రాధ లేత నడుం కలుక్కుమంది. విరిగింది.
మళ్ళీ లేచింది దుర్గేష్ కాలు.
బాధ, భయం తనను ముంచేస్తుండగా "అమ్మా...." అని కేకేసింది రాధ.
కాలితో ఇష్టం వచ్చినట్టు తన్నాడు దుర్గేష్. చేత్తో కొట్టాడు.
ఆ సమయంలో అతనికి ఎదురుగావున్నది తనకన్న కూతురని గుర్తుకు రావడంలేదు. తన శత్రువు కొడుకుతో కులికిన ఆడదానిలా మాత్రమే కనబడుతోంది ఆ అమ్మాయి.
మళ్ళీ కొట్టాడు దుర్గేష్. మళ్ళీ కొట్టాడు. మళ్ళీ....మళ్ళీ....మళ్ళీ....
ఊపిరందడం లేదు రాధకి. గుక్కతిరగడం లేదు.... అయినా చావు కేకలు పెడుతోంది.
"నాన్నా....నాన్నా చచ్చిపోతాన్నాన్నా! నన్ను చంపొద్దు నాన్నా! నాన్నా....నాన్నా.... అమ్మో....అమ్మా....అమ్మా.... అమ్మో....అమ్మో.... అమ్మో....అమ్మొమ్మొ....నాన్నా నన్ను చంపొద్దు...."
కొట్టడం ఆపలేదు దుర్గేష్. సుత్తితో కొట్టినట్లు దెబ్బలు, గునపం దిగేసినట్లు తాపులు....
క్రమ క్రమంగా రాధ రోదన బలహీనమయిపోయింది. అప్పటిదాకా దుర్భరమైన బాధ భరించలేక విలవిల్లాడుతున్న ఆమె శరీరంలో కదలికలు ఆగిపోయాయి.
నిశ్చలంగా అయిపోయింది ఆమె శరీరం.
కసి తీరినట్టు కాలితో ఇంకో రెండు తాపులు తన్ని రొప్పుతూ ఆగాడు దుర్గేష్.
కళ్ళప్పగించి ఇదంతా చూస్తున్నాడు. అతని అనుచరుడు ఫిలిఫ్స్. చూయింగ్ గమ్ నములుతున్న అతని దవడలు కదలడం మానేశాయి.
తన బాస్ కన్నకూతుర్నే కటికవాడిలా చంపేశాడన్న నిజం నెమ్మదిగా అతని మెదడులో యింకింది.
"నీ....ఏం చూస్తున్నావురా? ఇద్దర్నీ కలిపి కట్టి తగలేయ్" అని అరిచాడు దుర్గేష్ ఒక్కొక్క అక్షరాన్ని ఉమ్మేస్తున్నట్టు.
అలా ఆర్డర్ ఇచ్చి తర్వాత వెనక్కి తిరిగి నడిచి కొంచెం దూరములో ఆగి వున్న అంబాసిడర్ కార్లో కూర్చున్నాడు అతను.
కారు కదిలింది. కారు కదిలి వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ ఫిలిప్స్ దవడలు కదలటం మొదలెట్టాయి. చూయింగ్ గమ్ నముల్తూ తనకి చాలా అలవాటయిపోయిన పని చేస్తున్నట్టు అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసి అయిదు నిమిషాల తర్వాత జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు ఫిలిప్స్.
పెదిమల మధ్య ఉన్న సిగరెట్ అంటించి, దమ్ముపీల్చి ఆ తర్వాత వెలుగుతున్న అగ్గిపుల్లని ఆ అభాగ్యుల శరీరాల మీద పడేశాడు ఫిలిప్స్.
చితుకులు అంటుకున్నాయి. చితితోపాటు అంటుకుంది ఆ రాక్షస రాజ్యంలో రావణ కాష్టం!
* * * *
ఢిల్లీ: పాలం ఎయిర్ పోర్ట్ :
బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడి ఉంది డాక్టర్ సుధారాణి.
