Previous Page Next Page 
తిరిగి దొరికిన జీవితం పేజి 38


    "ఒక మొగవాడితో సినిమాలు, షికార్లు నీకు తప్పుగా కనిపించక పోవచ్చు...లోకం-"
    "సినిమాలు, షికార్లు-బహువచనాలు అక్కరలేదు. ఒక్క సినిమాకి - అదీ మొదటిసారి వెళ్ళాను. నేనతనితో విచ్చలవిడిగా తిరుగుతున్నానని మీకెవరు చెప్పారు?" సిగ్గుతో, ఆవేశంతో, కోపంతో ఆమె గొంతు వణికింది.
    "ఎవరు చెపితేనేం, నిజమేకాని అబద్దం కాదుకదా. నేను చెప్పే దేమిటంటే ప్రభాకరాన్ని నీవు ప్రేమించవచ్చు తప్పులేదు. కాని పెళ్ళి కాకముందే...."
    "హు ఇదంతామీకెవరు చెప్పారో నాకు తెలుసు. అవును పెళ్ళికాకముందు ప్రేమించానని కబుర్లుచెప్పి, అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరగడానికి-కడుపులు తెచ్చుకుని బిడ్డల్ని కని పారేసి, చేతులు కడుక్కోడానికి నాకు డబ్బులేదు- డబ్బులేని నాలాంటివాళ్ళు మీ సలహాలని తప్పకుండా ఆచరించాల్సిందే. థ్యాంక్సు...వస్తా" ఉక్రోషంగా ఆవేశంగా అని కళ్ళల్లోతిరిగిన నీరు అతనికి చూపడం యిష్టం లేనట్టు గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది. కృష్ణమోహన్ చకితుడై, పోయాడు ఒక్కక్షణం సరోజ మాటలు వినగానే చెళ్ళున కొట్టినట్లయింది. చటుక్కున ముందుకు వెళ్ళి భుజం పట్టుకుని తనవైపు తిప్పుకున్నాడు. "ఏమిటంటున్నావు నీవు" అతనలా ప్రవర్తిస్తాడని ఊహించని సరోజ తెల్లపోయింది. తన భుజాలమీద అతని చేతులు చూసింది. అది గమనించనట్లే, "ఇందాక అన్న మాటలు ఎవరి గురించి అన్నావు చెప్పు" ఆరాటంగా మళ్ళీ అడిగాడు. సరోజ వదిలించుకోబోయింది. అతను వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆవేశంలో ఉక్రోషంతో ఏదో అనేసింది సరోజ. ఆ మాటలకి అర్ధం ఏమని చెప్పగలదు. "అవునండీ! డబ్బున్న వాళ్ళు నీతి, నియమాలను డబ్బు చాటున దాచుకోవచ్చు. వారేం చేసినా లోకం కళ్ళు మూసుకుంటుంది. ఎటొచ్చీ నాలాంటి ఆడపిల్లలమీదే సమాజం ప్రతాపం చూపించగలదు అన్నాను. అంతే ప్రత్యేకం ఎవరి గురించి అనలేదు. దయచేసి నన్ను వదలండి-" తీక్షణంగా అంది సరోజ. "నా గురించి ఎవరో చెప్పినంత మాత్రాన యింత నీచంగా నన్నూహిస్తారని ఎన్నడూ అనుకోలేదు. నిజానిజాలన్నీ తెలుసుకోకుండా యింత నింద ఎలా వేశారు" అతని చేతులు తొలగిస్తూ అంది. "అయితే ప్రభాకరంతో నీవు తిరగడం లేదా?" తెల్లపోతూ అన్నాడు-"తిరిగితే మీ దగ్గిర దాచాల్సింది, అబద్దం ఆడాల్సింది నాకేం లేదు" పౌరుషంగా అంది. "మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అదీ చాలా స్వల్పం. అతను నాకు కొలీగ్ మాత్రం...అంతే-" నిష్కర్షగా అంది సరోజ.
