రైటర్ కన్నా పెద్ద పోస్ట్ ఎడిటర్ ది. తన రచనలు వెలుగుముఖం చూడాలంటే తనే ఒక పత్రిక పెట్టక తప్పదన్న నిర్ణయానికి వచ్చాడు అతను.
ఎడిటర్ కి కావాల్సిన అర్హతలు బుర్రలో గుంజు వుండటం. అంతే గాని పేరు ప్రక్కనలు డిగ్రీలు అక్కరలేదు. వేలిముద్రలు వేసేవాళ్ళు మంత్రులవంగా లేంది ఎడిటర్ కి మాత్రం చదువెందుకు! పత్రిక పెట్టతనికి డబ్బుంటే చాలు అది మాత్రం పుష్కలంగా వుంది.
ఆడవాళ్ళు ఆడపిల్లల్ని కంటూ మగవాళ్ళు మగపిల్లల్ని కంటూ వున్న యీ కొత్త సృష్టిలో ఆస్థులు కూడా అలాగే స్త్రీధనం స్త్రీలకి పురుషుల ధనం పురుషులకి చెందేలా ఏర్పాటుజరిగింది.
"సాహిత్యం కూడుపెట్టేనా గూడుపెట్టేనా! పెళ్ళి చేసుకొని ఏదయినా వ్యాపారం చేసుకోరా పిచ్చిగా" అంటూ ముద్దుముద్దుగా కోప్పడే తండ్రి హటాత్తుగా హార్ట్ ఎటాక్ తో చనిపోగా తండ్రి ఆస్తికి ఏకైక పుత్రరత్నం వారసుడయిన బి.పి.రావ్ కి ఆ ఆస్థీ వచ్చిపడింది.
ఇంకేం కావాలి? కోతికి కొబ్బరికాయ దొరికింది. ఎవరి తలమీద పగలగొడితే బాగా పగులుతుందా అని....(పగిలేది తలకాయా! కొబ్బరి కాయా?) సదరు కోతిగారు తలల కోసం వెతికిందట.
అలాగే-
బి.పి. రావ్ కి ఆస్థీ దొరికింది. తలల కోసం వెతికే పనిలేదు. ఏ చెత్తయినా చదవటానికి అశేష పాఠకులు తలలు వున్నాయి. కావాల్సిందల్లా పెట్టబోయే పత్రికకి పేరు తేవటం ఎలా అన్నదే ఆలోచన.
ఈ దెబ్బతో మిగతా పత్రికలు పడిపోవాలి. తన పత్రిక మాత్రం ఆకాశమంత ఎత్తు ఎదగాలి.
ఎలా!
ఎలా!!
అని ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా! ఏదో చెయ్యాలి. ఏదేదో చేసేసెయ్యాలి. అప్పుడే కదా పేరుప్రఖ్యాతులు వచ్చేది.
ఆలో....చించగా....చించగా...మంచి ఆలోచనే వచ్చింది.
ఆడవాళ్ళకి కొన్ని పత్రికలు మగవాళ్ళకి కొన్ని పత్రికలు పిల్లలకి పిల్లపత్రికలు యూత్ కి బూత్ పత్రికలు ఏవేవో అఘోరిస్తూనే వున్నాయి.
అన్ని కలిపినా ఓ పత్రిక పెడితే?
ఆ బాల గోపాలం చదువుతారు కదా!
ఆలోచన మంచిదే వచ్చింది. అమలులో పెట్టడం ఎలా!
ఒకే ఇంట్లో ఆడమగ ముసలి ముతక పిల్ల జెల్లా వుండటం లేదా! ఇదీ అంతే. ఒకే పత్రికలో అన్నీ వుంటాయి. అందరికి సబంధించినపని వుంటాయి. ఎవరికి కావాల్సినవి వాళ్ళు చదువుకోవచ్చు. వకేసారి వకేటైములో ఇంట్లో అందరూ చదవవచ్చు.
వకేసారి చదవాలంటే ఎలా?
మనసుంటే మార్గం వుంటుంది ఈ సత్యం తెలిసిన బి.పి.రావ్. మళ్ళీ ఆలోచించాడు.
అవసరం అయితే విడిగ వచ్చేలా లేదంటే కలిసి పడుండేలా పత్రికని తయారుచేస్తే! పైకి వకే పుస్తకంలా కనపడుతుంది. లోపల పది పుస్తకాలు వుంటాయి. లాగితే ఏ పుస్తకానికా పుస్తకం వూచి వస్తుంది. పిన్ను గుచ్చితే మళ్ళీ వకే పుస్తకం [పత్రిక] అవుతుంది.
