Previous Page Next Page 
రుధిర మందారం పేజి 4

    రూమ్ లోకి రాంగానే పాంటు, షర్ట్, కోటు విప్పి మూలగా విసిరేశాను. గాయాలనుంచి రక్తం ఇంకా స్రవిస్తూనే ఉంది. బనీను, కర్చీఫ్ రక్తంతో తడిసిపోయాయి.
    "అదేమిటి?" చూ నన్ను చూస్తూ గాభరాగా అన్నాడు.
    "కనపడటంలా రక్తం. లేచిన వేళ బాగుంది. ఆ ఇడియట్, తుపాకీ కళ్ళు మూసుకుని గురి చూచి కాల్చగలడు. కాని...ఈ పనికర్ కళ్ళు మూసుకుని తప్పించుకోగలడు. తుపాకీ గుళ్ళు శరీరంలోంచి దూసుకుపోలేదు. రాచుకుమ్తూ పోయాయి. ఫరవాలేదు. ఇది నాకో లెక్కకాదు." కాటన్ రక్తం తుడుచుకుంటూ అన్నాను.
    "అసలు తుపాకీ యెందుకు కాల్చారు? యెవరు కాల్చారు? నాకేం అర్ధం కావటం లేదు!"
    "కొన్ని విషయాలు అర్ధం కాకపోవటం, మరికొన్ని తెలుసుకోకపోవటం మంచిది." కటినంగా అన్నాను.
    వాంగ్ యీచూ నిర్ఘాంతపోయి అలా నిలబడిపోయాడు.
    తాపీగా గాయం చుట్టూ వున్న రక్తం తుడుచుకుని, గాయం మీద మందు, కాటన్, గాజుగుడ్డవేసి, డ్రస్ చేసేశాను. తొడకి నేనే ఇంజక్షన్ చేసుకున్నాను. లుంగీ, పల్చని షర్ట్ ధరించి చూ వైపు తిరిగాను. "వేడి టి ఓ కప్ పంపించండి" అన్నాను మంచంమీద కూర్చుని.
    "నన్నెందుకు పిలిచినట్లు రమ్మని?"
    "టీ తాగి చెపుతాను."
    మారు మాట్లాడకుండా చూ కిందకు వెళ్ళాడు. టీ కప్పుతో పదినిమిషాల్లో లోపలికివచ్చాడు.
    "మీకోసం మళ్ళీ ఎవరో వచ్చారు. మా హోటల్లో మీరు చెపుతున్న ఆనవాళ్ళు పేరుగల ఎవరూ లేరంటే నమ్మటంలేదు. తన పేరు రతన్ అని చెప్పాడు. పైగా రతన్ అనే అతనొచ్చాడని పనికర్ తో చెపితే చాలు రమ్మంటాడని కూడా అన్నాడు" చూ వివరంగా చెప్పాడు.
    "ఊహు, నే అనుకున్న దానికన్నా ముందే వచ్చేశాడన్నమాట. గుడ్, వెంటనే వెళ్ళి రతన్ ని పైకి పంపండి" అన్నాను.
    చూ వెళ్ళిపోయాడు కిందకు.
    రతన్ గదిలోకి రాగానే తలుపులు వేసి గడియ బిగించాడు.
    నేనేం మాట్లాడలేదు.
    "నీ విక్కడున్నట్లు నే ఊహించటంలో ఎంతమాత్రం పొరపడలేదు. ఎక్కడో ఉండవలసినవాడివి. చివరికి ఇక్కడ తేలావా పడేకర్?" అన్నాడు రతన్.
    "నా పేరు పడేకర్ కాదు పనికర్."
    "ఓహో పేరుకూడా మారిందన్నమాట!"
    "అవసరాన్నిబట్టి అన్ని మారిపోతాయి. నే యిక్కడున్నట్లు ఎవరు చెప్పారు? నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావ్? మళ్ళీ మనీ కోసమేనా? నీ శ్రమకి ఫలితం ఎప్పుడో అందజేశాను. పిచ్చిగా మళ్ళీ పచ్చనోటు అడక్కు. పదినిమిషాలలో పరలోకయాత్రకు సిద్ధం చేస్తాను నీదేహాన్ని."
    "నువ్వింతటి ఘనుడవని తెలుసు పడేకర్, నాకు కావలసింది పచ్చనోటు కాదు."
    "మరి...?"
    "చంద్రమణి...నీలికాంత...వుష్యరాగం, ఇంకా పేర్లు చెప్పనా?" రతన్ వ్యంగ్యంగా అన్నాడు.
    "గెటవుట్" కోపంగా పెద్దపెట్టున అరిచాను.
