Previous Page Next Page 
రుధిర మందారం పేజి 5


                                           5
    రాత్రి పది గంటలయింది.
    మీల్స్ తీసుకోంగానే విశ్రాంతిగా పడుకుని పుస్తకం గాని, పేపర్ గాని ఓ గంట తిరగేసి నిద్రపోవటం ప్రశాంతంగా ఉన్నప్పుడు అలవాటు.
    టేబుల్ లైట్ తలవద్ద బల్లమీద పెట్టుకుని న్యూస్ పేపర్ తిరగేస్తున్నాను. నిద్ర ముంచుకొస్తున్నది.
    "వద్దు, వద్దు. అనుమతి లేనిదే లోపలికి వెళితే కోప్పడతారు. నీకే చెప్పేది" రూమ్ బైటనుంచి వాంగ్ యీచూ మాటలు గాభరాగా వినవచ్చాయి.
    పక్కగది తలుపు తీసిన చప్పుడయింది. అంటే చూ భార్య చాంగ్ తలుపులు తీసుకుని గది బైటకు వచ్చి వుంటుంది.
    "నా సంగతి తెలియదు. తలుచుకొన్నానంటే నల్లిని నలిపేసినట్లు నలిపేయగలను. పేను కుక్కినట్లు కుక్కగలను. చెయ్యివదులు వాడి ముఖం వాడు నన్ను కోప్పడేంతటి మొనగాడా?"
    నల్లి, పిల్లి, పేను మొదలయిన పేర్లు తరుచు ఎవరు వాడతారో గుర్తొచ్చింది. ఆ కంఠస్వరం గుర్తించాను. చటుక్కున లేచి దిండుకింద పిష్టల్ ని జేబులో వేసుకున్నాను. పిష్టల్ వున్న జేబులో చెయ్యిపెట్టి, లేచి నుంచున్నాను.
    వాంగ్ యీచూని తోసి పారేస్తూ లల్లూరాం నా రూమ్ లోకి జొరపడి, గుమ్మంలో ఆగిపోయాడు.
    నిద్ర పోయేటప్పుడు తలుపులేసుకోవచ్చని తలుపులు బార్లా తెరిచి ఉంచాను. అందువల్ల లల్లూరాం నా రూమ్ లోకి రాగలిగాడు.
    "అచ్చా భాయ్! కష్టం లేకుండానే కనపడ్డావు. పని కూడా అలాగే పూర్తి అయితే బాగుంటుంది కదూ?" అతను అన్నాడు.
    అతని వైపు కోపంగా చూడటం తప్ప, ఏమీ మాట్లాడలేక పోయాను.
    "ఉన్నట్లుండి ఇలా ముఖాముఖీ వచ్చి మాట్లాడుతానని మాట్లాడుకోలేదు కదూ భాయ్?"
    అప్పటికి నేను పెద్దగా కనపడలేదు. చూ వైపు చూచాను.
    "మేడపైన ఎవరూ లేరని చెప్పినా వినకుండా, నాకు కావలసిన వాడొకడున్నాడు. వాడి పేరు పనికర్ లేక పడేకర్ కావచ్చు. అసలు పేరు ఆ రెండూ కాదు. వాడి రూపం చూచి పేరు చెపుతాను, అంటూ నా మాట ఖాతరు చేయక మేడపైకి వచ్చేశాడు." తన తప్పేం లేదన్నట్టు చూ అన్నాడు.
    "బాగుంది భాయ్! పనికర్, పడేకర్ మంచి పేర్లే ఎన్నుకున్నావు. శోభనాద్రి, శంకర్రావ్ పేర్లు మోటుగా ఉన్నాయనా? ఈ పేర్లు తగిలించుకున్నావ్?"
    "లల్లూరాం! ఇది ఎగతాళికి సమయం కాదు. నువ్వెక్కడ దిగావో చెప్పు, రేపు అక్కడికి వస్తాను. మాట్లాడుకుందాం." శాంతంగా అన్నాడు.
    అతను పెద్ద పెట్టున నవ్వాడు.
    "అరె భాయ్! నీ సంగతి నాకు తెలియదా? నీటిలో మొసలివి. కలుగులో ఎలుకవు. మూలనున్న తేలువు. క్షణం కన్ను మూస్తే పాతిక మైళ్ళు దాటిపోతావు. నేను డిగిన చోటు చెబితే నా దగ్గరకు వస్తావా? ఏం వినయం? ఏం వినయం? బాగుంది. మంచి ప్లేస్ ఎన్నుకున్నావు. అందుకే నీ వెనుక బయలుదేరిన నేను నిన్ను పట్టటానికి పదిహేను రోజుల పైనే పట్టింది. అసలు విషయాని కొద్దాం. నీవూ నేనూ భాయ్ గా ఉంటే అగ్నికి వాయువు తోడయినట్లుంటుంది."
    "ఉహు, నిప్పుమీద పడ్డ ఉప్పులా వుంటుంది." చిటపట లాడుతూ అన్నాను.
    "ఆ తొందరే మంచిది కాదు. ఇప్పటికే ఆ రహస్యం చాలా మందికి తెలిసిపోయింది."
    "నాకేం భయం లేదు. వందమందికి తెల్సినా నన్నేం చేయలేరు."
    "ఫూల్ లా మాట్లాడకు. మనిద్దరం కలిస్తే మూడో వాడిని పట్టటం తేలిక, అప్పుడు కోట్లు మనవి."
