"రంగా ఈయనకి బస ఏర్పాటు ఎలా... అద్దెకి ఏదన్నా దొరుకుతుందా?"
రంగా ఆలోచించాడు! అద్దెకు ఏమున్నాయి. "ఏం రాజూ నీకేమన్నా ఈ వూర్లో ఇల్లు ఎక్కడ అద్దెకు దొరుకుతాయో తెలుసా" కోమటి నరసింహం అబ్బాయి రాజూని అడిగాడు రంగ.
"అద్దెకి ఏం వున్నట్టులేదుగాని, మన ఎమ్మెల్యే అచ్చిరెడ్డి యింటి వెనుక చిన్న ఔట్ హౌస్ లాంటిది వుంది. ఆయనిప్పుడు ఇక్కడ వుండడం లేదుగదా. ఇల్లు తాళం పెట్టాడుగాని ఆ అవుట్ హౌస్ అలా ఖాళీగానే వుంది. రెండు గదులు, వరండా వున్నాయి అక్కడ."
"అయితే ఆయన్ని కాంటాక్ట్ చెయ్యాలి.హైదరాబాదు అడ్రసుంటే రాయించు ప్రెసిడెంటు చేతకాదంటే ఫోను నెంబరు తెలిస్తే ఫోను చేస్తా రాత్రికి. అంతవరకు కృష్ణమూర్తిగారూ స్కూలుకి ఇప్పుడు శలవలేగనుక స్కూల్లో ఓ రూములో వుండండి. అదేదో దొరికాక ఫ్యామిలీని తెచ్చుకుందురుగాని."
"అలాగే సార్!" వినయంగా అన్నాడు.
"ఇదిగో యింక సేద్యం విషయం మాటిమాటికీ చూడడానికి నాకు టైముండదు. రంగా, మీరు, ప్రెసిడెంటు, మునసబుగార్లే చూసుకోవాలి. మిషన్లు తెప్పించాం. రైసు మిల్లు తయారవుతుంది. ఈ ఏడాది ఎంత పండిస్తారో, ఎంత లాభాలు తెస్తారో చూస్తాను. మనం బియ్యం డైరెక్టుగా మార్కెట్ కి తరలించాలి. ఏజంట్లు వద్దు" అందరికీ ఎవరి పనులు వారికి అప్పగించారు కేశవరావుగారు.
* * *
ఉదయం ఏడుగంటల వేళ షటిల్ ఆడుతుంటే గుమ్మం ముందు ఆగిన టాక్సీలోంచి దిగినవాళ్ళని చూస్తూనే కేశవరావు, రాజేశ్వరి బ్యాట్ విసిరేసి చిన్నపిల్లల్లా పరుగెత్తివెళ్ళి వచ్చినవారిని కౌగిలించుకున్నారు.
"హాయ్! వాటే ప్లెజంట్ సర్ ప్రైజ్ డాక్టర్" అంటూ డాక్టర్ మోహనరావు చేయి పట్టుకుని షేక్ హాండ్ యిస్తూ కుదిపేసారు కేశవరావు.
"ఏయ్ సునందా! కబురన్నా లేకుండా ఎక్కడనుంచయినా ఊడిపడ్డారు" రాజేశ్వరి సంతోషంతో మాట పెగలలేదు. "ఏమిటి ఇండియా వచ్చినట్టే తెలీదు. వచ్చి కూడా మాకు తెలియచెయ్యలేదన్నమాట అన్యాయం."
సునంద రాజేశ్వరిని కౌగిలించుకుని "అబ్బ! ఎన్నేళ్ళయిపోయినట్లు అనిపిస్తూంది మిమ్మల్ని చూసి. ఏడెనిమిది నెలలకే."