ఈ అయిడియా అద్భుతమైంది. ఇంకా పత్రిక మార్కెట్ లోకి వెళ్ళలేదు కాబట్టి ఎవరికీ ఈ కొత్త ప్రక్రియ తెలియదు తెలియలేదు.
స్త్రీ పురుష ఆబాల గోపాల సచిత్ర విచిత్రవార పత్రికకి" ప్రయోగం" అన్న పేరు కూడా పెట్టటం జరిగింది. నిజంగ ఇది కొత్త ప్రయోగమే కదా!
అన్నిటికన్నా ముఖ్యమైంది పబ్లిసిటీ.
పబ్లిసిటీ స్టంటు పలురకాలుగా ఉంటుంది. పబ్లిసిటీతో ఎవరెంత బాగా స్టంటు చేయగలిగితే అంత బాగా ఆయారంగాలలో విజయం సాధిస్తారు.
"ప్రయోగం" పత్రిక గురించి దినపత్రికలు...అన్ని వార, మాసపత్రికలు ఇవికాక రేడియో, టి.వి....పాంప్లెట్స్ ద్వారా తమాషాగా పబ్లిసిటి ఇవ్వడం జరిగింది.
"ప్రయోగం ఏమిటి?...దేనికి? రేపటి దినపత్రిక చూడండి." అని మొదటిరోజు దిన పత్రికలో ప్రచురణ అయితే మర్నాటి దిన పత్రికలో "ఈ ప్రయోగం ఒకక్రి మీదనే కాదు-అందరిపై వేచి చూడండి" అని ప్రచురణ అయ్యేది.
ఆ మర్నాడు-
మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా...ఫీజు చెల్లించకుండా ఉండాలంటే__
మీరు అందచందాలతో అలలారుతు ఉండాలంటే....
ఫైవ్ స్టార్ హోటల్ తలదన్నేలా అతి చవుకలో అద్భుత పదార్దాలు మీకిచెన్లో రెడీగా ఉండాలంటే...
పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగవు....నరకంలోకి నెట్టివేయబడవు ఇదిగో ఇక్కడ జరుగుతాయ్. నిత్యకళ్యాణం పచ్చతోరణం....
ఇలా అంతనా పొంతనా లేకుండా అసలు యీ ప్రకటనలు దేనికి సబంధించినదో తెలీకుండా ఆలోచనల్లో పడ్డారు. దిన, వార, మాసపత్రికలు చదివే వాళ్ళు.
రేడియోలో అయితే "ప్రయోగం....సర్వజన ప్రయోగం__సర్వప్రియ ప్రయోగం..." అంటూ చిన్న సైజు పాట పావుగంటకో సారి వచ్చేది.
ఇహ టి.విలో అయితే ఏకంగా పాత్రలే దర్శన మిచ్చేవాళ్ళు. "నిత్యకళ్యాణం" అనేది ఒకమ్మాయి. ఆ అమ్మాయి పెళ్ళి కూతురు దుస్తులతో ఉండేది. జిడ్దోడుతున్న మొహంతో మామిడాకులు పట్టుకుని "పచ్చతోరణం" అనేవాడు ఒకబ్బాయి. "ఇది మీపై మా ప్రయోగం" అంటూ ఠక్కున ఆ సీను తెరపైనుంచి మాయమయ్యేది.
మాయాబజార్ లో ఘటోత్కచుని ముందు వున్నా పిండి వంటలన్నీ టి.వి. తెరపై నోరూరించేలా కానవచ్చేవి.
"ఇది మీకోసం మేము సమర్పించే నోరూరే ప్రయోగం." అంటూ అవి మాయమయ్యేవి.
పాంప్లెట్స్ లో కూడా తమాషా ప్రయోగం జరిగింది. "ఒకే ఒక నెల. వేచి చూడండి. మా "ప్రయోగం" మీ ఇంటి ముందు వచ్చి వాలుతుంది."
ఆయా ప్రయోగాలతో మీ ఇంటిల్లిపాదీ తలమునకలు కావాల్సిందే. మా ప్రయోగమే మీ ప్రమోదం....మీ ప్రమోధమే నా ప్రయోగం." అన్న పాంప్లెట్లు పంచబడ్డాయి ప్రతి ఇంటికి.
సస్పెన్స్ అంటే పడిచావని వారు ఎవరూ ఉండరు. ఈ ప్రయోగం దేని గురించో తెలీక ప్రజలు తల్లక్రిందులయ్యారు. కాని ఇది వకవార పత్రికకి సంబంధించిన పబ్లిసిటీ స్టంట్ అని మాత్రం ఎవరూ గ్రహించలేదు.