Previous Page Next Page 
రుధిర మందారం పేజి 3

    మీల్స్ కి కిందకి వస్తూ నా గది తలుపులకు తాళంవేసి ఓ జేబులో వేసుకున్నాను. తాళం వేస్తున్న నన్ను చూచి పక్కగది గుమ్మంలో నుంచున్న చాంగ్ లోపలికెళ్ళింది.
    గదిలోంచి బైటకు వస్తే తలుపుకి తాళం వేస్తున్నాను. మొదట్లో అదిచూచి. "పైకి ఎవరూ రారు. గదికి తాళం వేయకపోయినా ఫరవాలేదు. నే చూస్తుంటాను" అంది చాంగ్.
    "నా అలవాటు కేపనీ విరుద్దంగా చేయను" అని గబగబ కిందకు వచ్చాను.
    అప్పటినుంచి చాంగ్ గదికి తాళం వేస్తుంటే బయటనుంచున్నది కూడా లోపలికి వెళ్ళిపోతుంది.
    నవ్వుకుంటూ కిందకు వచ్చాను.
    యాభై మందికి సరిపడ ఛయిర్స్ ఉంటే ఆ ఛయిర్స్ సగం నిండగా ఎప్పుడూ చూడలేదు నేను. ఈపూట మూడువంతులు ఛయిర్స్ నిండిపోయాయి. జనంతో బేరర్స్ చకచక అటూ ఇటూ తిరుగుతున్నారు.
    ఓ పక్కగా ఖాళీగా ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాను. ఎప్పుడూ నాకు సప్లయి చేసే బట్లర్ నాకు కావలసిన ఆహరం తెచ్చి నాముందు ఉంచాడు. తలవంచుకుని తింటూ కూర్చున్నాను, తలఎత్తి చూచి_తిరిగి రుచిగల మాంసాహారం తినటంలో పడ్డాను.
    చిన్న జిప్ బ్యాగ్ టేబుల్ మీద వుంచి అతను కావసినవి తెప్పించుకుని ఆతృతగా తినివేసి, బిల్ చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు కౌంటర్ వైపు.
    పది నిమిషాల తరువాత "టక్, టక్" తలుపు తడుతున్న శబ్దం వినవచ్చింది.
    లేచి వెళ్ళి తలుపులు తీశాడు.
    వాంగ్ యీచూ, అతని వెనుక భార్య చుంగ్ చాంగ్ నుంచుని ఉన్నారు.
    "మీతో మాట్లాడాలి. గదిలోకి వస్తాము"
    "ఇప్పుడా?"
    "అవును. ఇప్పుడే. అర్జంట్ గా మాట్లాడాల్సిన పని ఉంది."
    "ఒన్ మినిట్" అని వాళ్ళముఖానే తలుపువేసి లోన గడియ బిగించాను. లోపల సర్దవలసినవి సర్ది,పాంట్ జేబులో పిష్టల్ ఉంచుకుని తలుపులు తీసి, ఇరువురిని మర్యాదగా లోపలికి ఆహ్వానించాను.
    "మీరు చేస్తున్న పనులేవీ మా కర్ధంకావటంలేదు." ముఖం అడ్డు పెట్టుకుని చూ అన్నాడు.
    "నా పనులు మీకర్ధంకాక పోవటంవల్ల నాకూ, మీకూ ఎటువంటి నష్టంలేదే? ముఖ్యమైన లెక్క కాగితాలు చూచుకుంటున్నాను. మీరెందుకొచ్చారో చెపితే?"
    "మా హోటల్ మంచి పేరుతో నాలుగు కాలాలపాటు ఉండాలా? అక్కరలేదా?"
    "ఉండాలనే కోరుతున్నాను."
    "మరి...ఇందాక మీరేం చేశారు? అతనెవరో జిప్ బ్యాగ్ వదిలి వెళితే అది మీరు పైకి తీసుకువచ్చారు, నే గమనించాను. అతనెవరో తరువాత వచ్చి, మీ హోటల్లో దొంగలున్నారు బ్యాగ్ పోయింది అంటే హోటల్ అల్లరయిపోదా?"
