శివరాం మొహం పాలిపోయింది. "శారద ఆత్మహత్యకి తలపడిందా? ఎందుకు?.... ఎందుకు. ఎందుకలా చేసింది" మనసులో మాట తెలియకుండానే పైకి అన్నాడు.
"ఎందుకేమిటి బాబూ. మొగుడు పెల్లాలన్నాక మాటమాట అనుకొంటారు. యీ మాత్రం దానికి నిండు పాణం తీసుకుంటావా అమ్మా అని కేకలేశాను బాబూ. ఆ అమ్మకి అసలే అభిమానం. మీరు సిట పట లాడుతూ కేకలేస్తే ఆ అమ్మకి పౌరుషం వచ్చి ఇంత పని సేసేసింది. బాబూ ఇకపై ఆ అమ్మని జాగ్రత్తగా సూసుకో బాబూ, మాట జారకు" అప్పలమ్మ హితోక్తులు సాగుతున్నాయి.
అవేవి శివరామ్ కు వినపడలేదు. శారద ఇంతకి తెగించిందా? ఎంతపని చేసింది. తనని నలుగురిలో అవమానపరచడానికి కాకపోతే అంత ఏం కొంప మునిగిందని ఇంత ఘోరం చెయ్యాలి. ఆవేశంతో అతని వళ్ళు ఉడికిపోసాగింది.
అప్పలమ్మ యిల్లు తుడిచి, హోటల్నుంచి కాఫీ, టిఫిను తెచ్చి పెట్టి వెళ్ళింది.
యాంత్రికంగా కాఫీ తాగుతున్నా -టిఫిను తింటున్నా శివరామ్ మనసు శారద చేసిన పనికి కుతకుతలాడుతూంది.
పది గంటల రైలు దిగి శారద వచ్చేసరికి బోనులో పులిలా పచార్లు చేస్తున్నాడు శివరామ్ ముందు గదిలో.
సూట్ కేసు పట్టుకుని లోపలికి అడుగుపెట్టిన శారదని చూడగానే అప్పటి వరకు ఎవరి మీద చూపాలో తెలియని చిరాకు, కోపం, ఉక్రోషం ఒక్కమ్ముడిగా చుట్టుముట్టాయి.
"ఎక్కడికి వెళ్ళావు?" తీక్షణంగా చూస్తూ అన్నాడు పళ్ళుకొరికి. ఆ క్షణంలో ఆ కోపంలో అంతకంటే మాటరాలేదు.
అతని తీక్షణతకి శారద మనసులో అరక్షణం బెదిరింది. కాని అది పైకి కనబడకుండా నిబ్బరంగా చూస్తూ "మా చెల్లెలి పెళ్ళికి వెడుతున్నట్టు ఉత్తరం రాసిపెట్టాను, చూడలేదా" అంది సౌమ్యంగా.
'ఎవరిని అడిగి వెళ్ళావు? నిన్ను వెళ్ళద్దని చెప్పాను, ఎందుకు వెళ్ళావు?' గొంతు మరింత పెరిగింది.
"అలా నా చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళడానికి వీలులేదని కట్టడి చేసే అధికారం మీకు లేదని తెలిశాక వెళ్ళాను" శారద నిబ్బరంగా చూస్తూ అని సూట్ కేసు పట్టుకుని లోపలికి వెళ్ళబోయింది.
శివరామ్ ఒక్కక్షణం నిర్ఘాంతపోయాడు. తనని ఎదిరించి నిర్లక్ష్యంగా జవాబిస్తున్నది శారదేనా అన్న దిగ్బ్రమతో, అపనమ్మకంగా చూశాడు శారదని. వెంటనే అతని మొహంలో రక్తం పొంగింది. విసురుగా దగ్గిరికి వెళ్ళి చెయ్యెత్తి "ఎదిరించి జవాబు చెపుతున్నావా! అంతవరకు వచ్చిందా నీ వ్యవహారం" పళ్ళు కొరికాడు.