తెల్లపోయి చూస్తూ నిల్చున్న వాసు, శ్యామలని చూసి "మీరు డాక్టర్ మోహన్ రావు అని నా కొలీగ్. ఆర్ధోపెడిక్ సర్జన్. ఈమె మిసెస్ మోహన్ సునంద. ఆవిడ బయోకెమిస్ట్ చేశారు. ఈ అబ్బాయి నా అక్క మనవడు నాకు ఇక్కడ హెల్ప్ గా ఉన్నాడు. ఈ అమ్మాయి డాక్టర్ శ్యామల అని యిక్కడ హాస్పిటల్ కి అపాయింట్ చేశాను" అని పరిచయం చేసి, "రండి రండి లోపలికి. వాసూ యూ కేరియన్ విల్ ది గేమ్" అంటూ లోపలికి నడిపించుకుంటూ వెళ్ళారు. శ్యామల గేమ్ వద్దని లోపలికి నడిచి వంటింట్లోకి వెళ్ళింది.
"మిమ్మల్ని చూడగానే ఏమిటో ఎంతో సంబరంగా వుంది. అమెరికాని చూసినట్టే వుంది. ఎంతయినా ముప్పైఐదేళ్ళ అనుబంధం, మరి అమెరికా అంటే... ఏమిటి ఎప్పుడు వచ్చారు. ఫోనన్నా చేయలేదు. హౌ ఈజ్ ఎవిరీబడీ ఇన్ డ హాస్పిటల్" కేశవరావు కుశలప్రశ్నలు వేశారు.
"మా అన్నయ్య కూతురిపెళ్ళి ఎల్లుండి రాత్రి. మొన్ననే విజయవాడ వచ్చాం. నిన్న పెళ్ళికూతురు చేయడం హడావిడి వద్దామంటే కుదరలేదు. ఈ రోజంతా ఖాళీ. పెళ్ళి రేపుగదా మిమ్మల్ని చూసి పిలిచి పెళ్ళికి తీసుకెళ్ళాలని వచ్చాం. మా అన్నయ్య మిమ్మల్ని తప్పక రావాలని మరీ మరీ చెప్పి కార్డు యిచ్చాడు" సునంద చెప్పింది. సాయంత్రం వెడదాం అందరం కలిసి" అంది.
"ఓ తప్పకుండా. మీరు పిలవకపోయినా వచ్చేస్తాం. మీతో ఒకరోజు గడపడానికన్నా వస్తాం. పిల్లలు రాలేదా కౌశిన్, కుముద ఎలా వున్నారు?" కేశవరావు అడిగారు.
"వచ్చారు. అక్కడ పిల్లలంతా కలిశారు గదా. వాళ్ళతో సరదాగా గడుపుతున్నారు. ఎలాగో మీరు మాతో వస్తారని వాళ్ళని వదిలేశాం. వాళ్ళని చూడటానికన్నా రావాలి మీరు."
"అంత చెప్పక్కరలేదు వస్తాం తప్పక. అయితే ఈ రోజంతా మీరు ఇక్కడ గడపాలి. రేపు తెల్లారి బయలుదేరుదాం. రాత్రిగా పెళ్ళి" రాజేశ్వరి అంటూ వంటింటివైపు వెళ్ళబోతుండగానే శ్యామల కాఫీలు కలిపి పట్టుకొచ్చింది.
"ఓ థాంక్స్! మా ఫ్రెండ్స్ ని చూసి మాటల్లో మరిచిపోయాను అతిథి సత్కారం" రాజేశ్వరి కప్పులందరికిచ్చింది. "శ్యామలా ఒక్క క్షణం" అంటూ వంటఇంట్లోకి వెళ్ళి "ఈ పిండి ఇడ్లీలు పెట్టేసి, కాస్త పచ్చడి చేసేస్తావా. లేకపోతే నీవు వెళ్ళి సుగుణని పంపించు. నీకు ఆస్పత్రికి ఆలస్యం అవుతుందేమో. నీకు సరిగా రాదులే, సుగుణనే పంపు" అంటూ హడావిడి పడిపోయింది. సునంద ఇల్లంతా కలియ తిరిగి వచ్చింది.
"ఓ గ్రేట్. ఏమిటి ఈ పల్లెటూరిలో కూడా యింత హైక్లాసుగా వుంది యిల్లు. రియల్లీ సూపర్బ్. మన అమెరికా ఇల్లు మాదిరే వుంది. ఐ నెవ్వర్ ఎక్స్ పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ హౌస్" విస్మయంగా అంది.
