Previous Page Next Page 
అహల్య పేజి 38


    'సెలవివ్వండి బ్రహ్మర్షీ! ఆ దేవరహస్యం నాకు తెలిసినా చిక్కు, ఇక్కట్లు లేవని తమరు భావిస్తే తెలియపరచండి'


    'రాజర్షీ! తమరి జీవితం, తమరి జీవనం అన్ని లోకాల్లోనూ విదితం! తమరికావిషయం తెలియచెప్పాలనే తాపత్రయంతో నేను వచ్చాను'


    'సెలవివ్వండి బ్రహ్మర్షీ!'


    'ఆ అదృష్టవంతుడివి నువ్వే! ఆ రాజ వంశం మీదే! ఆ పుణ్య భూమి మీదే! శ్రీమహాలక్ష్మి పద చిహ్నాలతో నీ అంతఃపురం మరో వైకుంఠం కానున్నది.


    'ధన్యోస్మి బ్రహ్మర్షీ! ధన్యోస్మి!' చెప్పరాని సంతోషంతో అన్నాడు జనకుడు.


    'నా జన్మ సార్ధకమైంది. మా మిధిలా నగరం పావనం కానున్నది! సాక్షాత్తూ ఆ శ్రీమహాలక్ష్మియే మా వంశంలో అవతరించడం మా భాగ్యం! శ్రీమహావిష్ణువుణు అల్లుడిగా పొందగలిగిన అదృష్టానికి నా మనసు పొంగిపోతున్నది'.


    'కాని ఆ తల్లి ఎలా అవతరిస్తుందన్నది ఆ మహాతల్లికే తెలుసు! లేదా ఆ త్రిమూర్తులకు తెలుసేమో! మరెవ్వరికీ తెలియదు రాజర్షీ!'


    'స్వామీ! ఎలా అవతరిస్తేనేం. ఎప్పుడు అవతరిస్తేనేం ఆ తల్లి నా మందిరంలో అవతరిస్తుంది. ఆ లక్ష్మి, ఆ పద్మాలయ, ఆ పద్మహస్త, ఆ క్షీరసాగర కన్యక ఈ జనక రాజపుత్రి అనిపించుకుంటుంది.


    అవతరించనున్న ఆ విష్ణువు, ఆ రాఘవుడు నా అల్లుడవుతాడు. అంతకంటే కోరదగినదేముంది బ్రహ్మర్షీ! తఫః ఫలితంగా శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి దర్శనం లక్ష్మీ సమేతంగా లభిస్తుంది.


    అలాంటిది ఆ దంపతులు నా ఇంటిలో కూతురుగా, అల్లుడుగా తిరుగాడుతూ ఉంటే కళ్ళారా చూసే భాగ్యం లభించడం ఎన్ని జన్మల పుణ్యఫలం కావాలి! అంతేనా? నేనొక్కడినేనా ధన్యుణ్ణి! నా అంతఃపుర స్త్రీలు, నా దాస దాసీ జనం, నా సేవకులూ, నా మంత్రులూ, నా అనుచరులూ, నా మిథిలా నగర వాసులు అందరూ అదృష్టవంతులు! స్వామీ! ఈ త్రేతాయుగంలో, ఈ పాదంలో జన్మించిన వారందరూ పుణ్యజీవులే! శ్రీమహా విష్ణువు యీ భూలోక వాసులపై అనన్యమైన ప్రేమను వర్షించడానికి అవతరిస్తున్నాడు స్వామీ!'


    జనకుడి వినయ వచనాలు, ఆనందం కళ్ళారా చూసిన బ్రహ్మర్షి, బ్రహ్మానంద సబ్రహ్మచారి అయ్యాడు. లేచాడు.


    'ఇక మేం సెలవు తీసుకుంటాం!'


    'అప్పుడేనా మహర్షీ! తమరు మా ఆతిథ్యం స్వీకరించి...'


    'జనక రాజర్షీ! ఈ రహస్యాన్ని తమ చెవిన వేసిపోవాలనేదే మా కోరిక. అది నెరవేరింది. ఇక ఈ అవతార పురుషుడి జననం కోసం ఈ అవతారమూర్తి అవతరణ కోసం వేచి ఉండడమే మాకు మిగిలింది' కదిలాడు విశ్వామిత్రుడు.


