Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 38


                                                  తండ్రికి తగిన తనయుడు

    అసమానమైన ఆత్మబలంతో అఖండమైన పాండిత్యంతో ప్రతిపక్షిని పరాభవించి కన్నతండ్రిని కాపాడుకొన్న ప్రతిభాశాలి అష్టావక్రుడు. అష్టావక్రుడు కహోడమహర్షి కుమారుడు. కహోడుడు వేదవేదాంగాలూ సమస్తశాస్త్రాలూ సమగ్రంగా అభ్యసించిన మహాపండితుడు. కాని పెద్దమ్మకు ముద్దుబిడ్డడైన గర్భదరిద్రుడు.
    కహోడమహర్షికి లేకలేక కలిగిన ప్రియపుత్రుడు అష్టావక్రుడు. అష్టావక్రుడికి పూర్వజన్మ పుణ్యంవల్ల సర్వవిద్యలూ సహజంగానే సంక్రమించాయి. అందరూ అతనిని బాల్యంలోనే సరస్వతీ స్వరూపుడుగా భావించేవారు.
    ఒకనాడు కహోడుడు ఒక పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని వేదపాఠాలు వల్లెవేస్తున్నాడు. అందులో పొరపాటుగా ఒకచోట స్వరం తప్పిపోయింది. అది విని ఆ సమీపంలో ఆడుకుంటున్న అయిదేళ్ళ పసిబాలుడు పకపక నవ్వుతూ "తప్పు తప్పు" అని పరిహాసం చేశాడు. ఆవిధంగా తన పాఠంలో తప్పు పట్టినందుకు అతనిమీద పట్టరాని కోపం వచ్చింది తండ్రికి. వెంటనే అతడు పటపట పండ్లు కొరుకుతూ కుమారుని చూచి "దుర్మార్గుడా! నా కడుపునా బుట్టిన నీవు నన్నే ఎగతాళి చేస్తావా? నా పాఠంలో తప్పులు పడతావా? వ్రేలెడు లేని పసిపాపడివి! నీకు ఇప్పుడే ఇంత అహంకారమా? ఇప్పుడే ఇంత కౌటిల్యమా? ఈ విధంగా నీవు వక్రబుద్ధితో వర్తించినందుకు నిన్ను అష్టావక్రుడిగా శపిస్తున్నాను. నీ శరీరం ఎనిమిది చోట్ల వంకరలు తేలి వికృతమైపోతుంది. నీ కురూపం చూచి అందరూ నిన్ను అవహేళన చేస్తారు. నీవు అనాకారివై నలుగురిలోనూ నవ్వులపాలై పోతావు. పో! నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఇదే" అని కోపావేశంతో శాపం పెట్టాడు కహోడుడు.
    వెనువెంటనే మునిబాలుని శరీరం ఎనిమిది చోట్ల వంకరలు దేరింది. ముని కుమారుడు అష్టావక్రుడైనాడు! ఇంతలోనే కహోడుడి కోపం చల్లారిపోయింది. ఆవిధంగా కురూపి అయిన కుమారుణ్ణి చూడగానే ఆయనకు చాలా దుఃఖం కలిగింది. తన తప్పు చెప్పిన పాపానికి కన్నబిడ్డను అంత కఠినంగా శపించినందుకు ఎంతగానో చింతపడ్డాడు కహోడుడు. ఆయన తన దురాగ్రహానికి పరిపరివిధాల పరితపించాడు. కాని ఇప్పుడు తను చేయగలిగింది ఏమీలేదు. శాపం మరల్చటానికి తనకు శక్తి లేదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం!
    అంతకంతకూ కహోడుడికి కుటుంబ పోషణమే కష్టమైపోయింది. అతను ధనసంపాదన కోసం మార్గాన్వేషణం సాగించాడు. ఒకనాడు భార్యను చూచి "దేవీ! ఇప్పుడు ధనసంపాదనకు నాకు ఒక్కటే మార్గం కనిపించింది. మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనకచక్రవర్తి ఆస్థానంలో "వంది" అనే ఉద్దండ పండితుడు ఉన్నాడు. అతనిని శాస్త్రచర్చలో జయించిన వాడికి అసంఖ్యాకమైన ధనకనకరాసులు బహుమానం ఇస్తానని జనకచక్రవర్తి ప్రకటించాడు. కాని పరాజితులైన పండితులందరినీ సముద్రగర్భంలో పారవేయటానికి ప్రతిజ్ఞ పట్టాడు వంది. అందువల్ల నేను మిథిలకు వెళ్ళి నా భాగ్యరేఖను పరీక్షించుకుంటాను. అదృష్టవశాన వందిని జయిస్తే అపారమైన ధనంతో తిరిగి వస్తాను. ఒకవేళ నేను పరాజయం పొంది సముద్రం పాలైతే నీవు ఎంతమాత్రమూ చింత పడవద్దు. మన అష్టావక్రుణ్ణి పెంచి పెద్దజేసి వందిని జయించి రమ్మని చెప్పు" అని అన్నాడు కహోడుడు.
