Previous Page Next Page 
జన్మభూమి పేజి 39

    ఎక్కడెక్కడి కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళకి టైము తెలియలేదు. పాతికేళ్ళుగా వాళ్ళు ఆప్తమిత్రులు. ప్రతి వీకెండ్ లో కలిసేవారు అమెరికాలో. కేశవరావు ఇండియా వచ్చేస్తుంటే గిలగిలలాడిపోయారు సునందవాళ్ళు. అమెరికా కబుర్లు, కేశవరావు తను చేసిన పనులు చెప్పుకుంటూనే ఫలహారాలు చేశారు. ఆ పూట ఆస్పత్రికి రానని కబురు పంపారు కేశవరావు. సుగుణ వచ్చి ఫలహారం చేసింది. వంట కూడా చెయ్యమని అందరం ఇక్కడే తిందాం అంటూ రాజేశ్వరి అంది. సుగుణ, రేణు కల్సి వంట చేశారు. రాజేశ్వరి సునందని అంటిపెట్టుకుని వుండిపోయింది. మధ్యాహ్నం రంగా, వాసు, శ్యామల అంతా వచ్చారు. సరదాగా భోజనం చేశారు. సుగుణ అప్పటికప్పుడు పెరుగు గారెలు, బొబ్బట్లు చేసి విందు భోజనం వడ్డించింది.
    "ఇక్కడ కూడా బాగానే ఉన్నట్టుంది. ఏ.సి.లు, పంపులు, జనరేటర్లు అన్ని సదుపాయాలూ వున్నాయి. ఏదో అనుకున్నాం, మీరు హ్యాపీగానే వున్నట్లున్నారు" అన్నారు మోహన్ రావు భోంచేస్తూ.
    "చెప్పాగా. హ్యాపీనెస్ అన్నది ఎక్కడుంటే అక్కడం మనం సృష్టించుకోవాలని. డాక్టర్ యిక్కడికి వచ్చాక ఈ వూరి కోసం ఏదో చెయ్యాలన్న నా తాపత్రయం, ఒక్కొక్క పని చేస్తుంటే కలుగుతున్న సంతృప్తి నాకు చాలా ఆనందాన్నిస్తుంది. బతికినందుకు నా జీవితానికొక సార్ధకత కలిగిందనిపిస్తుంది ఇన్నాళ్ళకి. ఇటు వూరి పెద్దగా, అటు డాక్టర్ గా బీదవారికి ఉచిత వైద్యం అందించడం తెలియని తృప్తినిస్తుంది."
    మధ్యాహ్నం నాలుగు గంటలకి కారులో వెంటబెట్టుకుని మిత్రులకి వూరంతా తిప్పి చూపిస్తూ తాను సాధించినది, సాధించదలచినది అన్నీ వివరించారు. స్కూలు, ఆస్పత్రి, పొలాలు, ట్రాక్టర్లు, రోడ్లు అన్నీ చూపించి గర్వంగా ఒక్కొక్కటి వివరించారు.
    "ఇదంతా చూస్తుంటే నాకూ ఇండియా వచ్చేసి మీలా మా ఊరిని తీర్చిదిద్దాలనిపిస్తుంది. రియల్లీ. యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్" తన ప్రాణ మిత్రుడిని అభినందించారు.
    "నిజంగా మీరు వస్తే, మీలాంటి వారికి మార్గదర్శకుడిని అయ్యానని గర్వపడతాను. రావాలి మోహన్. మనలాంటివాళ్ళం పూనుకోకపోతే ఈ పల్లెలు మారవు. ఆలోచించండి గట్టిగా. మనం సంపాదించాల్సినంత సంపాదించాం. పిల్లల బరువు బాధ్యతలు అయిపోయాక ఆలోచించండి ఈ విషయం-" స్నేహితుడికి ఉద్భోదించారు కేశవరావు.
