"డైలాగ్ బాగుంది__మీ యింటికి ఎప్పటికప్పుడు వద్దామని అనుకుంటూ వుండటం, ఏదో ఒక అడ్డంకుతో ఆగిపోవటం."
"నీ సంజాయిషీ నాకేం అక్కరలేదు. రావాలనుకుంటే రావచ్చు."
"అలా అనకేవ్ పారూ! నింద నామీద వెయ్యకపోతే నీవేం రాచకార్యాలెలగ బెడుతున్నట్లు? నా సంగతి చూసు నిన్న శ్యామలవాళ్ళింటికి పేరంటానికి వెళ్ళాను. మొన్న జమునాబాయిగారింటికి వెళ్లాను, మహిళా మండలి విషయం మాట్లాడటానికి. అటుమొన్న రాధకు నొప్పులోస్తుంటే ఆస్పత్రిలో చేర్చి అక్కడే వున్నాను. క్రితంరోజు......"
"సినిమాకెళ్ళి వుంటావు" మాట పూర్తిచేసింది పార్వతి.
పార్వతి నవ్వులో శృతికలిపింది సరోజ.
సరోజ అదీ ఇదీ అని లేకుండా కబుర్లు చెప్పెస్తున్నది పైకి" ఊ" కొడుతున్నది పార్వతి.
"సరోజను మించిన స్నేహితులు ఎవరూ లేరు తనకు. ఆప్తమిత్రురాలయినా డబ్బు ఎప్పుడూ అడగలేదు. నోరు విప్పి తన సమస్యలు చెప్పుకోలేదు. ఇప్పుడు అడగకతప్పదు. వారు రావటం ఎన్నాళ్ళు పడుతుందో? పిల్లల పుస్తకాలు కొనటానికి డబ్బులు కావాలి. పుస్తకాలు లేకుండా బడికి రావద్దని మాష్టారు కోప్పడ్డారని రఘు చెబితే కళ్ళనీళ్ళు పెట్టుకోవటంతప్ప ఏం చేయలేకపోయింది. ఎక్కడ డబ్బడుగుతానో అని పిన్ని ముందే జాగ్రత్తపడి చెప్పింది."
"పారూ! నీ శరీరం యిక్కడాను మనసు ఎక్కడో వున్నట్టుంది." పార్వతి తను చెప్పేది వినటం లేదని గ్రహించి గట్టిగా అంది సరోజ.
"కాస్త డబ్బుకావలసి వచ్చింది సరూ," అంది నేల చూపులు చూస్తూ పార్వతి.
"ఎంతకావాలి? ఎందుకు?"
డబ్బు ఎంతకావాల్సిందీ, ఎందుకవసరమయినదీ.
చెప్పింది పార్వతి, తల ఎత్తకుండానే.
"ముష్టి పాతికరూపాయలు అడగటానికి ఇంత మొహమాటమా? ఇప్పటిదాకా ఎందుకాగావ్?" సరోజ చివాట్లు. సన్నసన్నగా పెట్టి పార్వతి కష్టసుఖాలు అడిగింది.
ఉబికివస్తున్న దుఃఖాన్ని వ్యర్ధప్రయత్నంతో ఆపుకుంటూ అన్నీ చెప్పింది పార్వతి.
అంతా విన్న తరువాత "నువ్వు బాధపడనంటే ఓ విషయం అడుగుతా పారూ" అంది సరోజ.
"బాధ......? దానికి పూర్తిగా అలవాటుపడ్డాను. నీవు బాధపడక అడుగు."
సరోజ కనుబొమలు ముడిచి పెదవి కొరుక్కుంటూ పార్వతివైపు చూస్తూ కూర్చుంది.
సరోజ చేతిని వడిలోకి తీసుకుని మెల్లగా నిమురుతూ "ఏమిటో, ప్రపంచమమతా తలక్రిందులయినట్లు ముఖం పెట్టావు!" అంది పార్వతి.
"మీవారు కథానాయకి వేషాలు వేసే రమామణిని పెళ్ళి చేసుకున్నారని వార్త. దానికి ఓ పిల్లాడు కూడానట, నీకు తెలుసా పారూ?"
