Previous Page Next Page 
జనవరి 5 పేజి 3

  

       "మా ఆఫీసర్ కి మనసులో నామీద యిష్టముంది. దాన్ని తెలియచేయటానికి నానా యాతనలు పడుతున్నాడు. తన భార్యకు జబ్బన్నాడు తనకి సుఖం లేదన్నాడు. నాకు అర్హత లేకున్నా ప్రమోషన్ ఇస్తానన్నాడు. పని లేకపోయినా తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు....." మేఖల ఓ క్షణం మాట్లాడటం ఆపింది.
   
    "అందుకని ఏం చేశావ్?" ఆదిలక్ష్మి ఆందోళనగా అంది.
   
    "ఏం చేస్తే బావుంటుంది?" మేఖల అడిగింది.
   
    "నువ్వేం చేశావో చెప్పు"
   
    "అసలు ఏం చేస్తే బావుంటుందో చెప్పు"
   
    "ఏం చేసినా గొడవ పెట్టుకుని, ఉద్యోగం వదలకూడదు"
   
    "ఒకటి వద్దు అంటే రెండవది అవును అనే కదా?"
   
    ఆదిలక్ష్మి మాట్లాడలేదు.

    "రెండవది అంటే అతన్ని సుఖపెట్టడం వద్దు అనుకున్నాను. అప్పుడతనేం అంటాడు. నువ్వు మాకొద్దు అంటాడు. అతని కోరిక ఒప్పుకుంటే ఉద్యోగం నిలుస్తుంది. ప్రమోషన్ కూడా వస్తుంది. ఈ పరిస్థితుల్లో కూడా ఉద్యోగం నిలుపుకోమంటావా?"
   
    కూతురంత సూటిగా అడుగుతుందనుకోలేదు. అందుకే ఆదిలక్ష్మి కలవరపడింది. ఆ వెంటనే తేరుకుంది.
   
    "అతన్ని మభ్యపెట్టి ఉద్యోగం నిలుపుకోవాలి. లౌక్యం వుండాలి. అంతేగాని తెంపుకుంటే ఎలా?"
   
    మేఖల నవ్వింది.....ఒకింతసేపు అలా నవ్వుతూనే వుంది.....ఉన్నట్టుండి చటుక్కున ఆపేసి-
   
    "ఏం చేసినా గొడవపెట్టుకుని ఉద్యోగం వదలకూడదు అంతేగా? నువ్వన్నది....? ఏం చేసినా...? నన్ను అతనేం చేసినా నేను మాత్రం ఉద్యోగం వదలకూడదు..... అవునా?"
   
    సంభాషణ ఆ విధంగా మలుపు తిరిగి తన మీదే వస్తుందని ఆదిలక్ష్మి ఊహించలేదు.
   
    "ఇలా ఎన్ని ఉద్యోగాల్ని వదిలేస్తావు?"
   
    బింకంగా అంది ఆదిలక్ష్మి తన వాదనలో బలం లేదని, రీజనింగ్ లేదని తనకి తెలుసు కాని తనను తాను ప్రొటెక్టు చేసుకోవాలి. అందుకే మొండిగా పాత ప్రశ్ననే రెట్టించింది.
   
    "ఉద్యోగం, ఉద్యోగం అని అల్లాడిపోతున్నావు. ఒక మనిషి బ్రతకడానికి ఉద్యోగం తప్ప మరేదారి లేదా?"
   
    "లేదు" ఆదిలక్ష్మి ఖండితంగా అంది.
   
    "ఆలోచించి చెప్పమ్మా!"
   
    "ఆలోచించక్కర్లేదా"
   
    "ఉందని రుజువు చేస్తాను" మంచం మీంచి దిగ్గున లేస్తూ అంది మేఖల.
   
    కూతురెంత మొండిదో ఆదిలక్ష్మికి బాగా తెలుసు. అనవసరంగా కూతురితో వాదనకి దిగానేమో అని కొద్ది క్షణాలు ఆందోళన పడింది.
   
    "చెప్పమ్మా... రుజువు చేయమంటావా...." మేఖల పట్టుదలగా అంది డైరీని మూసేస్తూ.
   