    "అయితే...మరి...మరి గీత...ఎందుకబద్దం ఆడింది?" తనలో తను గొణుక్కున్నట్లు అన్నాడు కృష్ణమోహన్. గీత ఎందుకిలా చెప్పిందో సరోజకి తెలుసు. ముందరి కాళ్ళకి బంధంలా తన గురించి వున్నవి లేనివి పుట్టించి అతని మనసు విరిచేస్తే తరువాత ఒకవేళ తనేం చెప్పినా అతను నమ్మడు అని ఇలా చెప్పిందన్నది సరోజకి అర్ధమైంది. కాని ఆ మాట అతనికేలా చెప్పడం? "సరోజ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. సరోజకి ప్రభాకరంకి మధ్య ఏం లేదని సరోజ నోట విన్నాక కృష్ణమోహన్ కి ఏదో రిలీఫ్ అన్పించింది. కాని - సరోజ అన్న మాటలకి వెనక ఏదో అర్ధం వుందని అతనికి స్ఫురించింది, గీతని గురించి అందా..ఆ మాట నిజమా! ఆరోజు ప్రభాకరాన్ని చూసి గీత గాభరాపడి పరిగెత్తడం అతనికి గుర్తు వచ్చింది. దీనికి దానికి సంబంధం వుందా! ఏదో అనుమానం మనసులో రేకెత్తింది. సరోజ ప్రభాకరంని ప్రేమించడం లేదన్న తృప్తిని-గీత గురించిన అనుమానం అసంతృప్తిని యిచ్చి రాత్రంతా నిద్రపోలేకపోయాడు కృష్ణమోహన్. మర్నాడు సాయంత్రం ప్రభాకరం ఆఫీసు దగ్గర - కాస్త దూరంలో కారులో కూర్చుని ప్రభాకరం కోసం ఎదురుచూడ సాగాడు కృష్ణమోహన్. సరోజ వెళ్ళిపోగానే కారు తీసుకొచ్చి ఆఫీసుముందు నిలిపాడు. కాసేపటికి ప్రభాకరం రాగానే" ప్రభాకరంగారూ.....మీతో పది నిమిషాలు మాట్లాడాలి. ఒక్కసారి నా వెంటరాగలరా?" అన్నాడు కృష్ణమోహన్. ప్రభాకరం ముందు ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి తరువాత అర్ధమైనట్టు "పదండి-ఎక్కడికి వెడదాం-" అన్నాడు.
    "రండి, కారెక్కండి. అలా ఎటైనావెళ్ళి మాట్లాడుదాం." అన్నాడు. ఇద్దరూ కారెక్కారు. "మీరు, బహుశా సరోజగారి గురించి మాట్లాడడానికి వచ్చి వుంటారనుకుంటాను" సూటిగా అడిగాడు ప్రభాకరం "నిన్న జరిగినది సరోజగారు నాతో చెప్పారు. మా గురించి మీ కిలాంటి భావం రావడం దురదృష్టం. ఒకవేళ ఆమెపట్ల నాకు అలాంటి భావం వున్నా ఆమెకు అలాంటి ఉద్దేశం ఏకోశానాలేదు" ప్రభాకరం కృష్ణమోహన్ అడిగేవిషయం అర్ధం అయినట్లు చెప్పసాగాడు. కృష్ణమోహన్ పట్టుబడిన దొంగలా కనబడ్డాడు.
    "ఆమెకు లేదని మీ కెలా తెలుసు? అడిగారా.!"
    "అవును, అడిగాను తనమీద అలాంటి ఉద్దేశం ఎంతమాత్రం వద్దని ఆమె నిష్కర్షగా చెప్పింది. నిన్న జరిగిందానికి ఆమె ఎంతో నొచ్చుకున్నారు. మీ దృష్టిలో ఆమె దిగజారి నందుకు బాధపడ్డారు. ఆమె రానంటున్న మా అక్క నేను ఆమెని బలవంత పెట్టి సినిమాకి తీసికెళ్ళాం-"
    "మీ అక్కగారు వచ్చారా?" ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్ - "మీ ఇద్దరే వెళ్ళలేదా?" ఆ ప్రశ్న అర్ధం అయి అదోలా నవ్వి "నేరాలు చెప్పేవారు నమ్మించేట్టు చెపుతారు. అలాంటివి నమ్మేముందు నిజానిజాలు తెల్సుకోడం సహృదయుల కర్తవ్యం-" ప్రభాకరం నవ్వుతూనే అంటించాడు. కృష్ణమోహన్ మొహం సిగ్గుతో నల్లబడింది ఒక క్షణం. తడబడుతూ "అది సరే - సరోజ మిమ్మల్ని నిరాకరించడానికి ఏదన్నా కారణం చెప్పిందా?" ఆరాటంగా చూస్తూ అడిగాడు.
    "చెప్పింది - తన మనసు మరొకరిది అని చెప్పింది -మరొకరికి యిచ్చిన దానికీ భాగం పంచలేనని చెప్పింది." ప్రభాకరం ఆ మాటలు చెపుతూ కృష్ణమోహన్ వంక చూశాడు. డ్రైవ్ చేస్తున్న అతని మొహంలో భావం స్పష్టంగా కన్పించకపోయినా ఒక్క క్షణం అతని కళ్ళల్లో యేదో కాంతి తళుక్కుమన్నట్టు. స్టీరింగుమీది అతని చేయి వణికినట్లు అన్పించింది ప్రభాకరానికి. మాటల్లో ఊరిబయటికి వచ్చేసింది కారు. రోడ్డు వారన కారు ఆపి "పదండి అలా కూర్చుందాం" అన్నాడు కృష్ణమోహన్ కొండరాళ్ళు చూపిస్తూ.

 Previous Page Next Page