    అంత సాహసానికి పూనుకోవద్దని ఎంతగానో బ్రతిమాలింది మునిపత్ని. కాని కహోడుడు పట్టినపట్టు విడువలేదు. అతడు వెంటనే ప్రచండుడైన రాజపండితుడితో వాదించటానికై జనకమహారాజు ఆస్థానానికి ప్రయాణమై వెళ్ళాడు.
    సర్వవిద్యావిశారదుడైన జనకచక్రవర్తి ఆస్థానంలో వందికీ కహోడుడికీ శాస్త్రవివాదం సాగింది. పండితమండలి వారి వాదాలను శ్రద్ధగా పరిశీలిస్తున్నది. కొమ్ములు తిరిగిన మహాపండితుల నెందరినో పరాభవించిన రాజపండితుడి వాదనైపుణికి కహోడుడు తట్టుకోలేకపోయాడు. మత్తగజాలే పరుగెత్తిపోతే మశకం గతి ఏమున్నది! వంది ప్రశ్నలకు బదులు పలకలేక నీరసంగా నిలబడ్డాడు కహోడుడు. వంది విజయగర్వంతో పరాజితుడైన ప్రతిపక్షిని చూచి "బుద్ధిహీనుడా! అంతరాలు తెలియక అంతదూరం నుంచి వందిని జయించాలని వచ్చావా! కండకావరంతో కళ్లుకానక మా మీదనే కయ్యానికి కాలుదువ్వుతావా?  నీ అహంకారానికి తగిన శిక్ష అనుభవించు." అని భయంకరంగా గర్జించాడు. రాజపండితుని ఆజ్ఞానుసారం కహోడుణ్ణి సముద్రగర్భంలో ముంచివేశారు రాజభటులు.
    కాలం గడచిపోతున్నది. అష్టావక్రుడు పదిపన్నెండేళ్ళ బాలుడైనాడు. అతడు మాతామహుడైన ఉద్దాలక మహర్షి దగ్గర పెరిగి పెద్దవాడైనాడు. ఉద్దాలకుడు చిన్నతనం నుంచీ కన్నతండ్రి లేని లోటు కన్పించకుండా అష్టావక్రుణ్ణి గారాబంగా చూచుకొనేవాడు. అష్టావక్రుడు కూడా అన్నివేళల్లో ఆయన్నే అంటిపెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆయననే తండ్రి అని అనుకుంటూ ఉండేవాడు.
    అష్టావక్రుడు తాతగారి దగ్గర వేదశాస్త్రాలూ, కావ్యపురాణాలూ అన్నీ అధ్యయనం చేశాడు. తర్క శాస్త్రంలో ప్రవీణుడైనాడు. వాద నైపుణిలో బాగా ఆరితేరాడు.
    ఒకనాడు అష్టావక్రుడు తాతగారి ఒడిలో తలపెట్టి పడుకొని కమ్మకమ్మని కథలు వింటున్నాడు. ఆ సమయంలో ఉద్దాలకుడి కుమారుడైన 'శ్వేత కేతుడు' అక్కడికి వచ్చాడు. అతనికి తండ్రి తొడమీద తలపెట్టి పడుకున్న అష్టావక్రుణ్ణి చూడగానే చాలా అసూయ కలిగింది. శ్వేతకేతుడు ఆగ్రహావేశంతో అష్టావక్రుణ్ణి క్రిందికి లాగి "పోరా! పో. తండ్రిలేని దౌర్భాగ్యుడా! నా తండ్రి తొడమీద తల పెట్టటానికి నీకేం అధికారం ఉంది? అంత కోరికగా ఉంటే నీ తండ్రితోపాటు నీవు కూడా సముద్రంలో దూకి చావరాదూ! హాయిగా తండ్రి ఒడిలో తలపెట్టి పడుకోవచ్చు." అని కసిరి కొట్టాడు.
    ఆ మాటలు వినగానే అష్టావక్రుడికి దుఃఖం పొంగివచ్చింది. అతడు కన్నీరు కారుస్తూ ఉద్దాలకుణ్ణి చూచి "తాతా! అయితే నా తండ్రి ఎవరు? ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలో పడి ఎందుకు చనిపోయాడు తాతా!" అని పరిపరివిధాలుగా ప్రశ్నించాడు.
    ఉద్దాలకుడు జరిగిన సంగతి సవిస్తరంగా వివరించి చెప్పాడు అష్టావక్రుడికి. అష్టావక్రుడు కొంచెం ఆలోచించి "అయితే నన్ను ఆశీర్వదించు. తాతా! నీవు కూర్చిన విద్యాబలంతో వందిని జయించి వస్తాను. తండ్రిని చంపిన పాపాత్ముడికి ప్రతీకారం చేస్తాను. పితృఋణం తీరుస్తాను. నన్ను దీవించి పంపు తాతా!" అని తాతగారి పాదాలమీద వ్రాలాడు.

 Previous Page Next Page