    "నీకు పెళ్ళి చేయాలి. అది తల్లి దండ్రులుగా మా బాధ్యత. మేం మధ్య తరగతికి చెందిన తల్లదండ్రులం. కోరినంత కట్నమిచ్చి నీకు పెళ్ళి చేసే స్థోమత మాకు లేదు. నీకు ఏదయినా ఉద్యోగముంటే తక్కువ కట్నానికి ఎవరయినా పెళ్ళి చేసుకోవటానికి మొగ్గుచూపుతారని నా ఆశ.
   
    అందుకే నా బంగారం అమ్మి మీ నాన్న అప్పుచేసి వాటితో నీకు యూనివర్సిటీ స్థాయివరకు చదువు చెప్పించాం.
   
    ఆ సందర్భంలో నీ తమ్ముడి భవిష్యత్ ఏమిటని కూడా ఆలోచించలేదు. వాడు డిగ్రీ రెండుసార్లు తప్పాడు. పాసవుతాడో లేదో కూడా చెప్పలేం వాడొక మొరటు వాడిగా తయారయ్యాడు. ఆవేశం, ఉద్రేకం, కోపం, అసహనం, రాక్షసత్వం వాడి ప్రవర్తనలో చోటు చేసుకున్నాయి. దీనికి వాడ్ని ఒక్కడ్నే నిందించలేం. మా ఆర్ధిక వనరుల్ని, మా కాలాన్ని, శ్రమను నీకే కేటాయించాం. లేదంటే మరీ అంత దూకుడుగా తయారయ్యేవాడు కాదు. కాదంటావా? ఒక్కసారి ఆలోచించి చెప్పు."
   
    తల్లి తన తమ్ముడి గురించి చెప్పినదానిలో నిజముంది. తమ్ముడి ప్రవర్తనలో తొంగిచూసే ఎగ్రెసివ్ నెస్ కి తను కొంతవరకు బాధ్యత వహించక తప్పదు కాని అవన్నీ తను అడగలేదు. తమ్ముడికి తక్కువ చేయాలని చెప్పలేదు.
   
    "చెప్పమ్మా సమాధానం చెప్పు" కూతురు మౌనం వహించటంతో ఆదిలక్ష్మికి బలం చిక్కినట్లయింది.
   
    "కొంతవరకు నిజమే. ఆత్మవంచనంటే నాకు అసహ్యం. అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను. జీవితంలో రాజీపడి నేను బ్రతకలేను. జీవితానికి తలవంచి కూడా నేను జీవించలేను. భవిష్యత్ లో మీ రుణం తప్పక తీర్చుకుంటాను. ప్రస్తుతానికి మీ ఆందోళనను తగ్గించే పని చేస్తాను" అంది అప్పటికే మనస్సులో ఒక నిర్ణయానికి వస్తూ.
   
    "ఏమిటది" అనుమానంగా చూస్తూ అడిగింది ఆదిలక్ష్మి.
   
    వెంటనే ఏమీ చెప్పలేదు మేఖల.
   
    తల వంచుకుని ఆలోచిస్తూ వుండిపోయింది.
   
    అలా తల్లీ, కూతుళ్ళ మధ్య ఘర్షణ జరగటం అదే మొదటిసారి కాదు. అప్పటికి ఎన్నోసార్లు జరిగింది.
   
    "ఏదో చెబుతానన్నావ్ గదా చెప్పు మరి"
   
    కూతుర్ని వాదనలో నయినా ఓడిస్తే తన దారికి వస్తుందని ఆదిలక్ష్మి ఆరాటం. ప్రతి విషయంలో ముక్కు సూటిగా వెళితే ఎదురుదెబ్బలే తగులుతాయి తప్ప మన ధ్యేయం సానుకూల పడదని ఆదిలక్ష్మి వాదన.
   
    అడుగడుగునా ఆత్మవంచన చేసుకుని బ్రతికేకన్నా చావటం అంతకంటే మంచిదని మేఖల వాదన.
   
    బ్రతుకు భారం కాకూడదనుకుంటే దాన్ని రాజీ చేసుకుని ముందు కెళ్ళాలని తల్లి వాదన.
   
