Previous Page Next Page 
జన్మభూమి పేజి 40

    "గుడ్! ఒక్కొక్కరికి ఎంత వచ్చింది. బాగానే వుందే బిజినెస్" అని మెచ్చుకున్నారు.
    "అవే లెక్కలు చూస్తున్నాం. ఈ రెండు నెలలు కష్టపడ్డందుకు అందరికీ చేసిన పని ప్రకారం దగ్గర దగ్గర రెండువేలు వచ్చింది ఒక్కొక్కరికి. ఇది చూసి ఇంకా ఆడవాళ్ళు చేస్తాం అంటూ వస్తున్నారు.
    "మరింకేం! ఆపకుండా రెగ్యులర్ గా చేయండి. ఏ సీజన్ లో ఆ పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, పొడులు అవి ఎప్పుడూ చెయ్యొచ్చు.
    "వీటితోపాటు ఈసారి తినుబండారాలు, అరిసెలు, లడ్డూలు, మినపసున్ని, చక్కిలాలు, జంతికలు, మిక్చర్ లాంటివి కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీరు మాకొక హెల్ప్ చేయాలి. మన అన్నపూర్ణమ్మ గారి చెల్లెలు విజయవాడలో వుంటారు. మనం తయారుచేసే సామాను ఆవిడ షాపు పెట్టి అమ్మిపెడతాం అంటున్నారు. అమ్మకాల్లో ఆవిడకి కొంత పర్సెంట్ యిస్తాం. రెగ్యులర్ గా ఆవిడ షాపుకిచ్చి ఓ మూడు నాలుగు నెలలకి ఓసారి మా అంతట మేం సేల్ పెడదామనుకుంటున్నాం. ఆ షాపుకి పర్మిషన్,పెట్టుకోడానికి చోటు - కాస్త బ్యాంక్ లోను కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పించాలి.
    రెగ్యులర్ గా అమ్మేవారు సిటీల్లో వుంటే బాగుంటుంది. హైదరాబాదులో రగా కూతురు పద్మకి కూడా రాయించాను. తనూ ఎలాగో ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మకాలు చూస్తే తనకీ కొంత పర్సెంటు యిస్తే కాస్త రాబడి వుంటుంది. రంగాని వెళ్ళి ఓసారి మాట్లాడి రమ్మంటున్నాను. ఇది కేవలం ఎగ్జిబిషన్ లాకాక రెగ్యులర్ అమ్మకాలుంటే వీళ్ళందరికీ రెగ్యులర్ రాబడి వుంటుంది" రాజేశ్వరి తాపత్రయం అర్థం అయింది ఆయనకి.
    "అలాగే మాట్లాడుతానులే. చూద్దాం. తప్పకుండా చూద్దాం" అని వాగ్దానం చేశారు.
    అంతా వెళ్ళాక భార్యతో నవ్వుతూ "ఆర్నెల్లలో వీరు వారవుతారంటారు. ఫరవాలేదు నీవూ దారిలో పడ్డావు."
    రాజేశ్వరి ఏమిటన్నట్టు చూసింది!
    "అదే ఏదో చెయ్యాలన్న తాపత్రయం నీలోనూ కన్పిస్తుంది. నీలో చాలా మార్పు వచ్చింది. అమ్మో చచ్చినా రాను పల్లెటూరికి అన్నదానివి పదినెలల్లో ఈ వూరిలో భాగంగా మారిపోవడమేకాక, వూరికి ఏదో చెయ్యాలని ఆరాటపడుతున్నావు. ఐయామ్ హ్యాపీ! వెరీ హ్యాపీ! థాంక్ యూ వెరీమచ్" అన్నారు.
    రాజేశ్వరి కాస్త సిగ్గుపడి "నిజమే! నాకు తెలియకుండానే మీ అడుగుజాడల్లో నడిచాను. మీరన్నట్టు నేను ఈ వూరికి ఏదో చేసేయాలని, మా ఆడవాళ్ళందరికీ వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడే అర్హత కలిగించాలని అనిపిస్తుంది సుమా... ఇది ఎచీవ్ మెంట్ అనే చెప్పాలి.
    అందరూ స్వంత ఆర్జన చూసుకుని మురిసిపోతున్నారు. రోజుకు రెండు మూడు గంటలు కష్టపడితే, అసలు అందరూ కల్సి చేస్తుంటే ఆడుతూ పాడుతూ సరదాగా చేస్తున్నట్టు ఫీలవుతున్నారు. కాలక్షేపానికి కాలక్షేపం, డబ్బుకి డబ్బు వస్తుంటే అంతా సంతోషంగా ముందుకు వస్తున్నారు."
    "నిజంగానే ఇట్ ఈజ్ ఎనీ ఎచీవ్ మెంట్- ఐ కంగ్రాచ్యులేట్ యూ" భార్య చెయ్యి నొక్కి అన్నారు కేశవరావు.
    వాళ్ళు మాట్లాడుకుంటుండగా దూరం నుంచి శ్యామల, వాసు మాట్లాడుకుంటూ ఏదో నవ్వుకుంటూ వస్తున్నారు.