వాచ్ చూచుకుంది.
తొమ్మిదవుతుంది టైము. కనీసం ఇంకో గంటలో తను హాస్పిటల్లో వుండాలి.
ఈ క్యూని చూస్తే టిక్కెట్ దొరికేసరికి గంటపైన పట్టేటట్టుంది.
అసహనంగా కాస్త వెనక్కి తిరిగి తన లగేజ్ ఉంచిన స్థలం వేపు చూసింది సుధ.
క్యూకి కాస్త దూరంలో ఉంది తన బ్యాగ్. దానితోపాటే ఉంది చిన్న బ్రీఫ్ కేస్.
వాటిని తను ఇంకొంచెం దగ్గరగా పెట్టుకుంటే బావుండేదేమో అనిపించింది సుధకి.
బ్రీఫ్ కేస్ లో బట్టలున్నాయి. అవి పోయినా పర్వాలేదు.
కానీ బ్యాగ్ లో మందులున్నాయి.
చాలా విలువైన మందులు....
ఖరీదు కాదు ముఖ్యం. ప్రాణాలను రక్షించే మందులవి!
అవి పోతే కష్టమే.
వెళ్ళి వాటిని తెచ్చేసుకుని తన దగ్గరే పెట్టుకుంటే....
క్యూ వేపు మళ్ళీ అసహనంగా చూసింది సుధ.
వరుసగా నాలుగైదు ఫ్లయిట్స్ కాన్సిల్ అయ్యాయి ఇవాళ. బాడ్ వెదర్. అంచేత ఎయిర్ పోర్ట్ లో అంతా గందరగోళంగా ఉంది. అందరూ ఆత్రుతగా వున్నారు. క్యూ సరిగ్గా మెయిన్ టెయిన్ కావడంలేదు.
ఈ క్యూలో నుంచి ఒక్కసారి తను బయటికి గనక వెళ్ళిందంటే తన ప్లేస్ పోయినట్టే. ఆ తర్వాత ఇంక తనకి టిక్కెట్ దొరకడం దాదాపుగా ఇంపాసిబుల్!
అసలు తనకివాళ బుర్ర పనిచేయడంలేదు. అంతా కంగారు కంగారుగా వుంది. లేకపోతే అంతదూరంలో ఎందుకు పెడుతుంది లగేజ్ ని?
పొద్దున లేచీలేవగానే ఈ టెలిగ్రాం వచ్చింది.
దాంతో అంతా టెన్షన్ ....
ఆ టెలిగ్రాం కళ్ళముందు మెదిలింది.
"ఎమర్జెన్సీ స్టార్ట్ ఇమ్మీడియెట్ లీ"
__ ఎలెక్షన్ రెడ్డి.
గుర్తు రాగానే గుబగుబలాడింది డాక్టర్ సుధ మనసు.
ఎమర్జెన్సీ!
ఏం ఎమర్జెన్సీ?
ఈ ఎలెక్షన్ రెడ్డి తన తండ్రికి రైట్ హ్యాండ్ లాంటివాడు. ఇదివరకు ఆ ప్లేసులో ఫిలిప్స్ అని ఒకడు ఉండేవాడు. తన అక్కయ్య రాధారాణి చావు తర్వాత జరిగిన సీరియల్ మర్డర్స్ లో భాగంగా ఫిలిప్స్ ని దారుణంగా చంపేశారు. ఎదుటిపక్షం వాళ్లు. అతన్ని ఒకే బస్తాలో వేసి బస్తా నిండా కొత్త సున్నం కూర్చి దిగుడుబావిలో పడేశారు. నీళ్లు తగలగానే కొత్త సున్నం కుతకుతలాడి తెర్లడం మొదలుపెట్టింది. ఆ వేడికి ఉడికిపోయింది ఫిలిప్స్ శరీరం.
ఆ తర్వాత ఫిలిప్స్ ప్లేస్ లోకి వచ్చాడు ఈ ఎలెక్షన్ రెడ్డి.
అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరేట అది!
