తొందరపడకూడదు .నిదానంగా అన్నీ అడిగి తేల్చుకుందాం అనుకున్న పార్వతికి నిగ్రహించుకోలేని కోపం వచ్చింది. భుజంమీద వున్న భర్తచేతిని విదిలించుకొని లేచింది.
"అవును నేవున్నాను. ఇంకా చావు రాలేదంతే, మీరు వచ్చివుండేది రెండురోజులు. ఆ రెండురోజులూ ఊళ్లో తిరిగి రావటం. ఇంట్లోవున్న కాసేపు మాయమాటలు చెప్పి నా కళ్ళు కప్పటం. పిల్లలెలా వున్నారు? ఏంచదువుతున్నారు? వారి భవిష్యత్తు ఏమిటి? ఒక్కసారి అడిగారా? నీవున్నావుగా! ఎంత తేలిగ్గా అన్నారండీ, 'అమ్మా! అందరి నాన్నగార్లలా మా నాన్నగారు మనదగ్గర వుండరేమమ్మా!, అంటూ పిల్లలు వేధిస్తుంటే, మీరిచ్చే డబ్బు చాలక యీ ఇంట్లో వున్నందుకు పిన్ని హీనంగా మాటలంటుంటే, ఇరుగుపొరుగు హేళనగా చూస్తుంటే, నాకు చావు రాలేదు. మామూలుగానే వున్నాను" ఆవేశంలో ఆపై నోరు పెగల్లేదు పార్వతికి. చీర చెంగు నోట్లో కుక్కుకుంది. ఎక్కిళ్ళు పైకిరాకుండా వ్యర్ధప్రయత్నం చేస్తూ.
"పారూ నేను నాటక సమాజానికి అంకితం అయిపోయాను. నాలాంటి ప్రసిద్ధకళాకారుడు సంసారం, భార్య, పిల్లలూ అనుకుంటూ చేతులు ముడుచుకు కూర్చుంటే, ఎప్పటికీ కీర్తి శిఖరాలను అందుకోలేడు."
"కళాకారులు సన్యాసులు కారండీ! వారూ భార్యా, పిల్లలతో సుఖంగా వుంటారు. మీకు ఏ జంజాటన లేకుండా తిరగటం అలవాటయింది. కీర్తికాంక్ష తోడయింది. మీకు నేను ఏ విషయంలోనూ అడ్డుతగలను. ఈ క్షణం నుంచీ నేనూ పిల్లలం మీ వెంట వుంటాము."
మధుసూదనంకి చిర్రెత్తుకొచ్చింది.
"నాతో వుండటం అన్నది ఎప్పటికీ కుదరదు. ఎక్కడో పడుకుంటాం, ఏదో తింటాం ఇవాళ యిక్కడ, రేపు అక్కడ ఎలా కుదురుతుంది? నీకు అలవాటయిన ఇల్లు, మనుషులు." కచ్చితంగా చెప్పేశాడు మధుసూదనం.
"పిల్లలను పెంచి పెద్దచేయవలసింది, యిరువురి బాధ్యత. నే ఒక్కదాన్ని యీ భారం మోయలేను."
"ఆ సంగతి ముందే ఆలోచించాల్సింది. పిల్లలు పుట్టింతరువాత చింతించటం, చేతులు కాలింతర్వాత ఆకులు పట్టుకున్న చందనం లాంటిది."
"అంటే.....! పిల్లల్నికనటంలో నా ఒక్కదాని చెయ్యేవుందా?" తమ యిరువురిమధ్య యిలాంటి సంభాషణ దొర్లుతున్నందుకు సిగ్గుతో చితికిపోతూ అంది పార్వతి.
"ఆ__పుట్టినబిడ్డకు తల్లి ఎవరో తెలుస్తుందట. తండ్రి తెలియదు. "బాబూ! ఇతను నీ తండ్రి" అని చెపితే తప్ప. ఓ మహాకవి కధనం ఇది".
"ఛీ......ఛీ......ఏమంటున్నారో తెలిసే అంటున్నారా? ఇంతవరకూ లోకులు అంటున్నది కారుకూతలని వూరుకున్నాను. రమామణిని వివాహం చేసుకున్నారటగా? భార్య వుండగా మరో పెళ్ళి చేసుకున్న మీరు ఇంతకన్నా ఏం మాట్లాడగలరు?" పార్వతి తను కళ్ళారా చూస్తే తప్ప రమామణి విషయం ఎత్తకూడదనుకుంది. అనుకోకుండా ఆ ప్రసక్తి రానే వచ్చింది. ఎలాగూ బైటపడింది కాబట్టి నిజం గట్టిగా తెలుసుకోటానికే నిశ్చయించుకుంది.
పార్వతి మాటలువిని నిర్ఘాంతపోయాడు మధుసూదనం.
"ఎవరు చెప్పారు నీకిది?"