"డబ్బుంటే బ్రహ్మాండమైన ఇల్లు వున్నాయి ఇండియాలోనూ. ఇదివరకటి ఇండియా కాదులే. ఇక్కడా బాగానే వున్నారు అందరూ" లోపల కేశవరావు డాక్టర్ మోహన్ రావుకి ఇల్లు, పెరడు, గార్డెన్ అంత తీసుకెళ్ళి చూపించారు.
"వదినగారూ! అయ్యబాబోయ్ యింత చక్కటి యిల్లు ఈ వూర్లో వుందంటే నమ్మలేకపోతున్నాను. కేశవ్ యూ ఆర్ గ్రేట్. మేమింకా మీరేదో పిచ్చి ఆలోచనలతో అమెరికా వదిలి యిక్కడికి వచ్చి పల్లెటూరిలో యిబ్బంది పడ్తూ బతుకుతున్నారనుకుని జాలిపడ్తున్నాం" నవ్వుతూ అన్నాడు డాక్టర్ మోహన్ రావు.
"ఇంతకీ ఎలా వుంది ఇక్కడ. బాగుందా? రిగ్రెట్ అవుతున్నారా" సునంద అడిగింది. ఇల్లు అది బాగానే ఉందనుకో. కాలక్షేపం అది..."
"సునందా! కాలక్షేపం అన్నది మన దగ్గరకి రాదు. మనం దాని దగ్గిరకి వెళ్ళాలి. కాలక్షేపం అన్నది మనది మనం కల్పించుకోవాలి. మనం పరిచయాలు పెంచుకోవాలి. టైము స్పెండ్ చేసేందుకు దారులు వెతుక్కోవాలి. ఇక్కడ కాలక్షేపానికి ఏం లోటు. చూశారుగా రోజూ ఉదయం రెండు గేములు షటిల్ ఆడుతాం. తరువాత తొమ్మిదికి హాస్పిటల్ కి వెళ్ళి పన్నెండుకి వస్తాను. ఆవిడ స్కూలుకెళ్ళి పిల్లలకి చదువు చెపుతుంది. మధ్యాహ్నం మళ్ళీ ఆడవాళ్ళకి ఇంగ్లీషు చెపుతుంది. సాయంత్రం బీదవారికి చదువు, యింటిపని ఆవిడకి కాలక్షేపం. నాకు మధ్యాహ్నాలు టీ.వీ., పుస్తకాలు, సాయంత్రం చదరంగం, వూర్లో పనులు కాలక్షేపానికి ఏం లోటూ లేదు" విశదీకరించాడు కేశవరావు.
"హాస్పిటల్ కట్టించారా! ఎలా మేనేజ్ చేస్తున్నారు" కుతూహలంగా అడిగారు మోహన్ రావు.
"ఓ పాత బిల్డింగ్ వుంటే బాగుచేయించి ప్రస్తుతానికి వాడుతున్నాం. గైనకాలజిస్ట్ గా డాక్టర్ శ్యామల, ఒక నర్సు, ఆయా వున్నారు.
"మా ఆయన యిక్కడికి వచ్చాక సవ్యసాచి అయిపోయి యిటు మెడిసన్, అటు ఆర్థోపెడిక్, అటు హార్టు అన్ని కేసులు చేసేస్తున్నారు" రాజేశ్వరి హాస్యంగా అంది.
"రియల్లీ హౌ కమ్" అన్నాడు మోహన్ రావు.
కేశవరావు నవ్వుతూ అన్నీ వివరించాడు.
"ఊరి సంగతేమిటి. బాగుపడిందా. మీరు చేయాలనుకున్న పనులకి కోపరేషన్ ఇస్తున్నారా. ఎంతవరకు వచ్చింది ఊరి సంస్కరణ."
"మీరే చూద్దురుగాని, సాయంత్రం అన్నీ తీసుకెళ్ళి చూపిస్తా" కేశవరావు గర్వంగా అన్నాడు.