"అబ్బబ్బ! నీతో వచ్చిన చిక్కే ఇది. అసలు విషయం వదిలేసి ఏదేదో మాట్లాడతావ్?" కస్సున లేచింది లలిత.
"అసలు సంగతా? ఆఁ ఏమిటి చెప్తున్నాను. అదే_ఈ కాంట్రాక్టు పూర్తి అయ్యేటప్పటికి నీకు బంగారం తొడుగు వేసేస్తాను. విదేశాలు.... స్టీమర్లలో కాదు. విమానాల్లో తిప్పుకొస్తాను. ఇంటిని బట్టలషాపే చేసేస్తాను. నీకు పట్టుచీరలంటే గదూ ఎక్కువ ఇష్టం!"
"నాకు బంగారపు తొడుగూ అక్కర్లేదు....పట్టుచీరెలూ అక్కర్లేదు. ముందీ విషయం తేల్చిచెప్పు. మన పెళ్ళెప్పుడు?" నిలదీసింది లలిత.
"పెళ్ళా?" నెత్తిగోక్కున్నాడు 'లూ.'
"ఏం పెళ్ళా? అంటూ అంత ఆలోచనలో పడ్డావ్!"
"అసలు నేను పెళ్ళి చేసుకుంటానని నీతో ఎప్పుడైనా అన్నానా? అని ఆలోచిస్తున్నాను."
లలిత చివ్వున తలెత్తి 'లూ' ముఖంలోకి చూసింది అయోమయంగా.
"ఎంత ఆలోచించినా గుర్తు రావడంలేదు. ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పాను. నిజంగానే ప్రేమిస్తున్నాను కూడా. ప్రేమించడానికి మాత్రమే కాంట్రాక్టు తీసుకున్నాను. ప్రేమిస్తున్నాను. పెళ్ళికి కాంట్రాక్టు చెయ్యలేదుగా?"
లలిత నిశ్చేష్టురాలై నిలబడి పోయింది.
"లల్లీ!" అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
"ఛీ! నన్ను ముట్టుకోకు!""అదేమిటి? నా దగ్గర నీకు పాతివ్రత్యమేమిటి?"
"ఛీ! దుర్మార్గుడా? అట్లా మాట్లాడటానికి సిగ్గులేదూ?"
"సిగ్గెందుకు? నేను చేసిన దుర్మార్గం ఏమిటి? మీ ఆడవాళ్ళకు వున్న జబ్బే ఇది. మగవాడు ప్రేమిస్తున్నానంటే, ఆ మాటకోసమే మొహం వాచినట్టు వెంటనే డ్యూయెట్లలోకి దిగేస్తారు. ఏవేవో లేనిపోనివన్నీ ఊహించుకుంటారు. ప్రేమ వేరూ - పెళ్లి వేరూ! ఆ మాటంటే మగవాడు మోసం చేశాడంటారు. అసలు మోసమంతా ఆడవాళ్ళలోనే వుంది."
లలిత "లూ" ను పరీక్షగా చూసింది. అప్పుడే బలిసిన మేకపోతును మింగిన కొండశిలువలా కన్పించాడు.
"పెళ్లి చేసుకున్నాక ఇంకా ప్రేమ ఏమిటి నా బొంద?"
లలితకు "లూ"ని లాగి చెంపమీద కొట్టాలనిపించింది.
"మా బావకు తెలిస్తేనా డొక్క చీరేస్తాడు. సంబంధాలుకూడా చూస్తున్నాడు."
దూరంగా ఆగిన కారుకేసి చూసి "అరే మా బావగారి కారు లాగుందే! అదుగో ఆయనే!" అంటూ లలితను వదిలేసి పరుగులాంటి నడకతో స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు.
లలిత చైతన్యం కోల్పోయినట్టు నిలబడిపోయింది.
35
పరమేశం రాణీ గదిలోకి వచ్చేసరికి, ఆమె దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ కన్పించింది. తండ్రి హృదయం కరిగిపోయింది. పక్కన కూర్చుని తల నిమురుతూ "ఎందుకమ్మా ఏడుస్తావ్? ఏం మించిపోయిందని? పద బయలుదేరదాం! ఆలస్యానికి విరుగుడు లేదు" అన్నాడు.