    "అరిస్తే నీ నోరే నొప్పి పుడుతుంది. కోపం తెచ్చుకుంటే నీ గుట్టు బయటపడుతుంది" రతన్ బెదిరింపుగా అన్నాడు.
    రయ్యిన మంచం మీద నుంచి లేచాను. సింహంలా రతన్ మీదకు దూకి ఓ చేతితో తలుపు గడియ తీశాను. రతన్ ని లాగి గదిలోంచి బయటకు తీసుకువచ్చాను. "మరోసారి నాకంటపడ్డానా? నీ బాబు పోయిన చోటికి పంపుతానురా బద్ మాష్, నాపేరు, నా ఉనికి, అదే ఇందాక కూశావ్ వాటి సంగతి అన్నీ మరిచిపో, నిన్ను చంపటానికి కత్తి, తుపాకీ అక్కరలేదురా నా ఎడంచేతి చిటికినవేలి గోరు చాలు" అని మెడపట్టి మెట్లవైపు ఓ గెంటు గెంటాను. 
    రతన్ నా తోపిడికి విసురుగా పడబోయి మేడ మెట్ల పక్కనున్న మెష్ పట్టుకొని నిలతొక్కుకున్నాడు. వాడు కసితీర నాలుగయిదు బండబూతులు తిట్టి వెళ్ళిపోయాడు.
    గిరుక్కున వెనుతిరిగాను.
    వాంగ్ యీచూ, భార్య చింగ్ చాంగ్ గోడపక్కగా ఒదిగి నుంచుని ఉన్నారు.
    "మీరిక్కడేం చేస్తున్నారు?" గర్జించి అడిగాను, చూ తడబడ్డాడు.
    చాంగ్ మటుకు "మీ గదిలో పెద్దగా మాటలు వినిపిస్తూంటే ఏమిటో అని వచ్చాము." అంది.
    "మంచిది ఇక్కడేం ఘోరం జరగలేదు. పిచ్చికుక్క వస్తే వెళ్ళగొట్టాను. ఇంక మీరు వెళ్ళవచ్చు" అని గదిలోకి వెళ్ళాను. నా వెనుకనే చూ - చాంగ్ వచ్చారు.
    "మీకూ మీ డబ్బుకి నమస్కారం. మీవల్ల మేము, మా హోటలు రచ్చ కెక్కేటట్లున్నాం. మీరు వేరే హోటల్ చూసుకోండి" అన్నాడు చూ.
    "రతన్ గాడికి నాకు ఎందుకు పోట్లాట వచ్చిందో మీకు తెలియదు. నా ప్రవర్తనకాదు మీరు చూడవలసింది మీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇలా మీరు చాటుగా పొంచుండి నా మాటలు వినడం ఏమిటి? రూమ్ ఇచ్చారు. రెంట్ పారేస్తున్నాను. మంచిది. నాకు ఈరూమ్ లో ఉండే యోగం నిండా పదిహేను రోజులు కూడా లేదన్నమాట...నాకు రూమ్ ఇచ్చినందుకు వెళ్ళేటప్పుడు మంచి విలువైన బహుమతి ఇచ్చిపోదామనుకున్నాను. ప్చ్. ప్రాప్తంలేదు మీకు ఓ.కె. రేపు రాత్రిలోగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతాను."
    "పోట్లాటలంటే భయం, అందుకని కాస్త గట్టిగా చెపుదామని వచ్చాను. మీరు రూమ్ ఖాళీచేసి పోవద్దు" అన్నాడు చూ.
    "నెల కాకపోతే నాలుగు నెలలుండండి" నమ్రతగా అంది చాంగ్.
    "నేను రతన్ మాట్లాడుకుంది మీరు విన్నారా?"
    "ఉహు."
    "సరే, రూమ్ ఖాళీ చేయను. మీకు కావలసిన డబ్బు ఇస్తాను. నావిషయం ఏదీ పట్టించుకోకండి. అది మీకూ నాకూ మంచిది. వీలయితే నాకు సాయం చేయటానికి ప్రయత్నించండి. ప్రతిఫలం బాగా ముట్టచెబుతాను. ఇహ మీరు వెళ్ళవచ్చు" అన్నాను.
    "మీవిషయం పట్టించుకోము. గోలలేవీ జరగకుండా చూడండి. అదే మాకు కావలసింది" చూ అన్నాడు.
    తల ఊపాను, సరే అన్నట్లు.
    వాంగ్ యీచూ, చింగ్ చాంగ్ రూమ్ లోంచి బైటకు వెళ్ళిపోయారు.

 Previous Page Next Page