    "ఓస్. ఆ విషయం గురించా మీరు అడగటానికి వచ్చింది? అతను రాడు.  వస్తే నా గదికి పంపండి, బ్యాగ్ ఇచ్చి పంపుతాను" గట్టిగా చెప్పాను.
    "ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి. అతనొస్తే నేనే అందజేస్తాను."
    "మీకా శ్రమక్కరలేదు. వెళ్ళండి."
    "మీ వరస నాకేం నచ్చలేదు." చాంగ్ అంది మధ్యలో కలగ జేసుకుని.
    "ఎందుకనో?" ఓరగా చూచాను చాంగ్ వైపు.
    చాంగ్ మాట్లాడలేదు.
    "నావల్ల మీ హోటల్ కి పేరు పోయినప్పుడుగాని, నేను ఏ రోజు రెంట్ ఆరోజు ఇవ్వనప్పుడుగాని మీరు నాతో గట్టిగా మాట్లాడకండి. మీకు కాని విషయాలలో మీరు తలదూర్చవద్దు. ఇక మీరు వెళితే నాపని చూచుకుంటాను."
    చూ, చాంగ్ లు ముఖముఖం చూచుకున్నారు. ఏమణుకున్నారో నెమ్మదిగా లేచి అయిష్టంగా గదిలోంచి బైటకు వెళ్ళారు.
                                         4
    తుపాకి తూటాలు కాలిపిక్కకు, జబ్బకు తగిలినచోట రక్తం కారకుండా, బనీనువిప్పి కలికి కర్చీఫ్ చేతికి కట్టాను. కుంటుకుంటూ హోటల్ లో ప్రవేశించాను. కోటు పాంటు ముదురు స్నఫ్ కలర్ ని కాబట్టి రక్తం అంటినా కనబడదు.
    కౌంటర్ ముందున్న టేబుల్ పై చెయ్యి ఆనించి, "నా కోసం ఎవరయినా వచ్చారా మిష్టర్ వాంగ్ యీచూ?" అడిగాను.
    "అదేమిటి కోటుమీద ఎర్రగా రక్తంలాగుంది? మీ ముఖం నీరసంగా వుంది? బజారు వెళ్ళి వస్తానని చెప్పినపుడు బాగానే ఉన్నారే?" చూ కంగారుగా నన్ను పరీక్షగా చూస్తూ అడిగాడు.
    "నే అడిగిందేమిటి? మీరు చెప్పేదేమిటి?" చూ ముఖంలో తీవ్రంగా చూస్తూ అడిగాను. 
   "అహ...ఆ...ఆ...మీరెళ్ళిన అరగంటకి ఒకతను వచ్చాడు. కుడికన్ను మెల్ల. పాలిపోయిన రంగుతో ఆరడుగులెత్తునున్నాడు. మీ రూపం వర్ణించి...అతని పేరు పడేకర్. మీ హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడా?" అని అడిగాడు.
    "స్టుపిడ్" పిడికిలి బిగించి అన్నాను.
    "ఆ?" చూ నోరు దాకలాగా తెరిచాడు.
    "మిమ్మల్ని కాదు మిష్టర్ చూ! ఆ స్టుపిడ్ నన్ను ఎతుక్కుంటూ వచ్చాడా? మీరేం చెప్పారు?"
    "మీరు చెప్పమన్నట్లే చెప్పాను. కావాలంటే రూమ్స్ అన్నీ చూడండి, మీరు వర్ణించిన రూపంగలవారు యెవరూ లేరు అన్నాను. అన్నట్లు అతను మీపేరు పనికర్ అని కాక పడేకర్ అని ఎందుకన్నాడు?"
    "యాడవను" గట్టిగా అని, పిడికిలి బిగించి బల్లమీద గుద్దాను.
    బల్లమీద వస్తువులు ఎగిరిపడ్డాయి. చూ భయపడుతూ కుర్చీకి అతుక్కుపోయాడు.
    "మీరొకసారి పైకి రండి మిష్టర్ చూ!" అని గబగబా నడవబోయాను. మేడ మెట్లవైపు కాలు పెట్టేసింది. కాలు ఈడుస్తూ మెట్లు ఎక్కి నా రూమ్ చేరాను.
    వాంగ్ యీచూ నా వెనుకనే వచ్చాడు మేడపైకి.  

 Previous Page Next Page