    జనకుడూ తన రీతిలో ఆయనకు వీడ్కోలు పలికాడు.


                                      26


    సరస్వతి అలా నిష్టూరంగా అనగానే చతుర్ముఖుడు చిరునవ్వు నవ్వి చెప్పసాగాడు.


    'సరస్వతీ! భూలోకంలో అజనాభదేశంలో ఆంధ్రదేశం ఓ భాగం. అక్కడ ఓ నదీ తీరంలో మన అహల్యా గౌతములు నివసిస్తున్నారు. అక్కడ ఓ సామెత ఎప్పుడూ జనంలో వాడుకగా ఉంటుంది. 'పొద్దుపోక పనీపాటూ లేక తీరి కూర్చుని ఏవేవో మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు.


    పొద్దు అంటే సూర్యుడులే! ఆ సూర్యుడు ఉదయిస్తున్నట్లు భాసించి, అస్తమిస్తున్నట్లు భ్రమింప జేస్తాడు. అతడు వెలిగే కాలం పగలు! లేని సమయం రాత్రి. ఆ రెండు కలిస్తే ఒక రోజు! అలాంటి పొద్దులు ముప్పై అయితే ఒక మాసం! అలాంటి మాసాలు ఆరయితే ఒక ఆయనం. రెండు ఆయనాలు ఒక సంవత్సరం. వాటికి పేర్లున్నాయి. వారాలకూ పేర్లున్నాయి. గ్రహాలతో  ఏర్పడ్డాయి అవి. చంద్ర గమనాన్ని, నక్షత్రాల్ని గమనించి మాసాలకు చైత్రాది నామకరణం చేశారు'


    సంవత్సరాలు ప్రభవాదులు. అవి మన మానస పుత్రుడైన నారదుడి గాధతో ముడిపడి ఉన్నాయి.


    అవి అరవై! అవి మళ్ళీ తిరిగి రాగానే ప్రభవతో మొదలు! అది కాల చక్రం. ఇంతకూ ఇంత ఎందుకు చెప్పుకొచ్చానంటే? ఆ లోకంలో పొద్దుపోక సుద్దులు చెప్పుకుంటారట! మనకు అలా కాదు కదా! కనీసం నాకు అలా జరగదు కదా! క్షణం రెప్ప పాటు కాలం నేను విశ్రమించేందుకు వీల్లేదు కదా! నేను విశ్రమిస్తే ఈ సృష్టే ఆగిపోతుంది.


    శివుడు రుద్రుడై, లయ కారుడై లోకంలో ఉన్న అన్ని జీవుల్ని తనలో లయింప జేసుకుంటాడు. ఆయన తాండవం చేసినా, లాస్యం చేసినా కార్యక్రమం ఆగదు. జీవులు తమ కర్మబద్ధులై తామే లయిస్తారు.


    కానీ- సృష్టి అలా కాదు కదా! నేనే సృష్టించాలి కదా దేవీ! నిర్విరామంగా సృష్టిస్తూ క్షణం ఆలోచించే తీరిక దొరకని నాకు మన అమ్మాయి గురించి ఆలోచించే అవకాశం ఎక్కడ?


    ఏ జీవుడి గురించి గత జన్మ ఫలాన్ని బట్టి ఆ జీవికి ఈ జన్మలో ఏం జరుగుతుందో వాళ్ళ ముఖాన రాసి సృష్టించి లోకం పైకి వదిలేయాలి. క్రిమిజన్మ అయినా- కీటక జన్మ అయినా- పశుజన్మ అయినా- మానవ జన్మ అయినా వాళ్ళ వాళ్ళ తలరాతలు వారికి వ్రాసి పంపెయ్యాలి కదా!


    అయినా దేవీ! ఒక అహల్య ఏమిటి? నేను సృష్టించే వాళ్ళందరూ నా సంతానమే కదా! వాళ్ళ బాగోగులు వాళ్ళ తలరాతల మీద- ఆ తలరాతలు వాళ్ళ గత జన్మ సుకృతాలు. దుష్కృతాల మీద ఆధారపడి ఉంటాయి కదా! మరి వాళ్ళందరి గురించీ ఆలోచించే తీరిక మనకెక్కడిది?


    బ్రహ్మ అలా అనగానే సరస్వతి చిన్నగా నవ్వింది.

 Previous Page Next Page