Previous Page Next Page 
మారనికాలంలో మారినమనుషులు పేజి 3

    "మొదట్లో తండ్రి" పోనీలేమ్మా పార్వతీ! అత్తగారింటికి వెళ్ళినంతమాత్రాన నీకొచ్చిన నష్టమేమిటి? మధునాటక సమాజం స్థాపించి ఊళ్ళు తిరుగుతున్నాడు. పట్టుమని నెలకునాలుగురోజులు ఇంటిపట్టునఉండడు. నీవెళితే వంటరిగా ఉండాల్సిందేకదా? ఇక్కడయితే నలుగురం వుంటాం." అంటూ సమర్ధించేవాడు. అప్పట్లో అదీ నిజమనిపించింది. తరువాత అది అలవాటుకింద మారింది.
    పేపర్లో భర్త ఫోటో పడినప్పుద్ "ఊరూఊరూ వచ్చి" గొప్ప కళాకారుడి భార్యవు. అదృష్టవంతురాలివని పొగిడిన వాళ్ళు పొగిడినట్టే వున్నారు .సందేశాత్మక విప్లవాత్మక నాటకాలు సొంతంగా రచించి ప్రదర్శించటంలో మంచిపేరు వచ్చింది. అకస్మాత్తుగా తండ్రి మరణం, పిల్లలు పెరిగిపెద్దకావటం, పిన్ని సాధింపులు, తనకి జ్ఞానోదయం అయింది.
    "ఒక గది చూడండి మీరు వచ్చినప్పుడే వద్దురుగాని, నే యీ ఇంట్లో వుండలేను" అని పేచీపెట్టుకుంది. ప్రాధేయపడింది. "ఉహు" తన కన్నీరు వారిని కరిగించలేదు.
    "వేరేవుంచి నిన్ను పిల్లలను పోషించే శక్తి లేదు. మొదటినుంచీ ఇక్కడే వున్నావు. మంచో చెడో ఇక్కడే వుండు" అన్నారు.
    తను అశక్తురాలు. పిన్ని అన్నట్లు వారిని చూడగానే కరిగిపోతున్నది. భర్తను కొంగుకు ముడేసుకునే తెలివితేటలు ఎంతమాత్రం లేవు. ఏదయినా అడిగితే సమాధానం వుండదు మాయమాటలు చెప్పి, జాలిగా ముఖంపెట్టి తన అవసరం తీర్చుకుని పోవటమే. యీ తఫా వచ్చినప్పుడు వూరుకో కూడదు, తాడోపేడో తేల్చాల్సిందే.
    "అమ్మా! అందరి నన్నగార్లలా మన నాన్నగారు ఇంట్లో ఉండరేమని ప్రశ్నించే పిల్లలు, తండ్రి సంపాదన తల్లి సొమ్ముదాచి అస్తమానం సాధించే పిన్ని. వింత జంతువుని చూచినట్లు తనను చూచే ఇరుగుపొరుగూ. ఇహతను భరించలేదు. తన పిల్లల భవిష్యత్తు వూహించి ముందు జాగ్రత్త పడుతున్నది పిన్ని. ఎదిగే తన పిల్లల భవిష్యత్తు మాటేమిటి? తాను జాగ్రత్తపడలేదు. కళ్ళుమూసుకొని ప్రవర్తిస్తున్నది. ఇప్పటికయినా, తన కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ఉహూ.....ఇంక యీ కళ్ళు మూతలు వేయను.
    ఓ నిశ్చయానికొచ్చిన పార్వతి తృప్తిపడి లేచి కూర్చుంది మంచంమీద నుంచి. 
    పక్కగదిలోంచి ఇంకా మాటలు వినపడుతూనే ఉన్నాయి. తనగురించి అయినా వినదలుచుకోలేదు పార్వతి.
                                         3
    "అమ్మా! నాన్నగారు వూరునించివచ్చి చాలా రోజులయిందికదూ?" పెద్దవాడు రఘూ గొప్పవిషయం ఆరాతీసిన మొనగాడిలా ముఖంపెట్టి అడిగాడు.
    చిరిగిన చీర కుడుతున్న పార్వతి ఉలిక్కిపడి తలఎత్తి రఘూ ముఖంలోకి చూసింది.
    "మీ నాన్నగారు వచ్చారా? అని సుబ్బరామయ్య మాష్టారు అడిగారమ్మా?" అన్నాడు రఘూ. తల్లి "ఊ" కూడా కొట్టకపోవటంతో తిరిగి__"రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. మా అమ్మకూడా రోజూ నాన్నగారి కోసం చూస్తూ వుందని, చెప్పాను" అన్నాడు రఘు.
