Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 3

    కామాక్షి పుట్టింట్లోనూ అంతగొప్ప జరుగుబాటు ఏమీలేదు కానీ వాళ్ళది నలిగిపోయిన సంసారం. కాకపోతే, వాళ్లకో సొంత ఇల్లు వుంది. ఇంట్లో మనుషులు అందరూ మంచివాళ్లు కాబట్టి ప్రశాంతత వుంది.

    ఇక్కడ, భర్త మనస్సుకి ప్రశాంతత చేకూరితే, ఏదో వుద్యోగం చూసుకుంటాడు. చిన్నదో పెద్దదో తన బ్రతుకు ఒడ్డున పడుతుందని, కామాక్షి ఆశ.

    కామాక్షి భర్తతో పుట్టింటికి వచ్చి, దగ్గర దగ్గర నాలుగు నెలలు కావస్తోంది ! పాండురంగలో మార్పురాక పోగా, మరింత దిగజారిపోయి అదొక రకం మనిషిలా తయారయ్యాడు.

    రాత్రి అనికాదు పగలు అనికాదు ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ వుండడం చేస్తున్నాడు. బయట చేస్తున్నది ఏమిటో కామాక్షి అడిగిన చెప్పలేదు. ప్రతి మాటా దాటేయటం, మనస్సులో వూరికే మధనపడటం.

    ఇది గ్రహించి,

    కామాక్షి భర్తను మామూలు మనిషిని చెయ్యడానికి ఎన్ని విధాలో ఓర్పుగా చూస్తోంది.

    ఫలితం మాత్రం కొంచెం కూడా లేదు.

    ఈ రోజు సాయంత్రం ఉప్మాచేస్తే తిని, కాఫీ తాగి నాలుగు గంటలకి బయటకి వెళ్లాడు.

    భర్త రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది కామాక్షి.

    సంసార సాగరంలో ఈది, బాగా అలిసిపోయి, బి.పి. పేషెంట్ అయింది మహాలక్ష్మమ్మ. కొత్తగా కూతురు సమస్య ఒకటి,

    తల్లీ, కూతురు ఇరువురికి తెలుసు. ఒకరి పరిస్థితి మరొకరు ఎత్తకుండా బాధని మౌనంగా పడుతూ పైకి ధైర్యంగా వుంటున్నారు.

    పాడురంగం రాత్రికి వస్తాడా? రాడా?

    ఆ విషయం ఇద్దరికీ తెలియదు.

    "నువ్వెళ్ళి పడుకోమ్మా! కాసేపు చూసి నేను అన్నం తిని పడుకుంటాలే, ఆయన రెండో ఆట సినిమాకి వెళ్లారేమో?" కామాక్షి నవ్వడానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తూ అంది.

    "నాకూ నిద్దర రావడం లేదమ్మా! పడుకొని లేచానేమో, నిద్రపట్టేటట్లు కనపడడంలేదు. పక్కమీద దొర్లీ, దొర్లీ విసుగుపుట్టి ఇటు వచ్చాను."

    ఇద్దరికీ తెలుసు తాము అబద్ధాలు ఆడుతున్నామని.

    అయినా పైకి మామూలుగా వుండి, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. భార్యను చూసి రావడానికి కొడుకు అత్తవారింటికి వెళ్లాడు.

    ఇంట్లో వీళ్ళిద్దరూ కాక, మూడో వ్యక్తి, ఇంటి యజమాని అయిన మాధవయ్య పగలంతా గుమాస్తాగిరీ వుద్యోగంలో కొట్టుకులాడి, అలసిపోయి గుర్రుపెట్టి నిద్రపోతూ ఆ నిద్రలో కాస్త ప్రశాంతత పొందుతున్నాడు.

    బయట అంతా బాగా చీకటి అలుముకొని వుంది.

    రాత్రిపూట కావడంవల్ల ఆ వీధి అంతా నిర్మానుష్యంగా వుంది.

    లయబద్ధంగా వినిపిస్తున్న మాధవయ్య గురు తల్లీ కూతుళ్ళ సంభాషణ తప్పించి, మరే శబ్దమూ వినిపించడంలేదు.

    సరిగ్గా పన్నెండూ ఇరవై నిముషాలకి.

    మహాలక్ష్మమ్మ అల్లుడిని చూసి లేచింది. ఆవిడ మంచి మనిషి కాబట్టి. నిష్టూరంగా మాట్లాడక, "నేను వెళ్ళి పడుకుంటాను. అబ్బాయికి అన్నం పెట్టమ్మా!" అని తన గదిలోకి వెళ్ళిపోయింది.

    పాండురంగ కామాక్షిని చూడగానే బాధవేసింది.

