"ఓ యస్! నరేష్ అందరి మగాళ్ళలా ఆడపిల్ల పిలిస్తే పరిగెత్తుకుని రాడు. అతని మీద ఆ నమ్మకం నాకుంది. నీకు లేకుంటే అలానే నిరూపిస్తాను."
విమల ఆ సంభాషణకు భయపడింది. ఇది అనవసరమైన పట్టింపేమోననిపించింది ఆమెకు. దాన్ని అంతటితో తుంచెయ్యాలని "ఇక ఈ టాపిక్ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నరేష్ అలాంటివాడు కాడనేది స్పష్టం. రజనీ ప్రేమించిన వాడికి అలాంటి బుద్ధి మాత్రం వుండదనేది నిజం. సరూ! నీ సిద్ధాంతాన్ని కాసేపు పక్కన పెట్టు" అంది.
"నరేష్ అలాంటివాడు కాకపోతే నాకూ ఆనందమే. కాకపోతే మనవాడి వీక్ నెస్ అది. దాన్ని అధిగమించడం చాలా కష్టం" అంది సరళ.
రజనీ ఆ మాటలకు షాక్ తింది. సరళ మనస్ఫూర్తిగా నరేష్ ను ఒప్పుకోవడం లేదు. అతని మీదనా సందేహం. లేక మొత్తం మగజాతి మీదనా ఆమె అనుమానం అన్నది రజనీకి అర్థం కాలేదు.
"సరూ! నువ్వు నిక్కచ్చిగా నరేష్ నిజాయితీని ఒప్పుకోవడం లేదు" బాధగా అంది రజని.
అంతలోనే సర్వర్ వాళ్ళు ఆర్డర్ చేసినవి తీసికొచ్చిపెట్టాడు. ఐస్ క్రీమ్ ని చప్పరించి అంది సరళ "నరేష్ ఈ విషయంలో ఎక్స్ సెప్షన్ అని నువ్వు నిరూపిస్తే తప్ప నేను నమ్మను."
"నీకు నిరూపణ కావాలా?" సీరియస్ గా అడిగింది రజని.
"ఆఁ! ఇంతకాలం ఏర్పరచుకున్న నమ్మకాన్ని కేవలం నీ మాటలు నమ్మి ఎలా తప్పని ఒప్పుకోగలను?"
"అయితే సరూ! నువ్వు ఏ పరీక్ష పెట్టినా అందులో నరేష్ నెగ్గుతాడు. అన్నీ కలిసొచ్చినా పరాయి ఆడపిల్లను నరేష్ దగ్గరకు చేరనివ్వడు. నేను ఓడిపోతే నరేష్ తో తెగతెంపులు చేసుకుంటాను. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావ్?" రజని అప్పటికే ఆవేశపడుతోంది.
పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించింది విమల. ఎప్పుడూ పందెంకి దిగని రజని ఈరోజు బెట్ కట్టిందంటే ఇదేదో విషాదానికి దారి తీస్తుందేమోనని భయపడింది ఆమె.
చాలా ఆలోచించాక నవ్వుతూ చెప్పింది సరళ. "నేనేమీ చేయను. నరేష్ శ్రీరామచంద్రుడని మాత్రం ఒప్పుకుంటాను. నా సిద్ధాంతం తప్పని లెంపలు వేసుకుంటాను."
"అయితే ఓకే!"
"కానీ నేను ఈ పందానికి ఒప్పుకోను. ఎందుకంటే నరేష్ ను నువ్వు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రేమికులు విడిపోవడం నేను భరించలేను" అంది సరళ.
"అంటే నేను ఈ పందెంలో ఓడిపోతాననే నీ నమ్మకం" సీరియస్ గా అడిగింది రజని.
సరళ రజనీని రెచ్చగొడుతూ వుందని అర్థమైంది విమలకు. ఈ పందెం ఏ పరిస్థితులకు దారితీస్తుందోనన్న భయం ఆమెను కుదిపేస్తోంది. అందువల్లే ఆ టాపిక్ ను అంతటితో ఆపుచేద్దామన్న ఉద్దేశ్యంతో సరళవైపు తిరిగి "రజనీతో బెట్ ఏమిటే? నరేష్ నువ్వు అనుకుంటున్నట్టు ఆడపిల్ల బలహీనత వున్నవాడు కాదు. అతను మనస్ఫూర్తిగా రజనీని ప్రేమించాడు. తనను తప్ప మరో ఆడపిల్లవైపు కన్నెత్తి కూడా చూడడు" అంది.