    "ఉష్! నీతో నేకలవటంవల్ల కావాలని చేటు తెచ్చుకోటం. నీ దోవన నీవు ప్రయత్నించు. నా దోవన నేను ప్రయత్నించుతాను. యెవరికి ముందుగా మైకేల్ దర్శనమిస్తాడో, వాడిపంట పండినట్లే. నీ కంటపడ్డా నా కంటపడ్డా మైకేల్ ప్రాణంతో ఉండడు, నెక్ట్స్...మైకెల్ వద్ద దాగిన రహస్యం తెలుసుకున్నవాడే మరకత మాణిక్యాలకు అధిపతి. నాకే ఆ యోగం ఉంటుందనుకుంటున్నాను. నా దోవకి అడ్డం రాక నీ ప్రయత్నం నీవు చేసుకో. నీ ముఖానికి ఆ యోగ్యత పడుతుందేమో?" వ్యంగ్యంగా, నిర్లక్ష్యంగా తల ఎగరవేస్తూ అన్నాను.
    అతను చటుక్కున కోటు జేబులోంచి పిష్టల్ తీశాడు. నాకు గురి పెట్టాడు.
    "నీ వద్ద వున్న ప్లాన్ ఇస్తావా? స్వర్గానికి పంపనా? రెండే నిమిషాలు. జవాబివ్వు."
    "ప్లాన్ కాగితం దగ్గరుంచుకుంటానని ఎలా అనుకున్నావ్? నీ తెలివి ఏడ్చినట్లే వుంది. నన్ను చంపితే ఇటు కాగితం దక్కదు, అటు మైకేల్ గాడు అందడు. చూ! అతన్నేమీ చేయకు. ఉత్త బెదరిం..."
    "నాట్రిక్ పని చేసింది. లల్లూరాంతో మాట్లాడుతూ, మధ్యలో లల్లూరాం వెనుకగా ఉన్న వాంగ్ యీచూతో గాభరాపడుతున్నట్లు, అన్నాను.
    అతను గిర్రున వెనుతిరిగాడు. చటుక్కున పాంట్ జేబులో పిష్టల్ తీసి "ధన్, ధన్," మంటూ అతనిని కాల్చాను. అతను మొదలు నరికిన వృక్షంలా బోర్లా పడిపోయాడు. వీపులోంచి రక్తం కాలువలా వచ్చింది. సైలన్సర్ అమర్చిన పిష్టల్ కాబట్టి "సర్, సర్" అని చిన్న శబ్దం మాత్రమే అయింది.
    చూ "కెవ్" మని కేకవేశాడు. నా పిష్టల్ వాంగ్ యీచూ వైపు తిప్పాను.
    "మిష్టర్ వాంగ్ యీచూ! నోరుమూసుకుని, చేతులు పైకెత్తి లోపలికి రా. ఏయ్! చాటుగా ఉన్న శ్రీమతి చింగ్ చాంగ్, నువ్వూ ఇలా వచ్చేసెయ్యి, ప్రాణాలమీద ఏమాత్రం తీపివున్నా" అన్నాడు కరుగ్గా.
    వాంగ్ యీచూ, చింగ్ చాంగ్ భయపడుతూ రూమ్ లోపలికి లల్లూరాం శవాన్ని దాటుకు వచ్చారు.
    "చూ! ఈ శవాన్ని మాయచేయాలి. నాతో చేతులు కలపండి, ఎంత డబ్బయినా ఇస్తాను. తగలాల్సినచోటే తగిలి చచ్చాడు ముండాకొడుకు."
    "ధనమంటే ఆశయినా, ఇలా హత్యలు అవి దాచి సాయం చేయలేము. నావల్లకాదు. సాయంచేసినట్లే చేసి, నిన్ను పోలీసుల కప్పగిస్తే ఏంచేస్తావ్?" ఓ పక్క భయం భయంగా పిష్టల్ వైపు చూస్తూ అన్నాడు చూ.
    చింగ్ చాంగ్ దోసిట్లో ముఖం దాచుకొని ఏడ్వటం మొదలుపెట్టింది. అయితే ఏదో చిన్నగానే ఏడుస్తున్నది.
    "పోలీసులకి నన్నప్పగిస్తావా? మంచిది మిష్టర్ వాంగ్ యీచూ! పోలీసు డిపార్టుమెంట్ అంటే ఏమిటి? అధికారంలో ఉన్న దొంగలువాళ్ళు. లైసన్స్ బిళ్ళ లేని దొంగలం మేము. వాళ్ళకీ మాకూ అంతే తేడా? అసలు విషయం టూకీగా చెపుతాను. నా పేరు పనికర్ కాదు, అసలు పేరు చెపితే హడలిచస్తావ్! కాబట్టి నాపేరు అడగకు. పనికర్ అంతే. నేను ఈ ఊరు వంటరిగా రాలేదు. నా వాళ్ళు పాతికమంది దాకా వివిధ వేషాలలో ఈ రంగూన్ పట్టణంలో రకరకాల వృత్తులలో ఉన్నారు. ప్రతిరోజూ రెండోకంటికి తెలియకుండా ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటాము. నా ఆచూకీ, నా రహస్యం పోలీసులకు చెప్పి నన్ను జైలుపాలు చేయడం నీకు ఈజీమరి తర్వాత సంగతి? నా వాళ్ళు ఊరుకోరు. నన్ను జైలునుంచి తప్పిస్తారు. ఈ లోపలే నీది, నీ భార్యది, శరీరాన్ని అంగుళం, అంగుళం ముక్కలుగా కోసి కైమాచేసి నా మిత్రబృందం ఆరగిస్తారు. ఓకే, పోలీసులను పిలువు నాకేం భయంలేదు." 

 Previous Page Next Page