ఎవరైనా కొత్త పత్రిక పెట్టేముందు "మా పత్రికలో అవుంటాయి...ఇవుంటాయి..." అంటూ మాటల పద ప్రయోగంతో ముందే వూదర గొట్టడం జరిగేది. అంతేకాని ఇలా సస్పెన్స్ లో పెట్టిన వారు లేరు.
బి.పిరావ్ అంటే మాటలా! అందరికీ బి.పి. తెప్పిచ్చేఎడిటరాయెం ఆ మాత్రం పస ముందే చూపించక పోతే ఎలా?
అన్ని వార, మాస పత్రికలలో కల్పినా ఉత్తరాల శీర్షికలో కనీసం పాతిక వుత్తరాలు కూడా ప్రచురణకి నోచుకొని బి.పి.రావ్ అమాంతం ఎడిటరే అయిపోతున్నాడంటే అది విధిలీల కాక మరేమిటి?
విధిలీల అనే మాట ముందు మరోటి బి.పి రావ్ విషయంలో ఎవరికీ తెలీంది వుంది.
ఒకానొక కాలంలో ఆడవాళ్ళంతా కలిసి ముల్లోకాలు తిరిగి సర్వదేవుళ్ళని దర్శించి చివరకి భోళా శంకరుడి ద్వారా మొత్తానికి తమ కోరికలు సాధించుకొన్నారు. అప్పట్నించి సృష్టి తారుమారై మగవాళ్ళు మగ పిల్లల్ని కనటం....ఆడవాళ్ళు ఆడ పిల్లల్ని కనటం మొదలైంది.
మనుషుల్లో ఈ మార్పు వచ్చిందిగాని...దేవుళ్ళలో మాత్రం మార్పేమీ రాలేదు.
బ్రహ్మదేవుడు అందరి నుదుట రాతలు రాస్తూనేవున్నాడు. ఆయన అసిస్టెంట్లు బొమ్మలు చేస్తూనే వున్నారు.
ఆడవాళ్ళు ఆడపిల్లల్ని కనాలి....మగవాళ్ళు మగపిల్లల్ని కనాలి. ఆ కోరిక అంతవరకు బాగానే వుంది. మరి__అటు ఆడకి చెందక ఇటు మగకి చెందక మూడోరకం మనిషిని ఎవరు కనాలి? ఈ విషయం దేవుణ్ణి ఆడవాళ్ళు అడగటం మర్చిపోయారు.
యధావిధిగ బ్రహ్మదేవుడి దగ్గర అసిస్టెంట్లు తోచి తోచనప్పుడు, అప్పుడప్పుడు సరదాగా మూడోరకం మనిషిని తయారు చేసిభూమిమీదకు పంపించటం చేస్తున్నారు. ఆ బొమ్మ ఆడ కడుపులోనో....మగ కడుపులోనో దూరి జన్మ నెత్తక తప్పడంలేదు.
అలా మూడో మనిషిగా అవతారం ఎత్తి జన్మించిన వాడే "ప్రయోగం" సచిత్ర విచిత్ర వారపత్రిక ఎడిటర్ బి.పి. రావ్.
బి.పి. రావ్ తండ్రికి పూర్తి ప్రపంచ జ్ఞానం లేదు. పుట్టింది తన కడుపునే కాబట్టి వాడు మగ పిల్లాడేనని....తన కొడుకేనని అనుకున్నాడే గాని రెండిటికి చెడ్డ రేవడిలాంటి మనిషి అనుకోలేదు.
బి.పి.రావ్ తల్లి వరసపెట్టి నలుగురు ఆడపిల్లల్ని కంది. ఆడ పిల్లలందరూ ఆడతనంతో ఆకర్షణీయంగా ఉండేవాళ్ళు. బి.పి.రావ్ తండ్రికి "రావ్" తప్ప మరొకడు పుట్టలేదు.
తనకి పుట్టింది పూర్తిగా మగవాడు కాదన్న సంగతి గ్రహించిన ఆ తండ్రి అదికూడా ఎప్పటికో గ్రహించిన ఆ తండ్రి విషయాన్ని దాచేసి పూర్తిగా మగపిల్లవాడిలాగానే పెంచాడు.
చాటుమాటుగా డాక్టర్లు దగ్గరికి తీసికెళ్ళి పరీక్షలు చేయించాడు. దానివల్ల బి.పి. రావ్ కి వచ్చిందేమీ లేకపోగా డాక్టర్ల దగ్గరకి వింత మనస్తత్వాలతో...విచిత్ర రోగాలతో వచ్చే పేషంట్ల గురించి తెలుసుకోగలిగాడు.