    రాజీపడి బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకెనా అని కూతురి వాదన.
   
    ఆ ఇద్దరి మధ్యా, ఆ వైరుధ్యం ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తున్నా తెగేవరకు యిద్దరూ లాగలేదు. తెగాలని కూడా ఆ యిద్దరికీ లేదు.
   
    కానీ రోజు ఆ యిద్దరిలోనూ వారిమధ్య జరిగే ఘర్షణ అంత్యదశకు చేరుకుంటుందేమోనని అనుమానం చోటుచేసుకుంది. రెండు మూడు నిమిషాల మౌనం తర్వాత-
   
    "సాయంత్రం ఐదుగంటల కల్లా నాన్నగారు తమ్ముడు యిద్దరూ వస్తారు. మన కుటుంబం అంటే మనమిద్దరమే కాదుగా? నలుగురం ఉండగానే నా నిర్ణయాన్ని తెలియజేస్తాను. అప్పటి వరకు నన్ను ఒంటరిగా వదిలెయ్" గంభీరంగా అంది మేఖల.
   
    కూతురు మోములో తొంగి చూసిన సీరియస్ నెస్, ప్రవర్తనలో కనిపించే హుందాతనాన్ని మాటల్లో కనిపించే పరిపూర్ణత్వాన్ని చూసిన ఆదిలక్ష్మి మారు మాట్లాడకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది.
   
    మేఖల తన గది తలుపులు వేసుకొని గదిలో ఒంటరిగా మిగిలిపోయింది.
   
                    *    *    *    *    *
   
    మధ్యాహ్నం మూడు గంటల సమయం.....
   
    ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో అభిరామ్ తన మిత్రబృందంతో కొలువు తీరి వరల్డు సీరీస్ వన్ డే మ్యాచ్ తిలకిస్తున్నాడు.
   
    అభిరామ్ మొండివాడు అని కొందరంటే మూర్ఖుడని మరి కొందరు అంటుంటారు.
   
    అపరిమితమైన బలవంతుడని కొందరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, అందమైన మనస్సు కూడా వుందని మరికొందరు అనుభవంలో రుజువైంది.
   
    అతనికి చదువంటే చిరాకు.
   
    క్లాసులో బుద్దిగా కూచోవడం అంటే అసహనం.
   
    చదివిందంతా గుర్తెత్తుకుని వ్రాయడమంటే మంట.
   
    ఎప్పుడూ సరదాగా తిరగటం, సహవాసాలు చేయటం, కళ్ళెదుట జరుగుతున్నది అన్యాయం అని అనిపిస్తే విరుచుకుపడటం మహా ఇష్టం.
   
    అభిరామ్ కి కండబలం వుంది. దానికి మించిన ధైర్యముంది. పిరికి తనం తెలీదు. భయమంటే నవ్వుతడు. చదువైతే రాలేదుగానీ తనను తాను రక్షించుకుంటూ శత్రువును ఎలా దెబ్బతీయాలో బాగా తెలుసు. ఆ విషయాల్లో అతని మెదడు షార్ప్ గా పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. అతనెక్కడున్నా నలుగురు అతని వెనుక చేరిపోతారు. ఎందుకంటే వాళ్ళకే ప్రమాదం వచ్చినా అతను కాపాడుతహడు. ఆ సందర్భంలో ప్రాణాన్ని కూడా లెక్కచేయడు. అది తెలిసి కొంతమంది తమ రక్షణకోసం అతని వర్గంలో చేరితే, మరికొంత మంది అంతటి బలవంతుడు మాకు మిత్రుడు తెలుసా అని గర్వంగా చెప్పుకొనేందుకు చేరతారు.
   
    లెక్చరర్స్ అతన్ని అభిమానంగా పలకరిస్తారు. ప్రిన్సిపాల్ అతన్ని బావున్నావా అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు.

    కాలేజీ కమిటీ వారు అప్పుడప్పుడు అతన్ని టీ పార్టీలకు స్పెషల్ ఇన్ వైటీగా పిలుస్తుంటారు.

 Previous Page Next Page