    రాత్రికి వుండిపోయి తనివితీరా కబుర్లు చెప్పుకుని తెల్లారి నలుగురూ కల్సి విజయవాడ వెళ్ళారు పెళ్ళికి. స్నేహితురాలికి మంచి జరీ చీర, పెళ్లికూతురికి వెయ్యినూట పదహార్లు చదివించింది రాజేశ్వరి. ఆ రోజంతా పెళ్ళి హడావిడి అయ్యాక మర్నాడు ఉదయం బయలుదేరి వచ్చారు కేశవరావు, రాజేశ్వరి. స్నేహితులు వచ్చి వెళ్ళిన ఆనందంతో రాజేశ్వరికి మళ్ళీ రొటీనులో పడడానికి రెండు రోజులు పట్టింది.
                                                           *    *    *
    తొలకరి వానలు ఆరంభించగానే పొలం పనులు ఆరంభమయ్యాయి. నాట్లు మొదలయ్యాయి. అటు రాజేశ్వరి స్కూలు పనులతో, రోజురోజుకీ ఇరుగుపొరుగు వూర్లనుంచి వచ్చే రోగులతో కేశవరావుగారు బిజీ అయిపోయారు. వాసు ఆరో క్లాసుకి పాఠాలు చెప్పడం, సాయంత్రం లెక్కలు చూడడం, వీలున్నప్పుడల్లా ట్రాక్టర్లు నడపడం, రంగా, మునసబు, చౌదరి పొలం పనులు పర్యవేక్షణ. అందరూ ఎవరి పనులలో వారు బిజీ అయిపోయారు. వర్షాలు ఈ ఏడాది సంతృప్తికరంగానే పడడంతో పొలాలన్నీ పచ్చగా నవనవలాడుతున్నాయి.
    వానాకాలం ఆరంభమయిందగ్గరనుంచి హరిజనవాడనుంచి విరోచనాలు, దగ్గు, జలుబు, గొంతు నొప్పుల కేసులు, మలేరియాలు అన్ని కేసులు ఎక్కువయ్యాయి.  
    "అంకుల్ మీరింకా చెయ్యాల్సిన పని ఒకటి వుంది. మంచి రోడ్లు వేసి గుంటలు, బురదలు లేకుండా చేశారుగాని ఆ హరిజనవాడలో శుభ్రత అలవర్చుకోలేదు వాళ్ళింకా. ఒక్కసారి మీ దృష్టి అటు మళ్ళించి మందలించాలి వాళ్ళని. గుడిసెలన్నీ దగ్గర దగ్గర వుండడం, చెత్త కుప్పలతో వర్షాకాలం వస్తేచాలు. రోగాలు విజృంభింస్తాయి. ముఖ్యంగా నీళ్ళు నూతుల్లోంచి తాగుతారేమో విరోచనాలు పట్టుకుంటాయి..." అని వివరించాడు వాసు.
    "నిజంగానా... ఏమిటో ఒకసారి అటువైపు వెళ్ళాగాని అంత పట్టించుకోలేదు. ఈరోజు మధ్యాహ్నం అటు వెడదాం ఒకసారి నాలుగు గంటలకి రా ఇంటికి."
    హరిజనవాడలో నూరు నూట ఏభయ్ పాకలున్నాయి. అంతా కూలీలు. ముఖ్యంగా రైతు కూలీలు. చేపల చెరువులో పనిచేసేవారే. మరీ చిన్న గుడిసెలు. కొన్నింటికి కప్పులే సరిగా లేవు. ఇళ్ళ మధ్య జాగాలేదు. వున్నా ఇరుకు సందులు. యింటి ముందు చెత్త కుప్పలు, కుళ్ళు నీళ్ళు పారుతున్నాయి.  
    కేశవరావుని చూసి అందరూ గుడిసెలలోంచి బయటికి వచ్చి దండాలు పెట్టారు. ఆయన ఇటు ఎందుకు వచ్చారా అని ఆశ్చర్యపడ్డారు. ఆయన అందరిని ఉద్దేశించి "మీ హరిజనవాడ నుంచి రోజూ ఇంతమంది మందుల కోసం ఎందుకు వస్తున్నారో నాకర్ధం అయింది.