    రాజేశ్వరి వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ "వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు ఓ మంచి ఆలోచన వస్తుంది. ఇద్దరూ ఈడూ జోడూగా లేరూ- ఈ మధ్య వాళ్ళిద్దరినీ కనిపెడుతున్నాను. అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడ్డట్టున్నారు" కొంటెగా నవ్వుతూ అంది.
    కేశవరావుగారు నవ్వి "నీకూ అలా అనిపించిందా. వాసు రోజులో ఒకసారన్నా ఏదో వంక పెట్టుకుని ఆస్పత్రికి వస్తాడు పని కల్పించుకుని. ఈ మధ్య మనవాడు శ్యామల పిచ్చిలో పడ్డాడని నాకూ అన్పించింది.
    "మరింకేం. శుభస్యశీఘ్రం అని అక్షింతలు చల్లేస్తే సరి."
    "బాగుంది. వాళ్ళు ఏం అనుకుంటారో. వాళ్ళ మధ్య వున్నది వుత్త స్నేహమో మనకేం తెలుసు. అటు అమ్మాయి వాళ్ళు, యిటు అబ్బాయి వాళ్ళు అందరూ వుండగా మనం శుభం అనడం ఏమిటి."
    "ఏం! మనం పై వాళ్ళమా- ఇటు శ్యామలకి, అటు వాసుకి అందరికీ కావాల్సిన వాళ్ళమేగా. వాసూని మీరు కదపండి. నేను శ్యామలను అడుగుతాను."
    వాళ్ళ మాటలు పూర్తికాకుండానే వాసూ వచ్చి "రండి అంకుల్ గేమ్ ఆడుదాం" అన్నాడు నెట్ బిగిస్తూ.
    "ఇవాళ ఓపికలేదులే వాసూ. హరిజనవాడ తిరిగి అరిచి వచ్చాను. ఈ ఎండలో ఆడే ఓపిక లేదు. ఉదయం చల్లని టైములో అయితే ఫరవాలేదు గాని ఈ వేడిలో ఆడలేకపోతున్నాను. మీరిద్దరూ ఆడుకోండి" అన్నారు.
    వాళ్ళిద్దరూ ఆడుతుంటే అటు చూస్తూ కూర్చున్నారు లాన్ లో. ఆయనకీ మనసులో వాళ్ళిద్దరికీ పెళ్లి అయి ఈ వూరిలో సెటిల్ అయి శ్యామల హాస్పిటల్ వర్క్, వాసు వూరి సంగతులు చూసుకుంటూ వుండిపోతే బాగుండునని వుంది. ఆమాటే రాజేశ్వరితో నెమ్మదిగా అన్నారు. కాని ఆయన మనసులో చిన్న అనుమానం. శ్యామల డాక్టరు, వాసూ వుత్తి బి.కాం. సరైన ఉద్యోగం కూడా లేదు. శ్యామల ఒప్పుకుంటుందా...
    వప్పుకుంటుంది. శ్యామల అయినింటి పిల్ల ఏంగాదు. తండ్రి లేడు. ఎంత డాక్టర్ అయినా కాస్త అయినింటి సంబంధం కావాలంటే పెళ్లి ఖర్చు అది కూడా పెద్దగా పెట్టలేదు.
    వాసు ఉద్యోగం లేకపోయినా ఉన్నవూరిలో స్వంత యింట్లో భూములు చూసుకుంటూ వుండిపోతాడు. ఈ హాస్పిటల్ నీవు చూసుకో అంటే శ్యామల సంతోషంగా వప్పుకుంటుంది. నేను నచ్చచెపుతాను.
    అసలు మనం ఏం చెప్పనక్కరలేదు. యింకో నాలుగురోజులూరుకుంటే వాళ్లే బయటపడతారు అనిపిస్తుంది నాకు. ఈలోగా రంగా,సుగుణ అసలు ఏమంటారో వూరికే అడగండి" అంది.
    "అయితే ఒక షరతు పెడతాను. ఈ వూర్లోనే వుండి ఆస్పత్రి చూసుకుంటూ వుండిపోయే మాట అయితేనే పెళ్లికి వప్పుకుంటాం అని అందరం అంటే సరి" ఆయన స్వార్ధం ఆయనది.
    "శ్యామల ఎక్కడికి వెళ్ళదులేండి. ఆ అమ్మాయికి ఇది బాగానే వుంది." అంది. తరువాత ఒక్కక్షణం ఆలోచించి వాసూకి కూడా నెలకింత అని యిస్తున్నాంగా. ఉద్యోగం ఉన్నట్టే కదా. యింట్లో యింకో రూము వేయిస్తే యింట్లో వుంటారు. పల్లెటూరు అట్టే ఖర్చు ఏం వుంటుంది"
    అన్నీ మనమే ఆలోచించేస్తున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏమిటో అడగకుండా. వాళ్ళేం అడగక్కరలేకుండానే వారం రోజుల తరువాత వాసూ రాజేశ్వరి దగ్గిరచేరాడు ఓ సాయంత్రం.
    "ఆంటీ. మీరేం అననంటే ఓ మాట అడగాలి" అంటూ మొదలుపెట్టాడు.
    రాజేశ్వరి అర్ధమయి అర్ధం కానట్టు "ఏమిటీ- ఏమాట-" అంది.

 Previous Page Next Page