చినా, పిల్లాడు ఏడ్చినా, సరిగా చదవకపోయినా, ఇంట్లో ఏ చిన్నవస్తువు కనబడకపోయినా ఇల్లాలిగా శారదకి ఇంటిమీద శ్రద్ధలేదని, తల్లిగా తన బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదని, వంక దొరికితే చాలు వ్యంగ్యంగా విసుర్లు విసురుతాడు. ఆమెలో తప్పులు వెతికి సాధించి తృప్తిపడడం హాబీగా మారింది.
    "రోజంతా ఇంట్లో కూర్చుని ఏం చేస్తుందిరా, ముగ్గురికి వండడానికి ఇద్దరాడవాళ్ళం కావాలా, నేనింట్లో వుండి  చూసుకుంటున్నానుగా..." సత్యవతి కోడలిని సమర్థించేది.
    "ఏంటమ్మా, ఆవిడగారు ఉద్యోగాలేలితే ఇంట్లో వుండే పనిమనిషివా నీవు" తల్లిమీద ఎక్కడలేని ప్రేమా కురిపించాడు. "ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు చాకిరీ, కోడలొచ్చినా పని తప్పదా!"
    "సర్లేరా, ఈ రోజుల్లో అరవై అంటే ముసలితనం అని ఎవరూ అనుకోవడం లేదు. నేను చెయ్యలేనపుడు చెపుతాలే! అయినా పొద్దుటా, సాయంత్రం అన్ని పనుల్లో సాయం చేస్తూనే వుంది. మా ఆడవాళ్ళం మా సమస్యలు మేం చూసుకుంటాము. ఏమిటో మీ మగాళ్ళకి మా ఆడవాళ్ళ ఉద్యోగాలు కంటికి ఆనవు... మీరు చెయ్యమన్నప్పుడు ఉద్యోగాలు చేసి, మానమన్నప్పుడు మానడానికి ఏ సినిమాకో, ఊరికో వెళ్ళడంలా అనుకుంటారు. బతికినన్ని రోజులు మీ నాన్న అంతే.

 Previous Page Next Page