"నాన్నా! ఇప్పుడవన్నీ ఎందుకు నాన్నా?" అన్నది సునంద.
తులశమ్మ ఆగిపోయింది. ధర్మయ్య సందేహంగా కూతురి ముఖంలోకి చూస్తూ "అమ్మా!" అన్నాడు. అంతకంటే ఏమనాలో అతనికి తోచలేదు.
ధర్మయ్య సందేహానికి సునంద చిరునవ్వు నవ్వింది.
"మాంగల్యం కట్టకపోతే వివాహం కాదా?" అన్నాడు శేఖర్ ధర్మయ్య సందేహానికి సమాధానంగా.
"అవును నాన్నా! ఆత్మసాక్షిగా మేమిద్దరం భార్యా భర్తలం. ఇంకా ఈ నిదర్శనాలన్నీ ఎందుకు నాన్నా? మీ ఆశీర్వాదం చాలు మాకు!" అన్నది సునంద.
"అవునన్నయ్యా! చిన్నదైనా సునంద నిజమే చెప్పింది" అని తులశమ్మ తనమెళ్ళో వున్న పసుపుకొమ్ము కట్టిన పసుపుతాడు బయటికి తీసి చూపిస్తూ "దీన్ని చూస్తున్నావు కదూ! పదహారు రోజులు పండగకూడా వెళ్ళకముందే అగ్ని సాక్షిగా మీ అందరి ముందూ కట్టిన మాంగల్యాన్ని, కట్టుకున్న మొగుడే తెంచుకుపోతే నా ఈ చేతుల్తోనే పసుపుకొమ్ము కట్టుకున్నాను" తులశమ్మ కంఠం రుద్ధమైంది.
సునందా, శేఖర్ జాలిగా చూశారు. ధర్మయ్య కళ్ళు చెమ్మగిల్లాయి.
తులశమ్మ మళ్లీ చెప్పుకు పోసాగింది. చిన్నగా తనకు తానే చెప్పుకుంటున్నట్టు.
"మీ కోసం _ లోకంకోసం _ సంఘంకోసం _ కుటుంబగౌరవం కోసం దీన్ని నేను ముప్పై సంవత్సరాలుగా మోస్తున్నాను. కాని ఆయన ఒక్కనాడైనా నన్ను భార్యగా తలచాడా? అన్నయ్యా! మన పిచ్చేగాని_ ఈ పసుపు కొమ్ములూ, మంగళసూత్రాలూ మనుషుల్ని కలుపుతాయా? మనసులు కలవాలిగాని".... అని కళ్ళు తుడుచుకుంది తులశమ్మ.
వాతావరణం బరువుగావుంది. ఎవరూ వెంటనే మాట్లాడలేకపోయారు.
"వద్దన్నయ్యా! నా ఈ చేతుల్తో పసుపుకొమ్ము తేలేను" అన్నది బొంగురుపోయిన కంఠంతో.
"ఊరుకోమ్మా! ఏం చేస్తాం. నువ్వు చెప్పిందీ నిజమే. ఈ మాంగల్యం.... నలుగురిముందు హడావిడిచేసి పెళ్ళి జరిపించడం - అంతా లోకంకోసమే. మనసులు కలిసినప్పుడు ఇవన్నీ అనవసరం! రాతల్లీ! రా శేఖర్! లోపలకు రండి!" అన్నాడు ధర్మయ్య.
"ఒక్కక్షణం వుండండి" తులశమ్మ లోపలకెళ్ళి హారతి వెలిగించుకొని వచ్చింది.
సునందా, శేఖర్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు.
తులశమ్మ హారతి ఇస్తుండగా జానకిరామయ్య వచ్చాడు.
"రావయ్యా! జానకిరామయ్యా! అమ్మాయినీ_అల్లుడ్నీ దీవించు" అంటూ జానకిరామయ్య చేతులుపట్టుకొని తన ఆనందాన్ని వ్యక్తంచేశాడు ధర్మయ్య.
సునందా, శేఖరూ జానకిరామయ్యకు నమస్కరించారు.
"నూరేళ్లు వర్ధిల్లండి!" దీవించాడు జానకిరామయ్య.
33
హాల్లో పరమేశం ఉగ్రరూపంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు.
నరహరి సోఫాలో కూర్చుని చెబుతున్నాడు. తిరుగుతూ మధ్య మధ్య ఆగి పరమేశం నరహరిని చూస్తూ తల ఆడిస్తున్నాడు. రాణి నరహరి కూర్చున్న సోఫా వెనగ్గా దిగాలుపడి నిల్చుంది.