    మీ ఇళ్ళు, పరిసరాలు, చెత్త కుప్పలు, ఈ కుళ్ళు కాలవలు ఇవన్నీ ఇలా వుంచుకుంటే రోగాలు ఎందుకురావు? మీ ఇళ్ళు ఉంచుకోవాల్సిన తీరు ఇదేనా..." ఆయన కాస్త కోపంగా చూశారు అందరివంక. అంతా ఏం జవాబివ్వాలో తెలియనట్టు తలలు దించుకున్నారు.
    "నేను వూరంతా బాగుపర్చాలని ఎంత తాపత్రయపడుతున్నా, మీరు ఇలాగే ఉన్నారు. కాస్త ఇల్లు, పరిసరాలు శుభ్రంగా కూడా వుంచుకోలేకపోతే మీకు ఎవరేం చెయ్యగలరు. డబ్బులేని బీదరికానికి, శుభ్రానికి సంబంధం ఏమిటి? ఈ చెత్త యింటిముందే వేసుకోకపోతే ఓ గొయ్యి తవ్వి దూరంగా పారెయ్యవచ్చు గదా.
    ఇక్కడ ఇదివరకులా మట్టిరోడ్డు కాదు, తారు రోడ్డు. అయినా ఈ కుళ్ళు నీళ్ళు ఇలా ఎందుకు నిల్చిపోయాయి వాసూ. రేపు మనందరం ఇక్కడికొచ్చి ఈ చెత్తకుప్పలు, అవి తీసి బాగుచేయాలి. వూర్లో కుర్రవాళ్ళందర్నీ పోగుచెయ్యి. వాళ్ళు చెయ్యరు మనమన్నా చెయ్యాలి. ఇలా వుంటే రోగాలొస్తాయి" అన్నారు.
    అంతా మొహాలు చూసుకున్నారు.
    "వద్దు అయ్యా! మీరు చెయ్యడం ఏమిటి, మేం తీసేస్తాంలెండి ఈ కుప్పలన్నీ..." మొగాళ్ళు ముందుకు వచ్చి అన్నారు సిగ్గుపడుతూ.
    "చూడండి! ఎవరిల్లు, ఎవరి వీధి, ఎవరి వూరు వారు శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత. యిలా నేను వచ్చి మీకు చెప్పడం ఏమిటి? ఎవరికి వారు చూసుకోవాల్సిన విషయాలివి. నేను రోజూ వచ్చి చూడగలనా... ఎవరు చెప్పినా ఎన్నాళ్ళు చెపుతారు. ఎన్నాళ్ళు వచ్చి చూస్తారు" నిరాశగా అన్నారు.
    "లేదులెండి బాబూ! మీరెందుకు రావడం...మేం శుభ్రం చేసేస్తాం చూడండి. రేపు సాయంత్రానికల్లా చేస్తాం" అందరూ ముక్తకంఠంతో వాగ్దానం చేశారు.
    "సరే! రేపు సాయంత్రం ఇదే వేళకి వస్తాను. ఈ కుప్పలు ఇలాగే వుంటే నేనే శుభ్రం చేస్తాను. అంతేకాదు ఇకమీదట వారానికి ఒకరోజు వచ్చి చూస్తాను. మీరు ఈ ప్రాంతాలు శుభ్రంగా వుంచుకోకపోతే ఏ రోగాలు వచ్చినా మందుకి నా దగ్గిరకి రాకండి" ఆయన కాస్త కోపం నటిస్తూ విసవిసా వెళ్ళిపోయారు.
    "డాక్టరు బాబుకి కోపం వచ్చింది. అరేయ్, రేపు ఉదయం ఇక్కడంతా శుభ్రమైపోవాలి." వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు.
    ఇంటికొచ్చేసరికి ఆడవాళ్లంతా ఆ పూట చదువు మానేసి రెండుసార్లు వాళ్ళు అమ్మిన ఊరగాయలు, పచ్చళ్ళు, పొడులు, అప్పడాలు, వడియాల లాభాలు గురించి చర్చించుకుంటున్నారు. "ఈసారి మీకు యెంత లాభం వచ్చిందో తెలుసా? మొదటిసారి పద్దెనిమిది, రెండోసారి ఇరవై రెండువేలు వచ్చింది తెలుసా?" గర్వంగా అంది.

 Previous Page Next Page