"నువ్వు చెప్పింది నిజమేనా సరూ?" పార్వతి కంగారుగా అంది.
"నిజమైన వార్త. ఇందుట్లో అబద్ధం లేదు."
"వారు అలాంటివారంటే నమ్మలేకుండా వున్నా సరూ?"
"సరోజ తనకెలా వివరం తెలిసిందీ పూసగుచ్చినట్లు చెప్పింది పార్వతితో. అంతేగాక మధుసూధనం వూరినించి వచ్చిన తరువాత అడగవలసిందీ, చేయవలసింది బోధించి ధైర్యం చెప్పింది.
రక్తం లావాలా ఉడుకులెత్తుతుంటే, మనసులో అగ్నిపర్వతం పేలటానికి సిద్ధంగావున్నా, అన్నింటికీ తెగించిన దానిలా స్థిరంగా కూర్చుని వింది పార్వతి.
సరోజ యిచ్చిన పాతికరూపాయలు చెంగున కట్టుకుని, కొత్తగా తెలిసినవార్త మననం చేసుకుంటూ ఇంటికి బైలుదేరింది పార్వతి.
4
కాఫీ తీసుకుని గదిలోకి వెళ్ళబోతుంటే పార్వతికి అడ్డు తగిలింది వర్ధనమ్మ.
"నే అన్నానని కోపం తెచ్చుకోకు. లోకులనుకునేది చెప్పాను. అతగాడితో గట్టిగా చెప్పు. ఆడముండను ఇంత సంసారం యీదలేను. యీ బ్రతుకు బ్రతికేకన్నా నుయ్యో గొయ్యో చూచుకుంటాను. కళ్ళు మూసుకుంటే హరీ అనటానికి నిముషం పట్టదు."
"మెత్తగా చెప్పి నీవు తిట్టుకుంటున్నా ఆ మాటలన్నీ అన్వయించేది నాకే పిన్నీ? గ్రహించలేనంత మూర్ఖురాలిని కాదు." మనసులో అనుకుని పైకి "ఊ" కొట్టి కాఫీకప్పుతో గదిలో అడుగుపెట్టింది పార్వతి.
మధుసూధనం శేషతల్పంమీద విష్ణుమూర్తిలా తలకింద చేయి పెట్టుకుని మంచానికి నిండుగా పడుకొని పార్వతి రాకకోసం ఎదురు చూస్తున్నాడు. గుమ్మంలో పార్వతిని చూచి చిరునవ్వు నవ్వాడు.
మధుసూధనం నాటకంలో నటుడేకాదు! మామూలుగానూ నటుడే. నవ్వినా, మాట్లాడినా, నడిచినా, కూర్చున్నా ప్రత్యేకతతో చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటాడు.
"ఈ నవ్వే, నేను లొంగిపోవటానికి కారణం. కాదు-నా మెతకతనమే." అనుకుంది పార్వతి. మౌనంగా కాఫీ అందిచ్చింది.
"పారూ !"
"ఊ ..."
"దేవిగారికి నాపై కోపం వచ్చినట్లుంది? అరె.....మాట్లాడవోయ్, నోటి ముత్యాలేం రాలిపోవు. ఎప్పుడింటికొచ్చినా క్షణం కనుమరుగు అయ్యేదానివికాదు...వచ్చినప్పటినుంచీ చూస్తున్నా నానుంచి తప్పించుకుని తిరుగుతున్నావ్, ఇదంతా కోపమేనా? ఊ.....!" పార్వతిని దగ్గరకు లాక్కుని లాలనగా అడిగాడు మధుసూధనం.
"పిల్లలు చూస్తారు. చెయ్యి తియ్యండి." కంగారుగా గుమ్మంవైపు చూస్తూ అంది పార్వతి.
"భుజంమీద చెయ్యి వెయ్యకూడదా!"
పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. సామాన్య విషయంకూడా వాళ్ళను అమితంగా ఆకర్షిస్తుంది. పిల్లలు ఎదుగుతున్నారు. వారి బరువు బాధ్యతలు అవక్కరలేదు మీకు."
"అన్నీ చూచుకోటానికి నువ్వున్నావ్ కాదోయ్ పారూ" మధుసూధనం తేలిగ్గా అన్నాడు.