"ఎంత వెనకేసుకొచ్చాడనుకున్నావ్? దాన్ని చెయ్యిపట్టుకొని తాళిగట్టిన పెళ్ళాన్ని లాక్కెళ్లినట్లు లాక్కెళ్ళాడు" నరహరి రాణి ముఖంలోకి చూశాడు.
రాణి తలవంచుకుంది.
"నాకు మొదటినుంచీ వాళ్ళమీద అనుమానంగానే వుంది" నరహరి పక్కన కూర్చున్న "లూ" మంటలోకి మరో కట్టెను చేర్చాడు.
పరమేశం హఠాత్తుగా ఆగి "అమ్మాయ్ నువ్వు లోపలకుపో తల్లీ!" అన్నాడు.
రాణి తండ్రి ముఖంలోకి చూసింది. కళ్ళనిండా నీరు తిరిగింది. విసవిసా నడిచి, గబగబా మేడమెట్లు ఎక్కి రాణి వెళ్ళిపోతుంటే పరమేశం చూస్తూ నిల్చున్నాడు. రాణి వెళ్ళిపోయాక నరహరివైపు తిరిగాడు.
"ఊ! అంతవరకు వచ్చిందన్నమాట?" అన్నాడు పరమేశం నరహరి ఎదురుగా కూర్చుంటూ.
"అంతవరకేంటండీ! వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలుస్తూంది" అన్నాడు "లూ".
నరహరి 'లూ'కేసి చురచురా "నువ్వు నోరుమూసుకు కూర్చో!" అన్నట్టు చూశాడు.
"లూ" సర్దుకొని కూర్చున్నాడు.
"మిమ్మల్ని చూసి ఆ శేఖర్ని వదిలేశాను. అదే మరొకడైతే ఈ పాటికి శంకరగిరిమాన్యాలు పట్టించి వుందును. డేగలమర్రిలో ఈ నరహరిని అవమానించిన వాడెవడూ...."
అంటూ నిప్పులు కక్కుతున్న నరహరి దగ్గరకు పరమేశం వచ్చి నిల్చున్నాడు. భుజంమీద చెయ్యివేస్తూ "నరహరీ! ఏదో కుర్రవాడు. ఉడుకు రక్తం! తెలిసో తెలియకో చేశాడు, మనం పెద్దవాళ్ళం! నయానో భయానో వాణ్ణి మనం దారికి తెచ్చుకోవాలి. ఉద్రేకం రాజకీయ లక్షణం కాదు" అన్నాడు.
"వాడు మళ్ళీ మన దారిలోకి వస్తాడనే ఆశ నాకులేదు. ఆ రోజు నువ్వు చూళ్ళేదుగాని...."
"ఆఁ రాకేం చేస్తాడు. నువ్వట్లా చూస్తుండు! వాణ్ణి మళ్ళీ మన మార్గంలో పెడ్తానో లేదో?"
నరహరి ఆలోచిస్తూ కూర్చున్నాడు.
"నువ్వు వెంటనే నామినేషన్ వెయ్యాలి?" పరమేశం అన్నాడు.
నరహరి అర్ధంకానట్టు పరమేశం ముఖంలోకి చూశాడు.
"అర్ధం కాలేదూ? నరహరే ఈసారి కూడా డేగలమర్రి ప్రెసిడెంటు!"
నరహరి విస్మయంగా పరమేశం ముఖంలోకి చూశాడు.
"ఏమైనా సరే! ఎంత ఖర్చయినా సరే మళ్ళీ నువ్వే డేగలమర్రి సమితి ప్రెసిడెంటువు కావాలి" తన ధోరణిలో చెప్పుకు పోతున్నాడు పరమేశం.
నరహరి భ్రుకుటి ముడిచాడు.
"అదేమిటండీ? మరి నా యం.యల్.సి. సీటు....?" నీరు కారిపోతూ నసిగాడు.
"అదెక్కడికి పోతుందయ్యా? ఆ విషయం నాకు వదిలేయ్!" అన్నాడు పరమేశం.
నరహరి ఆలోచనలో పడ్డాడు.
"ఆఁ ! మరో విషయం! ఈ ఎలక్షన్స్ లో నా సపోర్టు నీకున్నట్లు మరో చెవిని పడకూడదు" అని 'లూ' కేసి చూశాడు పరమేశం.