    "నా కోసం ఇంతవరకూ మేలుకుని కూర్చున్నావా కామూ!" లోపలికి వస్తూనే మొదటి ప్రశ్న వేశాడు.

    మీరు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? ఆకలి వేస్తున్నా భోజనం చెయ్యకుండా కూర్చున్నాను. ఇలాంటి సాధింపు మాటలేవీ కామాక్షి అనలేదు.

    "కాళ్ళూ చేతులూ కడుక్కురండి! భోజనం చేద్దాం!" అని వంటగదిలోకి వెళ్ళిపోయింది.

    పాండురంగం హృదయం మరోసారి బాధగా మూలిగింది.

    కామాక్షికి పసిపిల్లలంటే చాలా యిష్టం. ఆమెని తల్లిని చేయలేకపోయాడు. కనీసం తన వుద్యోగాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అన్ని విధాలా చెడి పుట్టింటికి చేరిన ఆడదానిలా తను అత్తవారింటికి చేరాడు....!

    అలా ఆలోచిస్తూ పాండురంగం గదిలోకి వెళ్ళి పాంటూ, షర్టూ విప్పి, లుంగీ బనీను కట్టుకుని పెరట్లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చాడు.

    భర్త వచ్చేసరికి కామాక్షి రెండు కంచాల్లో అన్నం కూరా వడ్డించింది. ఇద్దరూ మౌనంగా భోజనం చేసి లేచారు.

    అర్దరాత్రి, వేళతప్పీ తింటే ఏం సయిస్తుంది? పేరుకి భోజనం తిన్నాం అన్నట్లు భోజనం తిని లేచారు.

    ఆ రాత్రి పడుకున్న తరువాత.

    "వేళకాని వేళలో భోజనం చేస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు! మీరెంత నల్లబడ్డారో, చిక్కిపోయారో మీకే తెలియదు. జరిగిన దానిని గురించీ వూరికే బాధపడి చేసేదేమీ లేదు కదా! నాన్నగారు తెలిసిన వాళ్ళని అడిగి ఏదో ఒక చిన్నదో పెద్దదో వుద్యోగం చూస్తానన్నారు. అందరికీ అన్నివేళలా చెడ్డరోజులుండవు" కామాక్షి భర్త తల నిమురుతూ, "నేను ధైర్యంగా వున్నాను. మీరు కూడా ధైర్యంగా వుండండి" అనే ధోరణిలో చెప్పింది.

    "నాకు తెలుసు కామూ!" అన్నాడు పాండురంగం.

    మీరెందుకు ఆలస్యంగా వచ్చారు? అని కామాక్షి డైరెక్ట్ గా అడగనూ లేదు. నేను ఫలానా విషయం వలన ఆలస్యంగా వచ్చానని పాండురంగం చెప్పనూ లేదు.

    కావాలనే ఇద్దరూ ఆ విషయాన్ని వదిలేశారు.

    పాండురంగం నాలుగురోజుల క్రితమే. ఓ పెద్దదాంట్లో(?) వేలు దూర్చాడు. తన మొదటి ప్రయత్నమే సక్సెస్ అయ్యింది.

    ఈ విషయం కామాక్షికి చెప్పాలా వద్దా?

    ఇంతవరకూ భార్య దగ్గర ఏ విషయమూ దాచలేదు పాండురంగం.

    ఒకపక్క చెప్పాలని.

    మరోపక్క చెప్పకూడదని.

    అతను మనస్సులో ఈ విషయం గురించే తర్జన భర్జన పడుతున్నాడు. మధనపడుతున్నాడు కూడా.

    అతను చేస్తున్నదీ,

    కొంపలు అంటుకునేంత ప్రమాదకరమయిన పని.

    అయితే,

    ఆ కొంపలు అంటుకోకుండా వెంటనే ఆర్పటానికి వెనుక మనుషులు వున్నారు.

    మాటల్లోపెట్టి అసలు విషయం లాగాలని చూసింది కామాక్షి.

    అసలు విషయం దాచేసి మిగతా విషయాలు మామూలుగా మాట్లాడాడు పాండురంగం.

    ఆ రహస్యం అతనిలోనే దాగుండిపోయింది.

    మూసివున్న తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి.

    బోసుబాబు తలుపులు తీసుకుని హాల్ లోకి వచ్చాడు.

    అతని రాకకోసమే ఎదురుచూస్తున్నట్లుగా తల్లి, తండ్రీ, అన్నా, వదిన హాల్ లో కూర్చుని వున్నారు. పక్కగదిలోంచి సుమిత్ర కూడా వచ్చి పెద్దన్నగారి పక్కన కూర్చుంది. 

 Previous Page Next Page