ఓ పక్క దేముడిచ్చిన శాపం...మరోపక్క ప్రపంచానికి తన సంగతి ఏమాత్రం తెలినీయకుండా పెంచి పెద్ద చేసిన తండ్రి....పోనీ ఇష్టపడే సాహిత్యంతో రోజులు వెళ్ళబుచ్చుదామా అంటే మూడ్రోజుల్లో మూతబడే పత్రికకూడా తను రాసిన ఒక్క రచనా వెయ్యకపోవటం...తను "ఉత్తరాల రచయితగా" మిగలటం ఇష్టంలేక ఏదో సాధించాలానే తపనతో ఆలోచించి చించి తనే ఓ పత్రికని తీసుకురావాలని నిర్ణయించుకోవటం జరిగిపోయింది.
అనుభవాన్ని మించిన విధ్యలేదు. బి.పి.రావ్ శారీరక, మానసిక అనుభవాలే ఈ కొత్త పత్రికని తేవడానికి దోహదమయింది.
ఒకానొక శుభ ముహూర్తాన "ప్రయోగం" సచిత్ర విచిత్ర వారపత్రిక విడుదలైంది.
తన "ప్రయోగం" ప్రజలకి ప్రయోగకరంగా వుందో లేదో వేచి చూడటానికి బి.పి. రావ్ కి ఒక్క వారంమించి ఎక్కువకాలం పట్టలేదు.
అదెలాగంటే...!
"ప్రయోగం" వారపత్రికలో నాలుగంటే నాలుగే సీరియల్స్ వున్నాయి.
ఒక సీరియల్ పూర్తి హాస్యరసంతో కూడుకున్నది.
రెండో సీరియల్ పూర్తి సంసారపక్ష సాంఘీకం.
మూడో సీరియల్ క్రైమ్, సస్పెన్స్, హత్యలు, రేపులతో నిండిపోయింది అది.
నాలుగో సీరియల్ ఎడ్వంచర్. అద్భుత భయానక సాహసయాత్ర.
ఈ నాలుగు సీరియల్స్ వల్లా....వారి వారి మనస్తత్వాలని బట్టి ....ఆ...యా...సీరియల్ ని చదవటం జరిగింది. ఇహ మిగిలింది శృంగారము, ప్రేమ.
అన్నీ సీరియల్స్ అయితే ఏం బాగుంటుంది? అందుకని ప్రేమ గురించి ఒక కొత్త శీర్షిక "ప్రయోగం" లో చోటు చేసుకుంది. ఇక్కడ కూడా పురుషులకో పేజీ స్త్రీలకో పేజీ కేటాయించబడింది.
ఎవరైనా తెలియక...లేక పెళ్లికానివారు జేబులో చేయిపెట్టే ప్రమాదం వుంది. కనుక "ప్రయోగం" పత్రిక మీరు కొనంగానే చేయవలసిన ముందు పని జేబుని కత్తిరించి దాచేయండి. జేబు కత్తిరించటం దొంగతనముకాదు రంకు తనముకాదు. జాగ్రత్త అంతే. గమనిక ఈ జాగ్రత్త పెద్దలు తీసుకున్న మంచిది.
"మీ మొదటిరాత్రి అనుభవాలు "కి మీ అనుభవం పంపించండి. మీరు కోరితేనే మీ పేర్లు ప్రచురింపబడతాయి. పేరు పడటం ఇష్టం లేకపోతే "ఒక సంసార స్త్రీ, లేక ఒక సంసార పురుషుడు" అని శీర్షిక కింద ప్రచురిస్తాము. పేరు గుప్తంగా ఉంచబడును.
ఇలా చాలా జాగ్రత్తగా కవరులాంటి కాగితాలను జేబు పేరుతో తయారుచేసి పెళ్ళయినవారికి మాత్రమే ఈ శీర్షిక అని పేరు పెట్టటంతో, ఆ ఎడిటర్ గారి ముందు చూపుకి పాఠకులు హర్షించారు.
పూర్వం ఓ ఆచారం వుండేదిట. మొదటిరాత్రి లీలలని పెద్దలు కిటికీ సందుల్లోంచి తలుపుకంతల్లోంచి చూస్తే ఆ కొత్త దంపతుల జన్మధన్యం అవుతుందని ఆ వంకతో ఆడంగులంతా (అనగా ఆడవాళ్ళు) తొంగి చూడటానికి తహ తహలాడే వాళ్ళు.
ఆ కాలంలో ఇలాంటి సీనులు చూడటానికి మగవాళ్ళకి బైట జంతుజాలం వుండేది. వెరైటీకి సానివీధి వుండేది.
కాలం మారింతరువాత దరిమిలా బ్లూ ఫిల్మ్ లు వచ్చాయి. వి.సి. ఆర్.లు వి.సి.పి. లు వున్నవాళ్ళంతా చాటుగా చూడటానికి మార్గం ఏర్పడింది. పాపం అవీలేని వాళ్ళు హాయిగా ఇంచక్క తెలుగు సినిమాలకి వెళ్ళేవాళ్ళు.
తెలుగు సినిమాలలో-
అన్నా చెల్లెళ్ళ బిగి కౌగిలింతలు. హీరోగారి ఉడుంపట్లు, హీరో యిన్ గారి అర్ధనగ్న అవతారం, ఉన్న కొలతలు చాలక బొడ్డు లోతు.