'లూ' అర్ధంకాక "అంతా మిస్టరీ!" అన్నాడు.
"నువ్వు నోరుమూసుకు కూర్చుంటావా లేదా?" గద్దించాడు నరహరి.
'లూ' బిక్క చచ్చిపోయాడు.
"ఏమిటోనయ్యా నీ ఎత్తులు నాక్కూడ అర్ధం కావడంలేదు" అన్నాడు నరహరి ఆలోచిస్తూ.
"కొద్దిరోజులు పోతే నీకే అర్ధం అవుతుందిగా?"
"ఏమిటో అంతా అయోమయంగా వుంది. నా యం.యల్.సి. సీటు గురించి మాత్రం...."
"అదంతా నాకు వదిలేయమన్నానుగా!"
"సరే! మీరు చెప్పినట్టే చేస్తాను" అంటూ నరహరి లేచి నిలబడ్డాడు.
పరమేశం నరహరితో కరచాలనం చేశాడు.
లూ, నరహరీ బయటకి వెళ్లిపోయారు.
అలా వెళ్లిపోతున్న వాళ్ళను చూస్తూ అదోలా నవ్వుతూ నిట్టూర్చాడు పరమేశం.
34
సంధ్య వెలుగులో హుసేన్ సాగర్ నీరు వింతశోభను వెదజల్లుతోంది. వెలుగుతున్న దీపంమీద బుట్ట బోర్లించినట్లు ఆకాశంలో వెలుగు మందగించింది.
ఆస్తమిస్తున్న సూర్యబింబంలాగే ఎర్రగా వుంది లలిత ముఖం కోపంతో. 'లూ' కూనిరాగం తీస్తూ ఆమె పక్కగా బెంచీమీద కూర్చుని వున్నాడు.
తన బాధను గ్రహించీ గ్రహించనట్టే ఎంత హాయిగా పాటలు పాడుకుంటున్నాడు? లలితకు అతని పక్కన కూర్చోవాలంటేనే కంపరంగా వుంది. చివుక్కున లేచి టాంక్ బండ్ బ్రిడ్జి రైలింగ్ పట్టుకొని నిల్చుంది.
'లూ' ఓ క్షణం ఆమెకేసి చూచి లేచి పక్కగా వెళ్లి నిలబడ్డాడు.
"నీ ముక్కు మీద కోపం....నీ ముఖానికే అందం...."
చాల్లే ఊరుకో! హాస్యాలకు వేళాపాళా లేదు" కసురుకుంది లలిత.
"ఎందుకు లల్లీ అంత కోపం? ఇవ్వాళే ఒక బ్రిడ్జికి కొత్త కాంట్రాక్టు తీసుకున్నాను. ఇకచూడు....లక్ష్మీదేవి గజ్జలు కట్టుకొని మన చుట్టూ డ్యాన్సు చేస్తుందో లేదో?"
ఆ చేస్తుంది. నువ్వెటూ సిమెంటు సరిగా వెయ్యవు. ఆ బ్రిడ్జి కడుతుండగానే కూలిపోకపోదు. నీకు జైలూ తప్పదు" అన్నది లలిత కసిగా.
"జైలా? నాకా?" లూ పిచ్చిగా నవ్వాడు.
"ఏమిటా నవ్వు!" వళ్ళు మండిపోతున్న లలిత అన్నది.
"లేకపోతే ఏమిటి నా పిచ్చి లల్లీ! ఈ దేశంలో ఎన్ని బ్రిడ్జెస్ కడుతుండగా కూలిపోవడంలేదు.... వాటికిందపడి ఎంతమంది చావడం లేదూ_ఎప్పుడైనా విన్నావా ఏ కంట్రాక్టరైనా జైలుకు వెళ్లినట్టు, అదే మన దేశం గొప్పతనం! ఇదేం అమెరికా అనుకున్నావా? వాటర్ గేట్ ఉదంతాన్ని దేశ సమస్యగా మార్చి ప్రెసిడెంటంతటివాణ్ణి బొక్కబోర్లా మళ్ళీ లేవకుండా పడెయ్యటానికి? ఆ మాటకొస్తే మనదేశంలో ఎన్ని వాటర్ గేట్లులేవు? రాష్ట్రాని కొకటి __ కాదు _ సమితి కొకటి దొరుకుతుంది" అన్నాడు 'లూ'.