లేచి కూర్చుని రాణీ తండ్రి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది.
"త్వరగా బయలుదేరు!"
"ఎక్కడికి నాన్నా?"
"చెబుతాగా? ముందు తయారవ్!"
"ఇంకా బావమీద ఆశలెందుకు నాన్నా? సునందను పెళ్ళి చేసుకున్నాడటగా?"
"పెళ్ళా పెటాకులా? ఎవరిముందు, ఎక్కడ తాళికట్టాడు?"
రాణి మనసులో ఆశ చిగురించింది.
* * * *
సునంద ఇల్లంతా అలంకరించి, తను సింగారించుకొని శేఖర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
వీధి వాకిలి తలుపు కొట్టిన శబ్దం విని, తండ్రీ, శేఖర్ వచ్చారనే ఆశతో గబగబా వెళ్ళి తలుపు తీసి నిర్ఘాంతపోయి నిల్చుంది. ఎదురుగా పరమేశం, రాణీ నిల్చున్నారు.
తొట్రుపాటును అణచుకొని గౌరవపూర్వకంగా "మీరా! రండి రండి!" అంటూ ఆహ్వానించింది.
పరమేశం, సునంద వెనకే లోపలకు వచ్చి కూర్చున్నారు.
ఇంకా నిల్చునే వున్న రాణీతో "కూర్చో రాణీ!" అన్నది సునంద.
సునందకు రాణీ ముఖం చూడాలంటే ఇబ్బందిగానే వుంది. రెండు నిముషాలు ఎవరూ మాట్లాడలేదు.
"నాన్నా, వారూ, సమితి పనిమీద ఊరికెళ్ళారు. సాయంత్రంలోగా వస్తారు." అన్నది సునంద.
రాణీ చివ్వున లేచినిల్చుంది. ఇంకా ఎందుకు కూర్చోవడం అన్నట్టు. పరమేశం కూర్చునే వున్నాడు.
"కూర్చోండి! ఇప్పుడే వస్తాను. కాఫీ తీసుకుని వెళ్దురుగాని" సమాధానానికి ఎదురు చూడకుండానే సునంద లోపలకు వెళ్ళింది.
"లేనాన్నా! బావ వచ్చాకే మాట్లాడదాం!" అన్నది రాణి.
"కూర్చో? శేఖర్ వుండడనితెలిసే వచ్చాను. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదనే వెంటనే నిన్ను తీసుకొచ్చాను" అన్నాడు చిన్నగా రహస్యం చెబుతున్నట్టు.
రాణి విస్మయంగా తండ్రి ముఖంలోకి చూసింది.
"శేఖర్ వచ్చాక మాట్లాడేది ఏముంటుంది పిచ్చితల్లీ! నే చెప్పినట్టు చెయ్! కూర్చో!" అన్నాడు పరమేశం.
రాణి కూర్చుంది. తండ్రి ఏంచెయ్యబోతున్నాడో ఎంత ఆలోచించినా రాణి బుర్రకు అందడంలేదు.
పరమేశం ఇల్లంతా కలియజూస్తుండగా సునంద ట్రేలో కాఫీ కప్పులు తీసుకొని వచ్చింది.
"ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా?" అంటూ ఒకకప్పు తీసుకొన్నాడు.
"తీసుకో రాణీ! అంటూ సునంద రాణి ముఖంలోకి చూసింది.
కళ్ళు ఉబ్బివున్నాయి. బాగా ఏడ్చి ఏడ్చి వచ్చినట్టు వుంది. సునంద మనస్సు చివుక్కుమంది. రాణి దుఃఖానికి కారకురాలు తనే ననే ఊహ రాగానే అపరాధిలా తలవంచుకుని, కాఫీ సిప్ చేస్తూ కూర్చుంది.
"నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడదామనే వచ్చాను" అన్నాడు పరమేశం ఖాళీకప్పు కింద పెడుతూ.
తనచేతిలో కప్పును పక్కనబెట్టి పరమేశం ముఖంలోకి విస్మయంగా చూసింది సునంద.