"చెప్పింది ఎవరయినా నిజమేచెప్పారు. నిజం కాదంటారూ, నన్నూ పిల్లలనూ మీ వెంట తీసుకెళ్ళండి. కలో గంజో తాగి మీదగ్గరే పడివుంటాము."
"ఎవరో గన్నాయిగాడు చెప్పింది నిజం అక్కడికి నా మాట అబద్ధం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నిన్ను నావెంట తీసుకెళ్ళేది లేదు. ఇలా ఇంటికి రాగానే పోట్లాట పెట్టుకుంటే నా ముఖం కూడా చూడవు గుర్తుంచుకో" మధుసూధనం బెదిరింపుగా అన్నాడు.
"మీరు కాదంటే నమ్మేటంత మూర్ఖురాలిని కాదు. రమామణిని పెళ్ళి చేసుకున్నారు. అందుకే నన్ను తీసుకెళ్ళనంటున్నారు. నాటకాలమనిషి నాటకం ఆడక యింకేం చేస్తాడు. మీరు తీసుకెళ్ళకపోయినా మీ వెంట ఎంతదూరం వెళితే అంతదూరం వస్తాను."
పార్వతి మొండితనం తెలిసిన మధుసూధనం తగ్గిపోయాడు. నే చెప్పేది విని నన్నర్ధంచేసుకో పారూ!" అంటూ పార్వతి చెయ్యిపట్టుకు తీసుకువెళ్ళి మంచంమీద కూర్చోపెట్టాడు.
"అనుకోని సంఘటనలు కొన్ని జరిగి రమామణిని దగ్గరకు తీసాను. ఎలా వదిలించుకోవాలో తెలియటంలేదు. నావల్ల పొరపాటు జరిగింది. నిన్నూ, పిల్లలనూ అన్యాయం చేయను. వచ్చిపోతుంటాను. డబ్బు పంపిస్తాను. నువ్వు రావటంవల్ల పరిస్థితులు విషమిస్తాయి. నాటక సమాజంనుంచి బైటికి రావలసివస్తుంది. నాకు ఏ పనీ చేతకాదు. జోలి తగిలించుకొని వీధులు తిరగాల్సిందే."
తను విన్నది నిజమయ్యేటప్పటికి, ఎన్నో అనుమానాలు బయలుదేరాయి పార్వతికి. గోడమీద పిల్లి వాటంగా అంది. "అయితే నేవిన్నవన్నీ నిజాలే చాలామంది ఆడవాళ్ళతో మీకు సంబంధం ఉందటగా?"
"ఎవరు చేరవేస్తున్నారు నీకీ వార్తలన్నీ?"
"కళ్లారా చూచినవాళ్ళు." మరో అబద్ధం ఆడింది పార్వతి.
మధుసూధనం మంచంమీద నుంచి విసురుగా లేచాడు.
"నా గురించి ప్రతివిషయం ఎంక్వయిరీ చేయటంలో నీవుద్దేశ్యం ఏమిటి? నా ఇష్టమొచ్చినట్లు వూరేగుతాను. కావాలంటే నువ్వూ వూరేగు. ఎప్పటిలాగా వచ్చిపోతూ వుండనా? పూర్తిగా వెళ్ళి పొమ్మంటావా? నా అవసరం, డబ్బవసరం లేకుండా బ్రతకగలవా?"
"భర్త క్షేమం గురించి తెలుసుకోటం భార్యధర్మం. ప్రతినిమిషం మీ సన్నిధిలోనే వుంటే అడ్డమైన తిరుగుళ్ళూ తిరగరు. అందుకే మీతో వస్తానని మరోసారి చెపుతున్నాను. మీ అవసరం అంటే ఏమిటి? మీ వీలయినప్పుడు ఓసారి రావటం. ఫలితం మరో బిడ్డకు తల్లిని కావటం, అదేగా నే పొందుతున్న స్వర్గం? ఇస్తున్న డబ్బంటారా? రెండు నెలలకు మూడునెలలకు పాతిక, యాభయి. అర్జంట్ అని లెటర్ రాస్తే పంపేది మరో పాతిక. నాలుగు పొట్టలకు నిండా గంజి కూడా రాదు. పిన్ని దయాధర్మబిచ్చంమీద బ్రతుకుతున్నాను. ఇహపై మిమ్మల్ని భరించలేనని స్పష్టంగా చెప్పింది. చివరిసారిగా నేను కావాలో, పరాయి ఆడవాళ్ళూ ,తిరుగుళ్ళూ కావాలో చెప్పి వేయిండి."
"ఎందుకు ఇన్నిసార్లు అడుగుతావు. నిన్ను నావెంట తీసుకెళ్ళటం కలలో మాట? నా అవసరం వుందో లేదో నువ్వే చెప్పు."
"శీలం అనేది స్త్రీకే కాదు పురుషుడికి కూడా ముఖ్యం. అడ్డమైనవాళ్ళతో పోయివచ్చే మీతో కాపురం చేయటం నా వల్లకాదు." పార్వతి కోపంతో వళ్ళు మరిచిపోయి అన్నది.