    "ఊ - నన్ను విసిగించక అవతలికెళ్ళు" కసురుకుంది పార్వతి. బిక్కముఖం వేసుకొని బైటికి వెళ్లాడు రఘు.
    "అనవసరంగా కోప్పడ్డాను. యీ మధ్య అకారణంగా కోపం వస్తున్నది. పిల్లలమీద చిరాకుపడి ప్రయోజనం ఏముంది" అనుకుంది పార్వతి.
    "అయిసొచ్చింది, అయిదుపైసలివ్వమ్మా!" జారిపోతున్న లాగును పైకి లాక్కుంటూ కిష్టుడొచ్చాడు.
    ఆటలన్నా చిరుతిండన్నా కిష్టుడికి ప్రాణం. అక్క, అన్న, తల్లిని ఏడ్పించకపోయినా, ఆవార కిష్టుడు దేనికో దానికి పేచీపెట్టి పార్వతికి కళ్ళనీళ్ళు తెప్పిస్తుంటాడు. చెప్పినా అర్ధంచేసుకునే యీడుకాదు.
    పార్వతి లేచివెళ్ళి పెట్టంతా వెతికితే పదిపైసలబిల్లా కనబడింది. కిష్టుడిచేతిలో పెడుతూ "రేపటికి అయిదుపైసలుంచుకో." అంది.
    "ఉంటే వుంచుకుంటా" బైటకు పరుగుతీస్తూ అన్నాడు కిష్టుడు.
    "బాలకిష్టుడి అల్లరిని మించిపోయింది నీ అల్లరి కిష్టు" అనుకుంది పార్వతి.
    "వారు వచ్చినప్పుడల్లా ఎంతోకొంత డబ్బిచ్చి వెళ్ళేవారు రావటం ఆలస్యం అయితే మనియార్డర్ చేసి ఉత్తరం రాసేవారు. కాని....యీతఫా రెండూలేవు. వారిచ్చిన దానిలో పదిపదిహేను తనుంచుకుని మిగిలినది పిన్నిచేతిలో పెట్టబట్టి, పిల్లలు పైసలడిగినా, పిన్ని గట్టిగా మాట్లాడక రోజులు గడిచిపోయాయి. వారిస్తున్న కొద్ది మొత్తానికి తనకీ, పిల్లలకీ ఓ పూట తిన్నా అర్ధాకలితో లేచిపోవాల్సిందే. నాన్న వున్నంతవరకూ పిన్ని నోట్లో నాలుకలేదు. నాన్న పోయింతరువాత మొదట్లో నోరు మెదపక రానురాను చాటుగా ఇప్పుడిప్పుడు పబ్లిక్ గా ఏదో ఒకటి అనేస్తున్నది.
    తను ఇంట్లో ఉండటం పిన్నికి శిక్ష. పిన్ని ఇంట్లో తనుండటం ఖర్మ. పరధ్యానంగా కుట్టటంవల్ల కసుక్కున వేలిలో సూది దిగబడింది. "అబ్బా" అనుకుంది చైతన్యం వచ్చి పార్వతి.
    "ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే యీపూట సరోజ యింటికి వెళ్లినట్లే" సూదిదిగిన వేలిని మరో వేలితో నొక్కి పట్టింది రక్తం పైకిరాకుండా. ఓ నిముషం ఆగి చీర కుట్టటం పూర్తిచేసి పెరట్లో కెళ్ళి ముఖం కడుక్కువచ్చింది. బొట్టు పెట్టుకుని జడవేసుకుంది.
    పిల్లలతోనూ, పిన్నితోను చెప్పి సరోజ యింటికి వెళ్లాలంటే యిరవై నిమిషాలు నడవటం కష్టం కాదు. తను వెళ్ళేటప్పటికి సరోజ యింట్లో లేకపోతే కష్టం. పదిళ్ళ పాపమ్మ సరోజ.
    సరోజ తనెళ్ళే సమయానికి ఇంట్లో వుంటుందా? వుండదా? దోవ పొడుగునా ఆందోళన పడుతూనే వుంది పార్వతి.
    పార్వతికి గుమ్మంలోనే ఎదురయింది సరోజ.
    "హోయ్! పారూ! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి, దోవతప్పి వచ్చావ్?" పార్వతి భుజంమీద చెయ్యివేసి వూపుతూ అంది సరోజ.
    "దారి చూచుకుంటూ తిన్నగా ఇక్కడికే వచ్చా!" పేలవంగా నవ్వి పార్వతి అంది..

 Previous Page Next Page