వీళ్ళు వచ్చింది తనతో మాట్లాడటానికా? ఏం మాట్లాడతారు? తమ వివాహం గురించేనా? సునంద గుండెలు దడదడలాడాయి.
"చదువుకొన్నదానివి, సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టావు, నీ తల్లిదండ్రులు దేశంకోసమే త్యాగంచేసినవాళ్లు" అని సునంద ముఖంలోకి గుచ్చిగుచ్చి చూశాడు పరమేశం.
ఈ ఉపోద్ఘాతం ఎటు లాక్కెళుతుందో అర్ధంకాని సునంద కుర్చీలో ఇబ్బందిగా కదిలింది.
"తలెత్తుకొని తిరగలేని పని జరిగిపోయిందమ్మా!" అంటూ పరమేశం తలవంచుకున్నాడు.
సునంద అదిరిపడింది. తలెత్తుకోలేని పని జరిగిందా? ఏమిటది? తనూ శేఖర్ వివాహం చేసుకోవడం తలవంపుల పనా?
"తలవంపులా? ఎవరు? ఏంచేశారు? మీ మాటలు నాకర్ధం కావడంలేదు" కొంచెం తీక్షణంగానే అడిగింది సునంద.
"ఎవరు చేసినా ఆ పాపాన్ని మనందరం పంచుకోవాల్సిందేనమ్మా!" అన్నాడు పరమేశం బాధపడుతున్నట్టు ముఖంపెట్టి.
"బాబాయిగారూ! పాపమా? పంచుకోవడమా? ఎవర్ని గురించి మాట్లాడుతున్నారు?" ఆదుర్దాగా అడిగింది సునంద.
"ఎవరిగురించో అయితే నీకెందుకమ్మా చెప్పడం? మా శేఖర్ - నువ్వూ- ఆ మాటకొస్తే నేనూ- అందరం కలిసి అభం శుభం తెలియని దీని జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాం!" అంటూ రాణికేసి దిగులుగా చూశాడు.
"క్షమించండి! ఏ పరిస్థితుల్లో మేము యిద్దరం భార్యాభర్తలం అయ్యామో మీకు తెలిస్తే, ఇలా మాట్లాడరు" అన్నది సునంద బాధగా.
"అవును నేను చెప్పేదీ అదే నమ్మాయ్! మా పరిస్థితులు నీకు ఇంతకుముందే తెలిసివుంటే, నీవీపని చేసివుండేదానివి కాదు. నాకు తెలుసు. నువ్వు ధర్మయ్య కూతురివి. నీలో ఆ సంస్కారం వుంది" అని సునంద కళ్ళలోకి చూశాడు.
సునంద అయోమయంగా చూసింది.
తన మాటల ప్రభావం అనుకున్న దానికంటే బలంగానే పనిచేస్తున్నదని తెలుసుకున్న పరమేశానికి సంతోషం కలిగింది. కాని ఆ భావం పైకి కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు.
"నీ తండ్రి ధర్మయ్యకే అసలు సంగతి తెలిసివుంటే శేఖరాన్ని నీ జీవితంతో చెలగాటం ఆడనిచ్చేవాడా?"
సునంద పిచ్చిదానిలా చూసింది. "శేఖర్ తన జీవితంతో చెలగాటం ఆడాడా?"
"పరమేశంగారూ! ఇందులో చెలగాటానికి తావులేదు. మాది పవిత్రమైన బంధం. అందుకు పరమేశ్వరుడే సాక్షి" అన్నది సునంద.
"పరమేశ్వరుడు....సాక్షి....హు!" అంటూ లేచి రాణీ దగ్గిరకు వచ్చి ఆమె జబ్బ పుచ్చుకొని లేవదీశాడు. చూడమ్మా! దానివైపొకసారి చూడు! శేఖర్ చేసిన ఆ పాపానికి కూడా ఆ పరమేశ్వరుడే సాక్షి! రాణి.... గర్భవతి...."
"పరమేశంగారూ!" సునంద దాదాపు అరిచినట్టే అన్నది.


