Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 3

    కాసేపు అరచి వాళ్ళు వూరుకుండిపోయారు.

    "నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. నేను మీ మనిషిని, మీ సోదరిని. అన్నలారా!" అంది పద్మిని.

    వాళ్ళ మాటల్ని జీర్ణించుకోవడానికి కొద్ది సమయం పట్టింది. సమ్మె చేయడానికి మొదట ఉత్సాహపడ్డారు గాని సమ్మె చేస్తుంటే కడుపుకాలటం తప్పించి ఫలితం కించిత్ కనిపించలేదు. సమ్మె మానేస్తే యజమానికి లోకువై పోతామని భయం. సూరిబాబులాంటి కొందరు రౌడీలు పట్టుబట్టి కూర్చున్నారు. ఇటు సమ్మె విరమించలేక అటు సమ్మె చేయలేక మనసులో కొట్టుమిట్టాడుతున్న సమయంలో యజమాని కూతురు వచ్చి అలా మాట్లాడటం వాళ్ళకి వింతగానే కాదు చాలా తమాషాగా కూడా వుంది.

    అమ్మాయిగారు అందంగా వుంది. మాటలు చూడబోతే ముద్ద ముద్దగా ముచ్చటగా వున్నాయి. చెప్పేదింటే ఏం బోయిందిలే! అనుకొని ఎవరికివాళ్ళు మిన్నకుండి పోయారు.

    "నేను మా డాడీతో __ సారీ__ నేనింట్లోంచి బైటికొచ్చేశాను. నేనిప్పుడు డాడీని డాడీ అనకూడదు. మీలో చేరిన నేను మధుసూదనరావుగారిని యజమానిగానే గౌరవించాలి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీలో చేరిన నాకు మీతోపాటు సమ్మెచేస్తూ మీ కోర్కెలు నెరవేరాలని యజమానితో పోరాడుతాను__" పద్మిని ఏకబిగిన అయిదు నిమిషాలు మాట్లాడింది.

    జరిగేది యధార్ధమో! నాటకమో! తెలియదుగాని కొంతవరకు అర్ధమైంది ఏంటంటే యజమానినించి యజమాని కూతురు విడిపోయి యజమానిమీదనే కత్తిగట్టి తమ పక్షంజేరి మాట్లాడుతున్నదని యెంతో కొంత అర్ధమైంది.

    పుట్టినరోజునాడు, పండగలనాడు స్వీట్లు పంచడానికి రావడం తప్పించి ఎప్పుడూ తమ దగ్గరకి రాని ఎప్పుడూ తమ కష్టసుఖాలు తెలుసుకోని మనిషి ఈ రోజు తమవైపు చేరటం చిత్రాతి విచిత్రంగా వున్నా ఇదేమిటో చూద్దామనుకొని వాళ్ళు తగ్గారు.

    "మేమడిగిందానికి మీరు సమాధానం యివ్వాలి" సూరిబాబు ముందుకొచ్చి అన్నాడు.

    "యిస్తాను" స్థిరంగా పలికింది పద్మిని.

    "మీరు మీ నాన్నగార్నించి విడిపోయి లక్షల్ని వదిలేసుకొని మాలో ఎందుకు చేరాలనుకుంటున్నారు మా మీద జాలా!"

    "జాలికాదు"

    "మరి?"

    "దీన్ని జాలి అనరు. సాటి మానవుని మానవునిగా గుర్తించి చేయూత నివ్వటం అంటారు. మాకు అంతులేని ఐశ్వర్యం వుంది. మీరంతా శ్రమజీవులు కష్టపడితేగాని కడుపునిండని పేదజీవులు. మీ కోర్కె న్యాయం అనిపించి నేను మా డాడీతో పోట్లాడాను. ఈ ఒక్కసారికి వారి కోర్కెలు మన్నించండి అన్నాను. కాని మా దాడి నా మాట వినలేదు. అటు నా మాటా వినక యిటు మీ మాటా వినకపోవడంతో నా మనసుకు కష్టం తోచింది. నేను వెళ్ళిపోతానని డాడీతో చెప్పాను. వెళ్ళిపొమ్మని వారు ఆశీర్వదించారు మీరందరూ బతకంగా లేంది ఈ విశాల ప్రపంచంలో నేనొక్కదాన్ని బతకలేనా అని ఇటు మీ దగ్గర కొచ్చేశాను. ఇప్పుడు మీలో నేనూ ఒక మనిషిని " అదేదో తెలుగు సినిమాలో హీరోయిన్ లా ఫోజుపెట్టి మరీ చెప్పింది పద్మిని.

    యజమాని కూతురు చెప్పిన మాటల్లో నిజం ఎంత వుందో వాళ్ళకి తెలీదు. అయినా వాళ్ళు కాసేపు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి పద్మిని ప్రియదర్శినీని తమలో చేరడానికి ఒప్పుకున్నారు.

    వెర్రి వేయివిధాలన్నట్టు అందరూ ఒక్కసారిగా "అమ్మాయిగారికి జై!" అన్నారు.