చాలా చిత్రమిన్ పేరు.
ఎలెక్షన్ రెడ్డి యమదూతలాంటివాడు.
అతనెక్కడుంటే అక్కడ చావు కబుర్లు, చిత్రహింసలూ తప్ప మరోమాట వుండదు.
అతని దగ్గరనుంచి వచ్చింది ఇప్పుడీ టెలిగ్రాం.
టెలిగ్రాం అతనెందుకొచ్చాడు?
నాన్న ఎందుకివ్వలేదు.
కళ్ళు గట్టిగా మూసుకుంది సుధ.
తన కుటుంబం ఎలాంటిదో, తన తండ్రి ఎలాంటివాడో, తన అక్క రాధారాణి, ఆమెని ప్రేమించిన రాజూ ఎలాంటి దారుణమైన చావు చచ్చారో, వాళ్ళ చితినిప్పు రావణకాష్టంలా రాజుకుని ఎన్ని ప్రాణాలని బలి కోరిందో, ఫలితంగా తమ కుటుంబంలో ఎంతమంది చనిపోయారో, తన తండ్రికి ప్రత్యర్ధి పక్షమైన మరిడేశ్వరరావు గ్యాంగులో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో అంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది సుధకి.
పగలు.
ప్రతీకారాలు.
ద్వేషం.
విద్వేషం.
హత్యలు.
ప్రతిహత్యలు.
మళ్ళీ ఇప్పుడో కొత్త ఎమర్జెన్సీ!
ఎవరికి ఏం జరిగి వుంటుంది!
ఈసారి ఎవరి వంతు!
తన తండ్రా, తమ్ముడా, తల్లా, మరెవరైనా బంధువులా, హితులా, సన్నిహితులా?
ఎవరు?
మెదడు మొద్దుబారిపోయినట్టయ్యింది సుధకి.
అస్తవ్యస్తంగా ఉన్న క్యూ వంకరటింకరగా కొద్దిగా ముందుకు జరిగింది.
ముందుకు అడుగేస్తూనే వెనక్కి తిరిగి చూసింది రాధ.
ఇప్పుడు ఆ యాంగిల్ నుంచి చూస్తే లగేజ్ అసలు కనబడటం లేదు. మధ్యలో ఒక స్థంభం లాంటిది వుంది. అది అడ్డం వస్తోంది చూపుకి.
వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటే?
క్యూ మరింత ముందుకు జరిగింది.
అప్పుడు చటుక్కున రంగంలోకి ప్రవేశించాడు ఒక వ్యక్తి. రాష్ గా వున్నాడు చూడ్డానికి. అందరినీ నెట్టుకుంటూ మొరటుగా ముందు కెళ్ళిపోయాడు.
వళ్లు మండింది అక్కడున్న అందరికీ.
పెద్దగొంతుతో ఎవరో ఏదో అనబోయారు.
చిన్న గొంతుతో ఇంకెవరో సర్ది చెప్పారు.
"అతనెవరో తెలుసా? బిర్యానికి బాడీగార్డు! గొడవ పెట్టుకోవద్దు."
దాంతో అందరి నోళ్ళూ చచ్చుబడిపోయినట్టు అయ్యాయి.
బిర్యాని అంటే బడా స్మగ్లరు. స్వచ్చమైన బర్మీస్ హెరాయిన్ వ్యాపారంలో అతనిప్పటికే ఆరొందల కోట్ల ఆస్తి వెనకేశాడు.
ఆ బిర్యానికి ఇతను అనుచరుడు.
ఏదో దుష్టశక్తి వచ్చి తం మధ్య దూరినట్లు అందరూ భయంతో నీలుక్కుపోయారు.
అలా అందరి మొహాల్లో ఆందోళన కనబడుతుంటే డాక్టర్ సుధ మాత్రం యధాలాపంగా ఒక్కసారి అతనివైపు చూసి తర్వాత తల తిప్పుకుంది.
ఆమెకిలాంటి వ్యక్తులు కొత్తకాదు.