శారద ఆ కోపానికి బెదరకుండా సూటిగా తీక్షణంగా చూసింది. "ముందా చెయ్యి దింపండి. తిట్టి కొడితే ఇక మీదట సహించను. భార్యని మర్యాదగా చూడడం నేర్చుకోండి."
మరోసారి నిర్ఘాంతపోవడం శివరామ్ వంతయింది. మాటల కోసం తడుముకున్నాడు.
"ఓహో అంతవరకు వచ్చిందా వ్యవహారం. అంత పొగరు ఎక్కిందా! మాటకి మాట జవాబు ఇచ్చేంత దానివయ్యావా. పో - ఎక్కడనించి వచ్చావో అక్కడికే ఫో. నీవేం చేస్తే అది సహించి పడుంటా ననుకున్నావా. పో ముందు బయటికి" ఉగ్రుడయి అరిచాడు.
"అగ్ని సాక్షిగా నలుగురెదురుగా కట్టుకున్న భార్యని పొమ్మనడం అంత సుళువు కాదు. భార్యని వదిలించుకోవాలంటే చాలా తతంగం ఉంది.
"నేను పోవాలంటే కోర్టుకెక్కి విడాకులు ఇవ్వండి. అంత వరకు పొమ్మనే అధికారం మీకు లేదు."
శివరామ్ కిది రెండోషాక్! శారదలో యీ నాటి ఈ తీరు శివరామ్ ఊహించనిది. అడుగడుగునా అతను ఆశ్చర్యచకితుడవుతూ శారదకేం పిచ్చి పట్టలేదు గదా అన్నట్టు తెల్లబోయి చూశాడు.
ఆమె అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే ఏం చెయ్యాలో తోచలేదు. పుట్టింట్లో ఎవరో ఏదో నేర్పిఉంటారు. ఆమె ముందు తగ్గి పోవడానికి అహం అడ్డు వచ్చింది.
"ఓహో, అంత దూరం వెళ్ళిందన్నమాట వ్యవహారం! అంత సరదాగా ఉంటే అలాగే ఇస్తాను విడాకులు. అడుక్కుతింటూ పోదువుగాని" ఉక్రోషంగా, కసిగా అన్నాడు.
"ఫరవాలేదు. ఈ బతుక్కంటే ఏ బతుకూ తీసిపోదు లెండి. మీ ఇంట్లో చేసే వంట మరెవరి ఇంట్లోనన్నా చేసి ఆ మాత్రం తిండి సంపాదించుకోగలను. ఇంతకంటే ఆత్మ గౌరవంతో బతకగలను. అంచేత పో పో అని బెదిరించకండి" నిర్లక్ష్యంగా అంది.
"నిన్ను నేను బాధ పెడ్తున్నానని నలుగురికి చెప్పడానికే కదూ ఆత్మహత్య తలపెట్టి నన్ను నలుగురిలో అవమానం చేశావు. పైగా ఎదిరించి జవాబులు చెప్తావా? తప్పు తప్పనడంపోయి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహిస్తానను కున్నావా" అరిచాడు.
ఎదురయిన ఈ స్థితి అత నూహించనిది అవడం వల్ల మనిషి వణికి పోతున్నాడు ఆవేశంతో వళ్ళంతా చెమటలు పట్టింది.
"అవును ఆత్మహత్య తల పెట్టడం పొరపాటే. తప్పే మీ లాంటి వారికి భయపడి నిండు నూరేళ్ళ జీవితాన్ని ముగించాలనుకోడం నా తప్పే. నేను చస్తే రేపటికి రెండు అనుకుని మూడోరోజు మళ్ళీ పెళ్ళికి తయారయ్యే మీ లాంటి వారికి జడిసి నా బతుకు పరిసమాప్తి చేసుకోవాలనుకోడం అవివేకమే. నలుగురికి తెలియడం మంచిదేలెండి. రేప్పొద్దున్న ఏం జరిగినా నేరం నా మీద వుండదు" శారద నిర్లక్ష్యంగా అంది.