"అదే వద్దన్నది. తను ఎంతో ప్రేమించిన ఆడపిల్ల వున్నా, అంతటితో సంతృప్తి పడకుండా దొంగదారులు తొక్కడం మగవాడి బలహీనత. నరేష్ కూడా మగవాడే కాబట్టి ఆ బలహీనత వుంటుందన్నాను. అంతే తప్ప నరేష్ ని ప్రత్యేకించి నేను తప్పుపట్టడం లేదు" సరళ ఐస్ క్రీమ్ పూర్తిచేసి, తన వాదనను వినిపించింది.
అప్పటికీ నరేష్ ని సరళ శంకించడం రజనీకి కోపం తెప్పించింది. "మాటలు అనవసం సరూ, నరేష్ కి ఆ బలహీనత లేదని నేనూ, అతను దానికి అతీతుడు కాడని నువ్వూ అంటున్నాం. మనిద్దరిలో ఎవరో ఒకరు గెలవాలి. నరేష్ కి ఆ బలహీనత వుందని నువ్వు రుజువైనా చేయాలి. లేకుంటే నరేష్ నిజాయితీని నువ్వు ఒప్పుకోనైనా తీరాలి. ఏం చేస్తావ్?" రజనీకి కోపం వచ్చిందని గ్రహించింది విమల.
సరళ అదేమీ పట్టించుకోకుండా "ఫ్రూఫ్ లేకుండా నరేష్ కు ఆడపిల్లల యావలేదంటే నేను ఒప్పుకోను. నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అందులో నరేష్ నెగ్గితే నీ ప్రియుడు సాక్షాత్తూ శ్రీరామచంద్రుడేనని ఒప్పుకుంటాను. అందులో నరేష్ ఫెయిలైతే నువ్వు అతనిని వదిలేయద్దు. నరేష్ కూడా అందర్లాంటి వాడేనని నువ్వు వప్పుకుంటే చాలు" అంది.
"అంతవరకు వచ్చాక ఏం చేయాలో నాకు వదిలిపెట్టు. ముందు నీకు వచ్చిన ఐడియా ఏమిటో చెప్పు."
"నే పెట్టబోయే పరీక్ష ఏమిటంటే..." అంటూ ప్రారంభించింది సరళ.
మొత్తం విన్నాక అక్కడున్న ముగ్గురిలో మరీ ఎక్కువ భయపడింది విమల. తన స్నేహితురాలు రజనీకి ఎదురుదెబ్బ తగులుతుందేమోనన్న భయం ఆమెను వణికిస్తోంది.
నరేష్ తను చెప్పడం వల్ల ఆ దురలవాటును మానుకున్నాడన్న నమ్మకంతో రజని ధైర్యంతో వుంది.
హాల్లో ఓ మూలగా కూర్చుని తనవైపే చూస్తున్న బ్రహ్మానందాన్ని చూసి 'సక్సస్' అన్నట్టు చిరునవ్వు నవ్వింది సరళ.
* * * * *
నరేష్ ఆరోజు శెలవు పెట్టాడు. అంతకు ముందు రోజు సాయంకాలం తలనొప్పిగా వుంటే ఎందుకైనా మంచిదని మరుసటి రోజుకి లీవ్ అప్లయ్ చేశాడు. లీవ్ ఆప్లికేషన్ తీసుకుని వెళితే మారుతీరావు గంటసేపు తన థీరీని వినిపించాడు.
"నాకు కనీసం జలుబు చేసి ఇరవై సంవత్సరాలైంది నాకిప్పుడు నలభై ఏళ్ళు. మామూలుగా అయితే ఈ వయసుకి షుగర్, బి.పీ, కీళ్ళనొప్పులు, కాళ్ళు లాగడం లాంటి సవాలక్ష జబ్బులొస్తాయి. కానీ నాకు రాలేదు. కారణం నేను స్త్రీని దగ్గరకు చేర్చకపోవడమే. మగవాడి పతనానికి కారణం స్త్రీయే ఏ మతమైనా అదే ఘోషిస్తుంది. సంసారిక దుఃఖంలోంచే తత్వశాస్త్రం పుడుతుందని అరవిందుడు చెప్పాడు. మనిషి సన్యాసైనా, సంసారైనా దానికి కారణం స్త్రీ. మగవాడ్ని పీల్చిపిప్పి చేసేది కూడా ఆమే. అందుకే జాగ్రత్త నీ మేలు కోరి చెబుతున్నా స్త్రీని త్యజించావా బ్రతుకు బ్రహ్మాండంగా వుంటుంది. ఇది నా అనుభవంలోంచి చెబుతున్నాను. గుర్తు పెట్టుకో. ఈ రోజుకి నీకు లీవ్ ఇస్తున్నాను. ఇంకెప్పుడూ జలుబని, జ్వరమని నా దగ్గరకు రాకు."