    వాళ్ళందరికి యజమాని తరువాత నిజమయిన యజమాని పద్మిని ప్రియదర్శినియే. వాళ్ళంతా అక్కడ పనిచేస్తున్నంతకాలం అమ్మాయిగారు అనాల్సిందే. అమ్మాయిగారికి జై అనాల్సిందే. ఇప్పుడు పద్మిని బయటకు రావడం వల్ల మరో రకంగా జై అన్నారు. కాని పద్మిని ఆ సత్యం గ్రహించే స్థితిలో లేదు. అప్పటికప్పుడే వాళ్ళందరి తరపున నిలిచి న్యాయం కోసం పోరాడుతున్న ఉక్కు మహిళలా తనకి తానే అనిపించింది. చాలా సినిమాల్లో హీరోయిన్ లు కళ్ళముందు గిర్రుగిర్రున తిరిగారు.

    "ఇది నాటకంగాని నిజంగాని. ఈ పిట్టని గట్టిగ పట్టి వుంచాలి" సూరిబాబు మనసులో అనుకున్నాడు.

    మధుసూదనరావు యింటిముందు గేటుకి అవతలగా టెంట్లు వేసుకొని వర్కర్స్ అంతా కూర్చుని వున్నారు.

    ఇప్పుడు పద్మిని కూడా వాళ్ళ మధ్య కూర్చుంది.

    అప్పుడే ఎండాకాలం ప్రవేశిస్తున్నది ఆ కొద్ది ఎండ కూడా తన ప్రభావాన్ని తీవ్రంగా చూపుతూ వుంది.

    ఎ.సి. రూముల్లో తప్ప పద్మిని ఎప్పుడూ ఎండ వేడిని భరిస్తూ టెంట్లలో కూర్చోలేదు. బీదవాళ్ళంతా చెడ్డవాళ్ళు కారు. అపరిశుభ్రంగా వుంటారనీకాదు. వాళ్ళూ నీళ్ళు పోసుకుంటారు, ఉతికిన బట్టలు కట్టుకుంటారు.

    అయినా వాళ్ళు వాడేది పరిమళ భరితమయిన సోపులు కావు, వాళ్ళు ధరించేది సర్ఫ్ తో ఉతికిన బట్టలు కావు. పెర్ ఫ్యూమ్ వాసనలకి వాళ్ళ జీవితాలు బహుదూరం. మంచి గంధం కూడా అందుబాటులో లేని విషయం. అలాంటివాళ్ళ శరీరాల మీదనించి వచ్చేది అచ్చమైన చెమట కంపు.

    సూర్యభగవానుడు పైకి వస్తున్నకొద్దీ అక్కడున్న అందరూ చెమటతో తడిసిపోతున్నారు. దాంతో ఆ ప్రదేశమంతా ఇంపైన కంపు ఆవరించింది. అలవాటయిన వాళ్ళకి ఏ కంపూ రావడంలేదు గాని పద్మినీకి మాత్రం కడుపులో తిప్పటం మొదలుపెట్టింది.

    "ఏమిటీ కంపు ఎక్కడ్నుంచి వస్తోంది?" పద్మిని అడిగింది.

    "కంపా! ఏం కంపూ రావడం లేదే? ఏరా యెల్లిగా! నీకేమన్నా వస్తున్నదిరా?" తాతబ్బాయ్ పక్కవాడిని అడిగాడు.

    "నిన్న తిన్న చాపలకూర అరిగి చావలా. ఇప్పుడే తెస్తాను. ఆ వాసన వచ్చుంటుందిరా" యెల్లిగాడు యికిలిస్తూ సమాధానమిచ్చాడు.

    "నీ మొహానికి చాపలకూర కూడాను. మట్టగిడన మాటలూ పీత మొహమూనూ!" అంటూ ముద్దుగా తిట్టాడు యింకోడు.

    దాంతో వాళ్ళంతా ఫక్కున నవ్వుకున్నారు.

    వాళ్లు ఎందుకు నవ్వుకుంటున్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏమిటో పద్మినీకి అర్ధం కాలేదు. అందరి మొహాలు చూస్తూ కూర్చుంది.

    ఆడవాళ్లు, యింట్లో వున్న పిల్లలు ఈ సమ్మెలో పాల్గొనలేదని, వాళ్ళ దోవన వాళ్ళు పని పాటలు చేసుకుంటున్నారని వీళ్లు మాత్రమే సూరిబాబు మాటలు విని సమ్మెలోకి దిగారని ఊహామాత్రంగా కూడా తెలీని పద్మిని వాళ్ళకోసం అలాగే కూర్చుండిపోయింది.

    పాలుగారే పద్మిని మోము ఎండకి తోలు వలిదిన కందగడ్డలా ఎర్రగా మారింది. చెమటతో దుస్తులు తడిసిపోయాయ్. హాయిగా డన్ లప్ పరువుమీద పడుకొని ఏ నవలో చదువుకోక ఇలా కూర్చున్నందుకు కొత్త శక్తి రాకపోగా నిలువునా నీరసం ముంచుకొచ్చింది. వడిలిన తోటకూర కాడలా అయింది పద్మిని పరిస్థితి.  

 Previous Page Next Page